ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్.. 'దేవర' మళ్ళీ వాయిదా..!

'దేవర' (Devara) సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన ఈ మూవీ, అక్టోబర్ 10 కి పోస్ట్ పోన్ అయినప్పుడు ఫ్యాన్స్ నిరాశచెందారు. ఆ తర్వాత అక్టోబర్ 10 నుంచి అనూహ్యంగా సెప్టెంబర్ 27 కి ప్రీ పోన్ కావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. మరో రెండు నెలల్లో తమ అభిమాన హీరోని బిగ్ స్క్రీన్ పై చూసుకోవచ్చని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో "దేవర మళ్ళీ వాయిదా" (Devara postponed again) అనే వార్త సంచలనంగా మారింది.

'దేవర' మళ్ళీ పోస్ట్ పోన్ అయిందని.. అసలు ఈ ఏడాది వచ్చే అవకాశమే లేదని, ఏకంగా నెక్స్ట్ ఇయర్ కి వాయిదా పడిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. విడుదలకు ఇంకా సుమారుగా రెండు నెలలే సమయముంది. ఇలాంటి టైంలో కొద్దిరోజులుగా ఎటువంటి అప్డేట్స్ ఇవ్వకుండా, 'దేవర' టీం సైలెంట్ గా ఉండటం.. ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. 

ఇంకా షూటింగ్ పూర్తికాలేదు. ఇప్పటిదాకా గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ మాత్రమే విడుదల చేశారు. రెండు నెలల టైంలో మిగతా షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేయాల్సి ఉంది. అలాగే మిగతా సాంగ్స్, టీజర్, ట్రైలర్ విడుదల చేసి.. ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచాల్సి ఉంది.  ఇంత తక్కువ టైంలో ఇవన్నీ సాధ్యమేనా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే 'దేవర' పోస్ట్ పోన్ న్యూస్ ని చాలామంది నమ్ముతున్నారు. 

ఇదిలా ఉంటే, సన్నిహిత వర్గాలు మాత్రం.. 'దేవర' ఖచ్చితంగా సెప్టెంబర్ 27నే విడుదలవుతుందని చెబుతున్నారు. 'దేవర' షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తయిందని, ఆగష్టులో చేసే జాతర సాంగ్ తో మొత్తం షూట్ కంప్లీట్ అవుతుందని అంటున్నారు. మరోవైపు పారలల్ గా జరుగుతున్న పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చివరి దశలో ఉందట. ఇప్పటికే కొందరు కీలక పాత్రధారుల డబ్బింగ్ కూడా పూర్తయిందట. ఈ నెలలోనే సెకండ్ సింగిల్, ఆగష్టులో టీజర్, మిగతా సాంగ్స్, సెప్టెంబర్ లో ట్రైలర్ విడుదల ఉంటాయట. మరి అన్నీ అనుకున్నట్టు జరిగి 'దేవర' సెప్టెంబర్ 27 కే వస్తుందేమో చూడాలి.