కూర్చునే ఉండకండి బాబూ

  హాయిగా కుర్చీలో కూర్చుని పనిచేసే ఉద్యోగం వస్తే ఎంత బాగుండు అన్నది ప్రతి మనిషి కల. కదలకుండా కూర్చుని సంపాదించడం ఎంత అదృష్టమో అనేది ప్రతి జీవి కోరిక. కానీ డబ్బు సంగతి పక్కన పెడితే, నిరంతరం కూర్చునీ కూర్చునీ ఉండే జీవనశైలితో... మన కుర్చీ కాస్తా మృత్యువుకి నేరుగా దారి చూపిస్తోందన్నది నిపుణుల మాట. ఇంతకీ నిరంతరం కూర్చునే ఉండటం వల్ల కలిగే అనర్థం ఏమిటో, దానిని నివారించుకునే మార్గాలు ఏమిటో మీరే చూడండి. ఇవీ అనారోగ్యాలు-   - నిరంతరం కూర్చుని ఉండటం మనలోని రక్తప్రసార వేగాన్ని తగ్గిస్తుంది. కొవ్వు కూడా నిదానంగా కరుగుతుంది. దీని వల్ల అంతిమంగా గుండె పనితీరు దెబ్బతింటుంది.   - అదేపనిగా కూర్చోవడం, మన శరీరంలోని ఇన్సులిన్‌ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుందని తేలింది. దీని వల్ల క్రమంగా చక్కెర వ్యాధి చాలా తేలికగా మనల్ని లొంగదీసుకుంటుంది.   - నిల్చొని ఉన్నప్పటికంటే కూర్చుని ఉన్నప్పుడే మన వెన్నెముక మీద అధికభారం పడుతుంది. పైగా కంప్యూటర్‌ స్క్రీన్‌ వంక చూస్తూ కూర్చోవడం వల్ల మెడ, భుజాల మీద ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా వెన్ను, మెడ నొప్పులతో పాటుగా మన నడకతీరులో కూడా మార్పు వచ్చేస్తుంది.   - శారీరిక కదలికలు ఉన్నప్పుడే మెదడుకి రక్తప్రసారం, ఆక్సిజన్‌ సరఫరా సమృద్ధిగా ఉంటుందనీ... అలా లేని సందర్భాలలో మెదడు నిదానంగా మొద్దుబారిపోతుందనీ తేలింది.   - కుర్చీని అదేపనిగా అంటిపెట్టుకుని ఉంటే సరైన వ్యాయామం లభించక నడుము భాగం నుంచి ఎముకలు, కండరాలు అన్నీ బలహీనపడిపోతాయి. నడుము నొప్పి, వెరికోస్‌ వెయిన్స్ వంటి నానా సమస్యలూ తలెత్తుతాయి.   - కూర్చుని ఉండటం వల్ల ముందు మన పొట్ట మీదే ఒత్తిడి పడుతుంది. దీంతో మన జీర్ణాశయం దెబ్బతింటుంది. ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, పొట్ట ఉబ్బరంగా మారిపోవడం, మలబద్ధకం వంటి నానారకాల జీర్ణసమస్యలకీ ఇది దారితీస్తుంది. ఇవీ ఉపాయాలు   ఓపిక ఉండాలే కానీ అదేపనిగా కూర్చుని ఉండటం వల్ల వచ్చే సమస్యల జాబితా ఎంత రాసినా తీరేది కాదు. అయితే దీని దుష్ఫలితాల నుంచి తప్పుకునేందుకు కొన్ని చిట్కాలూ లేకపోలేదు...   - నడిచే అవకాశం ఉన్నప్పుడు కాస్త కాళ్లని కదిలించమంటున్నారు. లిఫ్ట్‌ బదులు మెట్లని ఉపయోగించడం, స్వయంగా వెళ్లి ఫైల్స్‌ తెచ్చుకోవడం వంటి చిన్నచిన్న చర్యలతో బోలెడు ఫలితం ఉంటుంది.   - ఫోన్‌ మాట్లాడటం, క్యాంటీన్‌లో భోజనం చేయడం, స్నేహితులతో కాలక్షేపం సాగించడం వంటి పనులు నిలబడి కూడా చేయవచ్చు. దీని వలన కాళ్లకి కాస్త పని చెప్పినట్లవుతుంది.   - కుర్చీలో కూర్చుని ఉన్నప్పుడు మన వెన్ను కుర్చీకి సమాంతరంగా నిటారుగా ఉందా లేదా గమనించుకోవాలి. వెన్ను నిటారుగా ఉన్నప్పుడు ఊపిరితిత్తుల లోపల వరకూ శ్వాస చేరుకోవడాన్ని గమనించవచ్చు. దీంతో అటు ఊపిరితిత్తులు, ఇటు వెన్ను కూడా బలపడతాయి.   - గంటకి ఓసారన్నా లేచి ఓ నాలుగడులు వేయడం మంచిది. అలా ఓ నాలుగడులు వేసేంత సమయమే లేకపోతే కాసేపు నిలబడే పనిచేసుకునే ప్రయత్నం చేయవచ్చు.   - నిరంతరం కూర్చుని ఉండేవారు తిరిగి ఆరోగ్యాన్ని సమకూర్చుకునేందుకు నడకను మించిన వ్యాయామం లేదంటున్నారు. రోజులో ఏదో ఒక సమయంలో కాసేపు నడకని సాగించమంటున్నారు.   - నిర్జర.

read more
కూల్డ్రింక్ డబ్బులతో పరిశోధనలు

కూల్డ్రింక్స్ వల్ల ఎలాంటి అనారోగ్యాలు వస్తాయనేదాని మీద పెద్ద జాబితానే పేర్కొనవచ్చు. ఊబకాయం దగ్గర నుంచీ చక్కెర వ్యాధి వరకూ కూల్డ్రింకులు నానారకాల రోగాలనీ పెంచి పోషిస్తున్నాయనడంలో ఎవ్వరికీ ఎలాంటి సందేహమూ లేదు. కానీ ఇలాంటి రోగాల గురించి జరిగే పరిశోధనలని ప్రభావితం చేసేందుకు సదరు శీతలపానీయాల తయారీదారులు ప్రయత్నిస్తున్నారా అంటే ఔననేందుకు తగిన ఆధారాలు కనిపిస్తున్నాయి. దాదాపు వంద! బోస్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు పరిశోధకులు వివిధ పరిశోధనలు జరిపే కొన్ని సంస్థలను గుర్తించారు. వీరు చేస్తున్న పరిశోధనలకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయీ అన్న విషయం మీద ఆరా తీశారు. ఈ ఆరాతో దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి. అమెరికాలో దాదాపు వంద సంస్థలకు కోకో-కోలా, పెప్సీల నుంచి పుష్కలంగా నిధులు అందుతున్నట్లు తేలింది. వీటిలో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఉండటం కూడా విశేషం. ప్రభావం చూపేందుకే ఏ పని చేసినా దాని వెనుక ప్రయోజం ఉండాలనుకునే వ్యాపార సంస్థలు, ప్రజల ఆరోగ్యం గురించి ఇంతగా శ్రద్ధ తీసుకుంటున్నాయంటే అనుమానం రాక మానదు. ఇదంతా కూడా పరిశోధనలను ప్రభావింతం చేసేందుకే అంటున్నారు నిపుణులు. దానికి ఉదాహరణగా 50 ఏళ్ల క్రితం జరిగిన ఒక పరిశోధనను గుర్తుచేస్తున్నారు. అప్పట్లో హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఒక ప్రఖ్యాత పరిశోధనను వెలువరించారు. అందులో చక్కెరకంటే కొవ్వు పదార్థాల వల్లే గుండెజబ్బుల ప్రమాదం ఎక్కువని తేల్చారు. చక్కెర పరిశ్రమ నుంచి భారీగా నిధులు అందడంతో వారు సదరు పరిశ్రమకు అనుకూలంగా ఈ పరిశోధన సాగించినట్లు తరువాతి కాలంలో తేలింది. ఇప్పుడు కూడా శీతలపానీయాల దుష్ప్రభావాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ నిధుల ప్రవాహం సాగుతున్నట్లు అనుమానిస్తున్నారు. అబ్బే అంతా ఉత్తుత్తిదే శీతలపానీయాలు పరిశోధనలకు నిధులు అందించడాన్ని వారి సమాఖ్య వెనుకేసుకు వస్తోంది. సదరు కంపెనీలకు ప్రజల ఆరోగ్యం మీద మహా శ్రద్ధ ఉండబట్టే అవి అన్నేసి నిధులను అందిస్తున్నాయనీ... దానికి చాలా సంతోషంగా ఉందనీ సన్నాయినొక్కులు నొక్కింది. ఇక నిధులను పుచ్చుకుంటున్న ఆరోగ్య సంస్థలు కూడా- ‘ఏదో తమ సామాజిక బాధ్యతలో భాగంగా వారు ఇస్తున్నారు కాబట్టి మేం పుచ్చుకుంటున్నామే కానీ, వారిచ్చే నిధులు మా పరిశోధనలని ప్రభావితం చేయలేవు’ అంటూ బీరాలు పలుకుతున్నాయి. నిజానికి శీతలపానీయ సంస్థల చరిత్ర చూసినవారెవ్వరికైనా, వాటి నిజాయితీ మీద అనుమానాలు కలుగక మానదు. ఉదాహరణకు 2011-2015 మధ్యకాలంలో శీతలపానీయాల మీద నియంత్రణ విధించేందుకు ప్రయత్నించిన 28 బిల్లులను అవి తీవ్రంగా వ్యతిరేకించాయి. పైగా ఇవి అందించే నిధులతో వెలువడుతున్న పరిశోధనలు కూడా ఏమంత ఆమోదయోగ్యంగా ఉండటం లేదన్నది పరిశీలకుల మాట. ఉదాహరణకు ఊబకాయం గురించి జరిగిన ఓ పరిశోధనలో ఊబకాయానికీ, శీతలపానీయాలకీ మధ్య ఉన్న సంబంధం గురించి మాట్లాడకుండా.... వ్యాయామం చేయకపోవడం వల్లే ఊబకాయం వస్తుందని తేల్చేశారట. ఈ ఒక్క ఉదాహరణ చాలు, ఏదో శీతలపానీయాల ప్రభావంతో ఏదో మతలబు ఉందని అనుమానించడానికి. ఆఖరికి చక్కెర వ్యాధికి సంబంధించిన పరిశోధనలలో కూడా శీతలపానీయ సంస్థలు వేలుపెట్టడం చూస్తే మున్ముందు డయాబెటీస్ రోగులు కూడా శీతలపానీయాలను తాగవచ్చు అనే పరిశోధనలు వచ్చినా రావచ్చు. అందుకనే పరిశోధనా సంస్థలు శీతలపానీయాల ఉత్పత్తిదారుల నుంచి వచ్చే నిధులను తిరస్కరించాలంటూ వాదనలు వినిపిస్తున్నాయి.   - నిర్జర.

read more
చికిత్సలో వైద్యుల రాజకీయాలు

  మరో నెల రోజుల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. డెమోక్రెటిక్‌ పార్టీ తరఫు నుంచి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్‌ పార్టీ తరఫు నుంచి డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుని పీఠం మీద కూర్చునేందుకు పోటీ పడుతున్నారు. ప్రతి నాలుగేళ్లకి ఓసారి ఈ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఈసారి మాత్రం ఎన్నడూ లేనంత ఉత్కంఠత నెలకొంది. ట్రంప్‌ తన వ్యాఖ్యలతో ఈ ఆసక్తిని మరింతగా రెచ్చగొడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘వైద్యుల రాజకీయ భావాలకీ, వారు చేసే చికిత్సకీ మధ్య ఏమన్నా సంబంధం ఉందా!’ అనే కోణంలో ఒక పరిశోధన జరిగింది. వినడానికి ఆశ్చర్యంగా కనిపించినా, పరిశోధన ఫలితాలు మాత్రం ఆలోచింపచేసేవిగానే ఉన్నాయి.   వైద్యుల నేపథ్యం యేల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన హెర్ష్‌ అనే ఆచార్యుడు ఈ పరిశోధనను నిర్వహించారు. ఇందుకోసం ఆయన ఏదో ఒక రాజకీయ పార్టీకి విధేయంగా ఉండే ఒక 20,000 మంది వైద్యులను గుర్తించారు. వీరిలో 1,529 మందికి కొంతమంది రోగులకు సంబంధించిన రిపోర్టులను పంపించి వాటి మీద తమ అభిప్రాయాన్ని చెప్పమన్నారు. ఫలానా స్త్రీ గత ఐదేళ్లలో రెండు అబార్షన్లు చేయించుకుంది, ఫలానా రోగి ఊబకాయంతో బాధపడుతున్నా కూడా తగిన వ్యాయామం చేయడం లేదు... వంటి రకరకాల సమస్యలను వారి ముందు ఉంచారు. ప్రతి సమస్యకీ ఒకటి నుంచి పది పాయింట్లను కేటాయించి వాటి తీవ్రతని బట్టి పాయింట్లను కేటాయించమని అడిగారు. దాదాపు 300 మంది వైద్యులు ఈ సర్వేకు స్పందించి తమ అభిప్రాయాలను వెల్లడించారు.   తేడాలు బయటపడ్డాయి అబార్షన్ విషయంలో రిపబ్లికన్‌ వైద్యలు చాలా తీవ్రంగా స్పందించారు. అవి మానసికంగానూ, శారీరికంగానూ రోగి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే మారిజోనా అనే మత్తుపదార్థపు వాడకాన్ని కూడా వారు తీవ్రంగా వ్యతిరేకించారు. మరో వైపు ఇళ్లలో తుపాకులను ఉంచుకోవడం, విచ్చలవిడిగా లైంగిక చర్యలకు పాల్పడటం వంటి అంశాల మీద డెమోక్రేట్ వైద్యులు తీవ్రంగా స్పందించారు. కాకపోతే రోజువారీ సమస్యలైన ఊబకాయం, త్రాగుడు, సిగిరెట్‌ వాడకం, హెల్మెట్‌ వంటి విషయాల్లో ఇద్దరి స్పందనా ఒకేలా కనిపించింది. మరో మాటలో చెప్పాలంటే నైతికతకి సంబంధించిన విషయాలుగా భావించే అబార్షన్, మత్తుపదార్థాలు, తుపాకులు, లైంగిక స్వేచ్ఛ వంటి అంశాల మీద ఇరుపార్టీలకు చెందిన వైద్యులు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వైద్యుల మతం, ప్రాంతం, వయస్సులకు అతీతంగా ఈ తేడాలు బయటపడ్డాయి.   కారణం సాధారణంగా నైతికతకి సంబంధించిన సమస్యల మీద ఒకో రాజకీయ పార్టీ ధోరణి ఒకోలా ఉంటుంది. ఆ పార్టీ విధేయుల మీద కూడా ఈ ప్రభావం తప్పకుండా ఉంటుంది. అయితే నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన వైద్యలు కూడా ఈ ధోరణికి అనుగుణంగా ప్రవర్తించడం ఆశ్చర్యపరిచే అంశమే! ‘వైద్యులు కేవలం రోగలక్షణాల ఆధారంగా యాంత్రికంగా వైద్యాన్ని అందిస్తారని మనం అనుకోవడానికీ లేదనీ, వారి వ్యక్తిగత అభిప్రాయాలు వారు అందించే చికిత్స మీద కూడా ప్రభావం చూపుతాయనీ’ అంటున్నారు హెర్ష్‌. వైద్యులకు శిక్షణని అందించేటప్పుడు ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని అభ్యర్థిస్తున్నారు. అవసరం అనుకుంటే రోగులు కూడా వైద్యుల రాజకీయ నేపథ్యాన్ని గమనించాలని సూచిస్తున్నారు. వివిధ నైతిక సమస్యల మీద ఒకో రాజకీయ పార్టీ ఒకో అభిప్రాయానికి కట్టుబడి ఉన్న మన దేశానికి కూడా ఈ పరిశోధన వర్తిస్తుందేమో ఎవరన్నా విశ్లేషిస్తే బాగుండు.   - నిర్జర.

read more
నిరుద్యోగంతో ఆరోగ్యమూ గల్లంతు

నిరుద్యోగంతో మనిషి మనసు క్రుంగిపోతుందనీ, ఆత్మన్యూనతతో బాధపడే ప్రమాదం ఉందని తెలిసిందే! కానీ వారి ఆరోగ్యం కూడా పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని తెలుస్తోంది. Gallup-Healthways అనే సంస్థ రూపొందించిన నివేదికలో నిరుద్యోగానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.   50 ఏళ్లవారితో సమానం 30 ఏళ్లలోపు ఎలాంటి ఉద్యోగమూ లేనివారి ఆరోగ్యం 50 ఏళ్లు పైబడిన పెద్దలతో సమానంగా ఉందని ఈ నివేదికలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ధృవీకరించేందుకు వారు 2013-2015 మధ్యకాలంలో 155 దేశాలకు చెందిన దాదాపు 4,50,000 మందిని పరిశీలించారట. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే ఎక్కువ చదువు ఉండి నిరుద్యోగంతో బాధపడేవారి ఆరోగ్యం మరింత అల్పంగా ఉండటం. ఉదాహరణకు డిగ్రీ పట్టా పొందిన నిరుద్యోగులలో 86 శాతం మందిలో ఏదో ఒక అనారోగ్య సమస్య కనిపిస్తే, ప్రాధమిక విద్య మాత్రమే అర్హతగా ఉన్నవారిలో ఇది 72 శాతమే ఉంది.   అమెరికాలోనే ఎక్కువ మిగతా దేశాలతో పోల్చుకుంటే అభివృద్ధి చెందిన దేశాలలో ఈ నిరుద్యోగపు అనారోగ్యం ఎక్కువగా ఉండటం పరిశోధకులను సైతం ఆశ్చర్యపరిచింది. స్పెయిన్‌ యువతలో 40 శాతానికి పైగా నిరుద్యోగంతో బాధపడుతున్నారు, అదే అమెరికాలో అయితే కేవలం 11 నుంచి 12 శాతమే నిరుద్యోగం కనిపిస్తుంది. పైగా స్పెయిన్‌ పేదరికంతో కూడా కొట్టుమిట్టాడుతోంది. అయినా కూడా అలాంటి దేశాలతో పోల్చుకుంటే అమెరికా నిరుద్యోగులలో అనారోగ్యం ఎక్కువగా కనిపించిందట. కేవలం అమెరికాలోనే కాదు... ప్రపంచ బ్యాంకు ధనిక దేశాలు అంటూ ముద్రవేసిన చాలా దేశాలలో ఈ తేడా కనిపించింది.   కారణాలు నిరుద్యోగులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపేందుకు తగినంత ఆర్థిక వనరులు ఉండవన్నది మొదటగా తేలిపోయే కారణమే! కానీ ధనికదేశాల్లో ఈ వ్యత్యాసం ఎందుకని ఎక్కువగా ఉంటుందన్నదానికి కొన్ని ఆశ్చర్యకరమైన విశ్లేషణలు వెలువడ్డాయి.   - ధనికదేశాలలోని ఖర్చులు, ముఖ్యంగా వైద్యానికి సంబంధించిన ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. డబ్బున్నవారికి మాత్రమే అందుబాటులో ఉండే ఈ ఖర్చులను నిరుద్యోగులు భరించడం చాలా కష్టంగా మారిపోతుంది.   - భారతదేశం, మెక్సికో వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలోని కుటుంబ జీవనం అమెరికా వంటి ధనిక దేశాలకు కాస్త విరుద్ధంగా ఉంటుంది. మన దేశంలో 99 శాతం యువతకి తమ కుటుంబాలు అండగా ఉన్నాయి. వారు వారి కుటుంబాలతో కలిసే ఉంటారు. కానీ అమెరికాలో మాత్రం 26 శాతం మంది యువత తమ కుటుంబాల నుంచి విడివడి విడిగా బతికేస్తున్నారు. దాంతో వారి బాగోగులను చూసుకునేందుకు, ఆరోగ్యాన్ని కనిపెట్టుకుని ఉండేందుకు ఎవ్వరూ లేకుండా పోతున్నారు.   - నిర్జర.

read more
చలికాలంలో వేధించే డిప్రెషన్- SAD

చలికాలం రాగానే మనసంతా ఏదో తెలియని వేదనతో నిండిపోతోందా! ఏ పని చేయాలన్నా చిరాకుగా ఉంటోందా? సాధారణంగా ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ‘ఆ ఏముందిలే చలికాలం కదా, ఈ కాస్త బద్ధకం సహజమే!’ అనుకుంటూ ఉంటాము. కానీ లక్షణాల తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నప్పుడు అది కాలంతో పాటుగా వచ్చే డిప్రెషన్కి సూచన కావచ్చునంటున్నారు వైద్యులు. లక్షణాలు పైన చెప్పుకున్నట్లుగా తెలియని వేదన, చిరాకుతో పాటుగా చలికాలంలో ఈ కింది లక్షణాలు కూడా కనిపిస్తే మనకు Seasonal affective disorder (SAD) అనే వ్యాధి ఉందని అనుమానించాల్సి ఉంటుంది. - ఎంతసేపు నిద్రపోయి లేచినా ఇంకా నిస్సత్తువగా, మత్తు వదలనట్లుగా ఉండటం. - చిన్న విషయాలకే ఆందోళన చెందుతూ తరచూ ఉద్వేగానికి లోనవ్వడం. - ఆకలిలో మార్పులు వచ్చి పిండిపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకునేందుకు మొగ్గుచూపడం. తద్వారా    బరువు పెరగడం. -ఇతరులతో కలవడానికి, బయట తిరగడానికీ ఇష్టపడకపోవడం. ఏక్కడన్నా తిరస్కారానికి గురైనప్పుడు భరించలేకపోవడం. - ఏ పని మీదా ఏకాగ్రత లేకపోవడం. మూడీగా, చిరాకుగా ఉండటం. కారణాలు SAD ఎందుకు వస్తుందన్నదానికి శాస్త్రవేత్తలు స్పష్టమైన కారణాలు చెప్పలేకపోతున్నారు. అయితే కొన్ని కారణాలను మాత్రం ఊహించగలుగుతున్నారు. అవి... - చలికాలంలో తగ్గిపోయే సూర్యకాంతి మన జీవగడియారం మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇదే తాత్కాలిక  డిప్రెషన్కు దారితీస్తుంది. - సూర్యకాంతి తగ్గుదల వల్ల మన మెదడులోని ‘సెరొటోనిన్’ అనే రసాయనంలో తగ్గుదల ఏర్పడుతుంది. దీని వలన కూడా  డిప్రెషన్ ఏర్పడే అవకాశం ఉంది. - తక్కువ సూర్యకాంతిలో ‘మెలటోనిన్’ అనే రసాయనం ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది. ఈ అసమతుల్యత కూడా  డిప్రెషన్కు దారి తీస్తుంది.  అవకాశం అప్పటికే డిప్రెషన్ ఉన్నవారికి, అది చలికాలంలో మరింతగా ముదిరే ప్రమాదం ఉంది. వంశపారంపర్యంగా ఈ వ్యాధి ఉన్నవారిలో కూడా SAD ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక చలిప్రదేశాలలో నివసించేవారికి ఈ వ్యాధి సోకే సంభావ్యత ఎక్కువ. ఉదాహరణకు అమెరికాలోని అలాస్కా అనే చలి ప్రదేశంలో దాదాపు పదిశాతంమందిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయని తేలింది. చికిత్స వరుసగా రెండుమూడేళ్లపాటు ప్రతి చలికాలంలోనూ ఈ వ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు ఒకసారి వైద్యుని సంప్రదించడం మంచిది. అప్పుడు ఆయన ఈ లక్షణాలు SADకు చెందినవా లేకపోతే Bipolar Disorder వంటి ఇతర వ్యాధులను సూచిస్తున్నాయా అన్న అంచనాకు వస్తారు. గదిలో కృత్రిమ కాంతులను ఏర్పాటు చేసే లైట్ థెరపీ ద్వారా, యాంటీ డిప్రెసంట్స్ వంటి మందుల ద్వారా వైద్యులు ఈ వ్యాధికి చికిత్సను అందిస్తారు. తరచూ వ్యాయామం చేయడం, ఉదయం వేళల్లో సూర్యకాంతిలో తిరగడం, ఆప్తులతో ఎక్కువసేపు గడపడం, ధ్యానం చేయడం వంటి చర్యలతో కూడా SAD నుంచి ఉపశమనం పొందవచ్చు. SADని అశ్రద్ధ చేస్తూ ‘చలికాలంలో ఇలాంటి సహజమేలే’ అని బలవంతంగా సర్దుకుపోయేందుకు ప్రయత్నిస్తే అది మన ఉద్యోగాల మీద తీవ్రమైన ప్రభావం చూపవచ్చు. మత్తుపదార్థాలకు అలవాటు పడటం, ఆత్మహత్యకి ప్రేరేపించే ఆలోచనలు ఏర్పడటం వంటి ప్రమాదాలు కూడా SADతో పాటుగా పొంచిఉంటాయి. అందుకే చలికాలంలో చర్మం గురించి, జలుబూజ్వరాల గురించే కాదు... మెదడు గురించి కూడా కాస్త జాగ్రత్త వహించాలి.   - నిర్జర.

read more
ఆదాయంలో తేడాలు ఆరోగ్యంలోనూ కనిపిస్తాయి

పేదరికంతో ఒంటి మీద సరైన బట్ట లేకపోవచ్చు, తలదాచుకునేందుకు తగిన ఇల్లు ఉండకపోవచ్చు. కానీ పేదపిల్లల్లో ఆరోగ్యం కూడా అంతంతమాత్రమే అని తేల్చిచెబుతోంది ఒక పరిశోధన. ప్రభుత్వాలు ఎన్నెన్ని కబుర్లు చెప్పినా పేదల పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదనీ, పౌరుల ఆదాయాల మధ్య ఉండే తారతమ్యాలు వారి ఆరోగ్యాల మీద కూడా ప్రభావం చూపుతున్నాయనీ గుర్తుచేస్తోంది. 50 దేశాల పిల్లలు కెనడాలోని ఒటావా విశ్వవిద్యాలయానికి చెందిన జస్టిన్ లాంగ్ అనే శాస్త్రవేత్త ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరిగింది. తమ పరిశోధన కోసం వీరు 50 దేశాలకు చెందిన పిల్లల ఆరోగ్యాన్ని నిశితంగా గమనించారు. ఇందుకోసం వారు 177 నివేదికలను సేకరించారు. 9 నుంచి 17 ఏళ్ల వయసు మధ్య ఉన్న పిల్లల్లో గుండె, ఊపిరితిత్తుల సామర్థ్యం ఏమేరకు ఉందో పరిశీలించేందుకు ఈ నివేదికలు ఉపయోగపడ్డాయి. పరుగులెత్తించారు పిల్లల గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని అంచనా వేసేందుకు వారిని ఓ 20 మీటర్ల దూరాలను పరుగులెత్తించారు. పిల్లవాడు ఒకసారి ఆ దూరాన్ని పూర్తిచేయగానే, మళ్లీ అతడిని పరుగు తీయాల్సిందిగా అడిగారు. అయితే ఈసారి మరింత తక్కువ సమయంలో ఆ దూరాన్ని చేరుకోవాలని నిర్దేశించారు. ఇలా పిల్లవాడు పరిగెత్తే ప్రతిసారీ అతనికి కేటాయించిన సమయం తగ్గుతూ వచ్చింది. చివరికి పిల్లవాడు ఇక తనవల్ల కాదని చెప్పేవరకూ ఈ పరీక్ష సాగేది. తేడాలు బయటపడ్డాయి పదకొండు లక్షలకు పైగా పిల్లలకి నిర్వహించిన ఈ పరీక్షలలో వారి ఆరోగ్యానికీ, పేదరికానికీ మధ్య సంబంధం స్పష్టంగా బయపడింది. దేశంలోని ప్రజల ఆదాయాలలో విపరీతమైన తేడాలు ఉన్నప్పుడు, ఆయా దేశంలోని పిల్లల ఆరోగ్యం కూడా అంతంతమాత్రమే అని తేలింది. ఉదాహరణకు టాంజానియా ఏమంత ధనిక దేశం కాకపోవచ్చు. కానీ ఆ దేశంలో అసమానతలు పెద్దగా లేవు. దాంతో అక్కడి పిల్లలంతా ఆరోగ్యంగానే కనిపించారు. దానికి విరుద్ధంగా మెక్సికో మరీ అంత పేదదేశం కాదు. కానీ అక్కడ విపరీతంగా ఉన్న అసమానతల వల్ల మెక్సికో పిల్లలు బలహీనంగా తయారయ్యారు. ఇక అమెరికా పరిస్థితి కూడా అంతే! పైకి అభివృద్ధి చెందిన దేశమని చెప్పుకొంటున్నా, అక్కడా అసమానతలు విపరీతంగానే ఉన్నాయనీ.... అందుకే చివరి నుంచి నాలుగో స్థానంలో ఉందనీ తేలింది. అసమానతలు అన్న పదం ఉన్నచోట పేదరికం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఫలితాలు సహజమే అంటున్నారు పరిశోధకులు. వీటికి తోడు ఆటలు ఆడే సౌకర్యాలు తక్కువగా ఉండటం, పిల్లలని దగ్గర ఉండి ఆడించే పరిస్థితులు లేకపోవడం, తీసుకునే ఆహారంలో నాణ్యత లేకపోవడంతో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఊహిస్తున్నారు. పిల్లలు రోజులో కనీసం ఒక గంటపాటు ఈత కొట్టడం, సైక్లింగ్ చేయడం, పరుగులెత్తడం వంటి వ్యాయామాలు చేస్తే వారి గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యం శుభ్రంగా ఉంటుందని పేర్కొంటున్నారు. లేకపోతే వారు భవిష్యత్తులో అనారోగ్యాలతో బాధపడాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.     - నిర్జర.

read more
అంత కాంతి ఎందుకు బాబూ!

ఇప్పడు చాలా నగరాలలో పాతకాలపు ట్యూబ్లైట్ల బదులు ఎల్ఈడీలని అమర్చే ప్రక్రియ మొదలైపోయింది. చిన్నచిన్న దుకాణాలు మొదలుకొని పెద్ద పెద్ద మాల్స్ వరకూ ఎల్ఈడీలనే ఎక్కువగా వాడేస్తున్నారు. ఎల్ఈడీలని వాడటం వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ కాంతి వచ్చే మాట వాస్తవమే! కానీ అంత కాంతి వలన లేనిపోని ప్రమాదాలు ఏర్పడతాయని హెచ్చరిస్తోంది అమెరికన్ మెడికల్ అసోసియేషన్. ఈ సంస్థ మాటలు విని, ఆ దేశంలోని 25 నగరాలు తమ వీధిదీపాలను మార్చేశాయి. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ మొన్న జూన్లో విడుదల చేసిన ఒక నివేదికలో ఎక్కువ కాంతి ఉన్న ఎల్ఈడీ దీపాలను వాడటం వల్ల రకరకాల సమస్యలు ఉన్నాయంటూ పలు హెచ్చరికలు జారీచేసింది. ఒక నల్లటి వస్తువుని ఎంత ఉష్ణోగ్రత దగ్గర మండిస్తే అంతటి కాంతి వస్తుందో... దానిని కలర్ టెంపరేచర్ అంటారు. ఇది 3000 వరకూ ఉండటం వల్ల పెద్దగా ప్రమాదం ఉండదు. కానీ చాలా సందర్భాలలో 5000-6000 మధ్య ‘కలర్ టెంపరేచర్’ ఉండే ఎల్ఈడీ దీపాలను వాడేస్తున్నారని దుయ్యబట్టింది. వీటి నుంచి వెలువడే నీలపు కాంతి వల్ల ఏఏ సమస్యలు వస్తాయో తేల్చిచెప్పింది. వీరి నివేదిక ప్రకారం... - కంటిలోని రెటినా దెబ్బతిని కంటిచూపు బలహీనపడే అవకాశం ఉంది. - జీవగడియారపు వ్యవస్థ దెబ్బతిని నిద్రపోయే సమయాలలో విపరీతమైన మార్పులు వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది. - క్రుంగుబాటు వంటి మానసిక సమస్యలు తలెత్తే అవకాశమూ లేకపోలేదు. - వాహనాలను నడిపేవారు, ముఖ్యంగా వృద్ధుల కళ్ల మీద ఈ కాంతి నేరుగా పడటం వల్ల రోడ్డు ప్రమాదాలు జరగవచ్చు. - వాతావరణంలోకి వెలువడే ఈ కాంతి కిరణాలు మనుషుల మీద కాకుండా పక్షులు, తాబేళ్లు వంటి జీవజాతుల మీద కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. - ఒంటి మీద నేరుగా పడే ఇంతటి కాంతితో మనుషులు ఏదో పదిమంది కళ్ల ముందరా దోషిగా నిల్చొన్నట్లు అసౌకర్యానికి గురవుతూ ఉంటారు. ఇన్నిరకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి తక్షణమే అమెరికాలో వాడుతున్న వీధిదీపాలను తక్కువ స్థాయి ఎల్ఈడీలతో భర్తీ చేయమంటూ సూచించారు నిపుణులు. దాంతో అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో ఓ 25 నగరాలు తమ వీధుల తీరునే మార్చేశాయి. 3000 కలర్ టెంపరేచర్ లోపు ఉండే దీపాలను ఎంచుకున్నాయి. ఇప్పుడు హైదరాబాదులో కూడా 406 కోట్ల రూపాయలను ఖర్చుపెట్టి ఎల్ఈడీ వీధిలైట్లను నెలకొల్పాలని చూస్తున్నారు. మరి వారికి ఎల్ఈడీలతో వచ్చే దుష్ఫలితాలు, తీసుకోవల్సిన జాగ్రత్తలు తెలిసే ఉంటాయని ఆశిద్దాం.   - నిర్జర

read more
బ్లడ్‌గ్రూపే తెలియని బ్రిటన్ ప్రజలు

  సూర్యుడు అస్తమించని సామ్రాజ్యాన్ని పాలించామని బ్రిటన్‌ దేశస్థులు మురిసిపోతూ ఉండవచ్చుగాక! కానీ అమాయకత్వంలో మాత్రం వారు ప్రపంచంలో ఎవ్వరికీ తీసిపోమని నిరూపించుకున్నారు. తాజాగా జరిగిన ఒక సర్వేలో తమ ఆరోగ్యానికి సంబంధించిన మౌలికమైన విషయాలు కూడా తెలియవంటూ నాలుక కరుచుకున్నారు. ఆ నివేదిక ఇదిగో...   హెల్త్‌స్పాన్‌ అనే సంస్థ, తన పరిశోధనలో భాగంగా బ్రిటన్‌లోని రెండువేల మంది పెద్దలని ఓ పది ప్రశ్నలు అడిగింది. ఈ ప్రశ్నలన్నీ కూడా ఎవరో వైద్యవిద్యార్థులకు సంబంధించినవి కావు. ఒక వ్యక్తికి తన ఆరోగ్యం గురించి ఎంతవరకు తెలుసు అన్న విషయాలకు సంబంధించినవే! కానీ చాలామంది వీటిలో ఏ ఒక్క ప్రశ్నకీ సరైన సమాధానం చెప్పేలేకపోయారట. ఉదాహరణకు-   - సర్వేలో పాల్గొన్న సగానికి సగం మందికి తమ బ్లడ్‌గ్రూప్‌ ఏమిటో తెలియదట!   - ఒక 68 శాతం మంది తమ గుండె పనితీరు సవ్యంగానే ఉందని భావిస్తున్నారు. ఇక ఓ 42 శాతం మందికైతే మెరుగైన గుండె కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలియదు.   - 16 శాతం మంది అభ్యర్థులకు తమకు వంశపారంపర్యంగా ఎలాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉందో అన్న అవగాహన లేదు.   - ఓ 35 శాతం మంది తమ జీవితంలో ఎప్పుడూ వైద్య పరీక్షలు చేయించుకోలేదని చేతులెత్తేశారు.   - సర్వేలో పాల్గొన్న జనాభాలో చాలామందికి కొలెస్ట్రాల్‌ పరిమితుల గురించి కానీ, ఆరోగ్యకరమైన రక్తపోటు గురించి కానీ ఆలోచనే లేదు. పైగా వీటివల్ల ఏదన్నా ప్రమాదం ఏర్పడితే అప్పుడే చూసుకోవచ్చులే అని ఓ 44 శాతం మంది భావిస్తున్నారు కూడా!   - కొంతమంది అభ్యర్థుకి 47 ఏళ్లు వచ్చిన తరువాత కానీ తమ జీవనవిధానంలో ఏమన్నా మార్పులు ఉండాలేమో అన్న ఆలోచన రావడం లేదు.   ఇక కొంతమందికి రోజుకి ఎంత మంచినీరు తాగాలో కూడా తెలియకపోతే, మరికొందరేమో తమకి ఏమన్నా తేడా చేసినప్పుడు కూడా జీవన విధనంలో ఎలాంటి మార్పులనూ చేయం అని కుండబద్దలు కొట్టేశారు.   ఇలాంటి అజ్ఞానం నిజంగా ప్రాణాంతకం అంటున్నారు సర్వే చేపట్టిన పరిశోధకులు. 40 ఏళ్ల వయసు వచ్చిన తరువాత అన్ని రకాల వైద్య పరీక్షలనీ చేయించుకుంటేనే మేలని సూచించారు. సమస్యలు మరీ జటిలం అయితే తప్ప మర ఆరోగ్యాన్ని పట్టించుకోమనీ, దానివల్ల గుండె వంటి ముఖ్యమైన శరీర భాగాలను తీరని నష్టం జరిగిపోయే ప్రమాదం ఉందనీ హెచ్చరిస్తున్నారు. రక్తపోటు, కొలెస్ట్రాల్‌ పరిమితులు, డి విటమిన్‌ ఆవశ్యకత వంటి విషయాల మీద అవగాహన ఉంటే సమస్య మొదలవకముందే దానిని నివారించవచ్చునని సూచిస్తున్నారు. గత ఐదేళ్లుగా ఎలాంటి వైద్య పరీక్షలూ చేయించుకోకుండా ఉండి ఉంటే కనుక, తక్షణమే రక్తపోటు, కొలెస్ట్రాల్‌ వంటి పరీక్షల కోసం వైద్యడి దగ్గరకు బయల్దేరమని తొందరపెడుతున్నారు. లేకపోతే ఇవి నిదానంగా మన శరీరాన్ని దెబ్బతీసి, ముప్పు తలపెడతాయి. ఈ సూచనలు కేవలం బ్రిటన్ వాసులకే కాదు, మనకు కూడా ఉపయోగపడతాయి కదా!     - నిర్జర.

read more
అయితే ఆకలి లేకపోతే అనారోగ్యం!

  పేదరికం ఎక్కడ ఉంటే ఆకలి అక్కడ ఉంటుందనేది అందరికీ తెలిసిన నిజమే! ఆ ఆకలిని రూపుమాపేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలన్నీ తెగ కృషి చేసేస్తున్నాయి. వీటికి తోడు ఐక్యరాజ్యసమితి వంటి సంస్థల సహకారం ఎలాగూ ఉంది. కానీ పరిస్థితుల్లో ఏమంత మార్పులు కనిపించడం లేదని పెదవి విరుస్తోంది ఓ నివేదిక.   కోట్లమంది ఆకలితో Global Panel on Agriculture and Food Systems for Nutrition అనే సంస్థ రూపొందించిన ఈ నివేదిక, మన భవిష్యత్తు ఏమంత ఆరోగ్యంగా లేదని సూచిస్తోంది. ఇప్పటికే కోట్ల మంది ఆకలితో అల్లలాడిపోతున్నారనీ, 2030 నాటికి ఈ సంఖ్య ఏకంగా 300 కోట్లకు చేరుకుంటుందని ఈ నివేదిక ఊహిస్తోంది. అంతేకాదు! ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లల్లో నాలుగో వంతు మందిలో సరైన శారీరిక, మానసిక ఎదుగుదల ఉండటం లేదని స్పష్టం చేస్తోంది. ఉదాహరణకు ఒక్క గ్వాటెమాల (ఆఫ్రికా)లోనే 40 శాతం మంది పిల్లలు తమ వయసుకి ఉండాల్సినంత ఎత్తు లేరట! పేద దేశాలలోని పిల్లలకు ఆహారం అందినా కూడా అందులో పాలు, పండ్లు, కూరగాయలు వంటి పోషకాహారం లభించకపోవడం వల్ల ఈ దుస్థితి ఏర్పడుతోందని తేలింది. ఐదేళ్లలోపు పిల్లల్లో పోషకాహారం లభించక, రోజుకి ఎనిమిది వేల మంది చనిపోతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అర్థమవుతోంది.   ఊబకాయం పెనుముప్పు వెనుకబడిన దేశాలలో ఆకలి సమస్యగా ఉంటే... అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలలో ఊబకాయం ముంచుకు వస్తోందని హెచ్చరిస్తోంది ఈ నివేదిక. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2030 నాటికి ప్రపంచ జనాభాలో మూడోవంతు మంది ఊబకాయంతోనో, అధికబరువుతోనో బాధపడక తప్పదని తేలుస్తోంది. ఇక చైనాలో అయితే సగానికి సగం మంది ఊబకాయంలో కూరుకుపోక తప్పదని ఊహిస్తోంది. ప్రాసెస్డ్‌ ఆహారం, శీతల పానీయాల వాడకం విపరీతంగా పెరిగిపోవడమే ఈ దుస్థితికి కారణం అని నివేదిక కుండబద్దలు కొట్టేసింది. వీటి వల్ల రక్తపోటు, చక్కెర, గుండెజబ్బుల వంటి వ్యాధులు పెరిగిపోతున్నాయని తేల్చి చెప్పింది. ఈ పరిస్థితి HIV, మలేరియా వంటి వ్యాధులకంటే ప్రాణాంతకమని హెచ్చరిస్తోంది. సమస్యలే కాదు, సూచనలు కూడా!     ప్రపంచం ముందర ఉన్న వివిధ సమస్యలను స్పష్టం చేయడమే కాదు, ఆ సమస్యలకు కొన్ని పరిష్కారాలను కూడా సూచిస్తోంది ఈ నివేదిక. వాటిలో కొన్ని...   - పోషకాహారాన్ని కొనుగోలు చేసి అవి తక్కువ ధరలకే ప్రజలకు అందేలా ప్రభుత్వరంగ సంస్థలు చొరవ చూపాలి.   - ప్రజలకి ఆహారం అందుతోందా లేదా అనే కాదు... అందులో తగిన పోషకాలని అందించే పండ్లు, పీచుపదార్థాలు, తృణ ధాన్యాలు ఉన్నాయా లేదా అని కూడా గమనించుకోవాలి.   - ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌ విషయంలో ఖచ్చితమైన ప్రమాణాలను పాటించాలి. ఉత్పత్తి దగ్గర్నుంచీ ప్రకటనల దాకా అవి ఏ దశలోనూ వినియోగదారులను పక్కదోవ పట్టించేలా ఉండకూడదు.   - పిల్లలకు ఆరు నెలల వయసు వచ్చేవరకూ తల్లిపాలని పట్టించేలా తగిన ప్రచారం చేయాలి.   - అధికంగా ఉప్పు, పంచదార, మాంసం ఉన్న పదార్థాల వాడకం తగ్గేలా చర్యలు తీసుకోవాలి. చిరుతిళ్లు, ప్రాసెస్డ్‌ ఫుడ్స్, శీతల పానీయాల ప్రాభవాన్ని తగ్గించాలి.   - మహిళలకు తగిన పోషకాహారం అందిచే చర్యలు తీసుకోవడం వల్ల... వారికీ, వారికి పుట్టబోయే పిల్లల ఆరోగ్యానికీ ఢోకా లేకుండా కాపాడుకోగలగాలి.   ఈ సూచనలన్నీ ఆచరిస్తే సరేసరి! లేకపోతే... 2030 నాటికి ఈ నివేదిక ఊహించిన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందేమో!     - నిర్జర.

read more
మంచితనమే శ్రీరామరక్ష

  ‘మన మంచితనమే మనల్ని కాపాడుతుంది’ అని తరచూ పెద్దలు చెప్పే మాటల్ని మనం కొ్ట్టిపారేస్తూ ఉంటాము. కొన్నాళ్ల క్రితం వరకూ వారంతా హాయిగా పాటించిన విలువలని చాదస్తాలుగా తీసిపారేస్తూ ఉంటాము. కానీ నలుగురితో మంచిగా నడుచుకోవడం మన ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతుందని తేల్చిచెబుతున్నాయి అనేక పరిశోధనలు. వాటిలో కొన్ని...   ఒత్తిడి నుంచి ఉపశమనం గత ఏడాది కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు నిపుణులు ఒక పరిశోధనను నిర్వహించారు. ఇందుకోసం వారు 77 మంది అభ్యర్థులను ఎన్నుకొన్నారు. ఇతరులకు ఏవన్నా సాయం చేసినప్పుడు, మనలోని ఒత్తిడిలో ఏమన్నా మార్పులు వస్తాయా అన్న దిశగా అభ్యర్థలు జీవితాలను పరిశీలించారు. సాయం అనగానే ఏవో భారీ త్యాగాలు అనుకునేరు! అవతలివారి కోసం తలుపు తెరిచి పట్టుకోవడం, ఎవరన్నా దారి చెప్పమంటే సరైన సూచనలు ఇవ్వడం... ఇలా మనం రోజువారీ చేయగలిగే చిన్నపాటి సాయాలే! ఆశ్చర్యం ఏమిటంటే, ఇలాంటి సాయాలు చేసిన రోజులలో వారిలో సానుకూల దృక్పథం పెరిగి ఒత్తిడిని సునాయాసంగా ఎదుర్కోగలిగారట! ఒత్తిడిని ఎదుర్కోవాలంటే నలుగురితోనూ మంచిగా ఉండేందుకు ప్రయత్నించి చూడమంటున్నారు పరిశోధకులు.   సంతోషాల స్థాయి పెరుగుతుంది 2008లో హావర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌కి చెందిన కొందరు పరిశోధకులు, సైన్స్‌ అనే పత్రికలో ఓ వ్యాసాన్ని రాశారు. తమ దగ్గర ఉన్న డబ్బుని ఇతరుల కోసం ఖర్చుపెడితే, మనలో సంతోషపు స్థాయిలో ఏమన్నా మార్పు వస్తుందా అన్న కోణంలో వీరు ఒక పరిశోధనను నిర్వహించారట. ఇందులో భాగంగా వీరు కొందరు విద్యార్థులకి తలా కొంత డబ్బుని అందించారు. ఈ డబ్బుని తమ కోసం కానీ, ఇతరుల కోసం కానీ ఖర్చుపెట్టుకోవచ్చునని సూచించారు. ఏ విద్యార్థులైతే ఇతరుల కోసం డబ్బుని ఖర్చుపెట్టారో, వారిలో సంతోషపు స్థాయి కూడా గణనీయంగా పెరగడాన్ని గమనించారు. గుండెతీరు మెరుగుపడుతుంది   సమాజంతో సత్సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తుల ఆరోగ్యం భేషుగ్గా ఉంటుందని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. వీరిలో రక్తపోటు కానీ, గుండెవేగం కానీ సాధారణంగా ఉంటాయనీ... గుండెధమనుల మీద ఉండే ఒత్తిడి అదుపులో ఉంటుందనీ తేలింది. తమ మీద తమకు నమ్మకం పెరుగుతుందనీ... ఒత్తిడీ, క్రుంగుబాటు వంటి వ్యతిరేక ధోరణులు తగ్గుముఖం పడతాయనీ వెల్లడయ్యింది.   నలుగురితో మంచిగా ఉండటానికీ ఆరోగ్యానికీ సంబంధం ఏమిటన్న ప్రశ్న ఎవరిలోనైనా మెదలవచ్చు. దీనికి జవాబు ఏమంత కష్టం కాదేమో! మనిషి సంఘజీవి. తనకు ఇతరుల అవసరం ఉందని గుర్తించిననాడు, తాను కూడా ఇతరులకు చేతనైనంత సాయం చేస్తాడు. ఇతరులకు చేసే మేలు అంతిమంగా తనకే ఉపయోగపడుతుందన్న విషయం అతనిలో ఏదో ఒక మూలన స్ఫురిస్తూనే ఉంటుంది. అందుకనే ఇతరులకు సాయం చేసినప్పుడూ, ఆప్తులను ఆదుకున్నప్పుడూ... తన జీవితం సార్థకం అయ్యిందన్న తృప్తి అతనికి లభిస్తుంది. ఒంటరితనంలో అతన్ని దిగులు మాత్రమే ఆవరిస్తుంది. సంతోషాన్ని పంచుకోవాలన్నా, బాధను తగ్గించుకోవాలన్నా మనిషి చుట్టూ నలుగురు ఉండాల్సిందే! ఆ నలుగురితో మంచిగా బతకాల్సిందే!   - నిర్జర.

read more
ఆరోగ్యంలో మన స్థానం- 143

పరీక్షలలో పిల్లవాడికి నూటికి 42 మార్కులు వస్తే వాడి చెవి పట్టుకుని మెలేస్తారు. అంత తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయంటూ నిలదీస్తారు. కానీ అస్తవ్యస్తమైన విధానాల పుణ్యమా అని మన దేశానికే 42 మార్కులు వస్తే ఎవరిని ప్రశ్నించగలం? ఆరోగ్య రంగంలో ఐక్యరాజ్యసమితి మన దేశానికి అందించిన మార్కులివి. ప్రపంచవ్యాప్తంగా 188 దేశాలకు ఇలాంటి మార్కులను కేటాయించగా వాటిలో మన దేశం 143వ ర్యాంకుని పొందింది. ఆ ముచ్చట ఇదిగో... అన్నింటిలో దిగదుడుపే!   ప్రపంచంలోని వేర్వేరు దేశాలలోని ఆరోగ్య పరిస్థితులను అంచనా వేసేందుకు ఐక్యరాజ్యసమితి కొన్ని అంశాలను ఎన్నుకొంది. మలేరియా నివారణ, ఐదేళ్లలోపు పసిపిల్లల మరణం, పరిశుభ్రత... ఇలా ఓ 33 అంశాలలో ప్రతి దేశానికీ కొన్ని మార్కులను కేటాయించింది. వాటిలో మనకు దక్కిన కొన్ని మార్కులివీ-     - మలేరియా నివారణలో వందకి గానూ మనకి కేటాయించిన మార్కులు పది! మన పక్కనే ఉన్న శ్రీలంక వంటి చిన్నదేశాలు కూడా మలేరియా మీద విజయం సాధించాయి. తమ దేశాలలో మలేరియా రూపురేఖలే లేకుండా తరిమికొట్టి వందకి వంద మార్కులు పొందాయి. కానీ మనం మాత్రం 2030 నాటికన్నా మలేరియాను తరిమికొట్టాలన్న ఆశతో ప్రస్తుతానికి మలేరియా దోమల్ని పెంచిపోషిస్తున్నాము.   - స్వచ్ఛ భారత్‌ గురించీ, మరుగుదొడ్ల నిర్మాణం గురించీ మన ప్రభుత్వాలు తెగ ఊదరగొడుతూ ఉండవచ్చుగాక. వీటి గురించి ప్రకటనలను గుప్పించేందుకు కోట్ల రూపాయలను వెచ్చిస్తూ ఉండవచ్చుగాక. కానీ పరిశుభ్రమైన పద్ధతులను పాటించడంలో మన దేశానికి దక్కిన మార్కులు ఎనిమిదంటే ఎనిమిది!   - మాతాశిశు సంక్షేమం గురించి దశాబ్దాలుగా మన ప్రభుత్వాలు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టాయి. కానీ ఇప్పటికీ ప్రసవ సమయంలో స్త్రీల మరణాలు అదుపులోకి రావడం లేదు. ఐదేళ్లలోపు పిల్లల ఆరోగ్యానికీ భరోసా లేదు. అందుకే ఆయా రంగాలలో ఐరాస మనకు 39, 28 పాయింట్లను అందించింది. ఇంతేకాదు! వాయుకాలుష్యం, ఎయిడ్స్‌ వంటి సమస్యలను ఎదుర్కోవడంలోనూ మన సామర్థ్యం అంతంత మాత్రమే అని ఈ నివేదిక పేర్కొంటోంది.   సిరియాకంటే దారుణం వివిధ రంగాలలో ఆయా దేశాల ఆరోగ్య ప్రమాణాలను పరిగణలోకి తీసుకుని మొత్తంగా వాటికి కొన్ని మార్కులను కేటాయించింది ఐరాస. వాటి ప్రకారం ఐస్‌ల్యాండ్ దేశం 85 మార్కులతో తొలి స్థానంలో నిలువగా... సింగపూర్‌, స్వీడన్‌, ఫిన్‌ల్యాండ్, ఇంగ్లండులు తరువాత స్థానాలను పొందాయి. అంతర్యుద్ధంతోనూ, తీవ్రవాదంతోనూ నలిగిపోతున్న సిరియా (117), ఇరాక్‌ (128) వంటి దేశాలకంటే కూడా మన దేశం దిగువన ఉండటం తప్పకుండా ఆలోచించాల్సిన అంశమే! పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ వంటి పొరుగు దేశాలు మనకంటే తక్కువ మార్కులను పొందడం మాత్రమే మన నేతలను   తృప్తిపరిచే అంశం! మన దేశ ప్రజల్లో ఆరోగ్యం పట్ల పూర్తి అవగాహన లేకపోవడం, పౌరుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు బలమైన వ్యవస్థలు లేకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందంటున్నారు నిపుణులు. ఇదే వాతావరణం కొనసాగితే, వచ్చే ఏడాది మన ర్యాంకు మరింత దిగజారిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు! ఇంతకీ మోదీగారు ఈ ర్యాంకులను చూశారో లేదో!   - నిర్జర.

read more
డెంగీ, చికెన్‌గున్యాలను తరిమికొడదాం!

  డెంగీ- ఒకప్పుడు దీని అర్థం ఎవరికీ తెలియదు. ఇప్పుడో! ఈ పేరు వినని వారు ఉండరు. ఓ నాలుగు చినుకుల వర్షం కురిస్తే ఈ మహమ్మారి ఎక్కడ బయటకి వస్తుందో అని అనుమానం! ఓ రెండు డిగ్రీల జ్వరం పెరిగితే అది డెంగీ ఏమో అన్న భయం! వెరిసి డెంగీ ఇప్పుడు ఇంటింటి పేరు. ఇంతకీ ఈ డెంగీ ఏమిటి? దాన్నుంచి తప్పుకునే మార్గమే లేదా అంటే లేకేం....   డెంగీ వ్యాధి ఏడిస్‌ అనే దోమ ద్వారా వ్యాపిస్తుంది. మిగతా దోమలకంటే ఈ ఏడిస్‌ దోమ తీరు చాలా భిన్నంగా ఉంటుంది. కాబట్టి మనం దీని బారిన పడే ప్రమాదం ఎక్కువ. ఈ దోమ మన ఇంట్లో నిలువ ఉండే మంచినీటిలో సులభంగా బతికేస్తుంది. పాత టైర్లు, కుండీలు, కూలర్లు, ఫ్లవర్‌వాజులు, ఈతకొలను, నీటిడ్రమ్ములు... ఇలా ఎక్కడ మంచినీరు కాస్త నిలువ ఉంటే, అక్కడ వందలకొద్దీ గుడ్లను పొదిగేస్తుంది. పైగా ఇది పగటివేళల్లోనే కుడుతుంది. మన ఇళ్లలోని కర్టెన్ల వెనకాల, మంచాల కింద, బీరువాల చాటునా బతికేస్తూ అదను చూసి మన మీద దాడి చేస్తుంది. ఈ వైరస్‌ ఉన్న దోమ కుట్టినప్పటి నుంచి వారం రోజుల లోపు డెంగీ సూచనలు కనిపిస్తాయి. జ్వరంతో పాటుగా తలనొప్పి, కళ్ల వెనుక పోట్లు, కీళ్లు కండరాల నొప్పులు, దద్దుర్ల వంటి లక్షణాలు ఉండవచ్చు. అరుదుగా చిగుళ్లు లేదా ముక్కు నుంచి రక్తం కారడాన్ని కూడా గమనించవచ్చు.   మన శరీరంలోని రక్తస్రావాన్ని అరికట్టే ప్లేట్‌లెట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం, రక్తం పలచబడటం వంటి సూచనల ద్వారా రోగికి డెంగీ సోకిందని నిర్ధారిస్తారు. డెంగీ సోకిన వ్యక్తి ఒకటి రెండు వారాలలో తిరిగి కోలుకుంటాడు. అప్పటివరకూ తగినంత విశ్రాంతిగా ఉండటం, పోషకాహారాన్ని తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. ఇక డెంగీతో మన శరీరంలో నీటి శాతం తగ్గిపోయే ప్రమాదం ఉంది కాబట్టి... నీరు, పండ్లరసాలు, ORS వంటి ద్రవపదార్థాలను తీసుకుంటూ ఉండాలి.   డెంగీ ప్రాణాంతకం కాదు. అలాగని వైద్యుని సంప్రదించకుండా ఇష్టం వచ్చినట్లు మాత్రలు వేసుకుంటే మాత్రం పరిస్థితి విషమించే ప్రమాదం ఉంది. ఇక కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలు, కళ్లు తిరగడం, ఆయాసం, శరీరం మీద ఎర్రటి దద్దుర్లు, రక్తస్రావం... వంటి లక్షణాలు కనిపించినప్పుడు తక్షణమే వైద్యుని సంప్రదించవలసి ఉంటుంది. సకాలంలో అందే వైద్యంతో డెంగీ రోగలక్షణాలు తగ్గడమే కాకుండా, ప్లేట్‌లెట్ల సంఖ్య కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది. డెంగీ వచ్చాక తీసుకోవల్సిన జాగ్రత్తల కంటే అది రాకుండా చూసుకోవల్సిన అవసరమే ఎక్కువ. ఇందుకోసం...   - ఇంట్లోనూ, ఇంటి ఆవరణలోనూ ఎక్కడా నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలి. - తేమ లేదా చీకటిగా ఉండి దోమలు వృద్ధి చెందే పరిస్థితులు ఉన్నచోట బజార్లో దొరికే దోమల మందుని చల్లాలి. - ఉదయం వేళ్లలో కూడా మస్కిటో రిపెల్లంట్స్‌ని వాడుతూ ఉండాలి. - రోజంతా పడుకుని ఉండే పసిపిల్లలకి ఉదయం వేళల్లో కూడా దోమతెరని కట్టాలి. - శరీరం అంతా కప్పి ఉంచే దుస్తులను ధరించాలి.   చికెన్‌గున్యా డెంగీలాగానే చికెన్‌గున్యా కూడా ఏడిస్‌ దోమ ద్వారానే వస్తుంది. అయితే జ్వరంతో పాటుగా తీవ్రమైన తలనొప్పి, కీళ్లనొప్పులను ఈ వ్యాధిలో గమనించవచ్చు. వ్యాధి తగ్గిన తరువాత కూడా వారాలు, నెలల తరబడి కీళ్లనొప్పులతో రోగి బాధపడటం చికెన్‌గున్యాలో సాధారణం. అందుకే చికెన్‌గున్యా వచ్చిన రోగులు తగినంత విశ్రాంతి తీసుకోవడంతో పాటుగా కీళ్లనొప్పులకు మందులను కూడా వాడవలసి ఉంటుంది. డెంగీ దోమలు వ్యాపించకుండా, అవి కుట్టకుండా... ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో, అవన్నీ చికెన్‌గున్యాకు కూడా వర్తిస్తాయి.   డెంగీ, చికెన్‌గున్యాలు రెండూ ప్రాణాంతకం కాకపోయినా, రోగిని నిస్సహాయంగా మంచాన పడవేసే వ్యాధులు. వీటి బారిన పడినవారు కోలుకోవడం చాలా కష్టమవుతుంది. కాబట్టి అవి వ్యాపించకుండా అన్ని చర్యలూ తీసుకుందాం. వాటిని మన జీవితాల్లోంచి తరిమికొడదాం!    ..Nirjara

read more
జ్వరం ఇక దూరం

  జరుగుబాటు ఉంటే జ్వరమంత సుఖం లేదంటారు పెద్దలు. కానీ ఎంత జరుగుబాటు ఉంటే మాత్రం మంచంలో అలా నిస్సహాయంగా పడి ఉండాలని ఎవరు మాత్రం కోరుకుంటారు. జ్వరంతో పాటుగా వచ్చే సలపరింత, ఒళ్లునొప్పులు వంటి నానారకాల చిరాకులని ఎవరు మాత్రం ఇష్టపడతారు. అందుకనే జ్వరమొస్తే దాన్ని ఎలా తగ్గించుకోవలన్న తపనే అందరిదీనూ. అందుకోసమే ఈ వివరణ!   వైరల్‌ ఫీవర్లు! మనకు వచ్చే జ్వరాలలో రెండు మూడు రోజుల పాటు సతాయించి విడిచిపెట్టే వైరల్‌ ఫీవర్లే ఎక్కువ. అందుకని ఆరోగ్యంగా ఉండే పెద్దలు ఒకటి రెండు రోజుల పాటు ఉండే జ్వరాల గురించి అంతగా కంగారుపడాల్సిన అవసరం లేదు. ఈ కింది సందర్భాలలో మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది...   - శరీర ఉష్ణోగ్రత 103ని తాకుతున్నప్పుడు. పసిపిల్లలలో అయితే ఈ ఉష్ణోగ్రత 100.4 దాటినా కూడా వైద్యుని సంప్రదించడం మేలు.   - రెండు రోజులకి మించి జ్వరం కనిపిస్తున్నప్పుడు.   - దద్దుర్లు, వాంతులు, విరేచనాలు, నీరసం, కళ్లుతిరగడం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది, అతిగా దాహం వేయడం... వంటి ఇతర లక్షణాలు కనిపించినప్పుడు.   - బ్రాంకైటిస్, బీపీ, క్యాన్సర్‌ వంటి వ్యాధులు ఉన్నప్పుడు.   చిట్కాలు చిన్నపాటి వైరల్‌ జ్వరాలలో ఉపశమనానికి ఈ కింద చిట్కాలను పాటించి శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోవచ్చు   - జ్వరంతో శరీరంలోని నీటి శాతం గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీని వల్ల మూత్రం కూడా పచ్చగా మారడాన్ని గమనించవచ్చు. కాబట్టి ఒళ్లు వేడిగా ఉన్నప్పుడు తగినంత నీరు తీసుకోవడం మంచిది. మామూలు రోజుల్లో ఎలా ఉన్నా, జ్వరంగా ఉన్న రోజుల్లో కనీసం 8- 12 గ్లాసుల నీటిని తీసుకోమని చెబుతున్నారు. వైద్యులు. దీనివల్ల ఒంట్లో నీటి శాతం పెరగడమే కాకుండా, ఉష్ణోగ్రత కూడా తగ్గే అవకాశం ఉంటుంది.   - గోరువెచ్చని నీటిలో స్నానం చేయడం వల్ల ఉష్ణోగ్రత నిదానంగా తగ్గడమే కాకుండా, శరీరంలో ఉన్న అలసట కూడా తీరుతుంది. అలాగని చన్నీటి స్నానం చేస్తే మాత్రం, శరీరంలోని ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోయి అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది.   - చల్లని నీటిలో తడిపిన గుడ్డతో నుదురు, మణికట్టు, మెడ, పాదాలని తుడుస్తూ ఉంచడాన్ని వైద్యులు కూడా సూచిస్తూ ఉంటారు. అయితే ఒకేసారి అన్ని ప్రాంతాలలోనూ తుడిస్తే ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గిపోవచ్చు. కాబట్టి ఏదో ఒకటి రెండు ప్రాంతాల్లో తుడిస్తే సరిపోతుంది. పాశ్చాత్య దేశాల్లో అయితే సాక్సుని తడిపి రాత్రంతా ఉంచుకునే చిట్కాని వాడతారు, కానీ మన వాతావరణానికి అది సరిపోకపోవచ్చు.   - ఒకప్పుడు జ్వరం వస్తే లంఖణాన్నే (ఉపవాసం) మందుగా భావించేవారు. జ్వరాన్ని నయం చేసుకునేందుకు శరీరానికి తగినంత విశ్రాంతిని ఇవ్వడమే ఉపవాసంలో ఉన్న లక్షణం. ఇప్పుటి ఉరుకులపరుగుల జీవితంలో ఉపవాసాలు కుదరకపోయినప్పటికీ.... తేలికగా జీర్ణమయ్యే ఆహారం, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. వీటికి తోడుగా సీ విటమిన్‌, నీటి శాతం ఎక్కువగా ఉండే నారింజ వంటి పండ్లని కూడా తీసుకోవాలి.   - మన ఇంట్లోనే దొరికే తులసి, అల్లం వంటి ఔషధులతో మరిగించిన నీటిని తాగడం వల్ల కూడా మంచి ఫలితం దక్కుతుంది.     - నిర్జర.

read more
శ్రీలంకలో మలేరియా మాయం... మరి మనమో!

  మన పక్కనే ఒక బిందువులా కనిపించే ఓ చిన్న దేశం శ్రీలంక. నిన్నమొన్నటి వరకూ నిరంతర అంతర్యుద్ధంతో అతలాకుతలమైపోయిన దేశం. ఇప్పుడిప్పుడే ఆక్కడ ప్రశాంతమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. అలాంటి ఓ దేశం ఊహించని అద్భుతాన్ని సాధించింది. మలేరియా రహిత దేశంగా సగర్వంగా నిలిచింది. పెద్దన్నలాంటి మన దేశానికి కూడా ఆదర్శంగా నిలిచింది. ఆ విజయగాధ...   అనుకూలమైన పరిస్థితులు శ్రీలంకలో అడవుల శాతం ఎక్కువ. నీటి లభ్యతకీ కొదవేమీ లేదు. పైగా చుట్టూ సముద్రమే! దోమలకు ఇంతకంటే స్వర్గధామం ఏముంటుంది. ఇక శ్రీలంకలో గ్రామీణ ప్రాంతాలే అధికం కాబట్టి, ఏదన్నా వ్యాధి వస్తే దానికి చికిత్స తీసుకోవాలన్న అవగాహన కూడా తక్కవే! దాంతో ఒకప్పుడు లక్షలాది మలేరియా కేసులు నమోదయ్యేవి. వేలాదిమంది జనం పిట్టల్లా రాలిపోయేవారు.   యుద్ధం మొదలు శ్రీలంక ప్రభుత్వం ఆది నుంచీ కూడా మలేరియా మీద ఉక్కుపాదం మోపుతూనే ఉంది. మలేరియా పరీక్ష కోసం చేసిన రక్తపరీక్షల ఫలితాలను 24 గంటలలోనే అందించడం, డీడీటీ వంటి రసాయనాలతో దోమల వ్యాప్తిని నిరోధించడం వంటి జాగ్రత్తలను పాటించేది. ఇక 1958 నాటికి మలేరియా మీద పూర్తిస్థాయి యుద్ధాన్నే ప్రకటించింది. ఇందుకోసం కొలంబియాలో ఒక ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పింది. మలేరియాని అదుపుచేసేందుకు ఉపయోగించే డీడీటీ ప్రమాదకరం అని తేలిపోవడంతో సరికొత్త ప్రణాళికలతో తన యుద్ధాన్ని కొనసాగించింది.   ఇవీ చర్యలు - మలేరియా గురించి, దాని నివారణ చికిత్సల గురించి ప్రజల్లో విస్తృతమైన అవగాహనను కలిగించడం. - మలేరియా బారిన పడిన రోగులకు సత్వర చికిత్స అందించడం ద్వారా, వారి నుంచి ఆ రోగకారకాలు ఇతరులకు చేరకుండా చూసుకోవడం. - వర్షపాతం, నీటిప్రవాహం వంటి సూచనల ఆధారంగా మలేరియా ప్రబలే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి అక్కడకు తగిన వైద్య సిబ్బందిని పంపించడం. - దేశంలో నమోదవుతున్న మలేరియా కేసులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఎక్కడ ఆ వ్యాధి ప్రబలుతోందో గమనించడం. భవిష్యత్తులో ఆ ప్రాంతాల మీద మరింత దృష్టిని సారించడం. - ఒకపక్క మలేరియాని నివారించడం కోసం తగినన్ని నిధులను కేటాయిస్తూనే, మరో పక్క ఆ వ్యాధి మీద మరింత పట్టుని సాధించేందుకు పరిశోధనలు సాగించడం. ... ఇలా రకరకాలా చర్యలతో గత మూడు సంవత్సరాలుగా దేశీయంగా ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ఐక్యరాజ్యసమితి శ్రీలంకను మలేరియారహిత దేశంగా ప్రకటించింది.   మరి మనమో! మన దేశంలో మలేరియా అంటే సర్వసాధారణమైన విషయం. ఏటా దాదాపు పదిలక్షలమందికి పైగా జనం ఇక్కడ మలేరియా బారిన పడుతూ ఉంటారు. ఇక ఓ వెయ్యమంది వరకూ ఈ వ్యాధితో మృత్యుఒడిని చేరుతూ ఉంటారు. శ్రీలంకంతో పోల్చుకుంటే ఇక్కడ జీవనవిధానాలు మెరుగ్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రభుత్వాల దగ్గర నిధులకి కానీ, జనాల దగ్గర చదువుకి కానీ కొరత లేదు. కానీ లేనిదల్లా చిత్తశుద్ధి మాత్రమే! ఈ ఏడాది మన దేశం కూడా మలేరియాను 2030నాటికి సమూలంగా నాశనం చేస్తామని ప్రతిన పూనింది. అంటే మరో పదిహేను సంవత్సరాలకు కానీ మనం మలేరియా రహిత భారతదేశాన్ని చూడకపోవచ్చునన్నమాట! మన ఆరోగ్యశాఖల తీరుని గమనిస్తే అప్పటికైనా ఇది సాధ్యమేనా అన్న అనుమానమూ కలగక మానదు.   - నిర్జర.

read more
మీ పిల్లి ప్రాణాంతకం కావచ్చు!

  పిల్లులతో ఆడుకోవడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. కొందరిలో ఆ ఇష్టం కాస్త శృతి మించి వాటితో మోటుగా ఆడుకుంటూ ఉంటారు. ఇలాంటి సందర్భాలలో పిల్లి గోళ్లు కనుక మన శరీరానికి గీరుకుంటే అది ప్రాణాంతకంగా పరిణమించవచ్చు అని సూచిస్తున్నారు వైద్యులు.   cat-scratch fever: పిల్లులలో ‘బార్టొనెలా హెర్న్‌సెలే’ అనే ఒక బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉందట. ఈ బ్యాక్టీరియా పిల్లుల శరీరం మీద ఉండే రకరకాల పరాన్న జీవుల ద్వారా ఒక పిల్లి నుంచి మరో పిల్లికి వ్యాపిస్తాయి. వీటివల్ల పిల్లులకి పెద్దగా హాని కలుగకపోయినా... ఆ బ్యాక్టీరియా కనుక మనిషి ఒంట్లోకి చేరితే cat-scratch fever అనే జబ్బు వచ్చే ప్రమాదం ఉంది. పిల్లులతో ఆడేటప్పుడు వాటి గోళ్లు మనకు రక్తం వచ్చేలా గీరుకున్నా, మన కంటికి తగిలినా... సదరు బ్యాక్టీరియా మనలోకి చేరే అవకాశాలు ఏర్పడినట్లే.   లక్షణాలు - గాయం ఏర్పడిన చోట వాపు లేదా దద్దుర్లు, - శరీరంలోని లింఫ్‌ గ్రంథులు వాయడం, - నీరసం, జ్వరం, తలనొప్పులు, గొంతు నొప్పి, - వెన్నునొప్పి. కీళ్లు, కండరాల నొప్పులు, - బరువు తగ్గిపోవడం, ఆకలి మందగించడం...   .... ఇలా రకరకాల లక్షణాల ఈ రోగం ద్వారా ఏర్పడవచ్చు. గాయం ఏర్పడినప్పటి నుంచి రెండు నెలల వరకు ఎప్పుడైనా ఈ లక్షణాలు ఏర్పడవచ్చు. పైగా పరీక్షల ద్వారా ఈ జబ్బుని గుర్తించడం కూడా కష్టం. కాబట్టి ఈ లక్షణాలన్నీ ఏవో సాధారణ జ్వరం వల్ల ఏర్పడ్డాయని రోగులు భావించే ప్రమాదమే ఎక్కువ. ముఖ్యంగా HIV వంటి రోగంతో బాధపడుతున్నవారు కానీ, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కానీ ఈ వ్యాధి బారిన పడితే మరింత అనారోగ్యానికి లోనయ్యే ప్రమాదం ఉంది.   ఉపద్రవం: సాధారణంగా ఈ రోగ లక్షణాలన్నీ వాటంతట అవే తగ్గిపోతాయి. మరీ అవసరమైతే తప్ప వైద్యులు కూడా ఈ రోగానికి పెద్దగా మందులను సూచించరు. కానీ కొన్ని అరుదైన సందర్భాలలో మాత్రం ఈ బ్యాక్టీరియా శరీరం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించవచ్చు. తాత్కాలికంగా కంటిచూపు మసకబారడం దగ్గర్నుంచీ మెదడు శాశ్వతంగా దెబ్బతినడం వరకూ ఈ బ్యాక్టీరియా ఒకోసారి ఉపద్రవాన్నే సృష్టిస్తుంది. మరికొన్ని సందర్భాలలో ఇది ఎముకలు, గుండెను సైతం ప్రభావితం చేస్తుంది.   నివారణ: దాదాపు 40 శాతం పిల్లుల్లో ఏదో ఒక సందర్భంలో ఈ రోగాన్ని కలిగించే బ్యాక్టీరియా పొంచి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే పిల్లులతో ఆడుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం, ఏవన్నా గాట్లు తగిలిన తరువాత రోగలక్షణాలు కనిపిస్తే వైద్యుని సంప్రదించడాన్ని సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లిపిల్లల్లో ఈ వ్యాధి కారకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, వాటికి దూరంగా ఉండమని హెచ్చరిస్తున్నారు. ఇంట్లో ఉండే పెంపుడు పిల్లులకు కూడా తరచూ వైద్య పరీక్షలను నిర్వహించమని చెబుతున్నారు.   - నిర్జర.

read more
మధుమేహానికి వేపుళ్లంటే ఇష్టమట!

  కాలం మారిపోతోంది. కాలంతో పాటుగా మన ఆహారంలోని రుచులూ, అభిరుచులూ మారిపోతున్నాయి. దురదృష్టవశాత్తూ ఇలాంటి మార్పులన్నీ మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోకుండా కేవలం జిహ్వచాపల్యం ఆధారంగానే ఉంటున్నాయి. పండ్లూ కూరగాయలకు బదులుగా వేపుళ్లూ, బేకరీ పదార్థాలూ తీసుకోవడం ఎక్కువైంది. ఇక మాంసం తినేవారైతే గ్రిల్డ్‌ చికెన్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ మార్పులు ఖచ్చితంగా మన అనారోగ్యానికి కారణం అవుతున్నాయంటూ ఇప్పుడు ఒక పరిశోధన స్పష్టం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ పలకరించేందుకు సిద్ధంగా ఉన్న మధుమేహపు మహమ్మారికి వేపుళ్లంటే ఇష్టమని తెలియచేస్తోంది.   నీరు- నిప్పు మన వంటలో నీటికి ఉన్న ప్రాధాన్యత తగ్గిపోయి నిప్పుకి ప్రాముఖ్యత పెరిగిపోయింది. అంటే ఆహారాన్ని ఉడికించకుండా వేయించడమో, కాల్చడమో ఎక్కువయ్యింది. ఇలాంటి ఆహారంలో Advanced Glycation End Products (AGEP) అనే పదార్థాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఈ పదార్థాలు మన శరీరంలోని ఇన్సులిన్‌ వాడకాన్ని దెబ్బతీస్తాయట. ఇన్సులిన్‌ వాడకం సరిగా లేకపోవడంతో, మన శరీరంలో చక్కెర నిల్వలు పేరుకుపోయే ప్రమాదం ఉంది. ఇలా అధికంగా పేరుకుపోయిన చక్కెర నిల్వల వల్ల గుండె, కిడ్నీలు, కళ్లు వంటి కీలక అవయవాలు దెబ్బతినిపోతాయి. పైగా AGEPల కారణంగా శరీరంలోని కణాలు కూడా వాపుకి (inflammation) లోనై గుండెపోటు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.   పరిశోధనతో తేలిపోయింది AGEPల కారణంగా మన శరీరంలో ఇన్సులిన్‌ వాడకంలో లోపాలు, కణాల వాపు ఏర్పడతాయన్న విషయాన్ని శాస్త్రీయంగా రుజువు చేసేందుకు న్యూయార్కుకి చెందిన కొందరు వైద్యులు ఒక పరిశోధనను నిర్వహించారు. ఇందుకోసం ఒక వందమంది అభ్యర్థలను ఎన్నుకొన్నారు. వీరంతా కూడా ఊబకాయం, అధికరక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు ఉన్నవారే. అందరూ 50 ఏళ్లు పైబడినవారే. ఈ వంద మందిలో 49 మందిని ఎప్పటిలాగే ఆహారాన్ని తీసుకోమంటూ సూచించారు. మరో 51 మందిని మాత్రం తమ ఆహారాన్ని వండుకునే విధానంలో మార్పులు చేయమని చెప్పారు. వేయించడం, కాల్చడం కాకుండా ఉడికించడం, నానబెట్టడం వంటి పద్ధతుల ద్వారా ఆహారాన్ని వండుకోమని సలహా ఇచ్చారు.   ఫలితం ఊహించినదే! ఒక ఏడాదిపాటు జరిగిన పరిశోధన తరువాత తేలిందేమిటంటే వేపుళ్ల బదులు ఉడికించిన పదార్థాలు తిన్నవారిలో ఇన్సులిన్‌ పనితీరు మెరుగుపడింది. పైగా కణాల వాపు కూడా తగ్గిపోయింది. దీంతో మధుమేహం ఉన్నవారూ, ఆ వ్యాధి ఎప్పటికీ రాకూడని కోరుకునేవారూ వేపుడు పదార్థాలకు దూరంగా ఉండాలన్న విషయం స్పష్టమైంది. అంతేకాదు! శాకాహారంలో AGEPలు స్వతహాగానే చాలా తక్కువ స్థాయిలో ఉంటాయనీ, కాబట్టి మధుమేహానికి దూరంగా ఉండాలంటే ఇలాంటి ఆహారాన్నే తీసుకోవాలని చెబుతున్నారు.   - నిర్జర.

read more
9/11 దాడి ఇంకా పూర్తవ్వలేదు

  2001, సెప్టెంబరు 11. అల్‌ఖైదా ఉగ్రవాదులు రెండు బోయింగ్‌ విమానాల సాయంతో అమెరికాలోని ట్విన్‌ టవర్స్‌ను కూల్చివేశారు. ఈ ప్రమాదంలో విమానంలోని ప్రయాణికులతో సహా 2,700కి పైగా మృత్యువాత పడ్డారు. ఈ ఘటన జరిగి నిన్నటికి 15 ఏళ్లు గడిచినా, ఇప్పటికీ వేల మంది ఆరోగ్యాలు ప్రమాదంలో ఉన్నాయి. ఎందుకంటే...     విష వాతావరణం రెండు భారీ విమానాలు అంతకంటే భారీగా ఉన్న భవనాలను కూల్చివేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ విస్ఫోటనంలో విమానంలోని ఇంధనం మొదలుకొని, భవన నిర్మాణంలో ఉపయోగించిన యాస్బెట్సాస్ వంటి హానికారక పదార్థాలు ఎన్నో ఆ ప్రాంతాన్ని కమ్ముకున్నాయి. భవనంలో ప్లాస్టిక్‌ మొదలుకొని మానవ విసర్జితాలు అన్నీ అగ్నికి ఆహుతి అయ్యాయి. అక్కడ ఉన్న యంత్రాలు, పరికరాలు తగలబడిపోవడంతో మెర్క్యురీ, లెడ్ వంటి విషపదార్థాలతో ఆ ప్రాంతం నిండిపోయింది.     తప్పుడు నిర్ణయం ట్విన్‌ టవర్స్‌ని కూల్చివేడం ద్వారా అల్‌ఖైదా అమెరికాను దారుణంగా దెబ్బతీసినట్లు అయ్యింది. కానీ తమ పౌరుల స్థైర్యం ఇంకా చెక్కుచెదరలేదన్న సంకేతాలను అమెరికా పెద్దలు చెప్పాలనుకున్నారు. అందుకనే ట్విన్ టవర్స్‌ చుట్టుపక్కల ప్రదేశంలోని గాలి, నీరు ఇంకా సురక్షితంగానే ఉన్నాయనీ... పౌరులంతా అక్కడే ఉండి తమ రోజువారీ జీవితాన్ని కొనసాగించవచ్చనీ ఊదరగొట్టారు. దాంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలనుకున్నవారు కూడా అక్కడే ఉండిపోయారు. ఆ కాలుష్యంలోనే తమ జీవితాలను గడపసాగారు.     అనారోగ్యాలు మొదలు ఏళ్లు గడిచేకొద్దీ అక్కడి ప్రజల్లో అనారోగ్య సమస్యలు తలెత్తడం మొదలుపెట్టాయి. ముఖ్యంగా విస్ఫోటనం తరువాత ట్విన్‌ టవర్స్ చుట్టుపక్కల నివసించిన ప్రజలు, అక్కడి ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి వచ్చిన కార్మికులలో ఒకొక్కటిగా రోగాలు బయటపడసాగాయి. ఆస్తమా, ఊపిరితిత్తులు పాడైపోవడం, డిప్రెషన్‌, నిద్రలేమి మొదలుకొని క్యాన్సర్‌ వరకూ రకరకాల జబ్బులు పీడించసాగాయి.   ఉచిత వైద్యం 9/11 కాలుష్యం కారణంగా అనారోగ్యం బారిన పడ్డవారికి చికిత్సను అందించేందుకు 2012లో World Trade Center Health Program పేర ప్రభుత్వం ఒక ఆరోగ్య పథాకాన్ని మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఆ కాలుష్యానికి బాధితులుగా ఉన్నవారంతా ఉచితంగా చికిత్స చేయించుకోవచ్చు. ఈ పథకం కింద ఏకంగా 75 వేల మంది ప్రజలు చేరారంటే, 9/11 కాలుష్యం ఎంతమందిని ప్రభావితం చేసిందో ఊహించుకోవచ్చు. అయితే ఈ లెక్క చాలా తక్కువని వాదించేవారూ లేకపోలేదు. 9/11 ఘటన జరిగిన తరువాత కొంతమంది అక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయారనీ, మరికొందరికి అసలు ఈ పథకం గురించే తెలియదనీ చెబుతున్నారు. పైగా క్యాన్సర్‌ వంటి రోగాలు బయటపడటానికి ఒకోసారి 20 సంవత్సరాల వరకూ సమయం పడుతుంది. కాబట్టి మున్ముందు కాలంలో 9/11 బాధితుల సంఖ్య ఇంకా పెరగవచ్చని భయపడుతున్నారు. అలా ఉగ్రవాదుల పైశాచికత్వానికి, ప్రభుత్వాల తప్పిదాలు కూడా తోడవ్వడంతో 9/11 భూతం ఇంకా న్యూయార్కు వాసులను వెన్నాడుతూనే ఉంది.   - నిర్జర.

read more