సత్తా చాటిన జేసీ బ్రదర్స్! తాడిపత్రిలో టీడీపీ హవా
posted on Mar 14, 2021 1:48PM
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ మాత్రం షాక్ తగిలింది. ఫ్యాన్ హవాలోనూ సత్తా చాటారు జేసీ బ్రదర్స్. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో తెలుగు దేశం పార్టీ జెండా ఎగురవేశారు. తాడిపత్రిపై స్పెషల్ ఫోకస్ చేసిన వైసీపీ నేతలు.. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా.. జేసీ సోదరులను మాత్రం ఓడించలేకపోయారు.
తాడిపత్రి మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా.. తెలుగు దేశం అభ్యర్థులు 20 వార్డుల్లో విజయం సాధించారు. వైసీపీ కేవలం 12 వార్డులు మాత్రమే గెలిచింది. జనసేన , సీపీఐ చెరో వార్డులో గెలవగా.. స్వంతంత్ర అభ్యర్థి మరో వార్డులో గెలిచారు. ఒక వార్డులో ఫలితం టై వచ్చింది. 36 వార్డులకు 20 వార్డులు గెలవడంతో టీడీపీకే మేయర్ పీఠం దక్కనుంది. ఈ ఎన్నికల్లో కౌన్సిలర్ గా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఘన విజయం సాధించారు. దీంతో ఆయనే తాడిపత్రి మేయర్ కాబోతున్నారు.