అయ్యో!బొత్స అప్పుడే రాజకీయ సన్యాసమా?

 

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జీవచ్చవంలా మారిన కాంగ్రెస్ పార్టీని బ్రతికించడానికి ఏడాదిపాటు ఎన్ని ప్రయత్నాలు చేసినా బ్రతికే సూచనలు కనబడటం లేదంటూ భారంగా ఒక నిట్టూర్పు విడిచి బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో నుంచి ఈమధ్యనే వైకాపాలోకి జంపేసారు. కానీ ఇంకా పార్టీలో పూర్తిగా కుదురుకోకముందే మళ్ళీ ఆయన రాజకీయ సన్యాసానికి సిద్దపడుతున్నారని తెలిస్తే రాష్ట్ర, దేశ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులందరూ చాలా ఆందోళన చెందడం సహజమే. కానీ వారందరూ సుగర్లు, బీపీలు పెంచుకొని ప్రాణాల మీదకు తెచ్చుకొంటే వారి కోసం ఆయన ఓదార్పు యాత్రలు చేయలేరు. కనుక ఆయనే తన రాజకీయ సన్యాసానికి “కండిషన్స్ అప్ప్లై” అని ఓ స్టార్ మార్క్ పెట్టేసారు.

 

ఆ కండిషన్ ఏమిటంటే ఎల్విస్ స్టీవెన్సన్ కు ఆ ఎమ్మెల్యే పదవి ఇవ్వాలని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కి లేఖ వ్రాసారని, అందుకే ఆయన ఇప్పుడు ఈ ఓటుకి నోటు వ్యవహారంలో తెలంగాణా ప్రభుత్వానికి కో-ఆపరేట్ చేసారని, ఈ స్కెచ్చ్ వేసేందుకు జగన్మోహన్ రెడ్డి, హరీష్ రావుతో కలిసి సదరు ఎం.యల్యేలతో సరిగ్గా పదిరోజుల క్రితమే సమావేశమయ్యారని ఆంద్రప్రదేశ్ ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు తాజాగా ఒక ఆరోపణ చేసారు. దానిని ఆయన నిరూపిస్తే తను రాజకీయాల నుండి తప్పుకొంటానని బొత్స వారి కండిషన్. కనుక ఆయన వీరాభిమానులెవ్వరూ తొందరపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని, గుండెలు పగిలిపోకుండా బిగుతయిన దుస్తులు ధరించాలని విజ్ఞప్తి.