ఆదిత్య చలించిపోతూ చూశాడు. "అవునమ్మమ్మా.... చాలా అడ్వెంచర్ చేశాను. నా స్నేహితుడు బాబ్జీ భయపడి పోయాడో కానీ, నాకెందుకో ఆ క్షణంలో భయమే వేయలేదు.... ఎంత సేపటికీ నా పాపని నేను దక్కించుకోవాలన్న ఆరాటం తప్ప మరో ఆలోచనే కలగలేదు...సారీ అమ్మమ్మా...."
ఆవిడ నవ్వింది... "సారీ నాకెందుకురా ....అటు చూడు...." అంటూ అప్పుడే నిద్రలేచి నోట్లో వేలేసుకుని చిట్టి, చిట్టి అడుగులతో వస్తోన్న పాపాయిని చూపిస్తూ అంది "దానికి చెప్పు..."
ఆదిత్య పాపని చూడగానే తన ఉద్వేగం , బాధ అంతా మర్చిపోయిన వాడిలాగా చటుక్కున ఆవిడని వదిలి పాప దగ్గరకు వెళ్ళి గబుక్కున ఎత్తుకున్నాడు . "డాడీ!" అంటూ పాప ఆదిత్య మెడని చుట్టేసుకుంది చిట్టి చేతుల్తో.
తరచూ వచ్చి వెళ్ళడం వలన ఆదిత్య బాగా అలవాటై పోయాడు.
లలితాంబ వాళ్ళిద్దరినీ మురిపెంగా చూస్తూ పాపాయికి పాలు కలపడానికి వంట గదిలోకి వెళ్ళిపోయింది.
ఆదిత్య పాపతో ఆడుకుంటూ కబుర్లు చెబుతూ సర్వం మరిచిపోయాడు.
ప్రఖ్యకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లోని మూడు యూనివర్సిటీ లలో ఎంఎస్ కి సీట్ వచ్చింది. ఆమె కాలిఫోర్నియా యూనివర్శిటీ సెలక్ట్ చేసుకుంది.
భానుప్రియ కి ఆకాశాన్ని అందుకున్నంత సంతోషంగా ఉంది. ఇంతకాలం తనకీ, తన కూతురికీ అండగా ఉండి, ఎంతోసాయం చేసిన స్నేహితురాలు మధురి కి కృతజ్ఞతలు తెలియచేసుకుంది.
"నువ్వే ఆరోజు మాకు షెల్టర్ ఇవ్వకపోయి ఉంటె ఈ పిచ్చిది ఏమాయేదో మధూ. ఆ వెధవ దీని ఆయయకత్వాన్ని క్యాష్ చేసుకొని ఈ పాటికి నలుగురు పిల్లల్ని తల్లిని చేసి, ముసలిదాన్ని చేసేవాడు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను" అంది మధురితో.
"ఆపదలో ఉన్న నా స్నేహితురాలి కి ఆ మాత్రం సాయం చేయకపోతే స్నేహానికి అర్ధం ఏంటి భానూ...!" కాకపోతే ప్రఖ్య కూడా ఆ రిలేషన్ సీరియస్ గా తీసుకోలేదు. కాబట్టి సరిపోయింది కానీ, సీరియస్ గా తీసుకుని ప్రేమ అనీ, అతను లేకపోతె బతకలేనని ఫార్స్ చేసి ఉంటె ఎమయేది? ఏది ఏమైనా యూ ఆర్ లక్కీ.... నీ ఆదర్శాలు అర్ధం చేసుకుని తదనుగుణంగా మసలిన కూతురు దొరికింది....' అంది మాధురి.
అ రోజే ప్రఖ్య అమెరికా వెళ్ళే రోజు....
రెండు పెద్ద సూట్ కేసులు సర్దుకుంది... ఒక క్యాబిన్ బ్యాగు నిండా పుస్తకాలు, సర్టిఫికెట్స్ ఒక జత బట్టలు పెట్టుకుంది....హ్యాండ్ బాగ్ లో డబ్బులు, పాస్ పోర్ట్ , ఇతర కాగితాలు , పెన్ను, మధ్య లో ఫ్రెష్ అవడానికి కావలసిన టూత్ బ్రష్, పేస్టు పౌడరు , బొట్టు దువ్వెన , సబ్బు చిన్న న్యాప్ కిన్ అన్నీ సర్దుకుంది.
ఇప్పుడు ప్రఖ్య బాగా ఎదిగింది...జీన్స్ పాంట్ లాంగ్ కుర్తీ వేసుకుంది... నుదుట చిన్న నల్లటి స్టిక్కర్ కుడిచేతికి బ్రెస్ లేట్.... సింపుల్ గా అందంగా, ఆధునికంగా ఉంది. ఇంగ్లీష్ తప్ప మరో భాష మాట్లాడదు.
మాధురి భర్త శ్రీధర్ కారు సిద్దం చేశాడు.
ప్రఖ్య మాధురికి హాగ్ ఇచ్చి "థాంక్యూ అంటీ... ఐ లవ్ యూ" అంది.
మాధురి నవ్వుతూ , అల్ ది బెస్ట్ అంది.
భానుప్రియ కి మొదటిసారిగా కళ్ళవెంట నీళ్లోచ్చాయి. "జాగ్రత్తగా ఉండు బేటా..." అంది ప్రఖ్య ని దగ్గరకు తీసుకుని.
ప్రఖ్య అభయం ఇస్తున్నట్టుగా అంది. డోంట్ వర్రీ మమ్మీ.... ఇంక నా గురించి ఆలోచించకు... యు జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ....బైదిబై ....మిస్టర్ ఉత్తేజ్ ని అడిగానని చెప్పు....' అంది.
ఉత్తేజ్ ని ఏనాడూ ప్రఖ్య అంకుల్ అని కానీ, మరో వరస తో కాని పిలవలేదు. అతనితో చాలా తక్కువ సార్లు మాట్లాడింది. అతను ప్రఖ్య దృష్టి లో భానుప్రియ బాయ్ ఫ్రెండ్ . అందుకే పేరు పెట్టి సంభోదిస్తుంది. వయసుకి మించిన మానసిక పరిణతి వలన తల్లి భాయ్ ఫ్రెండ్ గురించి ఎటువంటి కామెంట్స్ చేయదు. పైగా భానుప్రియ కూడా ప్రఖ్య ని కొన్ని విషయాల్లో చాలా ఆధునిక భావాలతో పెంచింది. అందుకే ఉత్తేజ్ తో ప్రఖ్య ఎలా ఉంటుందో అనే విషయం భానుప్రియ కూడా పెద్ద ఆలోచించదు. అతనితో ప్రఖ్య అనుబంధం బాగుండాలని అతనిని తండ్రి స్థానంలో ప్రఖ్య గౌరవించాలని వగైరా ఆలోచనలు ఆమెకేం లేవు. అతనితో తనకున్న అనుబంధాన్ని చాలా కాజువల్ గా తీసుకుంటుంది. వాళ్ళిద్దరి మధ్యా ఎంతో కాలంగా రహస్యంగా సాగుతూ వస్తోన్న వాళ్ళ బంధానికి త్వరలో చెక్ పెట్టేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తల్లిగా తన కూతురికి మంచి భవిష్యత్తు నిచ్చి తన జీవితం తన ఇష్టం వచ్చినట్టు మార్చుకోవాలని ఎదురు చూస్తున్న భానుప్రియ కి ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. ప్రఖ్య అమెరికా వెళ్ళిపోతోంది. మళ్ళీ ఎప్పుడు వస్తుందో, ఇంక పెళ్ళి.... ఆ విషయం ప్రఖ్యకే వదిలేసింది. తనకిష్టం అయినవాడు, అన్ని విధాలా తనకు అనుకూలమైన వాడు తటస్థ పడితే తనే పెళ్ళి చేసుకునే స్వేచ్చ ప్రఖ్యకిచ్చేసింది. ఇదివరకులా తొందరపడి తప్పు చేసే దశ నుంచి ప్రఖ్య ఎదిగింది. తనని కాపలా కాయాల్సిన అవసరం లేదిప్పుడు.
భానుప్రియ హాయిగా ఊపిరి పీల్చుకుంది.
ఎయిర్ పోర్ట్ కి మాధురి, ఆమె భర్త భానుప్రియా వెళ్ళారు.
ప్రఖ్య చెక్ ఇన్ అయిపోగానే చివరిసారిగా వీడ్కోలు చెప్పి అందరూ వెనక్కి తిరిగారు.
ప్రఖ్య హ్యాండ్ బ్యాగ్, క్యాబిన్ బ్యాగ్ తీసుకుని సెక్యూరిటీ చెకింగ్ వైపు వెళ్ళిపోయింది.
***
శిరీష బ్యాంకు నుంచి నీరసంగా వచ్చి తలుపు తీసుకుని, లోపలికి వెళ్ళి సోఫాలో వాలిపోయింది.
ఈ మధ్య ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతింది. మనిషి బాగా చిక్కిపోయింది. జుట్టంతా ఊడిపోయి పల్చగా అవడంతో జడగానీ, ముడి గానీ వేసుకోడం మానేసి, అలాగే వదిలేస్తోంది. ఇదివరకు ఫెళ, ఫేళ్ళాడే కాటన్ చీరలు కడుతుండేది. ఇప్పుడు ఏది పడితే అదే ఆ చీర నలిగిపోయినా, వెలసిపోయినా పట్టించుకోడం లేదు.
ఆదిత్య ప్రవర్తనకి, భానుప్రియ చేసిన అవమానానికి మానసికంగా బాగా దెబ్బతింది శిరీష.
ఎంత ప్రేమగా ఎంత జాగ్రత్తగా చూసుకున్నా వివేక్ కూడా పూర్తిగా ఆమె దగ్గర ఉండలేకపోతున్నాడు. చాలా రోజులుగా అతనికి, అతని భార్యకీ మధ్య యుద్ధం మొదలైంది. మావగారు, బావమరది కూడా పరోక్షంగా హెచ్చరించారు అతడిని. అందుకే వివేక్ శిరీషతో ఇదివరకులా ఎక్కువ సమయం గడపలేక పోతున్నాడు. ఎదిగిన పిల్లల్లిద్దరున్న ఇంట్లో అనవసరంగా ఇంకో స్త్రీ విషయంలో భార్యతో గొడవపడడం అతనికి ఇష్టం ఉండడం లేదు. పైగా ఆమెకి పుట్టింటి బలగం ఎక్కువగా ఉండడంతో వాళ్ళ ఇన్ వాల్వ్ మెంట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. నలభై ఏళ్ళు దాటిపోతోంటే ఇంకా వాళ్ళందరి చేతా నీతులు చెప్పించుకోడం వివేక్ అహాన్ని దెబ్బ తీస్తోంది. అలా అని శిరీష మీద ప్రేమనీ, తమిద్దరి మధ్యా ఉన్న అనుబంధాన్ని వదులుకోలేక పోతున్నాడు. కాకపోతే ఇదివరకులా రాత్రిళ్ళు ఉండిపోవడం, ఎక్కువ సమయం ఆమెకి కేటాయించడం తగ్గిపోయింది.
అది కూడా శిరీష ను మానసికంగా కృంగదీసింది. ఇంతేనా ఈ బంధం అనిపిస్తోంది. ఏనాటికైనా తను పరాయిదే ...వివేక్ కి తను ఏమీ కాదు.. ఏమీ కానప్పుడు ఇంతకాలం పంచుకున్న మధురాను భూతులకి అర్ధం ఏంటి? ఇంతకాలం సాగించిన సహజీవనం విలువ ఏంటి? వివేక్ వైవాహిక జీవితానికి అంత వెయిట్ ఇచ్చేటప్పుడు తనతో ఎలా సహజీవనం సాగించాడు? ఈ ప్రశ్నలన్నిటికీ ఆమెకి సమాధానం మృగతృష్ణ అయింది.
దాంతో ఆమె నిర్వికారంగా మారిపోయింది.
ఆదిత్య రెండు, మూడు సార్లు కలిశాడని వివేక్ చెప్పాడు. కానీ తనని చూడలేదని కూడా చెప్పాడు. ఆదిత్య ఎక్కడ ఉంటున్నాడో అతని స్నేహితులను అడిగినా ఆవిడకి సరైన సమాధానం లభించలేదు. ఈ మధ్యే ఆదిత్య కి ఇన్ఫోటెక్ లో ఉద్యోగం వచ్చిందని తెలిసింది. అందుకు సంతోషించాలో, బాధపడాలో ఆమెకి అర్ధం కావడం లేదు. పాపనేం చేశాడో, ఎక్కడ ఉంటున్నాడో, ఏం తింటున్నాడో అనే ఆలోచనలతో ఆమె మాతృహృదయం తల్లడిల్లి పోతోంది. కానీ, ఆమెని ఊరడించి, సాయం చేసి తల్లినీ, కొడుకుని కలిపే సాహసం మాత్రం ఎవరూ చేయడానికి సిద్దంగా లేరు. ఆరోజు ఆదిత్య చేసిన అవమానంతో వివేక్ కూడా అతని ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడుతున్నాడు.
భానుప్రియ బెంగుళూరు వెళ్ళిపోడం , ఆదిత్య తన నుంచి దూరంగా పోడం ఇదంతా కేవలం తనకి ఆ భగవంతుడిచ్చిన శాపంలా భావిస్తోంది శిరీష.
ఆమెకి ఈ మధ్యే నాకెవరూ లేరు?" అనే భావన కలుగుతోంది.
మనసులో ఏ మూలో అమ్మ ఎక్కడుందో , ఎలా ఉందొ అనే ఆలోచన కూడా కలుగుతోంది... కానీ, ఆ ఆలోచన స్థిరంగా ఉండడం లేదు. ఇంకా ఉందా అమ్మ.... ఉంటె నాకోసం ఒక్కసారన్నా ఎక్కడుందో కూతురు అని ఎందుకు ప్రయత్నించలేదు.... ఎందుకిలా తనని వదిలేసింది.... అనే వేదన కూడా కలుగుతోంది....
సర్వం కోల్పోయి , ఆత్మీయత, అనురాగం, మమతలు, అన్నీ దూరం అయాక తల్లి ప్రేమ కోసం పరితపిస్తోంది . అమ్మన్నా ఉంటె నా ఈ మానసిక వేదన ఆమెకి చెప్పుకునేదాన్ని కదా! ఇప్పుడు నాకేవరున్నారు? నా బాధ వినడానికి అనుకుంటోంది.
ఎప్పుడూ ఒంటరిగా ఉంటె పిచ్చెక్కి పోతోంది అని తరచూ ఆదిత్య అనే మాటలు ఇప్పుడు బాగా అర్ధం అవుతున్నట్టుగా అనిపిస్తోంది.
