ఇప్పట్లో కేసీఆర్ సైలైన్స్ వీడే అవకాశాలు మృగ్యం?
posted on Dec 17, 2024 7:11AM
బీఆర్ఎస్.. మాటలు తప్ప చేతలకు ఆ పార్టీ నేతలు రెడీగా లేరని మరో సారి ప్రస్ఫుటంగా తేలిపోయింది. లేస్తే మనిషిని కాను అంటూ హెచ్చరికలు చేస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసలు లేవడానికీ, పొలిటికల్ గా యాక్లివ్ కావడానికి రెడీగా లేరని అవగతమయ్యేలా జరుగుతున్న పరిణామాలు ఉంటున్నాయి. అసెంబ్లీ సీతాకాల సమావేశాల ఎన్ని రోజులు జరగాలన్న దానిపై బీఏసీ సమావేశంలో గట్టిగా పట్టుబట్టిన బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు తదితరులు తమ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు గైర్హాజర్ కావడంపై మాత్రం నోరెత్తడం లేదు. కేసీఆర్ కూడా ఇటీవల.. అంటే రేవంత్ సర్కార్ కొలువుదీరి ఏడాది పూర్తయిన సందర్భంగా కేసీఆర్ ఇక పొలిటికల్ గా యాక్టివ్ అవుతారనీ, రేవంత్ సర్కార్ కు ఇక చుక్కలేనని బీఆర్ఎస్ నేతలు, శ్రేణులూ గట్టిగా చెప్పాయి. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరౌతారనీ, రేవంత్ సర్కార్ కు ఏడాది సమయం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ ఇంత వరకూ మౌనం వహించారనీ, ఆ గడువు ముగిసిందనీ, ఇక రేవంత్ సర్కార్ కు దినదిన గండం పరిస్థితి తప్పదనీ గట్టిగా చెప్పారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన ఈ ఏడాది కాలంలో ఆయన. దూకడుగా, దైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ, ప్రతిపక్ష బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేశారు. స్ఫూలంగా చూస్తే రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై పెద్దగా ప్రజా వ్యతిరేకత గూడుకట్టుకుందని చెప్పలేం. అయితే ఆయన సుపరిపాలన అందిస్తున్నారనీ చెప్పజాలం. రేవంత్ కు ప్రజలలో పెద్దగా వ్యతిరేకత కనిపించడపోవడానికి కారణం ప్రతిపక్షంగా బీఆర్ఎస్ వైఫల్యం ఒక ప్రధాన కారణంగా చెప్పాలి. ఈ ఏడాది కాలంలో ప్రతిపక్షం నుంచి రేవంత్ కు నిజమైన సవాల్ అన్నదే ఎదురు కాలేదు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావులు రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూ, ప్రతీ అంశంలోనూ ఇరుకుపెట్టాలని చూస్తున్నా.. వారి ఎత్తులను రేవంత్ సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నాడు. కేసీఆర్ యాక్టివ్ గా లేకపోవడం వల్ల బీఆర్ఎస్ ప్రతిపక్షంగా పూర్తిగా విఫలమైంది.
ఈ పరిస్థితుల్లోనే తెలంగాణలో రాజకీయ చాణుక్యుడిగా పేరున్న కేసీఆర్ ఇక తాను యాక్టివ్ అవుతున్నానన్న సంకేతాలు ఇచ్చారు. కేసీఆర్ వ్యూహం రచించాడంటే ఎంతటి రాజకీయ ఉద్దండులైనా విలవిలలాడాల్సిందే. అయితే రాష్ట్ర్రంలో బీఆర్ఎస్ పరాజయం తరువాత కేసీఆర్ ఫాం హౌస్ కే పరిమితం అయ్యారు. ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేసినా, అవినీతికి పాల్పడ్డాడంటూ కేసులు పెట్టినా కేసీఆర్ మౌనంగా ఉంటూ వచ్చారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఏడాది సమయం ఇవ్వాలని కేసీఆర్ ఇన్నాళ్లు ఏమీ మాట్లాడలేదని, ఇక నుంచి ఆయన రంగంలోకి దిగబోతున్నారని బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటూ వచ్చారు. ఆయన వ్యూహాలను రేవంత్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి కావడం ఖాయమనీ బీఆర్ఎస్ నేతలు సవాళ్లు విసిరారు.
తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్‌ది కీలక భూమిక అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ ను రగిల్చి రాజకీయంగా ఎదిగిన కేసీఆర్.. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తరువాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తొలి ఐదేళ్లు అద్బుత పాలనతో మరోసారికూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్.. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయారు. అప్పటి నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కేవలం ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన ఒక్కరోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, అధికారంలో ఉన్న తమకు సలహాలు సూచనలు ఇవ్వాలని రేవంత్‌రెడ్డి పలుసార్లు విజ్ఞప్తి చేసినా కేసీఆర్ స్పందించలేదు. మరోవైపు బీఆర్ఎస్ హయాంలో అవినీతి అక్రమాలను వెలికితీస్తూ కేసీఆర్ పై కేసులు బనాయించేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నించినప్పుడు కూడా కేసీఆర్ మౌనంగానే ఉన్నారు. ఇక మౌనం వీడి రేవంత్ సర్కార్ ఏడాది పాలనపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడతారనీ, అసెంబ్లీ సమావేశాలకు హాజరౌతారనీ బీఆర్ఎస్ నేతలు చెప్పారు. అసెంబ్లీలో అధికార పార్టీపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఇరుకునపెడతారనీ బీఆర్ఎస్ నేతలు గట్టిగా చెప్పారు. వారి మాటలకు బలం చేకూర్చే విధంగా కేసీఆర్ ఇటీవల తన ఫామ్ హౌస్ లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. ఇదే క్రమంలో రేవంత్ సర్కార్ తీరుపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడంపై కేసీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. తెలంగాణ త్లలి విగ్రహం రూపం మార్చడం మూర్ఖత్వం, ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా? అలా మార్పులు చేసుకుంటూ పోతే ఎలా? అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. అదే విధంగా అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అంశాలపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అంశాల వారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. మూసీ, హైడ్రా విషయంలో ప్రభుత్వ వైఖరి, గురుకులాలు, విద్యారంగంలో వైపల్యాలను సభలో లేవనెత్తాలని పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఆధారంగా వైఫల్యాలను ఎత్తిచూపాలని అన్నారు. అదేవిధంగా ఫిబ్రవరిలో బహిరంగ సభ ఉంటుందని, ఆ సభలో సర్కారు వైఖరిని ఎండగడతామని, ఫిబ్రవరి తరువాత పార్టీలో అన్ని కమిటీలు ఏర్పాటు చేస్తామని, కమిటీల ఏర్పాటు తరువాత సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో పేర్కొన్నారు. ఇకనుంచి రణమే.. నేను రంగంలోకి దిగుతున్నా అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. దీంతొ ఇంకేముంది బాస్ ఈజ్ బ్యాక్.. ఇక రేవంత్ సర్కార్ కు చుక్కలు చూపడం ఖాయమని బీఆర్ఎస్ శ్రేణులు సంబరపడ్డాయి. అయితే మళ్లీ కేసీఆర్ అసెంబ్లీకి గైర్హాజరై తుస్సు మనిపించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు, నేతల ధైర్యం, స్థైర్యం మరో సారి జావగారిపోయాయి.
పార్టీ నేతలతో భేటీలో రేవంత్ సర్కార్ పై విమర్శలు గుప్పించి, పార్టీ శ్రేణుల్లో ఆశలు చిగురించేలా చేసి ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నదేమిటయ్యా అంటే.. అమెరికాకు వెడుతున్నారు. తన మనవడితో కులాసాగా గడిపేందుకు ఆయన అమెరికా పర్యటన పెట్టుకున్నారు. ఆయన ఎప్పుడు అమెరికాకు బయలు దేరుతారన్న దానిపై కచ్చితమై సమాచారం లేకపోయినప్పటికీ ఆయన ఓ రెండు నెలల పాటు ఆయన అమెరికాలోనే ఉంటారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారిక సమాచారం ఏదీ లేదు. అయినా విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కేసీఆర్ అమెరికా పర్యటన ఖరారైంది. మొత్తం మీద కేసీఆర్ ఇప్పట్లో పోలిటికల్ గా యాక్టివ్ అయ్యే అవకాశాలు లేవని పరిశీలకులు అంటున్నారు. ఇప్పట్లో బీఆర్ఎస్ పుంజుకునే అవకాశాలు దాదాపు మృగ్యమనే అంటున్నారు.