ఆహా ఏం భోగం.. ఇంటి కన్నా జైలే నయం!

తాజాగా వెలుగు చూసిన ఓ వీడియో ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేసింది. ఆప్ మంత్రి సత్యేంద్ర కుమార్ జైన్ కు జైళ్లో సకల మర్యాదలూ జరుగుతున్నాయని చాటే వీడియో ఒకటి వెలుగులోకి వచ్చి ఆప్ పరువును గంగలో కలిపింది. వడ్డించే వాడు మనవాడైతే పంక్తిలో చివర కూర్చున్నా ఫరవాలేదు అన్న సామెతలా అధికారంలో మన పార్టీ ఉంటే జైళ్లో కూడా రాజభోగాలు అనుభవించవచ్చని ఆప్ మంత్రికి జైళ్లో అందుతున్న సౌకర్యాలను చూస్తే అర్ధమౌతుంది. కర్యాలను చూస్తే ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా దొరకవేమో అనిపిస్తుంటుంది.

గతంలో జైలులో కూడా రాజభోగాలు అనుభవించిన కొందరు రాజకీయ నేతలను మనం చూడగా.. ఇప్పుడు అదే కోవలో ఢిల్లీ మంత్రి కూడా చేరారు. డిల్లీలో ఆప్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీగా సామాన్యుల కోసమే పని చేస్తామనే ఆ పార్టీ మంత్రి   సత్యేంద్రకుమార్ జైన్ మనీలాండరింగ్ కేసులో మే 30న  అరెస్టైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న సత్యేంద్రకుమార్ కు అక్కడ సకల సేవలూ జరుగుతున్నాయని తెలియజేసే వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. 

ఈ వీడియోలో మంచం మీద దర్జాగా పడుకున్న మంత్రికి మరో వ్యక్తికి మసాజ్ చేస్తున్నాడు. మంత్రి పడుకున్న బెడ్ మీద టీవీ రిమోట్, తాగేందుకు మినరల్ వాటర్ బాటిల్ వంటివి కనిపిస్తుండడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు.. ఇది జైలా స్టార్ హోటలా అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇది ఇప్పటి వీడియో కాదు సెప్టెంబర్ నెల నాటి వీడియో అని ఆప్ నేతల వివరణ ఇస్తున్నా.. ఆ తర్వాత కూడా అదే జైలులో ఉన్న ఈ మంత్రికి అవే మర్యాదలు దక్కుతున్నాయని విమర్శలు వినవస్తున్నాయి. మొత్తం మీద ఈ వీడియో దెబ్బకు పదిమంది జైలు అధికారుల మీద వేటు పడింది. ఆప్ పార్టీకి రాజకీయంగా నష్టం జరిగింది.