సొరచేపతో ఎన్టీఆర్ ఫైట్.. ఛత్రపతిని మరిపిస్తాడా?

'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'దేవర' (Devara). 'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్.. 'దేవర'తో తన ఇమేజ్ ని మరింత పెంచుకోవాలి అనుకుంటున్నాడు. సెప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను రెట్టింపు చేసేలా.. ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే ఇందులో సొరచేపతో ఎన్టీఆర్ తలపడే సన్నివేశముందట. (Shark Fight Sequence In Devara)

సొరచేపతో ఫైట్ అనగానే తెలుగు ప్రేక్షకులకు ప్రభాస్, రాజమౌళి కలయికలో 2005 లో వచ్చిన 'ఛత్రపతి' చిత్రం గుర్తుకొస్తుంది. ఇందులో సొరచేపతో ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ అప్పట్లో హైలైట్ గా నిలిచింది. ఇప్పుడు అదే తరహాలో 'దేవర'లో సొరచేపతో ఎన్టీఆర్ తలపడే సన్నివేశాన్ని కొరటాల ప్లాన్ చేశారట. సముద్ర తీర ప్రాంతంలో జరిగే కథ కావడంతో కొరటాల ఈ ఫైట్ సీన్ ని ప్లాన్ చేశారని, అది కూడా ఓ రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. తాజాగా దీనికి సంబంధించిన కొన్ని సెట్ ఫొటోలు లీకై ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీంతో సొరచేపతో ఎన్టీఆర్ ఫైట్ ఎలా ఉంటుందోనని అభిమానులు ఎంతో ఎక్సైట్ అవుతున్నారు.

2005 తో పోలిస్తే ఇప్పుడు టెక్నాలజీ పరంగా, గ్రాఫిక్స్ పరంగా తెలుగు పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందింది. ఇప్పుడున్న వనరులతో సొరచేప ఫైట్ సీన్ ని సరిగ్గా తెరకెక్కిస్తే వెండితెర మీద అదిరిపోతుంది అనడంలో సందేహం లేదు. 'ఆర్ఆర్ఆర్'లో పులితో ఎన్టీఆర్ సన్నివేశాలు ఎలాగైతే హైలైట్ గా నిలిచాయో.. 'దేవర'లో కూడా ఆ స్థాయి సన్నివేశాలను కొరటాల ప్లాన్ చేసినట్లు సమాచారం.