విశాఖ మేయర్ పీఠం.. కూటమి ఖాతాలోకేనా?
posted on Mar 19, 2025 3:48PM
.webp)
ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్దదైన విశాఖపట్నం నగరపాలక సంస్థ కూటమి వశం కానున్నదా? వైసీపీ చేతిలో ఉన్న ఈ మేయర్ పీఠన్ని దక్కించుకోవడానికి తెలుగుదఏశం కూటమి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందా? అంటే పరిశీలకులు ఔననే బదులిస్తున్నారు. విశాఖ మేయర్ పీఠం లక్ష్యంగా కూటమి వ్యూహాలు, వైసీపీ ప్రతి వ్యూహాలతో ఒక్కసారిగా సాగర తీరంలో రాజకీయ వేడి పెరిగింది.
నాలుగేళ్ల కిందట జరిగిన ఎన్నికలలో విశాఖ మేయర్ పీఠాన్ని అప్పటికి అధికారంలో ఉన్న వైసీపీ దక్కించుకుంది. విశాఖ కార్పొరేషన్ లో 98 కార్పొరేటర్ల స్థానాలు ఉండగా వాటిలో 59 స్థానాలలో వైసీపీ కార్పొరేటర్లు విజయం సాధించారు. బీసీ వర్గానికి చెందిన మహిళ గొలగాని హరి వెంకట కుమారిని వైసీపీ అధిష్ఠానం మేయర్ ని చేసింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలై తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టింది. దీంతో విశాఖ కార్పొరేషన్ లో కూడా వైసీపీ బలం క్షీణించింది. పలువురు కార్పొరేటర్లు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు.
ఇప్పుడిక మేయర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కూటమి పార్టీలు సమాయత్తమౌతున్నాయి. నాలుగేళ్ల పదవీ కాలం పూర్తి అయితే కానీ మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అవకాశం లేకపోవడంతో ఇంత కాలం ఓపికగా వేచి ఉన్న కూటమి పార్టీలు.. ఇప్పుడిక నాలుగేళ్ల కాలపరిమితి ముగుస్తున్న తరుణంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే దిశగా పకడ్బందీ ప్రణాళికతో అడుగులు కదుపుతున్నారు. ప్రస్తుతం విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ లో కూటమి బలం 53గా ఉంటే.. వైసీపీ బలం 38కి పడిపోయింది. కానీ నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలంటూ కూటమికి మూడింట రెండు వంతులు అంటే 64మంది కార్పొరేటర్ల మద్దతు అవసరం. ప్రస్తుతం కూటమికి 53 మంది కార్పొరేటర్ల మద్దతు మాత్రమే ఉంది. అంటే మరో 11 మంది కార్పొరేటర్ల మద్దతు కూడగట్టాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం తమతో ఉన్న 38 కార్పొరేటర్లూ గోడ దూకకుండా వైసీపీ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. వైసీపీ కార్పొరేటర్లు జారిపోకుండా సీనియర్ నేత, మండలిలో వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో విశాఖ రాజకీయం రసకందాయంలో పడింది. రానున్న రోజులలో వైసీపీ నుంచి మరింత మంది కార్పొరేటర్లు కూటమి పార్టీల పంచన చేరుతారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.