నియోజకవర్గాల పునర్విభజన.. దక్షిణాదికి తీరని నష్టమేనా?

నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి తీరని నష్టం, అన్యాయం వాటిల్లనుంది. లోక్ సభ వేదికగా నియోజకవర్గాల పునర్విభజన అంశంపై జరిగిన చర్చో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు ఈ విషయంపై బలంగా తన గళం వినిపించారు. నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి తీరని అన్యాయం వాటిల్లనుందని ఆయన చెప్పారు. అది నిజమే. జనాభా ప్రాతిప్రతికన జరిగే నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఉత్తరాదిలో 155 లోక్ సభ స్థానాలు పెరుగుతుంటే.. దక్షిణాదిన మాత్రం కేవలం 34 స్థానాలు మాత్రమే పెరుగనున్నాయి.  నియోజకవర్గాల పునర్విభజనలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్‌లలో ఇప్పుడున్న 174 ఎంపీ సీట్లు 329కు పెరిగే అవకాశం ఉంది. అంటే ఆ రాష్ట్రాలన్నీ కలిపి అక్కడ 155 సీట్లు పెరుగనున్నాయి. 

అదే దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో సీట్లు 129 నుంచి 164కు మాత్రమే పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఐదు రాష్ట్రాల్లో కలిపి కేవలం 35 సీట్లు మాత్రమే పెరుగుతుంటే.. ఉత్తరాదిలో మాత్రం నాలుగు రాష్ట్రాలకు కలిపి 155 స్థానాలు పెరుగుతున్నాయి. ఏ విధంగా చూసినా ఇది  సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం.  ఆర్థిక క్రమశిక్షణ పాటించని రాష్ట్రాలకు రాజకీయంగా ప్రయోజనం కల్పించడమే అవుతుందనడంలో సందేహం లేదు. ఈ అన్యాయాన్ని సరిదిద్ది, దక్షిణాది రాష్ట్రాలకూ లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.  

ఆర్ధిక క్రమశిక్షణ పాటించకపోవడమే కాదు.. కుటుంబ నియంత్రణ అమలు విషయంలో కూడా ఉత్తరాది రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ విధానాలను ఇసుమంతైనా లెక్క చేయలేదు. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాలు మాత్రం జనాభా నియంత్రణ విషయంలో ముందువరుసలో నిలిచాయి. ఇప్పుడు అదే ఆ రాష్ట్రాలకు శాపంగా మారింది. దేశ ప్రయోజనాల కోసం గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కుటుంబ నియంత్రణను పాటించడంలో ముందున్న దక్షాణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరిగింది.  అందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వంటి దక్షిణాది రాష్ట్రాల నాయకులు  ఒక్కరు లేక ఇద్దరు చాలు అన్న నినాదాన్ని పక్కన పెట్టేసి ఎక్కువ మంది పిల్లలను కనండి అంటున్నారు. దక్షిణాది రాష్ట్రాలలో జనాభా పెరగాలని కోరుకుంటున్నారు.  ఎందుకంటే.. జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల విభజన జరుగుతుంది. నియోజకవర్గాల విభజనలో కుటుంబ నియంత్రణను కచ్చితంగా పాటింది, జనాభా పెరుగుదల నియంత్రణకు దోహదపడిన దక్షిణాది రాష్ట్రాలు నియోజకవర్గాల పునర్విభజనలో గణనీయంగా నష్టపోనున్నాయి. భారీగా నియోజకవర్గాలను కోల్పోనున్నాయి. 

ఎందుకంటే.. ఉత్తరాదిలో జనాభా పెరుగుదల రేటు దక్షిణాదితో పోలిస్తు  కంటే ఎక్కువగా ఉంది.  జనాభా ప్రాతిపదికన జరిగే నియోజకవర్గాల   విభజనతో ఉత్తరాది రాష్ట్రాలలో లోక్ సభ స్థానాలు పెరుగుతాయి. ఆ మేరకు దక్షిణాదిలో తగ్గిపోతాయి. అంటే దక్షిణాది వాయిస్ జాతీయ స్థానియలో బలహీన పడుతుంది.  ఇప్పటికే దక్షిణాది పట్ల కేంద్రం చిన్న చూపు చూస్తోందన్న భావన దక్షిణాది రాష్ట్రాలలో బలంగా ఉంది.  

ఉత్తరాది,దక్షిణాది ల మధ్య జనాభా పెరుగుదల రేటులో వత్యాసం ఉండటానికి కారణం  కుటుంబనియంత్రణ దక్షిణాది రాష్ట్రాలలో ఖచ్చితంగా,సమర్దవంతంగా అమలుచేయడమే.  ఒకప్పుడు "ఇద్దరైతే ముద్దు..ఆపై వద్దు" ఒక్కరు లేదా ఇద్దరు చాలు అనే కుటుంబనియంత్రణ నినాదం జనంలోకి బలంగా వెళ్లింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో ప్రజలు అందుకు కట్టుబడ్డారు.   తమ ఆర్ధిక పరిస్థితి మేరకు చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం అని భావించి కుటుంబ నియంత్రణను కచ్చితంగా పాటించారు.  . పిల్లల చదువులకు అధిక ప్రాధాన్యత ఇచ్చే దక్షిణాది కుటుంబాలు ఒకరిద్దరు పిల్లలో సరి పెట్టుకుని పిల్లల చదువులకు ఎలాంటి ఆటంకాలూ, ఆర్థిక సమస్యలూ ఎదురు కాకుండా చూసుకున్నారు.  
సాధారణంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా జనాభా నియంత్రణకు దోహదపడిన దక్షిణాది రాష్ట్రాలకు మేలు జరిగేలా చర్యలు ఉండాలి. కానీ జనాభా నియంత్రణను పాటించిన దక్షిణాదికి అన్యాయం జరిగేలా ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతోంది. అదే మాదిరిగా కేంద్రం నిధుల కేటాయింపులూ ఉంటున్నాయి. అంటే ఎక్కువ జనాభా ఉంది కనుక ఎక్కువ నియోజకవర్గాలు ఉత్తరాదికి. జనాభా ఎక్కువగా ఉండటం వల్ల పేదరికం ఎక్కువగా ఉంది.. అందుకు కేటాయింపులలో అధిక భాగం ఉత్తరాదికే అన్నట్లుగా పరిస్థితి ఉంది.  ఇది దారుణం. ఈ అన్యాయాన్ని సరిదిద్దకుంటే.. ఇప్పటికే ఉత్తరాది, దక్షిణాది మధ్య ఉన్న అంతరం మరింత పెరిగి అంతర్యుద్ధానికి దారి తీసే ప్రమాదం లేకపోలేదు.