‘‘దామోదర్ గౌతమ్ సవాంగం అన్న’’... సమగ్ర చరిత్ర..!

(శుభకర్ మేడసాని, ఇన్‌పుట్ ఎడిటర్, తెలుగువన్)

వెల్‌కమ్ టు జర్నలిస్ట్ లాండ్రీ. దామోదర్ గౌతమ్ సవాంగ్. 1986 ఏపీ కేడర్‌కి చెందిన మాజీ ఐపీఎస్ అధికారి. స్వరాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. బీఏ చదివిన గౌతమ్ సవాంగ్ బీకాం చదివిన మాస్టర్ మైండ్ అబ్దుల్ కరీం తెల్గీ... అంటే నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణం చేసిన అబ్దుల్ కరీం తెల్గీతో సంబంధాలు కలిగి వున్నాడని నాడు సీబీఐ తేల్చింది. 1992 నుంచి 2003 వరకు దాదాపు పదకొండు సంవత్సరాల పాటు సాగిన మూడువేల కోట్ల రూపాయల ఈ నకిలీ స్టాంపు పేపర్ల కుంభకోణం 2003లో వెలుగులోకి వచ్చింది. తెల్గీ అరెస్టు కంటే ముందు నుంచే అతనితో గౌతమ్ సవాంగ్ సన్నిహిత సంబంధాలు కలిగివున్నాడని, పలుమార్లు తెల్గీతో కలసి హైదరాబాద్ నుంచి ముంబైకి ఫ్లైట్‌లో ప్రయాణించాడని నాడి ఏపీ సీఐడీ నిర్ధారించింది. బాంబేలో పెద్ద మొత్తంలో సవాంగ్‌కి తెల్గీ నుంచి డబ్బులు ముట్టాయని వార్తలు వచ్చాయి. గౌతమ్ సవాంగ్‌కి సహకరించిన నాటి ఏసీపీ భూపేందర్ రెడ్డి కూడా ఈ కేసులో నిందితుడే అని సీబీఐ తేల్చింది. ఇదే కేసులో నాటి టీడీపీ మంత్రి కృష్ణ యాదవ్ అరెస్టయి జైలు జీవితం గడిపారు. డిటెక్టివ్ డిపార్ట్.మెంట్ డీఐజీ నరసింహారావు ఈ కేసులో అరెస్టయి సంవత్సరాలపాటు ఊచలు లెక్కపెట్టాడు. హైదరాబాద్ వెస్ట్ డీసీపీగా పనిచేస్తు్న్న గౌతమ్ సవాంగ్‌ను ఈ కేసులో విచారించడానికి సీనియర్ అధికారి ఉమేష్ షరాఫ్ నాటి సవాంగ్ ఆఫీసులో అడుగుపెడితే గౌతమ్ సవాంగ్ ఏం చేశారో తెలుసా? గోడ దూకి పారిపోయారు అనే వార్త అప్పట్లో హల్‌చల్ చేసింది. ఇదే కేసులో డీఎస్పీ సత్యనారాయణరెడ్డి, సీఐ మహ్మద్ అషీఫ్, ఎస్.ఐ. మధుమోహన్, కానిస్టేబుల్ కేపీ రెడ్డి కూడా జైలుపాలయ్యారు. కేసు సీబీఐకి బదిలీ అయింది. గౌతమ్ సవాంగ్‌కి ఉచ్చు బిగిసే సమయంలో నాటి టీడీపీ ప్రభుత్వంలో పెద్దల ఆశీస్సులతో సవాంగ్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోకుండా కేవలం శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నాడు సీబీఐ సిఫార్సు చేసింది అనే వాదన బలంగా వుంది. ఆ తర్వాత కొద్దికాలానికే వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అందివచ్చిన అవకాశాన్ని స్వయంగా క్రిస్టియన్ అయిన గౌతమ్ సవాంగ్ వినియోగించుకున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి దగ్గర క్రిస్టియన్ ఫాదర్ల లాబీయింగ్‌తో సీబీఐ సిఫారసు చేసిన శాఖాపరమైన చర్యలు అటకెక్కాయనేది బహిరంగ రహస్యం. 

ఆంధ్రప్రదేశ్ రెండ్ రాష్ట్రాలుగా విడిపోయింది. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన విజయవాడ పోలీస్ కమిషనర్‌గా గౌతమ్ సవాంగ్ జులై 2015 నుంచి జులై 2018 వరకు మూడు సంవత్సరాలు కొనసాగారు. సవాంగ్ ఆగం 2.0 ఇక్కడే మొదలైంది. విజయవాడ పోలీస్ కమిషనర్‌గా అనేక అక్రమాలకు పాల్పడ్డారని కింది స్థాయి పోలీసు సిబ్బందిని ఎవరిని కదిలించినా కథలు కథలుగా చెబుతారు. అందులో ప్రధానంగా దొంగ బంగారం ముచ్చట ముందు చెబుతాను. సవాంగ్ విజయవాడ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు, ఆ తర్వాత వచ్చిన పోలీస్ కమిషనర్ల కాలం పరిశీలిస్తే దొంగ బంగారం లెక్క ఇట్టే తేలిపోతుంది. చోరీకి గురైన బంగారాన్ని పోలీసులు దొంగల నుంచి రికవరీ చేసి బాధితులకు న్యాయం చేస్తారు. ఉదాహరణకు ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. కేజీ బంగారం చోరీకి గురైంది. పోలీసులు ఆ దొంగని పట్టుకున్నారు. ఆ కేజీ బంగారం దొంగ నుంచి రికవరీ చేశారని అనుకుందాం. బాధితుడికి 750 గ్రాములే చేరుతుంది. ఇక్కడ పావుకిలో బంగారం గోవిందా. అదే గౌతమ్ సవాంగ్ కమిషనర్‌గా వున్న సమయంలో కేజీకి అరకేజీ.. ముప్పావు కేజీ గోవిందా. పోలీస్ కమిషనర్ స్థాయిలో వుండి సీఐ స్థాయి సిబ్బందితో నేరుగా నాకు రికవరీ బంగారం కావాలని అడగటం పోలీసు శాఖ చరిత్రలో ఇటువంటి ఉన్నతాధికారిని మేము అంతకుముందు ఎన్నడూ చూసి ఎరగం అనేవారంటే, పరిస్థితి ఎంత ఘోరంగా వుందో అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో సివిల్  పంచాయితీలు. పక్కరాష్ట్రంలో వున్న వ్యక్తులను సైతం అక్రమంగా ఎత్తుకొచ్చి, ఆంధ్రాలో నిర్బంధించి, బెదిరించి పంచాయితీలు చేసేవారనే ఆరోపణలు అప్పుడు బలంగా వినిపించాయి. 

సవాంగ్ కమిషనర్‌గా వుండగా విజయవాడలో సెక్స్ రాకెట్, కాల్ మనీ వార్త పెను సంచలనం స‌ృష్టించింది. నాటి ఎంపీ కేశినేని నాని, గౌతమ్ సవాంత్ సంయుక్తంగా ముందుకు తీసుకువచ్చిన కేసు... విజయవాడ కాల్ మనీ, సెక్స్ రాకెట్ కేసు. ఏమాత్రం పసలేని కేసును పట్టుకుని నాటి ప్రతిపక్షం జగన్ గ్యాంగ్ ఏ స్థాయిలో నాటి ప్రభుత్వాన్ని అల్లరిపాలు చేశాయో మనం చూశాం. అత్యంత వివాదాస్పద కేసులలో పోలీసు ఉన్నతాధికారులు పత్రికా సమావేశం పెట్టి ప్రజలకు వివరణ ఇవ్వడం ఇవ్వడం పోలీసుల ప్రాథమిక బాధ్యత. అటువంటి బెజవాడలో అటు ప్రతిపక్ష పార్టీ రచ్చ, ఇటు మీడియాలో సంచలన కథనాలు... వీటిమీద స్పందించాల్సిన సవాంగ్ హైదరాబాద్ వెళ్ళి కూర్చున్నారు. ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వాస్తవాలు వివరించమంటే లెక్క చేయలేదు. చంద్రబాబు నాటి డీజీపీ జేవీ రాములును గట్టిగా మందలిస్తే సవాంగ్ హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి  తూతూమంత్రంగా కేవలం ఐదు నిమిషాల్లో సమావేశం ముగించారు. 

ఆ తర్వాత కాలంలో గౌతమ్ సావాంగ్‌కి ఒక బలమైన కోరిక వుండేది. అదే డీజీపీ పోస్ట్. తరచూ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్ళి చంద్రబాబు మనవడు దేవాన్ష్.తో ఆడుకోవడం, కాకాపట్టడం మొదలుపెట్టారు. ఒక ఫైన్ మార్నింగ్ సవాంగ్ డీజీపీ కలను చంద్రబాబుతో పంచుకోవడం జరిగింది. సాధారణంగా రాజకీయ నాయకులు ఏం సమాధానం చెబుతారు? చూద్దాం అంటారు. చంద్రబాబు కూడా అదే అన్నారు... చూద్దాం అని! గౌతమ్ సవాంగ్ బలహీనతను అర్థం చేసుకున్న ఒక మీడియా అధినేత నేను మాట్లాడాను. నువ్వే డీజీపీ అని గౌతమ్ సవాంగ్‌లో బలీయంగా వున్న కోరికను తట్టి లేపాడు ఆ మీడియా అధినేత. అలా ఒకసారి కాదు.. పలుమార్లు జరిగింది. అదే అదనుగా గౌతమ్ సవాంగ్ చేత అనేక సివిల్ పంచాయితీలు చేయించి లాభపడ్డారు. ఇంకోపక్క ఇదే కోవలో రాష్ట్రంలో ఆటోమోబైల్ టైకూన్‌గా పేరున్న వ్యక్తి కూడా అనేక సివిల్ పంచాయితీలు చేయించి ఇరువురూ లాభపడ్డారు అని చెబుతారు. ఇక మీడియా అధినేత వాడకం అంతా ఇంతా కాదు అని చెబుతారు. 

డీజీపీ మార్పు సమయం రానే వచ్చింది. జూన్ 30 సాయంత్రం 5 గంటలకు నాటి డీపీజీ మాలకొండయ్య రిటైర్‌మెంట్. మరి, నూతన డీజీపీ ఎవరు? చంద్రబాబు అప్పటి వరకు ఏ నిర్ణయమూ తీసుకోలేదు. గౌతమ్ సవాంగ్‌లో తీవ్ర ఆందోళన మొదలైంది. సవాంగ్ మీడియా అధినేతకు ఫోన్ చేశారు. నీ పేరే కన్ఫమ్. ఇంకొద్దిసేపట్లో చంద్రబాబు సంతకం పెట్టనున్నారు అనే తప్పుడు సమాచారాన్ని తెలియజేశారు. తన జీవితకాల కోరిక నెరవేరే సమయం ఆసన్నమైంది అనే తన్మయత్వంలో సవాంగ్ మునిగిపోయారు. గౌతమ్ సవాంగ్‌ని అభిమానించే మహిళలు, శ్రేయోభిలాషులు సవాంగ్ ఆఫీసుకి క్యూ కట్టారు. పూల బొకేలు, దండలు, స్వీట్ ప్యాకెట్లు, టపాసులు సిద్ధం చేశారు. ఆ  రాత్రి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఏ కబురూ లేదు. తెల్లారి చంద్రబాబు కార్యాలయం నుంచి ఆర్పీ ఠాకూర్‌కి పిలుపు వచ్చింది. ఆర్పీ ఠాకూర్ ఏపీ నూతన డీజీపీగా ప్రకటన వెలువడింది. గౌతమ్ సవాంగ్‌లో నిర్వేదం, విషాదం అలముకున్నాయి. ఇదేంటి ఇలా జరిగింది అని ఆ మీడియా అధినేతను సవాంగ్ ప్రశ్నిస్తే అప్పటి వరకు సవాంగ్‌ని ఒక రేంజ్‌లో వాడిన మీడియా అధినేత ప్లేటు తిప్పేసి, సరిగ్గా చంద్రబాబు సంతకం పెట్టే సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు అడ్డుపడ్డారు అనే కట్టుకథలో సవాంగ్‌ని నమ్మించడంలో విజయవంతం అయ్యారు. నాటి చంద్రబాబు ప్రభుత్వం సవాంగ్‌ను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్.మెంట్ డీజీగా నియమించింది. ఇక్కణ్ణించి కథ కొత్త మలుపు తీసుకుంది. తన డీజీపీ కల ఆవిరైపోయిన వేదనలో సవాంగ్ అడుగులు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ వైపు పడ్డాయి. ఆనాడే, చంద్రబాబు ప్రభుత్వం వుండగానే లోటస్‌పాండ్ వేదికగా సవాంగ్ ఒక ఐపీఎస్ టీమ్‌ని సిద్ధం చేసుకున్నారు. వారంతా చంద్రబాబు వ్యతిరేకులుగా, ప్రతిపక్ష నేత జగన్ అనుకూల టీమ్‌ని సిద్ధం చేయడంలో గౌతమ్ సవాంగ్ విజయవంతం అయ్యారు. 

2019 ఎన్నికలలో తెలుగుదేశం ఘోరంగా ఓడిపోయింది. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ మరుసటిరోజే మే 31న గౌతమ్ సవాంగ్ ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా నియమించబడ్డారు. ఇక్కడి నుంచి అసలు సవాంగం అన్న 3.0 స్టార్ట్ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోగానీ, ఆ మాటకొస్తే స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే దారుణమైన పోలీసు రాజ్యం నడిచింది. ఇందిర ఎమర్జెన్సీ సమయంలో కూడా ఎమర్జెన్సీ అని ప్రకటించిన తర్వాత మాత్రమే నిర్బంధం కొనసాగింది. సవాంగ్ నేతృత్వంలో పోలీసు దమనకాండ ఆంధ్రప్రదేశ్ పోలీసు ప్రతిష్ఠను పాతాళంలోకి తొక్కేసింది. సవాంగ్ పోలీసు పాలనలో ప్రతిపక్ష పార్టీ సభ్యులు, సామాన్య ప్రజలు అనేక దారుణాలకు గురయ్యారు. ఒక్కమాటలో చెప్పాలంటే పెను విధ్వంసం సృష్టించారు. సవాంగ్ మార్కు వేట మొదలైంది. అందులో ముందు వరస... ఆలూరు బాల వెంకటేశ్వరరావు. ఏబీ వెంకటేశ్వరరావుపై సాగించిన దమనకాండ మీకు తెలుసుకదా! నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి ఉన్నవీ, లేనివీ అనేక చాడీలు చెప్పి, నకిలీ పత్రాలు సృష్టించి ఏబీ వెంకటేశ్వరరావుపై విరుచుకుపడటం ప్రధాన అంశం. ఏబీతోనే ఆగలేదు. ఏబీ కింద పనిచేసిన ఉద్యోగులందర్నీ ముప్పుతిప్పలు పెట్టించి మూడు చెరువుల నీళ్ళు తాగించారు. 

సవాంగ్ లిస్టులో మరొక బాధితురాలు.. ఐపీఎస్ అధికారిణి గీతాదేవి. ఆమె చేసిన నేరం.. ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ డీజీగా వున్నప్పుడు గీతాదేవి రీజినల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ఆర్ఐఓ‌)గా పనిచేయటమే ఆమె చేసిన నేరం. గీతాదేవి మాతృమూర్తి కేన్సర్‌తో ఆఖరి పోరాటం చేస్తుంటే సవాంగ్ ఆమెను మానసికంగా కోలుకోలేనంత వేధింపులకు గురిచేశారు. ఇక తరువాతి వరుస చంద్రబాబు సామాజికవర్గం. పోలీసు శాఖలో పనిచేసే కమ్మ అధికారుల లిస్టు తయారుచేశారు. హెడ్ కానిస్టేబుల్ దగ్గర్నుంచి ఐపీఎస్ వరకు వున్న వున్న అధికారులు సవాంగ్ దృష్టిలో అంటరానివారు. స్వతహాగా జగన్ రెడ్డిది వివాదాస్పద, వికృత మనసత్త్వం. దానికి గౌతమ్ సవాంగ్ విషపూరిత ఆలోచనలు తోడైతే ఏమవుతుంది? అదే అయింది! ఎటుచూసినా విధ్వంసం. ఐదేళ్ళ జగన్ పాలన మీకు తెలియంది కాదు. ఎన్నికలకు ఏడాది ముందు పాలెగాడు జగన్‌కి సవాంగం అన్నపై ఉన్నపళంగా కోపం వచ్చింది. డీజీపీ పోస్టు నుంచి పీకిపడేశాడు. 

తెలుగుదేశం పార్టీ అతివాదులు సవాంగ్‌ను జగన్ ఇన్నాళ్ళూ అడ్డగోలుగా వాడుకుని కరివేపాకులా తీసిపారేశాడు... నాడు ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నియ్య.. నేడు సవాంగ్ అన్నియ్య అని పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. జగన్ శిబిరం ఆలోచనలో పడింది. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గా సవాంగ్‌ను నియమించారు. ఆ పదవిలో కూడా గౌతమ్ సవాంగ్ అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వున్నాయి. గ్రూప్-1 పరీక్ష పేపర్లు దిద్దే కార్యక్రమంలో గౌతమ్ సవాంగ్ తీవ్ర నేరానికి పాల్పడ్డారు. పరీక్ష పత్రాలను డిజిటల్ పద్ధతిలో దిద్దటాన్ని హైకోర్టు రద్దు చేసి, మాన్యువల్ రీవాల్యుయేషన్ చేయమని ఆదేశించింది. మొదటిసారి రీవాల్యుయేషన్ పీఎస్ఆర్ ఆంజనేయులు నేతృత్వంలో నిర్వహించబడింది. రెండోసారి గౌతమ్ సవాంగ్ ఆధ్వర్యంలో రీవాల్యుయేషన్ జరిగింది. హైకోర్టులో గౌతమ్ సవాంగ్ ప్రమాణ పత్రం దాఖలు చేశారు. దాంట్లో రీవాల్యుయేషన్ ఒకసారే జరిగిందనే తప్పుడు సమాచారాన్ని ప్రమాణపత్రంలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈమొత్తం ప్రక్రియ అక్రమమని తేల్చింది. పరీక్ష ఫలితాలు, ఎంపిక జాబితాను రద్దుచేసి మళ్ళీ మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. అలాగే, ఎంపికై ఉద్యోగంలో చేరినవారు కూడా కొనసాగటానికి వీల్లేదని తీర్పు చెప్పింది. ఇంటర్వ్యూ ప్రక్రియలో పోస్టులకు రేటు కట్టి అమ్ముకున్నారని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని నిగ్గు తేల్చడానికి గౌతమ్ సవాంగ్‌తోపాటు ఏపీపీఎస్సీ సభ్యులను విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. నాడు గౌతమ్ సవాంగ్ ఉత్సాహం చూపించిన కాల్ మనీ కేసును కోర్టు కొట్టివేసింది. గౌతమ్ సవాంగ్ ఆ కేసును కోర్టులో నిరూపించలేకపోయారు.