బీజేపీ అవమానించిందన్న పవన్ కల్యాణ్   

భారతీయ జనతా పార్టీతో ప్రస్తుతం పొత్తు పెట్టుకుంది జనసేన పార్టీ. రెండు పార్టీలు కలిసి ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశాయి. త్వరలో జరగనున్న లోక్ సభ ఉప ఎన్నికలోనూ బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తామని జనసేన ప్రకటించింది. అయితే తిరుపతిలో తామే పోటీ చేస్తామని ముందు నుంచి పట్టుబట్టిన జనసేన.. చివరికి వెనక్కి తగ్గడంపై పలు చర్చలు జరుగుతున్నాయి. ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సహా పలు అంశాల్లో ఏపీకి బీజేపీ అన్యాయం చేస్తుందని భావిస్తున్న పవన్ కల్యాణ్.. ఆ పార్టీతో తెగతెంపులు చేసుకునే యోచనలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. 

తాజాాగా బీజేపీ పై పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కేంద్ర బిజెపి జనసేనతో సఖ్యతగా ఉన్నప్పటికీ తెలంగాణ బిజెపి నేతలు మాత్రం జనసేనను అవమానించారని పవన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం బహిరంగ సభలో జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఎంఎల్‌సి స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. టిఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణి దేవిని గెలిపించాల్సిందిగా ఓటర్లను కోరారు. జనసేనను చులకనగా చూసేలా తెలంగాణ బిజెపి నేతలు మాట్లాడారని ఆరోపించారు. కేంద్ర నాయకత్వం జనసేనతో ఉన్నా.. తెలంగాణ నాయకత్వం మాత్రం జనసేన పార్టీని చులకన చేసిందని.. అందుకే తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పివి కుమార్తెకు మద్దతిస్తున్నాం అని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.