Previous Page Next Page 
తెల్ల గులాబి  పేజి 19

    'అలాగే" అంటూ కృతజ్ఞతలు తెలియజేసి వెళ్ళిపోయాడు.
    అయితే డాక్టర్ అనుకున్నట్టు సిజేరియన్ చేసి ఏడో నెల్లోనే బేబీని బైటకు తీయడానికి భాను ఒప్పుకోలేదు. పెళ్ళి కాని పిల్లకి సిజేరియన్ చేస్తే ఎంత ప్రమాదమో అమెకి తెలుసు. అలా అని పెళ్ళి కాని పిల్ల గర్భంతో కాలేజీ కి వెళ్ళి వస్తుంటే ఎవరికీ తెలియకుండా కాపాడటం అసాధ్యం. ఏవిధంగా చూసిన ప్రఖ్యకు ప్రమాదచ్చాయలె ఎక్కువగా కనిపిస్తున్నాయి.
    భానుకి అన్నింటి కంటే ఇక్కడ కూతురి ఆరోగ్యం, అందం కాపాడటం ముఖ్యం. సిజేరియన్ జరిగాక ఆ సంగతి పెళ్ళయ్యాక తెలియకుండా ఉంటుందా...' తెలిస్తే దాని జీవితం నాశనం అవుతుంది. ...సిజేరియన్ అయ్యాక ప్రఖ్య  కన్నెపిల్ల అని అంటే ఎవరు నమ్ముతారు? ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు.... పిచ్చెక్కినట్టు అయింది భానుకి...
    ఎలాగోలా ఇంకా ఆరు నెలలు దాటితే డాక్టర్ ప్రవీణ చెప్పినట్టు ఫార్మాలిటీస్ అన్నీ పూర్తీ చేసి బేబీని వాళ్ళెవరో అడిగిన వాళ్ళకి చ్చేస్తే ఇంక నిశ్చింతగా ఉండొచ్చు. అని ఆలోచించింది.
    ఈ సమస్య నుంచి క్షేమంగా గౌరవంగా బైట పడాలంటే ఒకటే మార్గం కనిపించింది. ఆవిడకి.... వెంటనే బెంగుళూరు లో ఉన్న తన స్నేహితురాలు మధురి కి ఫోన్ చేసింది. మధురి భాను చెప్పిందంతా ఓపిగ్గా విని, "ప్రఖ్యను వెంటనే నా దగ్గరకు పంపించు." అంది...
    మధురి భర్త ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్... "ఫస్ట్ ఇయర్ అయిపొయింది కాబట్టి , సెకండ్ ఇయర్ బెంగుళూరు లో చదువుతుంది. ఇక్కడే బీటెక్ పూర్తీ చేస్తుందిలే కంగారు పడకుమ నేను చూసుకుంటాలే" అని మాట ఇచ్చింది.
    భానుకి కొద్దిగా ఊరట లభించింది. ఇప్పుడు ప్రఖ్య ని కొట్టి, తిట్టి ఏం చేసినా చేసేదేం లేదు. ఈ సమస్య నుంచి జాగ్రత్తగా బైట పడాలి. అసలు డాక్టర్ నిజం చెప్తోందో లేదో! ప్రఖ్య వీక్ గా ఉండటం ఏంటి? వీకైతే మాధురిని బెంగుళూరు లో డాక్టర్ కి చూపించి అబార్షన్ చేయించమనాలి.
    అలా నిశ్చయించుకున్నాక ఆందోళన తగ్గింది. దీనికంతటికీ కారణం శిరీష. కొడుకుని అచ్చోసిన ఆంబోతులా పెంచింది. వెధవ జానెడు లేడు మీసాలు కూడా రాని వెధవ కి రోమాన్స్ కావాల్సి వచ్చింది... బ్లడీ ...ఛ...
    అలా రకరకాల ఆలోచనలతోటే ప్రఖ్యని బెంగుళూరు పంపించింది.
    ప్రఖ్య వెళ్ళిన రెండు రోజులకి శిరీష భాను దగ్గరకి వచ్చింది.
    ఆమెని చూడగానే ముఖం తిప్పెసుకుంది భానుప్రియ.
    శిరీష కళ్ళలో నీళ్ళతో అంది "భానూ! అయాం సారీ.... నేనిలా జరుగుతుందనుకోలేదు...."
    "సారీ నా, సారీ చెబితే బాగుపడి పోతుందా పరిస్థితి. వాడు చేసిన వెధవ పనికి నా కూతురి భవిష్యత్తు నాశనం అవుతుంది." మండిపడింది భానుప్రియ.
    "భానూ! చిన్నపిల్లలు వాళ్ళు, యవ్వనం లో అడుగు పెడుతున్నారని, ఆ దశ కొన్నిసార్లు పిల్లల చేత తప్పు చేయిస్తుందని మనకు తెలుసు. అయినా మనం వాళ్ళని అనుమానించ లేదు. ఇద్దరం తప్పు చేశాం. ఈ తప్పుని ఒప్పుగా దిద్దుకుందాం భానూ...."
    "అంటే...ఏంటి నీ ఉద్దేశం....? నా కూతురిని ఆ వెధవ కిచ్చి పెళ్ళి చేయమంటావా?"
    శిరీష రోషంగా చూసింది. "ఎందుకలా పదిసార్లు వెధవ, వెధవ అంటావు. తప్పు వాడొక్కడే చేశాడా?" నీ కూతురు చనువివ్వకుండానే దాని ఒంటి మీద చేయ్యేసాడా....?" 
    "పిచ్చి పిచ్చిగా మాట్లాడకు..."
    "నేను కాదు నువ్వు మాట్లాడుతున్నావు. ..కొంచెం ఆవేశం తగ్గించుకొని ఆలోచించు భానూ.... ప్రఖ్య నా కూతురు లాంటిది తన భవిష్యత్తు పాడవాలని నేను కోరుకుంటానా? పెళ్ళి చేద్దాం, ప్రఖ్యని నేను చదివిస్తాను... తనకెంత వరకూ కావాలో అంతవరకూ చదువుకోనీ... ఇద్దరూ చదువు కుంటారు నాకా శక్తి ఉంది కదా...."
    "ఆహా, చాలా బాగా చెప్పావు ....పెళ్ళి , పిల్లలు , చదువులు సాగుతాయనేనా...? అయినా మీసాలు కూడా రాకుండానే అంత పని చేసినవాడు ఏం చదువుకుంటాడు..? ఏం బాగుపడతాడు? ఆవారాగా తిరిగే వాడికి నా కూతుర్ని ఇచ్చి దాని గొంతు కోయమంటావా? ఈ మాట అనడానికి నీకు సిగ్గు లేకపోయినా నాకుంది. చేసింది చాలు ఇంక మా మానాన మమ్మల్ని వదిలేయండి..." శబ్దం చేస్తూ చేతులు జోడించింది.
    శిరీష కి చాలా అవమానంగా అనిపించింది. భానుప్రియ చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తుందేమో అనిపించింది... ఏదో చెప్పబోతూ ఆమె మోహంలో కనిపిస్తున్న భావాలు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ అంది...
    అనవసరంగా ద్వేషం పెంచుకున్తున్నావు. అలోచించి ఏదన్నా, మార్పు ఉంటె నాకు చెప్పు ఆనందంగా స్వీకరిస్తాను..." అంటూ వెళ్ళిపోయింది శిరీష. మంచి స్నేహితురాలిని అపార్ధాలతో కోల్పోతున్నందుకు శిరీష గుండె విరిగి పడినట్టుగా అనిపిస్తోంటే తనని తాను అదుపు చేసుకుంది.
    ఆమె వెళ్ళిన వైపు చూస్తూ నిరసనగా ముఖం తిప్పెసుకుంది భానుప్రియ. ఆ తరువాత పదిరోజుల్లో ప్లాట్ ఖాళీ చేసేసింది భాను ప్రియ.
    మధురి భర్తతో విషయం చెప్పి అక్కడే ప్రఖ్యని ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించింది. అయితే అక్కడ కూడా ప్రఖ్య అబార్షన్ కి చుక్కేదురైంది. మాధురికి బాగా తెలిసిన డాక్టర్ స్టేట్స్ కి వెళ్ళింది. తెలియని వాళ్ళ దగ్గరికి తీసుకెళితే రూల్స్ అనీ, అదనీ మాట్లాడతారు. పైగా ఆ పిల్లకి అప్పుడే మూడో నెల. మాధురికి కూడా అబార్షన్ అంటే కొంచెం భయం వేసింది.
    ప్రఖ్య ని జాగ్రత్తగా చూస్తూ, మధ్య , మధ్య రెండుసార్లు హైదరాబాదు డాక్టర్ చెకప్ కి రహస్యంగా కారులో తీసుకెళ్ళి తీసుకొచ్చింది.
    నెమ్మదిగా తొమ్మిదో నెల రాగానే డెలివరీకి భానుదగ్గర దింపేసింది. అప్పటికి దాదాపు సిలబస్ అయిపొయింది. మిగతాది ఇంటి దగ్గర చదువు కుంటానంది ప్రఖ్య.
    ప్రఖ్య కి కూడా ఆ అనుభవం తమాషాగా ఉంది.... నెల, నెలా తన శరీరంలో మార్పులు, కడుపులో బేబీ కదలికలు అనుకోకుండానే ఆమెకేదో మధురానుభూతులు కలగసాగాయి. డెలివరీ అయ్యాక మమ్మీ పాపనేం చేస్తుందో అనుకుంది. ఆ అనుభూతులన్నీ ఆదిత్య తో పంచుకోవాలని కూడా అనిపించింది.
    పాపం అది ఏం చేస్తున్నాడో! తనంటే ఎంత ఇష్టం ఆదికి అని ఆలోచిస్తూ ఉండేది. ఇద్దరూ ఎన్నిసార్లో ఆ అనుభవం పొందడానికి ప్రయత్నించారు కాని ఆ అవకాశం లభించలేదు. హోలీ పండుగ నాడు అది వెరీ అన్ ఫార్చునెట్.
    అన్ ఫార్చునేటా....? ఆ అనుభవం గుర్తు రాగానే మనసు తీయగా మూలిగింది. మళ్ళీ తరువాత అనుభవిస్తున్న బాధలు, కష్టాలు, ఇబ్బందులు తలచుకుంటే మాత్రం భయం వేస్తోంది. అనవసరంగా చదువు బాగా డిస్టర్బ్ అయింది. ఇలాగే జరిగితే తన భవిష్యత్తు పాడై పోతుంది. ఆదిత్య పెళ్ళి పెళ్ళి అంటున్నాడు. పెళ్ళి చేసుకుంటే నిజంగానే మమ్మీ అన్నట్లు భవిష్యత్తు పాడవుతుంది. పెళ్ళి చేసుకుంటే పిల్లల్ని కనాలి. ఉలిక్కిపడింది.... ఇప్పుడు , పెళ్ళి కాకుండానే కంటోంది ఏంటోగా ఉంది. తన కడుపులో ఒక జీవి ఊపిరి పోసుకుంటోంది. ఎంత తప్పు చేసింది! తన ఫ్రెండ్స్ కి తెలిస్తే ఎంత అసహ్యించుకుంటారు! కాకపోతే తను ఇలా జరిగితుందనుకోలేదు.
    అదేంటో  ఆదిత్య ను చూడగానే దగ్గరగా కూర్చోవాలని, అలా కూర్చున్నాక అతనేదో చిలిపి పనులు చేయాలని, ఆ తీయదనం అనుభవించాలని ఓ విధమైన తపన ఉండేది. కానీ, ఆ తీయని అనుభవం ఇంత కష్టాన్నిస్తుందని అనుకోలేదు. అనుకోని ఉంటె ఇలా జరగనిచ్చేదా...? ఏమో...!
    కడుపు లో పాపాయి కదుల్తుంటే ఆ మూవ్ మెంట్స్ తమాషాగా , కొత్తగా ఉన్నాయి. మధ్య మధ్యలో భయం కూడా వేస్తోంది. పొట్ట చీల్చుకొని పాపాయి బైటకి వస్తుందేమో అని భయం వేస్తోంది. పాపాయి మూవ్ మెంట్స్ ఆదిత్యకి చెబితే ఎంత బాగుండు.
    అది ఎలా ఉన్నాడో... నిట్టూర్చింది. ఒక్కసారన్నా చూడలేదు. ఆరు నెలలైంది. పాపం....! అటు వాళ్ళమ్మ ఇటు మమ్మీ ఇద్దరూ తిట్టారు, కొట్టారు.... ప్రఖ్యకి అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.... తనకోసం దెబ్బలు కూడా తిన్నాడు... అంటే ఆదిత్య తనని ప్రేమిస్తున్నాడా..../ మరి తను...! ఆదిత్యను ప్రేమిస్తోందా....? అసలు ప్రేమంటే ఏంటి..? అతను లేకపోతె బతకలేక పోవడమా? కానీ, తనకి అలాంటి ఫీలింగ్ ఏం లేదే.
    చాలాసేపట్నించి అలా బాల్కనీ లో కూర్చుని ఆలోచిస్తూ ఉండటం చేత కాబోలు నడుం నొప్పిగా అనిపిస్తోంది. నెమ్మదిగా కుర్చీ లోంచి లేచింది ప్రఖ్య.
    తొందరగా డెలివరీ అయిపోతే బాగుండు అనిపించింది.
    హౌస్ అరెస్ట్ చేసింది భానుప్రియ. అసలు బైటకే వెళ్ళ లేకపోవడంతో పిచ్చి పడుతున్నట్టుగా ఉంది. పదే, పదే ఆదిత్య గుర్తొస్తున్నాడు . బేబీని ఏం చేస్తుందో అమ్మ.... ఆదికి ఇచ్చేస్తే బాగుండు పాపం... తల్చుకుంటుంటే బాధగా అనిపిస్తోంది. తన బేబీని ఎవరికో ఇచ్చేస్తుందిట డాక్టర్.
    భవిష్యత్తు లో ఎప్పుడైనా పాప తనకి ఎదురు పడుతుందా....? నన్నెందుకలా వదిలేశావు మమ్మీ అని తనని అడుగుతుందా....? బేబీ ని తనే పెంచుకుంటే....! ఎవరికో ఇవ్వడం పాపం కాదా...? ప్రఖ్య కి ఏడుపు కూడా వచ్చింది కానీ , ఇలా ఆలోచిస్తోందని తల్లికి తెలిస్తే ఏం జరుగుతుందో ఆమెకి తెలుసు. శిరీష అంటీ ఏమనుకుంటుందో తన గురించి... ఈ ఆలోచనలతో పిచ్చి పడుతోంది. ఎటూ వెళ్ళలేక పోతోంది . ఏమీ చేయలేక పోతోంది. ఒంటరి ఉంటె ఆలోచనలు ముసురుకుంటూన్నాయి... భయం వేస్తోంది. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS