గద్గద స్వరంతో అంటోంది లలితాంబ -- "ఏనాటికైనా తన తప్పు తెలుసుకొని వస్తుందనుకున్నాను ఆడపిల్ల ఒంటరిగా ఎలా బతుకుతుంది అటు భర్త దగ్గరకో, ఇటు నా దగ్గరకో వచ్చి తీరాలి అని నమ్మాను. దాని పంతం, పట్టుదల ఇంతకంటే ఏం తెలుస్తుంది. ఇన్నేళ్ళ తరవాత నా మనవడు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు అదీ తల్లికి తెలియకుండా. అంటే తెలిస్తే పంపించదనేగా...."
ఆదిత్య అక్కడ క్షణం కూడా నిలబడలేక పోయాడు. అమ్మమ్మ ఏడుపు స్వరం విని తట్టు కోలేకపోయాడు. పెద్ద పెద్ద అడుగులేస్తూ అందరూ కూర్చున్న చోటికి వచ్చాడు.
అతడిని చూడగానే ఒక్కసారిగా అందరి నోళ్ళు మూతలు పడ్డాయి.
లలితాంబ ఆదిత్య వైపు చూసి చెంగుతో కళ్ళు తుడుచుకొని . పెదాల మీదకి నవ్వు తెచ్చుకొని అంది.
"లేచావా నాన్నా....! దా ఇదిగో నీ కూతుర్ని ఎత్తుకుంటావా....?" అంటూ ఆప్యాయంగా పిలిచింది.
ఆదిత్య కి దారిస్తూ ఆడవాళ్ళంతా పక్కకి తిరిగి నిలబడ్డారు.
ఆదిత్య వచ్చి లలితాంబ పక్కన మంచం మీద కూర్చున్నాడు.
ఆడవాళ్ళంతా "వెళ్ళొస్తాం పిన్నీ' అంటూ నెమ్మదిగా ఒక్కొక్కరే వెళ్ళి పోయారు.
వెళ్ళిపోయినా వాళ్ళని చూస్తుంటే ఆదిత్య కి సరదాగా అనిపించింది. ఇంతవరకు తనింటికి ఎప్పుడన్నా ఇంతమంది వచ్చారా...?
లలితాంబ ఆదిత్య దగ్గరగా జరిగి , అతని తల మీద చేయి వేసి జుత్తు నిమురుతూ, "చాలా అఘాయిత్యం చేసావు నాన్నా. నీ అదృష్టం బాగుండి పాపాయి క్షేమంగా ఉంది గానీ, ఏమైనా అయి ఉంటె ఎంత ప్రమాదం లో పడేవాడివో తెలుసా....? నాన్నా ఏదన్నా పని చేసేటప్పుడు ఆలోచన ఉండాలి. వివేకం ఉండాలి. ఆవేశం అనర్ధ హేతువు. అసలు మీ ఇద్దరూ పెళ్ళి కాకుండా తొందరపడటం తప్పు, పాపాయిని కనడం ఇంకా పెద్ద తప్పు. పోనీ డాక్టర్ చెప్పినట్టు ఎవరికైనా పిల్లల్లేని వాళ్ళకి ఇచ్చేసినా బాగుండేది. ఏ ఠికానా లేని నువ్వు దాన్ని పెంచుకోవాలను కోడం , ఇలా అర్ధరాత్రి వేళ దొంగతనంగా కారులో ఇంత దూరం తీసుకురావడం చాలా పెద్ద తప్పు. నాకు తలచుకుంటుంటే ఒళ్ళు గగుర్పోడుస్తోందిరా...." అంది.
ఆదిత్య జాలిగా చూశాడు.. "సారీ అమ్మమ్మా....నేను చాలా తప్పు చేశాను. కానీ, నాకు ఈ పాప కావాలి . నేను పెంచుకుంటాను...."
"ఎలా పెంచుకుంటావు....?"
"అమ్మమ్మా....ఒక్క రెండేళ్ళు మాత్రం నువ్వు పాపాయిని నీ దగ్గర ఉంచుకోవాలి. ఈలోగా నాకు ఇంజనీరింగ్ అయిపోతుంది. నేను మంచి జాబ్ చూసుకొని పాపని, నిన్నూ నాతొ తీసుకెళ్ళి పోతాను. ప్లీజ్ అమ్మమ్మా సాహసం చేశానో.... తప్పే చేశానో.... నేను అనుకున్నది సక్సెస్ ఫుల్ గా సాధించాను. పాపని నీకు అప్పగించాను. ఇంక నేను ఏం చేసినా అలోచించి చేస్తాను. నీకు ఫోన్ చేస్తాను. అమ్మని కూడా వీలైతే ఈసారి తీసుకొని వస్తాను రాకపోతే మనం ముగ్గురం అంటే పాప, నువ్వు నేను ఉందాం..."
"మరి నీ భార్య....?'
"భార్యా....! మాకు పెళ్ళే కాలేదుగా! అయినా నీకు తెలియదు లే అమ్మమ్మా.... ఇప్పుడు ఆడవాళ్ళందరికీ కూడా భర్తలు అవసరం లేదు. వాళ్ళకి బాగా చదువుకొని, మంచి ఉద్యోగాలు సంపాదించుకొని దర్జాగా బతకాలని కోరిక, స్వేచ్చగా , ఒంటరిగా బతుకుతారట. వాళ్ళకి ఎవరూ వద్దట. కానీ, నాకు చక్కగా అందరూ కావాలనిపిస్తుంది.
"అంటే ఆ అమ్మాయి నిన్ను పెళ్ళి చేసుకోదా....?"
"చేసుకోడు...."
"ఎందుచేత....?"
"వాళ్ళమ్మ వద్దంది...."
"ఎందుకు....?"
"వాళ్ళమ్మ కూడా మా అమ్మ లాగే ఒంటరి. స్వేచ్చ, స్వాతంత్ర్యం ఇవే కావాలట. అందుకే కూతుర్ని కూడా అలాగే తయారుచేస్తుందిట....."
ఆవిడ అయోమయంగా చూసింది. అసలీ స్వేచ్చ అంటే ఏంటో ఆవిడకి అర్ధం కావడం లేదు.
"పోనీ నువ్వు వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకోరా...?"
"ఆవిడ ఆరాటానికి నవ్వొచ్చింది ఆదిత్య కి.
"అమ్మమ్మా.....నేను ఇప్పుడు చేసిందే తప్పు కదా.... చదువు, ఉద్యోగం ....లేకుండా ఎవరైనా పెళ్ళి చేసుకుంటారా....?"
ఆవిడ నవ్వింది. ఆదిత్య ఆ క్షణంలో అమాయకంగా, ముద్దుగా అనిపించాడు. దగ్గరకు తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. దేవుడు దయామయుడురా నాన్నా! ఈ వయసులో నిన్నిలా చూస్తానని కలలో కూడా అనుకోలేదు. కూతుర్నే ఇంక చూస్తానని అనుకోలేదు. అలాంటిది మనవడిని, మనవరాలిని కూడా చూశాను. పైగా దాన్ని పెంచమంటున్నావు. చాలురా నా జీవితం ధన్యమై పోయింది నాయనా, రెండేళ్ళు కాదు, నేను బతికున్నంత కాలం నా ప్రాణానికి ప్రాణంగా, కంటికి రెప్పలా చూసుకుంటాను సరేనా....?
"అమ్మమ్మా...!" ఆవిడ కౌగిట్లో కి దూరిపోయి పిలిచాడు.
ఆ క్షణం ఆ ఇద్దరి పరిష్వంగం లో తర, తరలా రక్త సంబంధపు అనుబంధాలు విలీనమై పోయి, పెచ్చులూడిపోతున్న భారతదేశపు కుటుంబ వ్యవస్థ పునాదులు పటిష్టం అవుతున్నట్టుగా అనిపించింది.
వాళ్ళిద్దర్నీ అలా చూస్తున్న బాబ్జీ ఇరవై నాలుగు గంటల తరవాత హయిగా ఊపిరి పీల్చుకున్నాడు.
ఆదిత్య ఆమె కౌగిలి నుంచి విడివడి.... "అమ్మమ్మా... నేను రాత్రికి వెళ్ళిపోతాను... పాపం వీడు నా ఫ్రెండ్ ఇంట్లో చెప్పకుండా నాతొ వచ్చేశాడు... నేను వెళ్ళగానే నీకు ఫోన్ చేస్తాను...." అంటుండగానే ఆవిడ నవ్వుతూ "నాకూ ఏ ఫోను లేదురా....ఎవరున్నారు నాన్నా నాకు ఫోన్ చేయడానికి....నా బంధువులంతా ఈ ఊరిలోనే ఉన్నారు.... గాలితో కబురు చేసినా వచ్చి వాలతారు...." అంది.
"నీకు ఫోన్ లేదా?' ఆశ్చర్యంగా అడిగాడు.
"లేదు...' నవ్విందావిడ.
ఆదిత్య బాబ్జీ వైపు చూశాడు.... వెంటనే తన జేబులో ఉన్న సెల్ తీసి ఆవిడ కిస్తూ "ఇదిగో ఇది నా ఫోన్ ....ఇది మోగినప్పుడు అని చెప్పబోతూ ఆగిపోయి, సెల్ బాబ్జీ కిస్తూ "బాబ్జీ నీ సెల్ ఇలా ఇవ్వు...." అన్నాడు.
"నా సెల్లా....' కంగారుగా చూశాడు బాబ్జీ.
"ఇవ్వరా నీకు వేరేది కొనిస్టాలే....' అంటూ దాదాపు బాబ్జీ చేతిలోంచి సెల్ లాక్కొని లలితాంబ కిస్తూ, ఇదిగో , ఇది తీసుకో నా ఫోన్ నెంబర్ రాసి స్తాను. ఆ నెంబర్ ఇదిగో ఇలా మోగినప్పుడు ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అప్పుడు నువ్వు ఈ బటన్ నొక్కి నాతొ మాట్లాడొచ్చు. నా సెల్ ఇస్తే మా అమ్మ నాకు ఫోన్ చేస్తుంది కదా నీకు ప్రాబ్లం...." అంటూ అప్పటికప్పుడు ఆవిడ కి సెల్ డెమో చేసి చూపించాడు.
ఆవిడ కళ్ళద్దాలు పెట్టుకొని అటు చూసి, ఇటు చూసి.... "నాకెందుకురా ఇవన్నీ.... పక్కింటి రాజుకి ఇలాంటి ఫోన్ ఉంది వాడి నెంబర్ అడిగి తీసుకుని చేయి విషయం చెప్తాడు నాకు...." అంది.
"నేర్చుకో అమ్మమ్మా.... నేను రోజుకి నాలుగైదు సార్లు చేస్తాను... ప్రతిసారీ అతన్ని డిస్టర్బ్ చేయడం బాగుండదు కదా....!" అంటూ ఆవిడని కన్విస్ చేసి సెల్ ఇచ్చి పాపని ఒక్కసారి ఎత్తుకొని తిరిగి పడుకోబెట్టి ఆ రాత్రి డిన్నర్ చేసి బాబ్జీని తీసుకొని హైదరాబాద్ బయల్దేరాడు ఆదిత్య... కారులో కూర్చొని కారు స్టార్ట్ చేస్తూ చేయి ఊపుతున్న ఆదిత్య ని కళ్ళ నీళ్ళతో చూస్తూ ఉండిపోయింది లలితాంబ.
***
శిరీష తిండీ, నీళ్ళూ లేకుండా ఏడుస్తూనే ఉంది. ఇరవై నాలుగంటల్లో ఆమె ఆకర్షనీయమైన రూపంలో ఎంతో మార్పు వచ్చి పదేళ్ళు వయసు పెరిగినట్టు అయింది. భాను మాటలు, ఆమె చేసిన అవమానం , ఆదిత్య చేసిన పని, ఆమె మనసంతా వేదనతో నిండిపోయింది. వివేక్ ఆమె దగ్గరే ఉండిపోయి ఆమెను ఒదార్చడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు.
"నువ్విలా బాధపడుతూ కూర్చుంటే జరిగిందంతా మారిపోతుందా శిరీషా....? వాడెం చిన్నపిల్లాడా....' ఎక్కడో ఫ్రెండ్ దగ్గర ఉండి ఉంటాడు....వచ్చేస్తాడు....వాడి కోసం బెంగాపెట్టుకుని నువ్విలా ఆరోగ్యం పాడు చేసుకోడం బాగాలేదు...."
