నిద్రలేమికి చెక్ పెట్టాలంటే...!

  ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం ఎంత అవసరమో... నిద్ర కూడా అంతే అవసరం. కానీ మారుతున్న జీవన విధానం మనిషికి నిద్రను దూరం చేస్తోంది. ఒత్తిడి పెరిగిపోయి కంటి మీదకి కునుకు రానంటోంది. చిన్నగా కనిపించినా ఇది పెద్ద సమస్యే. నిద్రలేమి మన పనితనాన్ని, జీవనాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. కాబట్టి తగినంత నిద్రపోవాలి. నిద్రపట్టకపోతే ఎలా నిద్రపోవాలి అనకండి. దానికి కొన్ని సింపుల్ చిట్కాలున్నాయి. కేవలం కొన్ని రకాల ఆహార పదార్థాలతో సమస్యను దూరం చేసుకోవచ్చు. ప్రశాంతంగా నిద్రపోవచ్చు.   సాధారణంగా అందరూ పాలు ఉదయం పూట తాగుతుంటారు. అది మంచిదే కానీ రాత్రి పూట పాలు తాగడం వల్ల చాలా ఉపయోగం ఉంది. పాలు, పాల ఉత్పత్తుల్లో మెదడును శాంతపరిచే నాడీ ప్రసారకాలు ఉంటాయి. అవి చక్కగా నిద్రపోడానికి సహకరిస్తాయి. అందుకే రాత్రిపూట ఓ గ్లాసు గోరువెచ్చని పాలు తాగితే నిద్రాదేవత మిమ్మల్ని కరుణించడం ఖాయం. అదేవిధంగా అరటిపండ్లు. వీటిలో ఉండే పొటాసియం, మెగ్నీషియం కండరాలను రిలాక్స్ చేసి హాయిగా నిద్రపట్టేలా చేస్తాయి. ఈ పండ్లలో ఉండే ట్రిప్టోపాస్ అనే అమైనో యాసిడ్ శరీరంలో ప్రవేశించిన తరువాత సెరటోనిన్ గా మారి స్ట్రెస్ ను తగ్గిస్తుంది. దానివల్ల ప్రశాంతత చేకూరి నిద్ర పడుతుంది. చెర్రీస్ కూడా నిద్రలేమికి మంచి మందు. వీటిలో ఉండే మెలటోనిన్ నిద్రని క్రమబద్ధం చేస్తుంది. అందుకే రాత్రిపూట కొద్దిగా చెర్రీస్ ని తీసుకుంటే మంచిది. అంతేకాదు... ట్యూనా ఫిష్ కూడా నిద్ర సమస్యను తీర్చే దివ్యౌషధం. దీనిలో ఉండే బీ6 విటమిన్ నిద్ర పట్టడానికి చక్కగా సహకరిస్తుంది. అదే విధంగా బాదంపప్పులో పుష్కలంగా ఉండే మెగ్నీషియం కండరాల మీద ఒత్తిడిని తగ్గించి చక్కగా నిద్రలోకి జారుకునేలా చేస్తుంది. గ్రీన్ టీలో ఉండే థయమిన్ కూడా నిద్రలేమికి చెక్ పెడుతుంది.   చూశారు కదా! ఒకవేళ మీరు కనుక నిద్రలేమితో బాధపడుతుంటే వెంటనే మీ రాత్రిపూట ఆహారంలో వీటిని చేర్చుకోండి. వెంటనే నిద్ర వచ్చి మీ కన్నులపై వాలిపోతుంది చూసుకోండి.

read more
Online Jyotish
Tone Academy
KidsOne Telugu
యాంటిబయాటిక్స్‌తో చంపేస్తున్నారు...

  యాంటిబయాటిక్స్‌ని కనుక్కోవడం ప్రపంచ చరిత్రలో ఒక అద్భుతం. అవే లేని రోజుల్లో చిన్నపాటి చెవిపోటు కూడా ప్రాణాంతకంగా మారేది. కానీ అవే యాంటిబయాటిక్స్‌ని ఇప్పుడు విచ్చలవిడిగా వాడటం ఆందోళన కలిగించే విషయం. అలాంటి వాడకం వల్ల శరీరంలో నానా రకాల సైడ్‌ ఎఫెక్ట్స్‌ రావడం మాట అటుంచితే… అవసరమైనప్పుడు అసలు ఏ మందూ పనిచేయని పరిస్థితి వస్తుంది. దీనినే antibiotic resistance అని పిలుస్తున్నారు.   యాంటిబయాటిక్స్‌ గురించి ఇప్పుడు ఈ కథంతా మళ్లీ చెప్పుకోవడానికి ఓ కారణం ఉంది. వైద్యులు ఈ యాంటిబయాటిక్స్‌ని రోగులకి ఇచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవాలనుకున్నారు లండన్‌ పరిశోధకులు. ఇందుకోసం వాళ్లు ఒకరు కాదు, ఇద్దరు కాదు… ఏకంగా 1,85,014 మందిని పరిశీలించారు. వీరంతా కూడా 65 ఏళ్లు పైబడినవారే. అంటే వైద్యులు వీరికి చికిత్సని అందించేందుకు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందన్నమాట. దురదృష్టవశాత్తూ వీరంతా వైద్యుల దగ్గరకి చిన్నచిన్న అనారోగ్యాలతో వెళ్లినప్పుడు కూడా, వీరికి అనవరసంగా యాంటిబయాటిక్స్‌ను అందించారట. ఇలా సగానికి సగం కేసులలో యాంటిబయాటిక్స్‌ తీసుకోవాలంటూ వైద్యులు తొందరపడినట్లు తేలింది. ఈ యాంటిబయాటిక్స్‌ కూడా మామూలువి కాదు… అలెర్జీలు, విరేచనాలు, గుండెజబ్బులు, కండరాల సమస్యలు వంటి నానారకాల దుష్ప్రభావాలు చూపించేవి. ఇలా ఉత్తిపుణ్యానికే శక్తివంతమైన యాంటిబయాటిక్స్‌ తీసుకోమంటూ వైద్యులు సలహా ఇస్తున్నట్లు తేలింది.   కాస్త విశ్రాంతి, మరికాస్త ఉపశమనంతో తగ్గిపోయే జలుబు, దగ్గు లాంటి చిన్నపాటి సమస్యలకు కూడా యాంటిబయాటిక్స్‌ను సూచించడం చూసి పరిశోధకుల తల తిరిగిపోయింది. ఇంతాచేసి ఈ వైద్యులంతా మహామహా సీనియర్లు! యాంటిబయాటిక్స్‌ను విచ్చలవిడిగా వాడకూడదన్న అవగాహన ఉన్నవారు. చిన్నపాటి సమస్యలకు ఆ మందులు అస్సలు అవసరమే లేదని తెలిసినవారు. ఆరోగ్యం మీద అవగాహన ఉండే లండన్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే… ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న మన దేశంలో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉండి ఉంటుందో కదా! అందుకనే యాంటిబయాటిక్స్‌ వాడకాన్ని అదుపు చేసేలా… అటు ప్రభుత్వమూ, ఇటు వైద్య సంస్థలూ కఠినమైన నిబంధనలను విధించాలని కోరుకుంటున్నారు పరిశోధకులు.   -నిర్జర.

read more
వినాయ‌కుని ప‌త్ర పూజ‌లో వైద్య విజ్ఞానం!

  ప‌త్ర పూజ లేకుండా వినాయ‌క చ‌వితి పూర్తికాదు. ఆ గ‌ణేశుని వివిధ పేర్లతో స్తుతిస్తూ ఏక‌వింశ‌తి (21) ప‌త్రాల‌తో పూజించ‌డం సంప్రదాయం. ఆరోగ్యానికి సంబంధించి వినాయ‌క‌చ‌వితి వ‌చ్చే స‌మ‌యం చాలా కీల‌క‌మైంది. వ‌ర్షాకాలం ముగిసి అంటువ్యాధులు ప్రబ‌లే కాలం ఇది. ఈ స‌మ‌యంలో క‌నుక ఔష‌ధుల‌కు ద‌గ్గర‌గా ఉంటే గాలి ద్వారా సోకే క్రిముల తాకిడి త‌క్కువ‌య్యే అవ‌కాశం ఉంది. బ‌హుశా అందుక‌నే మ‌న పెద్దలు ప‌త్రపూజ‌ను ఏర్పరిచి ఉంటారు. ప‌ల్లెల్లో రోజువారీ క‌నిపించే మొక్కల‌లోని ఔష‌ధ గుణాలు ఉన్న మొక్కల‌ను ఎంచుకుని వాటి ప‌త్రాల‌తో పూజ‌ను చేయ‌మ‌ని మ‌న‌కు సూచించారు. అలా పూజించిన ప‌త్రాల‌ను క‌నీసం 3 నుంచి 9 రోజుల వ‌ర‌కూ ఇంట్లోనే ఉంచ‌డం వ‌ల్ల వాటి నుంచి వెలువ‌డే గాలి, చుట్టుప‌క్కల ఉన్న వాతావ‌ర‌ణం మీద ప్రభావం చూపుతుంది. ఇక వినాయ‌కునితో పాటుగా ఆ ప‌త్రాల‌ను కూడా నీటిలో విడువ‌టం వ‌ల్ల నీటిలో కూడా ఔష‌ధిగుణాలు చేకూరుతాయి. ఈ ప‌త్రాల‌లో కొన్నింటిని నేరుగా ఆయుర్వేదంలో వాడ‌తారు, మ‌రికొన్నింటిలో ప‌త్రాల‌ను కాకుండా పళ్లనో, బెర‌డునో, కాయ‌ల‌నో, వేళ్లనో వాడ‌తారు. కానీ ఇలా పూజ‌లో సంబంధింత ప‌త్రాల‌ను వినియోగించ‌డం వ‌ల్ల ఏ చెట్టుని ఏమంటారు, వాటిని గుర్తించ‌డం ఎలా, వాటి ఉప‌యోగం ఏంటి అన్న వైద్య విజ్ఞాన‌మ‌న్నా మ‌న పూర్వీకులు ఒక త‌రం నుంచి మ‌రో త‌రానికి అందించేవారు. మ‌రి ఆ ప‌త్ర పూజ‌లో దాగిన ఔష‌ధాల‌ను ఇప్పుడు చూద్దామా...     సుముఖాయనమః  మాచీపత్రం పూజయామి! మాచిప‌త్రి లేదా ద‌వ‌నం:  కుష్టువ్యాధితో స‌హా ఎటువంటి చ‌ర్మవ్యాధినైనా త‌గ్గించ‌గ‌ల ఔష‌ధి. తల‌నొప్పి మొద‌లుకొని తిమ్మిర్ల వ‌ర‌కూ న‌రాల‌కు సంబంధించి చిన్నాచిత‌కా స‌మ‌స్యల‌న్నింటినీ దూరం చేస్తుంది. గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి! వాకుడాకు: ద‌గ్గు, ఉబ్బసం, క్షయ‌లాంటి క‌ఫ సంబంధ‌మైన రుగ్మత‌ల‌కు చ‌క్కటి మందు. ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి! మారేడు:  శివునికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ ఆకు నిజంగానే అందుకు యోగ్యమైన‌ది. ఆయుర్వేదంలోని ముఖ్య ఔష‌దాల‌లో బిల్వం ప్రముఖ‌మైంది. ఇప్పుడంటే పిల్లల్లో అతిసారాన్ని అరిక‌ట్టేందుకు రోటావైర‌స్‌లాంటి టీకాల‌ను వేయిస్తున్నారు. కానీ ఒక‌ప్పుడు మారేడు ప‌త్రాలు, కాయ‌ల‌తో అతిసారాన్ని ఎదుర్కొనేవారు. జీర్ణాశ‌యానికి సంబంధించిన మ‌రెన్నో స‌మ‌స్యల‌కు కూడా మారేడు చ‌క్కటి మందులా ప‌నిచేస్తుంది. గజాననాయ నమః దుర్వాయుగ్మం పూజయామి! గ‌రికె:  వినాయ‌కునికి అత్యంత ప్రీతిక‌ర‌మైన ప‌త్రం. త‌న ఒంటి మీద తాపం భ‌రిప‌రానిది అయిన‌ప్పుడు సాక్షాత్తూ ఆ గ‌రికెనే మీద క‌ప్పమ‌న్నార‌ట ఆయ‌న‌. నిజంగానే చ‌ర్మసంబంధ‌మైన వ్యాధుల‌న్నెంటికో ఔష‌ధి ఈ గ‌రికె. ఏద‌న్నా దెబ్బ త‌గిలిన‌ప్పుడు వెంట‌నే గ‌రికెని పిండి దెబ్బ మీద అద్దటం ఇప్పటికీ మ‌న ప‌ల్లెల్లో చూడ‌వ‌చ్చు.   హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి! ఉమ్మెత్త: ఒంటిమీద ఏవైనా సెగ్గడ్డలు వ‌చ్చిన‌ప్పుడు, ఉమ్మెత్త ఆకుల‌కు కాస్త సెగ చూపించి వాటి మీద వేసేవారు పెద్దలు. అప్పుడు గ‌డ్డలలో ఉన్న చీము త్వర‌గా బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుందట‌. లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి! రేగు:  రేగు ప‌ళ్ల కాలం వ‌చ్చిందంటే పెద్దలెవ్వరూ వాటిని వ‌దులుకోరు. జీర్ణకోశ వ్యాధుల‌కు ఉప‌శ‌మ‌నంగానూ, రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంపొందించ‌డంలోనూ రేగు పళ్లు, కాయ‌లు అమిత ఫ‌లితాన్ని అందిస్తాయి. గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి! ఉత్తరేణి: ఇప్పటికీ ప‌ల్లెల్లో ఉత్తరేణిని పళ్లు తోముకునేందుకు వాడ‌తారు. చెవిపోటు, పిప్పిప‌న్నులాంటి ముఖ‌సంబంధ‌మైన వ్యాధులకి ఔష‌ధిగా దీనిని వాడ‌తారు. గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి! తుల‌సి:  తులసి గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే క‌దా! ఇంటింటా దేవుళ్లతో స‌మానంగా పూజ‌లందుకునే తుల‌సి నిజంగానే అందుకు అర్హత క‌లిగింది. క్రిమిసంహారిణిగా, చ‌ర్మవ్యాధుల‌కు దివ్యౌష‌ధంగా, క‌ఫానికి విరుగుడుగా తుల‌సి ఓ ఇంటింటి ఔష‌ధం. ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి! మామిడాకు:  ఇంట్లో ఏ శుభ‌కార్యం జ‌రుగుతున్నా దానికి తొలి సూచ‌న‌గా మామిడాకుల తోర‌ణాల‌ను గుమ్మాల‌కు క‌డ‌తారు. గుమ్మం ద‌గ్గర మామిడాకు ఉంటే ఇంట్లోకి ఏ క్రిమీ రాలేద‌ని పెద్దల న‌మ్మకం. వికటాయ నమః కరవీరపత్రం పూజయామి! గ‌న్నేరు: చ‌ర్మవ్యాధుల‌కు ఔష‌ధంగా ప‌నిచేస్తుంది. తేలుతో స‌హా ఎన్నో విష‌కీట‌కాలు కుట్టిన‌ప్పుడు దీనిని ఉప‌యోగిస్తారు. భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి! విష్ణుక్రాంతం:  క‌ఫం వ‌ల్ల ఏర్పడే ద‌గ్గు, జ‌లుబు, జ్వరం వంటి స‌మ‌స్యల‌ను దూరం చేస్తుంది. వటవేనమః దాడిమీపత్రం పూజయామి! దానిమ్మ:  జీర్ణకోశంలో ఉండే క్రిముల ప‌నిప‌ట్టేందుకు దీనిని వాడ‌తారు. ర‌క్తహీన‌త‌ను సైతం దూరం చేయ‌గ‌ల శ‌క్తి దీనికి ఉంది. సర్వేశ్వరాయనమః దేవదారుపత్రం పూజయామి! దేవ‌దారు: క‌ళ్లకు చ‌లువ‌చేసే గుణం ఈ దేవ‌దారు ప‌త్రాల‌తో కాచిన తైలానికి ఉంటుంది. ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి! మ‌రువం:  మ‌ల్లె వంటి పూల‌తో స‌మానంతో ఆడ‌వారు ఈ ఆకుల‌ను పూల‌మాల‌లో వాడ‌తారు. అదేమీ వృథా పోదు. ఎందుకంటే మ‌రువంలో ఉండే ఔష‌ధ గుణాలు కేశాల‌కి ఎంతో బ‌లాన్ని అందిస్తాయ‌ట‌. ఈ ఆకుల నుంచి వ‌చ్చే సువాస‌న మాన‌సిక ఒత్తిడిని సైతం త‌గ్గిస్తుంది. మ‌రి వినాయ‌కుడు చ‌ల్లద‌నం కోసం చంద్రుని త‌ల‌మీద ధ‌రించిన‌ట్లు, ఆడ‌వారు మ‌రువాన్ని త‌ల మీద పెట్టుకోవ‌డం త‌ప్పేమీ కాదుగా! హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి! వావిలాకు:  కీళ్లకు సంబంధించిన నొప్పుల‌కు దీనిని ఔష‌ధంగా వాడ‌తారు. శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి! జాజి:  చ‌ర్మవ్యాధుల‌లోనే కాకుండా జాజిని నోటిపూత‌, నోటి దుర్వాస‌న‌న నుంచి త‌క్షణం ఉప‌శ‌మ‌నం పెద్దలు వాడుతుంటారు.   సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి! దేవ‌కాంచ‌నం:  జీర్ణాశ‌యంలో నులిపురుగులను సైతం పోగొట్టగ‌ల‌దీ దేవ‌కాంచ‌నం. ఇభవక్త్రాయనమః శమీపత్రం పూజయామి! జ‌మ్మి:  పాండ‌వులు అజ్ఞాత‌వాసానికి వెళ్లే ముందు ఈ చెట్టు మీద‌నే త‌మ ఆయుధాల‌ను దాచిపెట్టారు. దీని నుంచి వీచే గాలి సైతం ఎన్నో క్రిముల‌ను సంహ‌రించ‌గ‌ల‌ద‌ని న‌మ్మకం. అందుక‌నే దీనికి ప్రద‌క్షిణ చేసినా ఆరోగ్యం చేకూరుతుంద‌ని చెబుతారు. వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి! రావి:  బుద్ధునికి జ్ఞానోద‌యాన్ని క‌లిగించిన వృక్షమిది. .జీర్ణసంబంధ‌మైన ఇబ్బందులు ఉన్నవారి కోసం ఆయుర్వేదంలో రావిని విరివిగా వాడ‌తారు. సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి! మ‌ద్ది: మ‌ద్దిలో రెండు ర‌కాలున్నాయి. తెల్లమ‌ద్ది, న‌ల్లమ‌ద్ది! మ‌నం పూజ కోసం సాధార‌ణంగా తెల్లమ‌ద్ది ప‌త్రాల‌ను వాడ‌తాము. వ్రణాల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భించేందుకు తెల్లమ‌ద్ది ఆకులు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. కపిలాయ నమః అర్కపత్రం పూజయామి! జిల్లేడు: చ‌ర్మవ్యాధుల‌కే కాకుండా న‌రాల‌కు సంబంధించిన తిమ్మిర్లు, ప‌క్షవాతం వంటి రుగ్మత‌ల‌ను హ‌రించ‌డంలో జిల్లేడుది గొప్ప పాత్ర‌. అయితే జిల్లేడుని కానీ, ఆ మాట‌కి వ‌స్తే ఏ ఇత‌ర ఔష‌ధిని కానీ పూర్తి ప‌రిజ్ఞానం లేకుండా ఉప‌యోగించ‌కూడ‌దు.   -నిర్జర‌      

read more
ఇంట్లో తింటేనే ఆరోగ్యం, పొదుపు

  ఇప్పుడు జీవితమంతా పరుగులమయం. ఈ పరుగుల మధ్య కావల్సినంత డబ్బయితే సమకూరుతోంది కానీ ఇంటిపని చేసుకునేంత తీరిక కానీ ఓపిక కానీ మిగలడం లేదు. దాంతో ఆ డబ్బుతోనే కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నాం. రోజంతా ఎలాగూ కష్టపడ్డాం కదా అని బయటే తినేస్తున్నాం. దీని వల్ల డబ్బుకి డబ్బు, ఆరోగ్యానికి ఆరోగ్యం వృధా అయిపోతున్నాయని నిపుణులు నొచ్చుకొంటున్నారు.   దాదాపు మూడేళ్ల క్రితమే ఇంటి వంట గురించి ఓ పరిశోధన జరిగింది. ఓ తొమ్మిదివేల మంది మీద జరిగిన ఈ పరిశోధనలో ఇంట్లో వండుకునే వంటలో చక్కెర, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయని తేలింది. అంటే ఇంటి వంట ఎక్కువ పోషకాలను అందిస్తూ, తక్కువ కెలోరీలని ఇస్తుందన్నమాట. దీని వల్ల ఆరోగ్యం భేషుగ్గా ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు కదా! ఇంటి వంట అనగానే కాస్త పరిశుభ్రమైన రీతిలో వండుకుంటాం. అందులో ఎంత ఉప్పు పడుతోంది, ఎంత నూనె వేస్తున్నాం, మసాలా వేయాలా వద్దా... లాంటి విషయాలన్నీ మన విచక్షణకు అనుగుణంగానే ఉంటాయి. బయట వండేవారు కేవలం రుచిని, లాభాన్నీ మాత్రమే పట్టించుకుంటారు కదా!   ఇంటి వంట భేషైనది అని చెప్పేందుకు తాజాగా మరో పరిశోధన కూడా జరిగింది. University of Washington Health Sciences చేసిన ఈ పరిశోధన కోసం 437 మందిని ఎన్నుకొన్నారు. వీరు ఒక వారంలో ఇంటి వంట ఎన్నిసార్లు తిన్నారో, అందులో ఎలాంటి ఆహారం ఉంది అని వాకబు చేశారు. ఈ ఆహారాన్ని healthy eating index అనే ఓ జాబితాతో పోల్చి చూశారు.   మన ఆహారంలో పళ్లు, కూరగాయలు, పాలపదార్థాలు, తృణ ధాన్యాలు, ఉప్పు, పప్పులు... ఇలా ఏ పదార్థం ఏ మోతాదులో ఉంటే బాగుంటుందో సూచించే జాబితానే ఈ healthy eating index. దీని ద్వారానే అమెరికా ప్రభుత్వం తమ పౌరుల ఆరోగ్యానికీ- ఆహారానికీ మధ్య సంబంధాన్ని అంచనా వేసే ప్రయత్నం చేస్తుంది. వారానికి మూడు రోజులే ఇంట్లో వండుకునేవారితో పోలిస్తే, వారంలో ఆరు రోజులపాటు ఇంటి వంటను తినేవారు healthy eating indexలో ఎక్కువ మార్కులను సాధించినట్లు తేలింది. పోషకాల తక్కువైతే మాత్రమేం! బయట తినడం వల్ల ఖర్చు మాత్రం విపరీతంగా అవుతోందని పరిశోధకులు గ్రహించారు.   బయట తిండికి సంబంధించి పరిశోధకులు మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తేల్చారు. - చవకబారు ఫాస్ట్‌ఫుడ్స్ తినడంలో పేదవారే ముందుంటారని అందరూ అనుకుంటారు. నిజానికి పేదాగొప్పా అన్న తారతమ్యం లేకుండా అంతా ఒకేలా ఈ చిరుతిళ్లని తింటున్నారని బయటపడింది. - 1970లతో పోలిస్తే బయట ఆహారంలో ఎక్కువ కొవ్వు పదార్థాలు చేరుతున్నాయని గమనించారు. - ఎక్కువమంది పిల్లలు ఉన్న ఇళ్లలో.... ఇంటి వంటకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తేలింది.   - నిర్జర.

read more
కొంతమందికి స్వీట్స్ అంటే ఎందుకంత ఇష్టం?

  ‘వీడు అన్నంకంటే చాక్లెట్లే ఎక్కువ తింటాడు?’, ‘వాడు రోజుకి పావుకిలో స్వీట్స్ తింటుంటాడు’... లాంటి మాటలు మనకి వినిపిస్తూనే ఉంటాయి. జిలేబీ బండినో, స్వీట్ షాపునో చూడగానే ఆగిపోయే మనుషులూ మనకి తెలుసు. ఇంతకీ మనలో కొందరికి తీపి అంటే ఎందుకంత ప్రాణం. మరికొందరు స్వీట్స్‌ అంటే ఎందుకంత నిస్తేజంగా ఉంటారు. దీని వెనుక కేవలం మన అభిరుచులే కారణమా?   తీపి పట్ల కొందరికి ఎక్కువ ఇష్టం ఉండటానికి జన్యుపరమైన కారణం ఏమన్నా ఉందేమో కనుక్కొనే ప్రయత్నాలు ఎప్పటినుంచో జరుగుతున్నాయి. ఎలుకలలోనూ, కోతుల్లోనూ చేసిన పరిశోధనల్లో FGF21 అనే జన్యువు ఈ విషయంలో చాలా ప్రభావం చూపుతున్నట్లు తేలింది. కాలేయంలో ఉత్పత్తి అయ్యే ఈ జన్యువుకి తీపి పదార్థాలని దూరంగా ఉంచే సామర్థ్యం ఉందట. అంటే ఈ జన్యువు సవ్యంగా ఉన్నవారు తక్కువ తీపిని తింటారన్నమాట.   తీపి గురించి జంతువుల మీద చేసిన ప్రయోగం మనుషుల విషయంలో రుజువవుతుందా లేదా తెలుసుకోవాలనుకున్నారు డెన్మార్కు దేశపు శాస్త్రవేత్తలు. దీనికోసం వారు Inter 99 study పేరుతో 6,500 మందిని ఎన్నుకొన్నారు. వీరి ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి, ఎలాంటి ఆహారాన్ని ఇష్టపడతారు... లాంట వివరాలన్నీ సేకరించారు. వారిలో FGF21 జన్యువు ఏ తీరున ఉందో గమనించారు.   తీపంటే బాగా ఇష్టపడేవారిలో FGF21లో మార్పులు ఉన్నట్లు తేలింది. ఇలాంటివారు 20 శాతం ఎక్కువగా తీపిని ఇష్టపడుతున్నారట. FGF21 జన్యవు సవ్యంగా ఉన్న వ్యక్తులలోనేమో, తీపిపదార్థాలు తినకుండా ఆ జన్యవు ప్రభావితం చేస్తున్నట్లు తేలింది. ఈ జన్యువులో మార్పు ఉన్న వ్యక్తులు కేవలం తీపిని ఇష్టపడటమే కాదు... మద్యపానం, పొగతాగడం ఎక్కువగా చేయడాన్ని కూడా గమనించారు.   స్వీట్స్ పట్ల వ్యసనానికి మనలోని ఒక జన్యులోపమే కారణం అని తేలిపోయింది. భవిష్యత్తులో ఈ లోపాన్ని మందులతో సరిదిద్దే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. అప్పటివరకు ఎలాగొలా తీపి పట్ల వ్యామోహాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయమని సూచిస్తున్నారు. ఊబకాయం, గుండెజబ్బులు, డయాబెటిస్... లాంటి నానారకాల సమస్యలకూ తీపి కారణం అవుతోందని హెచ్చరిస్తున్నారు. వినడానికి బాగానే ఉంది కానీ... తీపికి అలవాటు పడ్డ నాలుకని అదుపుచేయడం అంత సాధ్యం కాదని శాస్త్రవేత్తలే సెలవిస్తున్నారు కదా!   - నిర్జర.

read more