Previous Page
తెల్ల గులాబి  పేజి 34

    ఒంటరిగా ఉండటం శాపం. పగవాళ్ళు కూడా ఎప్పుడూ ఒంటరిగా ఉండకూడదు. రేపు తనకి ఏదన్నా అయితే, ఈ నాలుగు గోడల మధ్య, ఆ బంధించబడిన తలుపుల వెనక తనకి ఏ హార్ట్ ఎటాక్ వస్తే....తను చచ్చిపోతే తలుపు తీసేవాళ్ళు కూడా ఎవరూ లేని ఈ బతుకు బతుకేనా అనిపిస్తోంది.
    శిరీష కి ఏడుపోచ్చేసింది.... వెక్కి వెక్కి ఏడవసాగింది...
    ఆదిత్య తిరిగిన ఆ పరిసరాలన్నీ ఆమెని వెక్కిరిస్తున్నట్టుగా అనిపిస్తోంది.
    అకస్మాత్తుగా కాలింగ్ బెల్ మోగింది... ఆమె కళ్ళ నీళ్ళతో ఆశగా తలుపు వైపు చూసింది... వివేక్ వచ్చి ఉంటాడా ? ఈ మధ్య వారం అయింది వచ్చి... రోజూ ఫోన్ మాత్రం చేస్తున్నాడు... ఆమె కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ ఆశగా వెళ్ళి తలుపు తీసింది...
    ఎదురుగా నిలబడిన వ్యక్తిని చూడగానే ఆమెకి నోటమాట రాలేదు....నిశ్చేష్టురాలయింది.
    ఎవరు? ఎవరితను....? ఆరడుగుల పొడుగు, నిండుగా సంతరించుకున్న మగతనం, అందమైన ముఖ వర్చస్సు...తొణికిసలాడుతున్న వ్యక్తిత్వం ఎవరు? "అదీ....!" అస్పష్టంగా పలికింది.
    "అమ్మా.....!" ఆర్తిగా పిలిచాడు ఆదిత్య.
    వణికిపోతూ నాలుగడుగులు వేసింది శిరీష.. పడిపోబోతున్న ఆమెని చటుక్కున పట్టుకున్నాడు ఆదిత్య.
    అలాగే ఒడిసి పట్టుకుని లోపలికి వచ్చి తలతిప్పి వెనక్కు చూసి "రా అమ్మమ్మా!" అన్నాడు.
    అప్పటిదాకా ఆదిత్య వెనకాల, కొంచెం ఎడంగా నిలబడిన లలితాంబ చటుక్కున ముందుకు వచ్చింది. ఆమె చేతిలో ముద్దులు మూటగడుతున్న బంగారు బొమ్మలాంటి నాలుగేళ్ల పాప.
    శిరీష తేలిపోతున్న కళ్ళతో చూసింది.... అస్పష్టంగా కనిపించారు ముగ్గురూ.
    "ఆ....అమ్మా....!" అంటూ ఆదిత్య చేతుల్లో తల వాల్చేసింది.
    'అమ్మా....!' ఆదిత్య ఖంగారుగా ఆవిడ్ని కుదుపుతూ అలాగే తీసుకొచ్చి సోఫాలో పడుకోబెట్టాడు.... లలితాంబ పాపని కిందికి దించి, సోఫాలో ఓ పక్కకి కూర్చుని శిరీష మొహం రెండు చేతుల్లోకి తీసుకుని "శిరీ....శిరీ " అని ఖంగారుగా పిలవసాగింది. 
    ఆదిత్య డైనింగ్ హల్లో ఉన్న ఫ్రేజ్ తెరిచి , మంచినీళ్ళ బాటిల్ తీసుకొచ్చి చల్లటి నీళ్ళు మొహం మీద చిలకరించాడు.
    అతి ప్రయత్నం మీద కొద్దిగా కళ్ళు తెరిచింది శిరీష....ఎదురుగా కన్నీళ్ళ తో కనిపించిన తల్లిని చూడగానే ఆమెకు దుఃఖం ఆగలేదు.
    శిరీష తల ఒడిలో పెట్టుకుని జుట్టు నిమురుతూ వెక్కిళ్ళు పెడుతున్న కూతుర్ని ఓదార్చడం మర్చిపోయిన దానిలా నిశ్చేతనంగా కూర్చుంది లలితాంబ. ఆవిడ కళ్ళు కూడా వర్షిస్తున్నాయి.
    పాప బిక్కచచ్చి నిలబడిపోయింది.
    ఆదిత్య కళ్ళు తుడుచుకుని పాప నెత్తుకుని శిరీష దగ్గరగా వచ్చాడు.
    "అమ్మా....! ఇలా చూడు....ఇది నాకూతురు....నీ మనవరాలు...." అన్నాడు.
    శిరీష కన్నీళ్ళ తో తలెత్తి పాప వైపు చూసింది.
    అంతే ఆమె ఉద్వేగంగా , ఆర్తిగా చేతులు చాచి పాపని దగ్గరకు లాక్కుని గుండెలకి హత్తుకుంది.
    అమ్మమ్మ, అమ్మ, కూతురు.... ముగ్గురినీ అంత దగ్గరగా , అంత ఆర్తిగా , అంత ఆత్మీయంగా చూసిన ఆదిత్య కళ్ళు నీటితో నిండిపోయాయి.
    సాధించావు అదీ అనుకున్నాడు....
    "నేను కాఫీ కలుపుకుని తెస్తాను...' అంటూ వంటగది లోకి వెళ్ళాడు...కాస్సేపు అక్కడే వెక్కి వెక్కి ఏడిచి కాఫీ కలుపుకుని తెచ్చాడు.
    అతనిచ్చిన కాఫీ అమృతంలా అందుకుంది శిరీష...
    "ఇన్నాళ్ళూ ఎక్కడున్నావురా? వీడు నీకెలా కలిశాడమ్మా" అడిగింది లలితాంబని.
    ఆదిత్య తన దగ్గరకు వచ్చిన రోజు నుంచీ ఈరోజు దాకా జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పింది లలితాంబ.
    "నేను చేయలేని పనివాడు చేశాడు. ఇంతకాలం నా పరువు, మర్యాదలను మంట గలిపినవాడు పుట్టాడని బాధపడ్డానమ్మా....ఇప్పుడు నా కొడుకు నీతికి, ధర్మానికి కట్టుబడి బతికి, పట్టుదలతో తను కోరుకున్నది సాధించాడని గర్వంగా ఉంది..."
    "నిజం తల్లీ ...ప్రేమ పేరుతొ ఆడపిల్లల్ని వంచించి, లొంగదీసుకుని గర్బిణిని చేసి పారిపోతున్న వాళ్ళు ప్రేమ, ప్రేమ అంటూ వెంటపడి , వేధించి , కాదన్నందుకు యాసిడ్ పోసి తగలబెట్టేవాళ్ళు ఆడపిల్లని కామదృష్టి తో తప్ప మరోలా చూడలేని కాముకులు ఇలాంటి ఎందరో దుర్మార్గులున్న ఆ సమాజంలో నీ కొడుకు లాంటి వాళ్ళు నూటికి ఒక్కళ్ళున్నా చాలు...చాలు...." ఉద్వేగంగా అంది లలితాంబ.
    శిరీష కళ్ళల్లో ఆదిత్య పట్ల అంతులేని అభిమానం వెల్లివిరిసింది....మెరిసే కళ్ళతో ఆదిత్య ను చూసి "అయామ్ ప్రౌడ్ ఆఫ్ యూ అదీ...." అంది.
    ఆదిత్య గర్వంగా నవ్వాడు.
    "అంతా బాగుంది....ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడుందే?" అడిగింది లలితాంబ.
    "నాకు తెలియదమ్మా..భాను చాలా మొండిది.... మూర్ఖురాలు... అనుకున్నది సాధించి తీరుతుంది.... ఖచ్చితంగా ఆ అమ్మాయిని అమెరికా పంపించి ఉంటుందని పిస్తోంది" అంది...
    "ఆదిత్య మొహం మాన్లమైంది. కానీ అది కాస్సేపే...." వెంటనే అన్నాడు....
    "వెళ్ళినా ప్రఖ్య మాత్రం తప్పకుండా వెనక్కి వస్తుందమ్మా..." అన్నాడు.
    "వాళ్ళ మనస్తత్వాలు అవికావురా" అంది శిరీష.
    "కానీ వస్తుందమ్మా.... తప్పకుండా వస్తుంది... నాకా నమ్మకం ఉంది ....అన్నాడు."
    "గాడ్ బ్లెస్ యూ" అంది శిరీష..."ఇంతకీ పాప పేరేంటిరా" అడిగింది పాపను ముద్దు పెట్టుకుంటూ.
    "ఇంకా పెట్ట లేదమ్మా....ఆరోజు సిస్టర్ నా చేతికిస్తూ నీ పాప వైట్ రోజ్ అంది...అదే పేరుతొ పిలుస్తాను... తెల్లగులాబీ అని..."
    "తెల్ల గులాబీ ... తెల్లగులాబీ ...బాగుందిరా ...ఈ చిట్టి తల్లి నన్ను నా తల్లిని కలిపింది. నాకింతకన్నా ఏం కావాలిరా అదీ....నాన్నా.... ఇకనుంచీ నన్ను వదిలి పోవుకదూ...." పక్కన కూర్చున్న అదిత్యని దగ్గరకు తీసుకుంటూ అడిగింది శిరీష.
    "వెళ్ళనమ్మా ....నాకు కుటుంబం కావాలి... పెద్ద కుటుంబం కావాలి... అమ్మ, నాన్న అమ్మమ్మ, నానమ్మ, నా భార్య, పిల్లలు, వాళ్ళ పిల్లలు ...పెద్ద కుటుంబం.... వసుధైక కుటుంబం కావాలి.... ఆ కుటుంబంలో ఎవరికీ ఎప్పుడూ ఇన్ సెక్యూరిటీ ఉండదు... ఎప్పుడూ ఎవరూ ఒంటరితనంతో బాధపడరు.... దెబ్బలాటలు, మనస్పర్ధలు, అలకలు, కోపాలు ఎన్ని వచ్చినా కుటుంబంలోనే సమసిపోతాయి.... చివరికి ఏకమయేది కుటుంబమే.... అందుకే నాకు కుటుంబం కావాలి... నాకు సింగిల్ ఫ్యామిలీ వద్దు.... కాకపొతే నేను చెప్పిన బంధువుల్లో కొందరు నాకు లేకపోవచ్చు ...కానీ, నా పిల్లలకి మాత్రం అందరూ ఉంటారు... నా నమ్మకం నన్ను గెలిపిస్తుంది...నా కూతురికి తప్పకుండా అమ్మ, అమ్మమ్మ కూడా ఉంటారు..." స్థిరంగా, గంబీరంగా, ఆత్మవిశ్వాసంతో అన్నాడు ఆదిత్య...
    "దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నాన్నా!" అంది లలితాంబ.
    నలుగురూ ఒకళ్ళ నొకళ్ళు స్పృశించుకుంటూ ఆ స్పర్శ లోని మాధుర్యాన్ని అనుభవిస్తూ పరవశించి పోతున్న ఆ నిమిషం లోనే కాలిఫోర్నియా యూనివర్శిటీ లో అనుకోకుండా ఎదురుపడిన ఆదిత్య స్నేహితుడు రాకేష్ ప్రఖ్య కి ఎదురయ్యాడు.
    "నువ్విక్కడికి ఎప్పుడు వచ్చావు? ఆశ్చర్యంగా అడిగింది ప్రఖ్య."
    "నేనూ అదే అడుగుతున్నాను.... హౌ కమ్ యూ ఆర్ హియర్ " అన్నాడు రాకేష్.
    "ఇది నా ఎయిమ్ ....అమెరికాలో ఎం ఎస్ చేయాడానికి కదా కష్టపడ్డాను. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు....' అంది ప్రఖ్య...
    "కానీ నీకోసం అక్కడ ఆదిత్య ఎదురు చూస్తున్నాడు .... నువ్విక్కడికి వస్తున్నట్టు వాడికి తెలుసా.?" అడిగాడు రాకేష్.
    'ఆదిత్యా?" నొసలు చిట్లించింది ప్రఖ్య..."నేనసలు అతని గురించి ఆలోచించడం మానేసి చాలా కాలమైంది."
    "అదేంటి?" ఆశ్చర్యంగా అదిగాడు రాకేష్..."మీ ఇద్దరూ లవర్స్ కదా..."
    "నాన్సెన్స్." విసురుగా అంది ప్రఖ్య...."లవ్ గివ్ ఏం లేదు."
    "మరి...పాప?"
    "జస్ట్ యాక్సిడెంట్!"
    "అంటే నువ్వు ఆదిత్యను మ్యారేజ్ చేసుకోవా?"
    "అసలా ఆలోచనే లేదు....ఏదో టీనేజ్ లో పరస్పరం అట్రాక్ట్ అయాం...అంతే..."
    "కానీ, పాపనేం చేస్తావు?"
    "ఏమో! భుజాలేగరేసింది... అయినా తను పెంచుకుంటానన్నాడు కదా.... పెంచుకోడం లేదా?"
    రాకేష్ చిరాగ్గా చూశాడు...
    "వాడు పెంచుకుంటున్నాడో , ఏం చేస్తున్నాడో కానీ, నీ కూతురి పట్ల నీకేం రెస్పాన్సిబిలిటీ లేదా? నాకు చాలా వింతగా ఉంది ప్రఖ్యా... బీయింగ్ ఏ ఉమన్ అసలు నువ్వు పాప విషయంలో ఇంత నేగ్లిజేన్స్ చూపించడం రియల్లీ వండర్..."
    "రాకేష్....నేను కనాలని పాపని కనలేదు.... అడిత్యని నేను ప్రేమించడం, అతను లేకపోతె బతకలేను అనుకోడం లాంటివి కూడా ఏం జరగలేదు... మా ఇద్దరి స్నేహం అలా సాగింది.... అయినా తనేప్రోవోక్ చేశాడు.... నేనూ టీనేజ్ లో ఉన్నాను.... అంతే దాని కోసం నా కెరియర్ పాడు చేసుకుని కమిట్ అయి ఉండడం రెడిక్యులస్..."
    రాకేష్ కళ్ళల్లో రెప్పపాటు కాలం ఆమె పట్ల ఏవగింపు కలిగింది... ఈమె ఏం ఆడది అనుకున్నాడు.... స్వరంలో కొంచెం తీవ్రత పలికిస్తూ అన్నాడు....
    "ఏనాటికైనా పాపకోసం నువ్వు ఆదిత్య తో కలిసి బతుకుతావనే మేమంతా అనుకున్నాం.... తనూ అదే నమ్మకంతో ఎదురు చూస్తున్నాడు.... నువ్వు నిజంగా ఆడదాని వైతే వెళ్ళాలి కూడా..."
    "మేమంతా అంటే...."
    "అల్ ఫ్రెండ్స్...."భుజలేగరేశాడు రాకేష్.
    "ఎందుకలా?" ఆశ్చర్యంగా అడిగింది ప్రఖ్య.
    "ఎందుకేంటి? యూ హేవ్ డాటర్.... డాటర్ ని కూడా వదులుకుని నువ్వు సాధించేదేం ఉంటుందని అనుకుంటున్నావు?"
    "యాక్సిడెంటల్ గా జరిగిందో, జరగాలనే జరిగిందో ఒక ఇన్సిడెంట్ జరిగింది....దాని రిజల్ట్ పాప.... పాపని తల్లి లేనిదానిలా వదలడం నీకెలా అనిపిస్తుందో కానీ, నాకు మాత్రం... ఆఫ్ కోర్స్ నాకే కాదు మన ఇండియన్ సొసైటీ ;లో ఎవరికీ కూడా ఇది కరెక్ట్ అనిపించదు....నీకు కరెక్ట్ అనిపించినా అది ఎక్స్ క్యూజబుల్ కాదు...కాబట్టి నువ్వు వెంటనే ఆదిత్య కి మెయిల్ పంపించు.... నీ ఎం.ఎస్ అవగానే వెళ్ళి పోవడమో, ఆదిత్య నే ఇక్కడికి పాపతో సహా పిలిపించుకోవడమో ఏదో ఒకటి చేస్తేమంచిది...."
    ప్రఖ్య తల అడ్డంగా ఆడిస్తూ స్థిరంగా అంది.... "ఓ...నో..నా వల్ల కాదు... అయినా నాకిప్పుడు ఆదిత్య మీద ఇంట్రస్ట్ ఏం లేదు....నేనిప్పుడు ఫ్యామిలీ లైఫ్ లో పడితే నా కెరియర్ ఏం కావాలి?
    "మళ్ళీ కెరియర్ అంటావేమిటి ప్రఖ్యా? మీ మదర్ నీ కెరియర్ కోసం ఏం చేసిందో నీకు తెలుసు. మరి మీ మదర్ కి నీమీద ఉన్న రెస్పాన్సీబిలిటీ నీకు నీ పాప పట్ల ఉండదా? నీ క్యారెక్టర్ ఏంటో నాకేం అర్ధం కావడం లేదు. నువ్విప్పుడు గర్ల్ కాదు మదర్....ఒక మదర్ వి.... బిహేవ్ లైక్ ఏ మదర్. ఎనీ వే ....నీకు సెంటిమెంట్స్ లేవనీ ఇప్పుడే అర్ధమైంది.... ఇదీ ఇకందుకు మంచిదే అల్ ద బెస్ట్" చేయి చాచాడు రాకేష్.
    అతని మాటలు గురి చూసి వేసిన బాణం లా తగలాల్సిన చోట తగలడంతో మ్రాన్పడి పోయి నిలబడ్డ ప్రఖ్య అప్రయత్నంగా షేక్ హ్యాండ్ ఇచ్చింది.
    "నీకేదన్నా హెల్ప్ కావాలంటే కాల్ మీ.... ఇదిగో నా నెంబర్....' చిన్న స్లిప్ మీద సెల్ నెంబర్ వేసి ఆమెకిచ్చి తనకోసం ఎదురు చూస్తున్న స్నేహితుడితో వెళ్ళిపోయాడు.
    ప్రఖ్య అతని మాటలు పదే, పదే తల్చుకుంటూ ఉన్న చోటే శిలలా నిలబడిపోయింది.
    "నువ్విప్పుడు గర్ల్ కాదు... మదర్..మదర్...మదర్... మదర్.... బిహేవ్ లైక్ ఎ మదర్....' రాకేష్ మాటలు చెవుల్లో గింగిర్లెత్తుతోంటే అచేతనంగా అతను వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయింది.

                                        -------అయిపోయింది --------


 Previous Page

WRITERS
PUBLICATIONS