కేసీఆర్ శ్రీరంగం పర్యటన అందుకేనా?
posted on Dec 13, 2021 3:51PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసి నేటికి మూడేళ్లు పూర్తయ్యాయి. రాష్ట్రం ఏర్పడిన అనంతరం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భానికి, నాలుగేళ్ళ అనతరం రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భానికి పెద్దగా తేడాలేదు. కేసీఆర్ సారధ్యంలో తెరాస తొలిసారి కంటే, రెండవసారి మరింత ఎక్కువ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. మూడింట రెండువంతుల (18 మందిలో12) మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారెక్కడంతో. కారు జోరుకు తిరుగన్నదేలేకుండా పోయింది. కానీ,2019 లోక్’సభ ఎన్నికలలో తెరాస కథ అడ్డం తిరిగింది. కారు సారూ పదహారు బండి బోల్తా కొట్టింది. బీజేపీ నాలుగు, కాంగ్రెస్ మూడు ఎంపీ సీట్లను గెలుచుకున్నాయి. తెరాసకు సవాలు విసిరాయి.
ఇక అక్కడి నుంచి కథ అడ్డం తిరిగింది. ప్రతి పక్షమే ఉండకూడదు అనుకుంటే, ఒకరికి ఇద్దరు తోడయ్యారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి,కేసీఆర్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ముఖ్యంగా హుజూరాబాద్ ఓటమి తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్, కాళ్ళ కింద భూమి కదిలి పోతున్నట్లుగా షేక్ అవుతున్నారు. ఏదో తెలియని భయం ఆయన్ని భయంకరంగా వెంటాడుతోందని ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాల సమాచారం. ఓ వంక రాజకీయంగా వరస ఓటములు వెంటాడుతున్నాయి. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఓటమి దెబ్బ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల బయట పడేస్తే, హుజూరాబాద్ ఏ గెలుపు భర్తీ చేయలేని భారీ దెబ్బ తీసింది.మరో వంక దాచేస్తే దాగని అవినీతి కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి.అన్ని దిక్కుల నుంచి ఉచ్చులు బిగుసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి సన్నిహితులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు అందినట్లు సమాచారం. దీంతో ముఖ్యమంత్రి మరింతగా భయపదుతున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపధ్యంలోనే, కేసీఆర్ ఆత్మ రక్షణలో పట్టారు. ఢిల్లీతో వరి పేరున కయ్యానికి కాలు దువ్విన ఆయనే సయోధ్యకు కూడా ప్రయత్నించారని అంటారు. అయినా, నాలుగు రోజులు ఢిల్లీలో ఉండి వట్టి చేతులతతో వచ్చారు. మరోవంక, కేంద్రంలో బీజేపీ వ్యతిరేక శక్తులతో చేతులు కైపి రక్షణ వలయం ఏర్పరుచుకునే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా ఈరోజు తమిళనాడులోని శ్రీరంగం వెళ్లారు. శ్రీరంగం రంగనాథస్వామికి కుటుంబ సమేతంగా పూజలు ఆచరించి, మొక్కులు తీర్చుకునిందుకే ముఖ్యమంత్రి తమిళనాడు వెళ్లి నట్లు చెపుతున్నా, ఈ పర్యటనలో స్వామి కార్యంతో పాటుగా స్వకార్యం కూడా ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. శ్రీరంగం నుంచి చెన్నైవచ్చి, రేపు (మంగళవారం) ఉదయం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ను కలిసే అవకాశముందని అంటున్నారు.
నిజానికి ప్రస్తుత చిక్కులోంచి బయట పాడేందుకు స్టాలిన్’తో ముఖ్యమంత్రి చర్చిస్తారని అంటున్నారు. అలాగే, స్టాలిన్’తోపాటుగా తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ నరసింహన్ను కలసి వారి సహకారం తీసుకునేందుకే కేసీఆర్ తమిళనాడు టూర్ ప్లాన్ చేశారని అంటున్నారు. స్టాలిన్ ద్వారా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సహా ఇతర పార్టీలతో చేతులు కలిపే ప్రయత్నంలో భాగంగానే ముఖ్యమంత్రి స్టాలిన్’ను కలుస్తున్నారని అంటున్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో కేంద్ర వైఖరి, రాజకీయ అంశాలపై స్టాలిన్తో చర్చించనున్నారని అంటున్నారు. అదే విధంగా కేంద్రంతో మంచి సంబంధాలున్న మాజీ గవర్నర్ నరసింహన్ను మర్యాద పూర్వకంగా కలిసి వారి ఆశీస్సులు తీసుకుంటారని అంటున్నారు. అయితే కేసీఆర్ ప్రస్తుత తమిళనాడు టూర్ విషయం,ఈ టూర్ వెనకున్న అసలు కథ ఎలాఉన్నా, కేసీఆర్ సెకండ్ టర్మ్ మొదటి మూడేళ్ళు రాష్ట్రానికే కాదు, ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రి కుటుంబానికి కాసింత కష్టంగానే సాగాయి .. మిగిలిన రెండేళ్ళు ఎలా ఉంటాయో ..ఏమో .. చెప్పడం కష్టమే.