డీఎంకేని టచ్ కూడా చేయలేరు.. విజయ్ పార్టీపై రజినీకాంత్ షాకింగ్ కామెంట్స్!

తమిళనాడులో డీఎంకే, ఏడీఎంకే పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. ప్రస్తుతం అక్కడ స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ అధికారంలో ఉంది. జయలలిత మరణం తర్వాత ఏడీఎంకే పార్టీ వెనుకబడిపోయింది. దీంతో డీఎంకే దూకుడుకి ఇప్పట్లో ఏడీఎంకే అడ్డుకట్ట వేయలేదనే అభిప్రాయాలున్నాయి. ఈ క్రమంలో దళపతి విజయ్ (Vijay) పొలిటికల్ ఎంట్రీ ఆసక్తికరంగా మారింది. తమిళగ వెట్రి కళగం అనే పార్టీని స్థాపించిన విజయ్.. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించాడు. దీంతో వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరికొందరైతే.. ప్రధాన పోటీ డీఎంకే, టీవీకే మధ్యేనని.. విజయ్ పార్టీ దెబ్బకి డీఎంకే ఓడిపోవడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

మంత్రి ఈవీ వేలు రచించిన 'కళైంజ్ఞర్‌ ఎనుమ్‌ థాయ్‌' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రజినీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీఎంకే పార్టీ మర్రి చెట్టు లాంటిదని, ఎలాంటి తుఫానునైనా ఎదుర్కొంటుందని అన్నారు. డీఎంకే మర్రి చెట్టును ఎవరూ కదిలించలేరని అభిప్రాయపడ్డారు. స్టాలిన్ రాష్ట్రాన్ని చక్కగా పాలిస్తున్నారని, పార్టీని బాగా నడుపుతున్నారని ప్రశంసించారు. సమాజం కోసం, ప్రజల సంక్షేమం కోసం కరుణానిధి ఎంతో కృషి చేశారని కొనియాడారు.

రజినీకాంత్ చేసిన తాజా కామెంట్స్ తమిళనాట హాట్ టాపిక్ గా మారాయి. డీఎంకే పార్టీ మర్రి చెట్టు లాంటిదని, ఎవరూ కదిలించలేరని రజినీ చేసిన కామెంట్స్.. పరోక్షంగా విజయ్ పార్టీని టార్గెట్ చేసినట్టుగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కొందరు విజయ్ ఫ్యాన్స్.. సోషల్ మీడియా వేదికగా రజినీ ని టార్గెట్ చేస్తూ విమర్శలు కూడా మొదలుపెట్టారు.