ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున మరో సంచలన ప్రకటన!

తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ సినీ హీరో అక్కినేని నాగార్జున (Nagarjuna)కు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. అయితే అధికారుల చర్యను ఇప్పటికే నాగార్జున తప్పుబట్టారు. పట్టా భూమిలోనే భవన నిర్మాణ చేశామని, ఒక్క అంగుళం కూడా చెరువుని ఆక్రమించలేదని, అయినప్పటికీ అధికారులు కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా సడెన్ గా కూల్చేశారని అన్నారు. అలాగే ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకుంటానని తెలిపారు. తాజాగా ఈ విషయంపై నాగార్జున మరోసారి స్పందించారు. (N convention demolition)

"ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ.. ఎన్-కన్వెన్షన్ కి  సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల  కంటే, ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయి. కన్వెన్షన్ నిర్మించబడిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి. ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించింది కాదు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని Special Court, AP Land Grabbing (Prohibition) Act, 24-02-2014న ఒక ఆర్డర్ Sr 3943/2011 ద్వారా జడ్జిమెంట్  ఇవ్వటం  జరిగింది. ప్రస్తుతం, నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం గౌరవ హైకోర్టుని ఆశ్రయించటం జరిగింది. న్యాయస్థానం తీర్పుకి నేను కట్టుబడి ఉంటాను. అప్పటి వరకు, ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని నేను మిమ్మల్ని సవినయంగా అభ్యర్ధిస్తున్నాను" అంటూ సోషల్ మీడియా వేదికగా నాగార్జున రాసుకొచ్చారు.