కేటీఆర్ గ్యాస్ బాంబు పేలినట్టేనా!
posted on Mar 14, 2021 5:04PM
తెలంగాణలో రాజకీయ కాక రేపిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. గతంలో ఎప్పుడు లేనంతగా పార్టీలు పోరాడటంతో మండలి ఎన్నికలు ఆసక్తిగా మారాయి. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన కొన్ని నిమిషాలకే.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కొన్ని నిమిషాల్లోనే వైరల్ గా మాారాయి. పోలింగ్ పైనా కేటీఆర్ కామెంట్ల ప్రభావం కనిపించిందనే చర్చ జరుగుతోంది.
షేక్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకున్న కేటీఆర్.. ఓ మహానుభావుడు చెప్పినట్లు.. ఇంట్లో గ్యాస్ సిలిండర్‌కు మొక్కి ఓటేసేందుకు బయలుదేరా అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి చేసినవిగా పలువురు అంటున్నారు. 2013లో సాధారణ ఎన్నికల సందర్భంగా మోదీ ... ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలను దృష్టిలో పెట్టుకుని... ఆనాటి యూపీఏ సర్కార్‌కు కౌంటర్‌గా.. సిలిండర్‌కు ఇంట్లో మొక్కి వస్తున్నానంటూ వ్యాఖ్యానించారు. తాజాగా కేటీఆర్ ఆ మాటలనే బీజేపీపై వ్యంగ్యాస్త్రంగా సంధించారు. కేటీఆర్ వ్యాఖ్యలను స్ఫూర్తిగా తీసుకున్న పలువురు... తమ ఇళ్లలో గ్యాస్ సిలిండర్లకు పూజలు చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
షేక్ పేట తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన తొలి ఓటు వేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓటు వేయడానికి వచ్చే ముందు తాను.. తన ఇంట్లోని గ్యాస్ సిలిండర్ కు దండం పెట్టుకుని వచ్చానని చెప్పారు. ఎవరు గెలిస్తే మంచి జరిగుతుందో ఆలోచించి పట్టభద్రులు ఓటు వేయాలని కోరారు కేటీఆర్. పట్టభద్రులంతా ఓటింగ్ రావాలని కోరారు. కేటీఆర్ గ్యాస్ సిలిండర్ వ్యాఖ్యలపై వెంటనే కౌంటరిచ్చారు హైదరాబాద్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచంద్రరావు. తాను ఓయూ నిరుద్యోగి ఎల్లస్వామికి దండం పెట్టుకుని వచ్చానని చెప్పారు.