Next Page 
మహావృక్షం  పేజి 1

            
                                మహావృక్షం
                                                      - అత్తలూరి విజయలక్ష్మి

 

                                                      


   రాత్రి పది గంటలు కావస్తోంది.
ఉస్మానియా జనరల్ హాస్పిటల్,కులీ కుతుబ్ షా భవంతిలోని కార్డియాలజీ వార్డ్ లోంచి భైటికి వచ్చింది డాక్టర్ అనూష.
కారిడార్ లోంచి హుందాగా నడుచుకుంటూ,కిందకి దిగి,ఆవరణ లోంచి నడిచి తన కారు పార్క్ చేసిన చోటుకి వచ్చింది.
బ్యాగ్  లోంచి కారు తాళంచెవులు తీస్తుండగా గుర్తొచ్చింది డాక్టర్ వసుధని ఇంటి దగ్గర డ్రాప్ చేయాలన్న సంగతి. కారు స్టార్ట్ చేసి, కుడిచేతి వైపుగా తిప్పి, ముందుకు పోనిచ్చింది. కొన్ని క్షణాల్లో హాస్పిటల్ మరో గేటులోకి కారు దూసుకు వెళ్ళింది.
అనూష కారు పోర్టికోలో ఆపి,దిగి నడుచుకుంటూ టెలిఫోన్ ఎక్స్చేంజి ఎదురుగా వున్నద్వారంలోంచి లోపలికి నడిచింది.
ఓ పక్క మేల్ జనరల్ వార్డు, మరో పక్క ఫిమేల్ జనరల్ వార్డు...నవాబుల కళా హృదయాన్ని చాటి చెపుతోన్న ఎత్తయిన కట్టడం.సున్నపురాయితో నిర్మించబడిన బలిష్టమయిన నిర్మాణం. రెండు పక్కలా పైన గోడలకి తగిలించిన హాస్పిటల్ నిర్మాతలైన నవాబుల నిలువెత్తు చిత్రాలు.
అనూష ఫిమేల్ వార్డువైపు నడిచింది. కొందరు పేషంట్స్ నిద్రపోతున్నారు.కొంచెం ఓపిక వున్నవాళ్ళు వాళ్ళ బంధువులతోనూ, డ్యూటీ నర్సులతోనూ కబుర్లు చెప్పుకుంటున్నారు.
అవూష వసుధ గదివైపు నడిచింది.
అప్పుడే బ్యాగ్ సర్దుకుంటున్న వసుధ ఆమెను చూడగానే చిరునవ్వుతో విష్ చేసింది.
"రేడియా?వెళదామా?"అడిగింది అనూష.
"అలాగే "ఇద్దరూ కలిపి బయటికి వచ్చారు.
కారు దగ్గరికి సమీపిస్తుండగా అంది వసుధ."నాకిప్పుడు అలవాటై పోయింది మేడమ్!భయం లేదు.  వంటరిగా వెళ్ళిపోగలను.మీకింకా శ్రమ ఇవ్వడం భావ్యం కాదుగదా!"
"మంచిదేగా.వెళ్ళగలగాలి, కానీ ఇప్పుడు కాదు. వెహికల్ కొనుక్కున్నాక అలాగే వెళుదువుగాని" కారులో కూర్చుని డోర్ వేయబోతూండగా వినిపించింది వార్డులోంచి హృదయవిదారకమైన ఏడుపు.
పేషెంటు ఎవరికో కాలం చెల్లింది.
ఒక్క క్షణం ఇద్దరూ చలనం లేనట్టు ఆగిపోయారు.
గాలికి ఊగుతున్న పొడవాటి అశోక చెట్లు, గుడ్డిగా వెలుగుతూన్న విద్యుద్దీపాలు, నిశ్శబ్దంగా వున్న వాతావరణం ....ఆ నిశబ్దాన్నిచీల్చుకుంటూ గుండెల్ని మెలితిప్పేలా ఏడుపు....
"మేల్ వార్డులో ఒకతను సాయంత్రం సీరియస్ గా వున్నాడు. డాక్టర్ ఛటర్జీ కేసు. బహుశా అతనే
పోయుంటాడు" కొంచెం భయం ద్వనిస్తూన్న స్వరంతో చెప్పింది వసుధ.
ఆ అమ్మాయి మొహంలో కనిపిస్తోన్న భయం చూసిన అనూషకి జాలేసింది.ఇంకా మృత్యువును చూడటానికి అలవాటుపడని కొత్త డాక్టర్. చిన్నపిల్ల....ఇలాంటివి తన అనుభవంలో ఎన్నో...నెమ్మదిగా ఆమె భుజం మీద చేయి వేసి "టేకిటీజీ"అంది.
వసుధ డోర్ వేసింది.కారు స్టార్ట్ చేసింది అనూష.
చావుపుట్టుకలు ఎంత సహజమైనా బతుకుకోసం పడే తపన,ఆరాటం ముందు మరణాన్ని తేలికగా జీర్ణించుకోగల ధైర్యం ఎంతమందికుంటుంది?
కారు మెయిన్ రోడ్ మీదకి వచ్చింది.సిద్దెంబర్ బజార్ మీదుగా నాంపల్లివైపు తిరిగింది.
ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. ఎవరి ఆలోచనలలో వాళ్ళున్నారు.
అనూష వృత్తిపట్ల చాలా అంకితభావం గల డాక్టరు. డబ్బుకోసం మానవత్వాన్ని కూడా మర్చిపోయి, పవిత్రమైన వైద్యవృత్తిని కమర్షియల్ చేస్తున్న డాక్టర్లున్న ప్రస్తుత సమాజంలో అనూషలాంటివాళ్ళు చాలా అరుదు.
ఉస్మానియా మెడికల్ కాలేజీలో విజిటింగ్ ఫేకల్టీగా,హాస్పిటల్ లో మంచి కార్డియాలజీస్టుగా అటు విద్యార్దుల దగ్గరా,ఇటు సీనియర్స్ డాక్టర్స్ దగ్గరా మంచి పేరు సంపాదించింది.
రోగుల సంగతయితే చెప్పక్కర్లేదు. ఆమె ఒక దేవత. స్టూడెంట్స్ క్కూడా వైద్యవృత్తిలో వున్న పవిత్రతని గురించి వివరిస్తూ' డాక్టర్లు వృత్తిపట్ల అంకితభావం కలిగివుండాలని చెప్తుంది.
అందుకే ఆమె అంటే అప్పుడే వైద్యవృత్తిలోకి వస్తున్నడాక్టర్లకి ఎంతో గౌరవం, అభిమానం. అప్పుడప్పుడే వికసిస్తున్న మొగ్గలు కాబట్టి వాళ్ళనింకా డబ్బు అనే వైరస్ అంటలేదు.
అలాంటివాళ్ళ కోవకు చెందిందే డాక్టరు వసుధ. చిన్నప్పటినుంచీ తెలిసినవాళ్ళు అమ్మాయి వసుధ.అనూష గైడెన్స్ లోనే రెండేళ్ళక్రితం హౌస్ సర్జన్సీ పూర్తిచేసింది.
ఆ హాస్పిటల్లో ఉద్యోగం లభించి ఐదారు నెలలవుతోంది. తల్లీ, తండ్రీలేని వసుధ పెదనాన్న దగ్గర వుండి చదువుకుంది. అతను చాదస్తుడవడంచేత వసుధని నైట్ డ్యూటీలకి పంపించడానికి ఇష్టపడలేదు.
ఉద్యోగం అన్నాక ఏ డ్యూటీ అయినా చేయాలి. 'వసుధకి కాస్త అలవాటు అయ్యేదాకా నేనొచ్చి దిగబెడతాను' అని అనూష ప్రామిస్ చేయడంతో ఆయన కొద్దిగా సంతృప్తిపడ్డాడు.
ధైర్యం, సాహసం ఊపిరిగా బతికే అనూష తోడు వసుధకి  ఎంతో స్పూర్తినిస్తుంది.
అనూష తన బాధ్యతనీ,కర్తవ్యాన్నీ ఎట్టి పరిస్టితుల్లోనూ మర్చి పోదు తిండి తినడం అయినా మర్చిపోతుంది కానీ ....బాధ్యత మరచిపోదు. ఒకరికి సాయం చేయడం కూడా తన బాధ్యత అనే అనుకుంటుంది.ఎంతరాత్రి అయినా తన పేషెంట్స్ అందరినీ పేరుపేరునా పలకరించిగానీ ఇంటికి వెళ్ళదు.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS