జైభీమ్ చంద్రుపై హైకోర్టు జడ్జీ సీరియస్...
posted on Dec 13, 2021 4:03PM
ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఉద్దేశించి జైభీమ్ సినిమా ఫేమ్ జస్టిస్ చంద్రు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ తీవ్రంగా స్పందించారు. జస్టిస్ చంద్రు కామెంట్లను జస్టిస్ దేవానంద్ ఖండించారు. ఎంతో మంది ప్రాథమిక హక్కులను కాపాడుతున్నామని, జస్టిస్ చంద్రు ఆరోపణలు నిరాధారమైనవని చెప్పారు. మొత్తం హైకోర్టును ఎలా నిందిస్తారని జస్టిస్ దేవానంద్ ప్రశ్నించారు.
‘‘ఒక డాక్టర్‌ని పోలీసులు రోడ్డుపై విచక్షణారహితంగా కొట్టారు హక్కుల గురించి పోరాడాలంటే విశాఖకు వెళ్ళండి. మంచి డైరెక్టర్‌తో సినిమా తీయించండి. దేశంలోని ఇతర హైకోర్టులతో పోలిస్తే జడ్జి నుంచి కక్షిదారుల వరకు ఏపీ హైకోర్టులో కనీస సౌకర్యాలు లేవు. కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. హైకోర్టు న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తుంటే సీబీఐ విచారణకు ఆదేశించడం తప్పా?.’’ అని జస్టిస్ బట్టు దేవానంద్ వ్యాఖ్యానించారు.
విజయవాడలో జరిగిన ఓ సభలో ప్రసంగించిన జస్టిస్ చంద్రు.. ఏపీ హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరిస్తోందని అన్నారు. ప్రభుత్వం శత్రువులు, ప్రత్యర్థులతో కాదు న్యాయవ్యవస్థతో యుద్ధం చేస్తోందని కామెంట్ చేశారు. అమరావతి భూస్కామ్‌లో ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేస్తే హైకోర్టు స్టే ఇచ్చిందని, కోర్టులు న్యాయం చేయాల్సిందిపోయి ఏదో చేయడానికి ప్రయత్నిస్తోందని జస్టిస్ చంద్రు ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.