"ఏమో వివేక్ ....వాడిలా తయారవుతాడని నేనెన్నడూ ఊహించలేదు..."
"ఏమైందిప్పుడు....? టీనేజ్ లో నూటికి తొంబై మంది తప్పులు చేస్తారు. ఇప్పుడు సమస్య విదిపోయినట్టేగా ఎవరి దారిన వాళ్ళు మీ పిల్లల్ని తీర్చి దిద్దుకోండి నువ్వూ, భానూ...."
"పాపనేవరు కిడ్నాప్ చేసి ఉంటారు నాకెందుకో ఆదిత్య మీదే అనుమానంగా ఉంది...."
"నీదంతా బేస్ లెస్....వాడు పాపని తీసుకెళ్ళి ఏం చేసుకుంటాడు చెప్పు.... కనీసం పిల్లల్ని ఎట్టుకోడం కూడా రాదు కదా ఎలా తీసుకెళ్తాడు'....?"
"మరి ఎవరు తీసుకెళ్ళి ఉంటారు.?"
"ఎలా తెలుస్తుంది..../ పోలీసులు రంగంలోకి దూకితే తెలుస్తుంది. మరి ఆవిడేమో పోలీస్ కంప్లయింట్ ఇవ్వడానికి సంకోచిస్తోంది...."
అంతలో కాలింగ్ బెల్ మోగింది....
శిరీష భయంగా చూసింది.... ఎవరై వుంటారు....?
ఆమె భుజం మీద అభయం ఇస్తున్నట్టు తట్టి, నేను తీస్తాలే....నువ్వు పడుకో అంటూ వివేక్ లేచి వెళ్ళి తలుపు తీశాడు....
ఎదురుగా బాగా అలసిపోయిన ముఖంతో , చెదిరిన క్రాఫ్ తో నలిగిన బట్టల్తో ఆదిత్య....
వివేక్ ని చూడగానే అప్రయత్నంగా ముఖం చిట్లించి , తల వంచుకొని లోపలికి నడిచాడు ఆదిత్య.
అతని వాలకం చూస్తుంటే ఏదో అనుమానం... భయం కూడా వేసింది వివేక్ కి...
"అదీ...." పిలిచాడు.
ఆదిత్య తలతిప్పి కూడా చూడకుండా లోపలికి వెళ్ళబోతుంటే వివేక్ చటుక్కున అతని భుజం పట్టుకొని ఆపుతూ అడిగాడు.
"ఎక్కడి నుంచి వస్తున్నావు...?"
ఆదిత్య మాట్లాడలేదు.
శిరీష వివేక్ మాట విని బోర్లా పడుకున్నదల్లా చివ్వున వెల్లకిలా తిరిగి ఆదిత్య వైపు చూసింది.
తూలిపోతున్న శరీరాన్ని అదుపులో పెట్టుకుంటూ "అదీ...!" అంటూ లేచింది.
వివేక్ అసహనంగా అడిగాడు. "వినిపించడం లేదా....?'
"ఆదిత్య అసలు తనని కాదన్నట్లు నిలబడి పోయాడు. శిరీష తూలుతూ, నడుస్తూ "అదీ....! అదీ....! ఎక్కడి కెళ్ళావురా....?" అంటూ ఆదిత్య దగ్గరగా వచ్చింది.
ఎప్పుడు చూసినా నలగని బట్టల్తో, నీటుగా , అందంగా ఉండే శిరీష ని ఆ స్థితిలో చూస్తుంటే వివేక్ మనసు కరిగి పోయింది. ఆమె అలా అవడానికి కారకుడైన ఆదిత్య చలనం లేనట్టుగా, శిలలా నిలబడ్డం చూస్తుంటే ఒళ్ళు మండిపోయింది.
"నిన్నే అడుగుతున్నాను....ఎక్కడి కెళ్ళావు అదీ....' అడిగాడు వివేక్.
ఆదిత్య ఒక్కసారి తలెత్తి వాళ్ళిద్దరిని చూసి తల తిప్పుకుంటూ "ఊరి కెళ్ళాను" అన్నాడు.
"ఊరా.....!' షాకింగ్ గా ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు శిరీష, వివేక్.
"ఏ వూరు....?' విస్మయంగా అడిగింది శిరీష.
"మీకనవసరం...." విసురుగా జవాబిచ్చాడు ఆదిత్య.
శిరీష స్తంభించి పోయింది. ఆదిత్య తనని చెళ్ళున చెంప మీద కొట్టినట్టు అనిపించింది.
"ఏమన్నావు....?" దగ్గరగా వచ్చి సూటిగా ఆదిత్య కళ్ళలోకి చూస్తూ అడిగింది.
చూపులు తిప్పేసుకుని అన్నాడు. "కరెక్టే అన్నాను. ఆయనేవరు నన్నడగడానికి..."
"అదీ...." ఉద్రేకంతో వణికిపోతూ శిరీష చేయి ఎత్తబోయింది. వివేక్ ఒక్క అంగలో వచ్చి ఆమె చేయి గట్టిగా పట్టుకున్నాడు.
"నువ్వెళ్ళు నేను మాట్లాడతాను..."బలవంతంగా శిరీష ను గదిలోకి పంపించబోతుంటే.... శిరీష ఆవేశంతో వణికిపోతూ వివేక్ చేతుల్లోంచి విడిపించుకొని ఆదిత్య వైపు నడిచింది. విసురుగా ఆదిత్య చొక్కా కాలర్ పట్టుకొని లాగి చెంప మీద చెళ్ళు చెళ్ళున కొట్టసాగింది.
"శిరీ....ఏంటా ఆవేశం...?" వివేక్ బలవంతంగా శిరీష ను లాగి గదిలోకి నెట్టి తలుపేశాడు... లోపల్నుంచి శిరీష ఏడుస్తూ గట్టిగా తలుపు కొట్టసాగింది...
వివేక్ ఆదిత్య దగ్గరగా వచ్చి అతని భుజం మీద చేయేశాడు...
"నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు.... నీకు తెలుసా....?" అడిగాడు నిదానంగా.
"తప్పు చేయడానికి నేను నువ్వు కాదు...." విసురుగా అన్నాడు ఆదిత్య.
"వాట్ డూ యూ మీన్ ?" విస్మయంగా అడిగాడు వివేక్.
"యస్...!" యూ ఆర్ ఏ క్రిమినల్... నన్నూ, మా అమ్మనీ విడదీయదానికి వచ్చిన రాక్షసుడివి.. ఐ హెట్ యూ...." అరిచాడు ఆదిత్య.
వివేక్ కి ఏమీ అర్ధం కాలేదు. ఆదిత్య ఏం మాట్లాడుతున్నాడో, ఏం జరుగుతుందో అర్ధం కానట్టు బిత్తరచూపులు చూస్తూ నిలబడి పోయాడు.
"సిగ్గులేదూ....! మా అమ్మతో ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోడానికి.. నీతి లేని నువ్వు నన్ను తప్పు చేస్తున్నానని బ్లేం చేస్తావా? నీకసలు ఆ అర్హత లేదు." ఆయాస పడిపోతూ అరుస్తున్న ఆదిత్య ను ఎలా అదుపు చేయాలో అర్ధం కాలేదు వివేక్ కి. నెమ్మదిగా ఆ అబ్బాయి తనని ఎందుకు ద్వేషిస్తున్నాడో తెలుసుకోడానికి ప్రయత్నించసాగాడు. అర్ధమవుతున్న కొద్దీ సిగ్గుతో, అవమానంతో నిలువెల్లా దహించుకు పోతున్నట్టు అనిపించింది. అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఆదిత్య భుజం మీద ఉన్న అతని చేయి జారిపోయింది. కలలో నడుస్తున్నట్టుగా నెమ్మదిగా కదిలి బైటికి వెళ్ళిపోయాడు.
అతను వెళ్ళిన వైపు కసిగా చూసి విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు ఆదిత్య.
శిరీష తలుపు బాదుతూనే ఉంది.
ప్రఖ్య సూట్ కేస్ లు సర్దేసుకుని, తయారై సోఫాలో కూర్చుని టీవి చూస్తోంది. లోపల భాను చీర కట్టుకుంటోంది.
ప్రఖ్య బెంగుళూరు వెళ్ళిపోతోంది. చదువు కంటిన్యూ చేసి, ఇంక అక్కడే సెటిల్ అవడానికి భాను నిర్ణయించేసింది. త్వరలోనే తను కూడా బెంగుళూరు వెళ్ళే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టింది. ప్రఖ్య కి భవిష్యత్తు తల్చుకుంటే బెంగుళూరు వెళ్ళాలనే వుంది. కానీ, ఒక వారం క్రితం తన గర్భం నుండి బైటపడిన ఓ చిన్న ప్రాణి రూపం ఆమె కళ్ళల్లో మెదులుతోంది. జీవితంలో మొదటిసారిగా తన శరీరంలో కలుగుతున్న అనేకరకాల స్పందనలు, చిత్రమైన ప్రకంపనలు మార్పులు ప్రఖ్యకి అటు కొన్ని మధురమైన ఆలోచనలను, కొన్ని భయాలను కూడా కలగ జేస్తున్నాయి. ఆమెకి ఆదిత్య తో సమాగమానికి ముందు కలిగిన తీయని అనుభూతులన్నీ గుర్తొస్తున్నాయి. ఆ అనుభవ ఫలితం తన గర్భం అనీ, ఆ గర్భం లో నుంచి బైటికి వచ్చిన ఓ చిన్ని ప్రాణి తనకు కూతురు అవుతుందని, తాను కూడా ఒకప్పుడు అమ్మ గర్భం నుంచి అలాగే అదే విధంగా జనించిందని కొత్త విషయాలు ఎన్నడూ ఆలోచించలేని విషయాలు ఇప్పుడు ప్రతిక్షణం మనసులో మెదులుతూ అశాంతికి గురి చేస్తున్నాయి.
పాపని ఒక్కసారి చూడాలనిపిస్తోంది.
తను వెళ్తున్నట్టు ఆదిత్య కి చెప్పాలని అనిపిస్తోంది.
కానీ, అపరాకాళిలా మండిపడుతున్న భాను ని చూస్తుంటే తన కోరికల్లో ఏ ఒక్కటి కూడా వ్యక్త పరచ లేకపోతోంది. ఏదో ఒంకతో పోనీ ఒక్కసారి వెళ్ళి ఆదిత్య ను చూసి వద్దమన్నా ఇంట్లోంచి బయటకు వెళ్ళనివ్వడం లేదు.
పాపని కిడ్నాప్ చేసినవాడు ప్రఖ్యని కూడా ఎక్కడ కిడ్నాప్ చేస్తాడో అని భయపడుతోంది భాను.
పాప కిడ్నాప్ గురించి డాక్టర్ పోలీసులకి ఫిర్యాదు చేసింది. హాస్పిటల్ నుంచి ఒక పాపని ఎవరో అపహరించుకు పోయారన్న విషయం మాత్రమే చెప్పింది. కానీ ఎవరి పాప, ఏంటి అన్న సంగతి చెప్పలేదు.
ఆవిడ తన పరపతి ఉపయోగించి, అపహరించబడిన పాప గురించి ఫిర్యాదు మాత్రం చేసింది కానీ, వెతికించే ప్రయత్నాలు చేయలేదు. పోలీసులు కూడా లాంచనంగా కేసు రిజిష్టర్ చేసుకున్నారు. కానీ వాళ్ళ రికార్డులో ఏ మాత్రం కదలిక ఉండని అనేక కేసుల్లో అదీ ఒకటిగా ఉండి పోయింది. డాక్టర్ ప్రవీణ కి ఆదిత్యే పాపని తీసుకుని వెళ్ళాడని నమ్మకంగా అనిపించింది. కాబట్టే ఆవిడే కూడా ఆ విషయం సీరియస్ గా తీసుకోలేదు. తప్పకుండా ఆదిత్య వెనక్కి వస్తాడని తనని కలుస్తాడని గాడంగా విశ్వసిస్తోంది.
అలాగే పాపని కిడ్నాప్ చేసింది ఆదిత్య అన్న విషయం భాను ప్రియకి కూడా ఖచ్చితంగా తెలిసింది. ఇప్పుడు ఆమెకి ఆదిత్య ఏ క్షణం లోనైనా వచ్చి బ్లాక్ మెయిలింగ్ కి దిగుతాడని భయం పట్టుకుంది. అసలు మూడో రోజే ప్రఖ్యని పంపాలనుకుంది కానీ, ఆ పరిస్థితుల్లో ఏమి తెలియని ఆ పిల్లనలా వేరే ఊరికి పంపించడం ప్రమాదం అని ఆగింది కానీ ఏ క్షనానికా క్షణం భయం, భయంగా గడుపుతోంది. ఆఫీసుకి లీవు పెట్టేసి ప్రఖ్యతోటే ఉంటోంది. ఇవాళ ప్రఖ్యని తీసుకుని వెళ్ళి బెంగుళూరు లో దింపివస్తే కానీ, ఆవిడ ఆందోళన తగ్గదు.
పాపని పిల్లలు లేని వాళ్ళెవరో పెంపకానికి తీసుకున్నారని మాత్రం ప్రఖ్య కి చెప్పింది. మిగతా విషయాలేమీ ఆ పిల్లకి తెలియకుండా జాగ్రత్త పడింది.
కాకపోతే ప్రఖ్య మాత్రం తను మళ్ళీ బెంగుళూరు వెళ్ళాలా? వద్దా? అనే మీమాంస లో పడింది. వెడితే ఇంక జీవితంలో ఆదిత్య నీ, కలిసే అవకాశం లేదు. ఇంతకూ ముందు అడిత్యతో అనేక అనుభూతులు పంచుకున్నప్పుడు కేవలం వయసు పెట్టె గిలిగింతలు ఒత్తిడి తప్ప ప్రత్యేకంగా ఆదిత్య పట్ల ప్రేమో, అనురాగం లాంటివి కలగలేదు. కానీ ఇప్పుడు ఎందుకో ఆదిత్య కి దూరంగా వెళ్ళాలని పించడం లేదు.
పాపని కూడా ఎక్కడో వదిలి వెళ్ళాలంటే తనకి తనే ఒక శాడిస్టు లా అనిపిస్తోంది. చాలసార్లు పేపర్ల లో చదివింది. టీవిలో న్యూస్ లో చూసింది. మురుగు కాలవల్లో చెత్త కుండీల్లో, హాస్పిటల్లో ఆవరణ లో పసిపిల్లల ను వదిలి వెళ్ళిన తల్లుల గురించి వార్తలు... ఆరోజు అవి చదవలేక, వినలేకా చెవులు కళ్ళు మూసుకుని ఆ తల్లులని తిట్టుకుంది. కానీ ఇప్పుడు తనే చేస్తోందా తప్పు. తను పాపం చేస్తోంది. ఒక్కసారి ఆదిత్య తో మాట్లాడి, పాపనేవరో తీసికెళ్ళరు, ఎక్కడికి తీసుకెళ్ళారో , ఎవరు తీసు కెళ్లారో తెలుసుకుని పాపని తీసుకురమ్మని చెప్పాలని ఉంది? కానీ ఎలా? ఎలా కలవాలి?
ఏమిటి ఆలోచిస్తున్నావు?" బస్సు టైం అయింది పద. లక్ డీకాపూల్ దాకా వెళ్ళాలి. ట్రాఫిక్ తెలుసుగా ఎలా ఉంటుందో తయారై చేతిలో ఎయిర్ బ్యాగ్ తో హాల్లోకి వచ్చింది భాను ప్రియ.
ప్రఖ్య నెమ్మదిగా లేచి, టీవి ఆఫ్ చేసింది.
అప్పుడే కాలింగ్ బెల్ మోగింది.
భానుప్రియ విసుగ్గా మొహం చిట్లించింది. ఎవరో ఈ టైము లో విసుక్కుంటూ వెళ్ళి తలుపు తీసింది.
తలుపు తీయగానే ఎదురుగా నిలబడిన వ్యక్తిని చూసి స్థంభించిపోయింది.
