అమాంతం రేట్లు పెంచేసిన అమెజాన్.. అర్థరాత్రి నుంచే అమలు..
posted on Dec 13, 2021 3:56PM
అమెజాన్. ఆ అడవి అంత పెద్దది ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్. అమెజాన్‌లో ఏ టూ జెడ్.. ఏది కావాలన్నా దొరుకుతుంది. అమ్మే వారికి కొనే వారికి వారధిగా మారింది అమెజాన్. ఈ అన్‌లైన్ కొనుగోళ్లు ఎంత పాపులరో.. ప్రైమ్ వీడియోస్ పేరుతో సినిమాలు, సీజన్స్ కూడా అంతే పెద్ద బిజినెస్. అందుకే, అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్న వారు కోట్లల్లో ఉంటారు. తాజాగా, వారందిరికీ షాక్ ఇస్తూ.. అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం ధర భారీగా పెంచేసింది. ధరల పెరుగుదల గురించి ముందే సమాచారం ఇచ్చినా.. సడెన్‌గా ఈ అర్థరాత్రి నుంచే పెరిగిన ధరలు అమలులోకి వస్తుందని అమెజాన్ ప్రకటించింది.
డిసెంబర్ 13 వరకూ.. అమెజాన్ ప్రైమ్ వార్షిక సభ్యత్వం రూ.999గా ఉండగా.. డిసెంబర్ 14 నుంచి ఆ ధర ఏకంగా రూ.1,400 కానుంది. ఈ పెంచిన ధరలు సోమవారం అర్ధరాత్రి నుంచి (మంగళవారం డిసెంబరు 14) నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు అమెజాన్ ప్రైమ్ తన డీల్స్ పేజీలో ప్రకటించింది.
అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిఫ్ మూడు రకాలుగా ఉంది. నెల.. మూడు నెలలు.. ఏడాది టైమ్ పీరియడ్‌కి ప్రైమ్ సభ్యత్వం అందుబాటులో ఉంది. తాజా పెంపుతో ఈ మూడు ప్యాక్‌ల ధరలూ పెరగనున్నాయి. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ నెలవారీ సభ్యత్వ రుసుము రూ.129గా ఉండగా, పెంపు తర్వాత రూ.179 కానుంది. అంటే, 38శాతం పెరగనుంది. ఇక, మూడు నెలల ప్యాక్‌కు రూ.329 ఉండగా అది 39శాతం పెరిగి.. రూ.459 అవుతోంది. వార్షిక సభ్యత్వం రూ.999 నుంచి.. 50శాతం పెంపుతో రూ.1,499కి చేరుతుంది.
2016లో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను భారత్‌లో ప్రారంభించింది అమెజాన్. అప్పుడు వార్షిక సభ్యత్వం రూ.499గా ఉండగా, ఆ తర్వాత 2019లో రూ.999కు పెంచింది. 2018లో నెలవారీ సభ్యత్వాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికి ప్రైమ్ వీడియోలు, ప్రైమ్ మ్యూజిక్‌తో పాటు, ఒకటి లేదా రెండు రోజుల్లోనే ఉచిత హోమ్ డెలివరీ వంటి ప్రయోజనాలు ఉంటాయి. టాప్ డీల్స్‌ను 30 నిమిషాల ముందుగానే పొందే అవకాశమూ లభిస్తుంది. అందుకే, ఇండియాలో కోట్లలో అమెజాన్ ప్రైమ్ ఖాతాదారులు ఉన్నారు.