అయ్యో! ఆయన వేములవాడ వెళ్ళారా?

 

కరీంనగర్ జిల్లాలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రం గురించి ఎరుగని వారుండరు. సుదూర జిల్లాలు రాష్ట్రాల నుండి కూడా వేములవాడ స్వామి వారి దర్శనానికి భక్తులు వస్తుంటారు. కానీ అధికారంలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రులు మాత్రం స్వామివారి పేరు చెపితే హడలిపోతుంటారు. ఎందుకంటే ఆ గుడికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చినవారి పదవులు ఊడిపోతుంటాయి! అది కాకతాళీయమో లేకపోతే రాజకీయనాయకులకి నిజంగానే అటువంటి శాపమేమయినా ఉందేమో తెలియదు కానీ ఇంతకు ముందు రాజన్న దర్శనం చేసుకొన్న ముఖ్యమంత్రులు టీ అంజయ్య, కే విజయ భాస్కర రెడ్డి, ఎన్టీ రామారావులు పదవులు కోల్పోయారు. అందుకే మంత్రులెవరూ ఆ గుడి ఛాయలకి కూడా వెళ్ళే సాహసం చేయరు.

 

కానీ నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమార్తె కవిత, పార్టీకి చెందిన మరికొందరు నేతలని వెంటబెట్టుకొని ఆ గుడికి వెళ్లి అక్కడ హోమాలు అవీ నిర్వహించారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా ఆయన మంత్రులందరూ కేసీఆర్ తమ ఫోన్లను ట్యాపింగ్ చేయించినందుకు ఆయన త్వరలోనే తన ముఖ్యమంత్రి పదవిని కోల్పోక తప్పదని బల్లగుద్ది గట్టిగా వాదిస్తున్నారు. ఇటువంటి సమయంలో కేసీఆర్ ఆ సెంటిమెంటును పక్కనబెట్టి వేములవాడ స్వామి వారిని దర్శనం చేసుకొని వచ్చేరు. ఇంతకుముందు మాజీ ప్రధాని స్వర్గీయ నరసింహరావు కూడా ఆ గుడికి వెళ్ళేరు కానీ, ఆయన కుర్చీకేమీ కాలేదు. కనుకనే కేసీఆర్ కూడా దైర్యం చేసారేమో? మరి ఆ సెంటిమెంటు ఎఫెక్ట్ ఉందో లేదో త్వరలోనే తేలిపోతుంది. కేసీఆర్ పదవికి ఏమీ కాకపోయినట్లయితే ఇక మిగిలిన మంత్రులందరూ కూడా నిర్భయంగా రాజన్న దర్శనానికి వెళ్లి రావచ్చును.