ఆదిత్య.
"ఎక్స్ క్యూజ్ మీ....!" ఆదిత్య స్టైలిష్ గా అంటూ ఆవిడని తప్పుకుని లోపలికి వచ్చేశాడు.
ఆదిత్య స్వరం వినగానే ప్రఖ్య లో చలనం వచ్చినట్టు అయింది. మొహం విప్పారింది. "అదీ!' అంటూ రెండు అడుగులు ముందుకేసిందల్లా భానుప్రియ హుంకరింపుతో ఆగిపోయింది.
"అరేయ్....ఎక్కడికిరా , బైటకి నడువు....ఐసే గెట్ అవుట్...." భానుప్రియ విసురుగా వచ్చి ఆదిత్య జబ్బ పట్టుకుని డోర్ దాకా తోసుకుంటూ వచ్చింది.
ఆదిత్య విసురుగా ఆవిడని విడిపించుకుని ఒక ఉదుటున ప్రఖ్య దగ్గరగా వచ్చి "ఎక్కడికి వెళ్తున్నావు ప్రఖ్యా....!" అడిగాడు సోఫా దగ్గరగా పెట్టిన సూట్ కేసు, బ్యాగు చూస్తూ.
ప్రఖ్య బెదురుగా తల్లి వైపు చూసి మొహం తిప్పుకుంది. భయంతో ఆమె గుండె దడ దడలాడుతోంది. అయినా ఆదిత్య ను చూసిన ఆనందంతో మాత్రం కళ్ళు మెరిసిపోతున్నాయి.
అది గమనించిన భానుప్రియ మండిపడుతూ అరిచింది. "ఎవర్రా నువ్వు?" మర్యాదగా బైటకి వెడతావా?" పోలీసులను పిలవనా?"
ఆదిత్య నిదానంగా ఆవిడా వైపు తిరిగి అన్నాడు "పిలవండి. తప్పకుండా పిలవాలి. నా భార్యని మీరు నా నుంచి విడదీస్తున్నారని నేనే కంప్లైట్ చేయాలను కుంటున్నాను. నేను స్టేషన్ కి వెళ్ళే బదులు వాళ్ళే ఇక్కడికి వస్తే ఇంకా బాగుంటుంది కదా!....పిలవండి."
నిశ్చేష్టురాలింది భాను ప్రియ...ఎంత ధైర్యం వీడికి? నిన్న కాక మొన్న తన కళ్ళ ముందు ఎదిగి తన తోటే సవాల్ విసురుతాడా? భార్య అంటాడా తన కూతుర్ని నిప్పులు కురిపిస్తూ అంది...
"యూ బాస్టర్డ్.... ఏంట్రా కూస్తున్నావూ? చెప్పు తీసుక్కోడతా....వెళ్ళు ముందు." విసురుగా వచ్చి ఆదిత్య షర్టు పట్టుకుని లాగింది...
ఆదిత్య అంతకన్నా విసురుగా ఆవిడ చేయి విసిరికొట్టి అన్నాడు... "మర్యాదగా ప్రవర్తించండి.. ఇంటి అల్లుడిని ఇలా అవమానిస్తారా?"
"ఎవడురా అల్లుడు? నీ బతుక్కి నా అల్లుడివయే అర్హత కూడా ఉందా?" ఎక్కువగా మాట్లాడావంటే పళ్ళు రాలగోడతాను...."
"నాకూ వచ్చండి ...మీరేం చేయగలరో అవన్నీ నేనూచేయగలను.... కానీ చేయను. ఎందుకంటె మీతో నాకనవసరం...నాక్కావలసింది నాభార్య.... అంటూ ప్రఖ్య దగ్గరగా నడుస్తూ ....సీరియస్ గా అడిగాడు....ప్రఖ్యా....! నువ్వు నాతొ వస్తున్నావా?"
ప్రఖ్య వణికిపోతూ నిలబడింది.
"ఎందుకలా వణికిపోతున్నావు. ప్రఖ్యా మనం పెళ్ళి చేసుకోకపోయినా మనకో పాప ఉంది. అది మన ప్రేమ గుర్తు. పాప నా దగ్గర ఉంది. ఒక తల్లిగా పాపని ఒదులు కొని వెళ్ళిపోవడం రాక్షసం. మీ అమ్మకేలాగా మొగుడు, ఓ కుటుంబమూ లేదు... ఒద్దు కూడా . నీక్కూడా ఫ్యామిలీ అనేది కావాలా, వద్దా?"
"ఫ్యామిలీ....?" ప్రఖ్య కి ఒక్కసారిగా ఒళ్ళు గగుర్పొడిచినట్టు అయింది. అందులోనూ ఆదిత్య పదే, పదే తనని భార్య అంటూ సంబోధించడం ఆమెకి వింటుంటే మధురంగా అనిపిస్తోంది. తనకో పాప ఉంది. అవునూ పాప...పాప ....అది దగ్గర ...ఎలా? ఎలా? ఆ విషయం స్పురణ కి రావడంతో అయోమయంగా ఆదిత్య వైపు, తల్లి వైపు చూసింది.
భానుప్రియ కళ్ళు నిప్పులు చేరుగుతున్నాయి. మొహం ఎర్రగా జేవురించి ఉంది. పగబట్టిన పులిలా గర్జించింది. ఆవిడ చూపులు ఆదిత్య వైపు తిరిగి తీక్షణంగా అతడినే చూస్తున్నాయి. ఏ క్షణాన అయినా మీదపడి కరిచేలాగా వుంది.
"రాస్కెల్, పాపని కిడ్నాప్ చేసి, నన్ను నా కూతుర్ని బ్లాక్ మెయిల్ చేయాలను కుంతున్నావా? నీ ఆటలు నా దగ్గర సాగవు. నాకు తెలుసు నువ్వే కిడ్నాప్ చేశావని, నిన్నసలు ఇలా వదలకూడదు. మర్యాదగా ఆ పాపని తెచ్చివ్వు." గట్టిగా అరిచింది.
"ఏం చేసుకుంటారండి పాపని? మీకు పిల్లల్ని పెంచే టైం ఉందా? మీ కూతుర్ని పెంచనిస్తారా?" తీసికెళ్ళి ఎవరికో ఇస్తారు...అమ్ముకుంటారు."
"నోర్మూయ్ , ఏంట్రా వాగుతున్నావు?" చెయ్యెత్తింది భానుప్రియ.
"కరెక్ట్ గా మాట్లాడుతున్నాను... మీకు పిల్లలు , మొగుడు ఫ్యామిలీ లైఫ్, ఏమీ వద్దు....స్వేచ్చ కావాలి.... మా అమ్మకీ అంతే...స్వేచ్చ కావాలి... మీ ఇద్దరూ హాయిగా స్వేచ్చగా బతకండి. నేనూ నా భార్య మా పాప ఆనందంగా బతుకుతాం. మీతో మాకెలాంటి సంబంధం వద్దు."
ప్రఖ్య నివ్వెరపోయి చూస్తోంది. నిలువెల్లా వణికిపోతోంది. ఎప్పుడూ ధైర్యంగా ఉండే ప్రఖ్య ఆ క్షణంలో తప్పు చేసిన ఆత్మన్యూనతతో తల్లికి ఎదురు చెప్పలేక పోతోంది. అలా అని ఆదిత్య ను తల్లిలా అసహ్యిన్చుకోడం కానీ, అతని మీద కోపం తెచ్చుకోడం కానీ చేయలేకపోతోంది. ఆదిత్య మాటలు ఆమెకి సబబుగా అనిపిస్తున్నాయి. కానీ, వాటిని అంగీకరించే ఆత్మ స్తయిర్యం మాత్రం ఆమెకి కలగడం లేదు.
ఇప్పుడు తను ఆదిత్య తో వెళ్ళి అక్కడ, ఎలా బతకాలి? పాపని తనెలా పెంచగలదు. తనకేం చేతకాదు. పాపని ఎట్టుకోడం కూడా రాదు. అలాంటప్పుడు ఆదిత్య అన్నట్టు ఒక ఫ్యామిలీ ఏర్పాటు చేసుకునే శక్తి ఎట్లా వస్తుంది. ఆమెకేం అర్ధం కావడంలేదు.
ఆదిత్య మళ్ళీ అన్నాడు. "ప్రఖ్యా!" నీకు తెలుసు మనిద్దరం ఒంటరితనంతో ఎంత బాధ పడ్డామో... మన పాపని అలా చేయొద్దు. నా మాట విని నాతొ వచ్చేయ్... ఇద్దరం కలిసి చదువు కుందాం.... మన ఫ్యూచర్ డిజైన్ చేసుకుందాం.... మీ అమ్మని, మా అమ్మని వదిలేద్దాం. మన జీవితాలు మనం ఏర్పరచుకుందాం. మన పాపని పెంచుకుందాం. ఇంకా పిల్లల్ని కందాం. ప్లీజ్ ప్రఖ్యా నా మాట విను నాతొ రా." అతని స్వరంలో ప్రాదేయత , నడక లో వేగం పెరిగి చటుక్కున ప్రఖ్య దగ్గరకు నడిచి ఆమె చేయి పట్టుకున్నాడు.
మెరుపులా వచ్చిన భానుప్రియ ఆదిత్య చెంప మీద చెళ్ళున చరిచి ప్రఖ్యని అతని చేతుల్నులించి విడిపించి "ఫోరా , పో దరిద్రుడా....! పోతావా? మెడపట్టి గెంటనా?" అంది.
అనుకోని ఆ సంఘటన కి నివ్వెరపోయిన ఆదిత్య కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి.
"చెంప మీద కుడిచేత్తో రుద్దుకుంటూ ఆవేశంగా అన్నాడు. మిస్ భానుప్రియ గారూ. మీరు మీ అమ్మాయిని పెళ్ళి కాకుండా కన్నారో, మొగుడ్ని వదిలేసి తిరుగుతున్నారో కానీ, ఆ అమ్మాయికి ఎలాగా తండ్రి ప్రేమ లేకుండా పెంచారు. మీకసలు సెంటిమెంట్స్, అనుబంధాలు లేవు. కనీసం మీ కూతుర్ననా సరిగ్గా పెంచండి. నాతొ కలిసి పాపని కన్న ఈమెకి పెళ్ళి అవుతుందనే ఆశిస్తున్నారా? జరగదు. ఎన్నటికీ జరుగదు. ఈమె భర్తను ఏనాటి కైనా నేనే... ఈ అవమానం గుర్తుంచుకుంటాను... ఇంతకింత పగ తీర్చుకుంటాను..." అంటూ ప్రఖ్య వైపు తిరిగి అన్నాడు...
"ప్రఖ్యా ఇండివిడ్యువాలిటీ గురించి , స్వేచ్చ గురించి కబుర్లు చెప్పడం కాదు. పరిస్తితులను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోడం చాలా అవసరం. మీ అమ్మ మాటలు వింటే నీ బతుకు నాశనమే నామాట విను.
నేను నీకోసం ఎదురు చూస్తుంటాను. నువ్వు రా... మీ అమ్మని ఎదిరించి వస్తావో, బతిమాలి వస్తావో నీ ఇష్టం... బట్ ఒక్కటి చెప్తున్నాను ....ఒంటరి బతుకు బతికేకన్నాచావడం బెటర్....ఒంటరి బతుకు బతుకే కాదు. పదిమందిలో బతికితేనే బతుక్కి అర్ధం ఉంటుంది. మనం చనిపోయిన తర్వాత కాసిని కన్నీళ్లు కార్చడానికి ఎవరన్నా వుంటారు...." ఈ మాటలనేసి గిరుక్కున వెనక్కి తిరిగి డోర్ తీసుకుని వెళ్ళిపోయాడు . అతను ఆవేశంతో తిరిగి మూసిన డోర్ గట్టిగా శబ్దం చేస్తూ గోడకి కొట్టుకొని ఆగిపోయింది.
ప్రఖ్య కి దుఃఖం ముంచుకొచ్చింది.... సోఫాలో కూలబడి పోయి వెక్కి వెక్కి ఏడవసాగింది.
అప్పటి వరకూ స్థాణువై నిలబడిన భానుప్రియ ప్రఖ్య వెక్కిళ్ళ శబ్దం విని ఆమె వైపు చూసింది. విసురుగా ఆమె దగ్గరకి నడిచి అరిచింది.
"ఎందుకే ఏడుస్తున్నావు? వాడేదో పిచ్చి కూతలు కూస్తే ఏడవడానికి సిగ్గు లేదూ. చూడూ నేనిప్పుడే చెబ్తున్నా నా కూతురు డేర్ డెవిల్ అనిపించుకోవాలి . చెత్త ప్రలోభాలకి నీచ, నికృష్ణ వాగుడికీ చలించిపోయి , ఏడుస్తూ కూర్చోడం అంటే నాకసహ్యం. ఇంకెప్పుడూ ఏడవకు లే లేచి బయల్దేరు... ఊ ...వెళ్ళు...మొహం కడుక్కు రా..."
ప్రఖ్య ఆవిడ స్వరం లోని తీక్షణతకి బెదిరిపోతూ లేచి వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళి పోయింది.
భానుప్రియ కిప్పుడు కొద్దిగా భయం కలగసాగింది. తను ఊహించింది నిజమే. పాపని వీడు కిడ్నాప్ చేశాడు. చేసి ఏం చేస్తాడు? బ్లాక్ మెయిల్ చేస్తాడా? పోలీస్ కంప్లయింట్ ఇవ్వడం మంచిదా? కాదా? ఇస్తే తప్పకుండా దాని వెనక అనేక ప్రశ్నలు, సమస్యలు తప్పవు. ఈ గోలలో ప్రఖ్య చదువు దెబ్బతినడం ఖాయం. అంతకన్నా వాడి నుంచి ప్రఖ్యని దూరంగా పంపించేయడం మంచిది. అలా అనుకున్నాక ఆమెకు కొంచెం శాంతిగా అనిపించింది.
ప్రఖ్య మొహం కడుక్కుని వచ్చి, కింద పెట్టిన సూట్ కేస్ చేతిలోకి తీసుకుంది.
కాలగర్భం లో ఏడాది గిర్రున తిరిగిపోయింది.
ఈ ఏడాది నుంచీ ఆదిత్య శిరీష కి దూరంగా ఒక గది తీసుకుని ఉంటున్నాడు. కాలేజీ అయిపోగానే రెండు గంటల సేపు ఒక నెట్ కేఫ్ లో పని చేస్తున్నాడు. నెలకి అయిదారు వేలు వస్తోంది.
ఇంకో రెండు గంటలు టెన్త్ క్లాస్ పిల్లలకి నలుగురికి ట్యూషన్ చెప్తున్నాడు. శిరీష తన పేరున సేవింగ్స్ ఎకౌంట్స్ లో వేసిన డబ్బులు కాలేజీ ఫీజులకి వాడుకుంటూ చేతి ఖర్చు కింద తనే స్వయంగా సంపాదించుకుంటున్నాడు. మధ్య మధ్య నాలుగైదు సార్లు అమ్మమ్మ ఊరు వెళ్ళి పాపని చూసి వచ్చాడు.
