Previous Page Next Page 
తెల్ల గులాబి  పేజి 32

    పాప ఎదుగుతున్న వివిధ దశలు చూస్తుంటే అతని ఒళ్ళు పులకించి పోతోంది. బి.టెక్ ఐపోగానే ఉద్యోగం చూసుకుని పాపనీ, అమ్మమ్మ నీ తెచ్చేసుకోవాలి . అని ప్రతిరోజూ అనుకుంటాడు.
    ఆదిత్య కి లలితాంబ రెండు లక్షలిచ్చింది. ఆ డబ్బు పాప పేరున ఫిక్స్ చేశాడు ఆదిత్య. అతనికి అటు ప్రఖ్యతో గానీ, ఇటు శిరీషతో గానీ ఎలాంటి కమ్యూనికేషన్ పెట్టుకోలేదు.
    ఆదిత్య చాలా మారాడు. మనస్తత్వం లో చిల్లపిల్లాడి చంచలత్వం ఆలోచన లేని ఆవేశం అన్నీ పోయాయి. అసలుసిసలైన యువకుడిలా తయారయాడు. ఆలోచనల్లో విచక్షణ, పరిణతి వచ్చేశాయి. అతని రూపంలో కూడా బాలుడి పసితనం పోయి ఒళ్లోచ్చి మేన్ లీగా తయారయాడు. అతనికి ఒకే టార్గెట్ వుంది. బి.టెక్ పూర్తిచేయాలి. ఉద్యోగం చూసుకొని పాపని తెచ్చుకోవాలి. ఇంకా ఏడాది ఆగితే ఇంజనీరింగ్ అయిపోతుంది ఒక్క ఏడాది. ఆ తర్వాత తనకో ఇల్లు, ఇంట్లో సందడి చేసే పాప, మంచి సలహాలిస్తూ, తను తప్పు చేయబోయినా సరిదిద్ది తనని మంచి మార్గంలో నడిపించే పెద్దావిడ అమ్మమ్మ. బుద్ది మారి, అమ్మకూచి లా కాక, యువతి గామారిన ప్రఖ్య వస్తే ఒక భార్య ఎంత బాగుంటుంది ఇల్లు.
    అమ్మ....ఆదిత్య శిరీష గుర్తొచ్చింది...కళ్ళు చెమర్చాయి.
    ఆరోజు వివేక్ ఆవిడని గదిలోకి తోసి తనతో మాట్లాడాక తను సూటిగా వేసిన మాటల తూటాలతో గాయపడి వెళ్ళిపోయాడు. ఆ తరువాత తను స్నానం చేసి, తయారై వచ్చిందాకా అమ్మ తలుపు బాది, బాది, ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది. ఆదిత్య తలుపు తీసి, ఆమెకి తాత్కాలిక ఉపచర్యలు చేసి, సూట్ కేస్ తీసుకుని ఇంట్లోంచి వచ్చేశాడు. ఆ తరువాత ఆవిడ ఎన్నిసార్లు రాకేష్ తో కబురు చేసినా వెళ్ళలేదు.
    అమ్మ ఏం చేస్తోందో....ఒక్కక్షణం ఆదిత్య మనసు విలవిల్లాడింది.
    ఏం చేస్తుందిలే. ఆ వివేక్ తో హాయిగా ఎంజాయ్ చేస్తుంటుంది.,, అంతలోనే నిర్లక్ష్యంగా అనుకున్నాడు.
    కానీ, ఎందుకో అలా అనుకోబుద్ది కాలేదు. పాపం ఎంత ఏడుస్తుందో అనిపించింది. ఏది ఏమైనా తన చదువు పూర్తీ అయి ఉద్యోగం సంపాదించి కునేదాకా వెళ్ళేది లేదు. అప్పుడు అమ్మమ్మ, పాపతో కూడా వెళ్ళి సగౌరవంగా తన దగ్గరకు తీసుకువస్తాడు.
    అలా అనుకున్నాక ఆదిత్య కెంతో ఆనందంగా అనిపించింది.
    యస్. అలాగే చేయాలి. అలా జరిగిన్నాడు తన జీవితానికో అర్ధం ఉంటుంది. ఏదో సాధించానన్న తృప్తి ఉంటుంది.
    ఆదిత్య ఆలోచిస్తూనే కమ్మటి నిద్రలోకి జారిపోయాడు.
    బెంగుళూరు లో ప్రఖ్య చదువు నిరాటకంగా సాగిపోతోంది. భానుప్రియ కూడా బెంగుళూరు లో వేరే ఉద్యోగం చూసుకొని పూర్తిగా షిఫ్ట్ అయిపొయింది.
    ప్రఖ్య మనసులోంచి క్రమంగా ఆదిత్య రూపం కనుమరుగవడమే కాక, పాపని కూడా పూర్తిగా మర్చిపోయింది. తోటి విద్యార్ధులతో పోటీగా సాగుతున్న చదువు మీద ఆసక్తి బాగా పెరిగింది. ఇప్పుడామెకి కూడా పెళ్ళి, పిల్లలు , సంసారం అనే జంజాటం లో పడ్డ ఆడదానికి భవిష్యత్తు ఉండదన్న నమ్మకం గాడంగా పడిపోయింది.
    బి.టెక్ అయిపోగానే స్టేట్స్ వెళ్ళి ఎం.ఎస్ చేయడానికి జి.ఆర్.ఇ. టోఫెల్ లో చేరింది. అమెరికన్ యాక్సెంట్ లో ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడుతోంది. తన ఆఫీసు వాళ్ళ ద్వారా యునైటెడ్ స్టేట్స్ లోని యూనివర్శిటీ ల వివరాలు తెప్పించింది భానుప్రియ.
    ఈ ప్రయత్నాలు, చదువు వీటితో పూర్తిగా బిజీగా అయిపోయిన ప్రఖ్య కి ఆదిత్య గురించి ఆలోచించే సమయం కూడా లేదు.
    ఎప్పుడైనా గుర్తొచ్చినా ఆమె పెద్దగా బాధపడడం లేదు. ఏదో టీనేజ్ లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ గా , అది ప్రతి అమ్మాయి , అబ్బాయి జీవితంలో చాలా సహజంగా జరిగే పొరపాటుగా భావించి వెంటనే మర్చిపోడానికి బాగా అలవాటు పడింది.
    బి.టెక్ ఫైనలియర్ పరీక్షలు మొదలైనాయి. అయితే అంతకు ముందే ఇన్ఫోటెక్ వాళ్ళు కాంటాక్ట్ చేసిన కాంపస్ సెలక్షన్ లో ఆదిత్య సెలక్టు అవడం, అతనికి అపాయింట్ మెంట్ ఆర్డర్ రావడం జరిగింది. ఆదిత్య ఆనందానికి హద్దుల్లేవు. తన కల సాకారం కావడానికి ఏంతో దూరం లేదన్న నమ్మకం , ఆశతో అతను ఎప్పటి కన్నా ఉత్సాహంగా మారిపోయాడు. ఫైనల్ ఇయర్ తెగ్జామ్స్ అవగానే జాబ్ లో చేరాలి కాబట్టి ర్యాంక్ సంపాదించాలి, బాగా చదువుకోవాలి గట్టిగా నిర్ణయించు కున్నాడు.
    అటు ప్రఖ్యా, ఇటు ఆదిత్య కూడా సీరియస్ గా  చదువుతున్నారు. 
    భవిష్యత్తు పైన ఇద్దరికీ విడి , విడిగా కొన్ని స్థిరమైన అభిప్రాయాలు పడిపోయాయి.
    చిన్నప్పట్నించీ ఆదిత్య పడిన ఒంటరి తనపు బాధ , ఆవేదన లోంచి వెలువడిన కొన్ని భావాలు అతనికి కుటుంబ వ్యవస్థ మీద చెప్పలేనంత మమకారం కల్పించడానికి దోహదం చేశాయి.
    తప్పో, ఒప్పో మంచో,చెడో తనొక  తప్పు చేశాడు. కానీ ఫలితంగా తనకో పాపాయి నిచ్చాడు దేవుడు. ఇప్పుడు ఆ పాప తనని డాడీ అని ముద్దుగా పిలుస్తోంటే అతనికి దూరమైనా ఓ తీయని పిలుపు ఈరోజు తన పాపాయికి దక్కించిన ఆనందంతో మురిసిపోతున్నాడు. అమ్మమ్మ ఊరికి వెళ్లినప్పుడల్లా పాపాయి చేత పదే పడే డాడీ అని పిలిపించుకుంటూ ఆ పిలుపులోని మాధుర్యాన్ని మనసారా ఆస్వాదిస్తున్నాడు. తనకు దక్కని ఆ పిలుపులోని మహత్యాన్ని ఆనందాన్ని తలుచుకుని కళ్ళు తడి అవుతుంటాయి. కానీ భగవంతుడు తన ఆక్రందన విని చిన్నవయసులోనే తనని తండ్రి చేశాడేమో అనుకుంటుంటాడు.
    ఒక్కోసారి తన పాపాయికి తండ్రి నిచ్చి తల్లిని దూరం చేసినందుకు బాధగా కూడా అనిపిస్తుంటుంది. కానీ, ప్రఖ్య పాపాయి కోసం తప్పకుండా తన దగ్గరకు వస్తుందన్న ఆశాభావం మాత్రం అతను కోల్పోవడం లేదు. తప్పకుండా బి.టెక్ పరీక్ష లైపోగానే వాళ్ళమ్మ ని ఎదిరించి పాపకోసం వస్తుందని అతని ప్రగడ విశ్వాసం. ప్రఖ్య కూయా ఆడదే కదా. ఆడవాళ్ళు ప్రపంచంలో ఏదైనా వదులుకుంటారు కానీ, పిల్లల్ని మాత్రం వదులుకోరు. పాపాయి ఏమైందో అనే ఆలోచనతో అయినా ప్రఖ్య తప్పకుండా వస్తుంది.
    పరీక్ష లైపోయాయి. ఆదిత్య ఒక శనివారం వెళ్ళి లలితాంబ తో మాట్లాడాడు.
    అమ్మమ్మా, నిన్ను, పాపనీ నాతొ తీసికెళ్ళి పోవాలనుకుంటున్నాను. త్వరలో మంచి ఇల్లు చూసి తీసుకుని వెళ్తాను..... వస్తావా ? అనడిగాడు.
    ఆవిడ కళ్ళు నీటితో నిండిపోయాయి.
    చివరి రోజుల్లో కొడుకుంటే కొడుకు దగ్గర, లేదా కూతురి దగ్గరా ప్రశాంతంగా వెళ్లి పోవాల్సిన జీవితంలో సగభాగం ఒంటరిగా ఉన్న ఒక్క కూతురి జాడ కోసం బాధపడుతూ గడిచిపోయింది. ఇప్పుడు మనవడు తనని అతనితో రమ్మంటున్నాడు. ఇది నిజమా?కలా? నిజమే అయినా తనిప్పుడు ఆ పట్నం వెళ్ళి బతకగలదా? ఈ ఇల్లు ఏం చేయాలి? ఆవిడకేం అర్ధం కాలేదు.
    నెమ్మదిగా అంది. ఈ వయసులో నేనక్కడికి వచ్చి సర్దుకుని ఉండలేనేమో రా తండ్రి...! పాపని నా దగ్గరే ఉంచి ముందు నీ భార్యని తెచ్చుకో.... తరువాత పాపని తీసుకుని వెళుదువు గానీ.
    ఆదిత్య నిరాశగా అన్నాడు. నా భార్య ... ఆవిడ ఎక్కడుందో నాకు తెలీదు అమ్మమ్మా. తనంతట తను వస్తే తప్ప నేనుగా వెళ్ళి తెచ్చుకునే అవకాశం లేదు. నీకక్కడ చాలా బాగుండేలా చూసే పూచీ నాది. అంతేకాదు నువ్వు వచ్చాక నేను అమ్మని కూడా తీసుకొచ్చేస్తాను. అందరం కలిసి ఉండచ్చు.
    "అమ్మనా?' ఆవిడ నమ్మలేనంత ఆశగా చూసింది.
    "అమ్మ వస్తుందా? నేను అమ్మను చూస్తానా?' నా శిరీష ను చూస్తానా? చెప్పరా తండ్రి నా కూతుర్ని నేను పోయేలోగా చూస్తానా?' ఉద్వేగంగా అడిగింది.
    "తప్పకుండా చూస్తావు. అమ్మమ్మా. లేకపోతె నేను ఇంతకాలం నుండీ పడిన ఈ భాధలన్నిటికీ నాకేం దక్కినట్లు అమ్మమ్మా! నువ్వు, అమ్మ, నేను,నా భార్య, నా పిల్లలు అందరూ కలిసి ఉండాలన్నది నాకున్న ఓ తీయని కల. నా చిన్నప్పుడు మా ఇంటి దగ్గర చుట్టూ పక్కల వాళ్ళంతా ఇంటి నిండా జనంతో పండగలు చేసుకుంటుంటే ఒంటరిగా నిలబడి నేను పొందిన బాధ ఏంటో నాకు తెలుసు... అమ్మా ఎప్పుడూ నన్ను ఎవరితో కలవనిచ్చేది కాదు. ఆవిడ గురించి అందరూ వివరాలడుగుతారని ఆవిడ భయం. కానీ అప్పుడు ఆ భయం లోంచి ఒక్క క్షణం నేనేం కోల్పోతున్నానో అమ్మ గుర్తించి ఉంటె ఇవాళ నాకిలాంటి పరిస్థితి వచ్చేది కాదు అమ్మమ్మా" ఆదిత్య స్వరం గద్గికం అయింది.
    ఆవిడ చప్పున ఆదిత్య ని దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంది.
    ఆవిడ పరిష్వంగంలో అనుభూతి ని ఆస్వాదిస్తూ మౌనంగా రోదించసాగాడు ఆదిత్య.
    "తప్పురా మగవాడివి ఏడవకూడదు. తప్పు చేసి, పారిపోయే వాళ్ళ సంగతి తెలుసురా నాన్నా... కానీ, నీలాగా ఆ తప్పుని ఒప్పుగా మార్చుకోడానికి , చిన్న వయసులోనే ఇంతంత సాహసాలు చేసిన వాళ్ళ గురించి నాకు తెలియదురా. నీ ద్వారానే తెలిసింది.. మూడేళ్ళ క్రితం అప్పుడే భూమ్మీద పడిన చిన్నారిని తీసుకుని నువ్వు రెండు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి రావడం తల్చుకుంటే నాకిప్పటికీ ఒళ్లు గగుర్పోడుస్తోంది... ఆదేవుడు నిన్ను దయతలచి పాప క్షేమంగా ఉండేలా చూశాడు కానీ, ఏదన్నా జరిగి వుంటే నిన్ను నువ్వు క్షమించుకోగలిగేవాడివా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS