హైడ్రాపేరిట వసూళ్ల దందా!

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు మరో సారి కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు హైడ్రా పేరిట పెద్ద ఎత్తున వసూళ్ల దందాకు పాల్పడుతున్నారని సంచలన విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. మూసీ సుందరీకరణ పేరిట పేదలను నిర్వాసితులను చేస్తున్నారనీ, ఫోర్త్ సిటీ పేరుతో సీఎం రేవంత్ కుటుంబం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నదని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.  రీజనల్ రింగ్ రోడ్డు పేరిట పేదల భూములను ఆక్రమిస్తున్నారని, ఏ వైపు పేదలపై ప్రతాపం చూపుతూ మరో వైపు పెద్దలతో ఒప్పందాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. 

ఆరు గ్యారంటీలకు పంగనామాలు పెట్టేసిన రేవంత్ సర్కార్.. ఇదేమిటని ప్రశ్నించిన వారిని జైళ్లకు పంపుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా రుణమాఫీలకు ఎగనామం పెట్టేసిందన్నారు.  కేసీఆర్ పాలనలో దేశానికే దిక్సూచిగా ఎదిగిన తెలంగాణను 15 నెల‌ల కాంగ్రెస్ పాల‌న‌లో పాతాళానికి పడిపోయిందన్నారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో పాలన కాదు పీడన సాగుతోందన్నారు. కాంగ్రెస్ సర్కార్ ను ఆయన సర్కస్ కంపెనీగా అభివర్ణించారు.