Previous Page Next Page 
తెల్ల గులాబి  పేజి 20

    ప్రఖ్య కి ఇప్పుడు డెలివరీ అయిపోగానే మళ్ళీ బెంగుళూరు వెళ్ళిపోయి చదువు కంటిన్యూ చేసేస్తే, ఈ ఆలోచనలన్నీ పోతాయి. ఇంజనీరింగ్ అయిపోతే మంచి భవిష్యత్తు పొందొచ్చు. అనుకున్నాక కాస్త ఊరటగా అనిపించింది ఆమెకి. నిశ్చింతగా కళ్ళు మూసుకుంది.
    అయితే, ప్రఖ్య బెంగుళూరు వెళ్లిందని తెలిసిన దగ్గర్నుంచీ ఆదిత్య వేస్తున్న ప్లాన్స్ మాత్రం అటు భానుకీ, ఇటు ప్రఖ్య కి మాత్రమె కాకుండా అతని తల్లి, శిరీష క్కూడా తెలియలేదు. కొన్ని రోజులు పిచ్చి పట్టిన వాడిలా అయ్యాడు. తర్వాత డాక్టర్ ప్రవీణ ద్వారా ప్రఖ్య ఆరోగ్యం గురించి, ఆమె క్షేమ సమాచారాల గురించి తెలుసుకుంటూ, మరో పక్క చదువుకుంటూ, తనేం చేయాలో ఆలోచిస్తూనే ఉన్నాడు. ప్రతి నేలా డెవలప్ మెంట్స్ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ డెలివరీ టైం కోసం ఓపిగ్గా ఎదురు చూడసాగాడు.
    ఇప్పుడు ఆ సమయం వచ్చింది.
    సమయం రాత్రి పది నలబై నిమిషాలు.
    జంటనగరాల ప్రజలు సుషుప్తీ జాగృదావస్థల మధ్య జోగుతున్న వేళ.
    నగరం నడిబొడ్డున ఉన్న ప్రముఖ ప్రసూతి ఆసుపత్రి.
    నల్లటి బలమైన ఇనుప గేటు.
    లోపలి కేళుతొంటే ఎడం పక్క వరుసగా సైనికుల్లా పొడుగాటి అశోక వృక్షాలు... విశాలమైన ఆవరణ లో కుడి పక్క లోపలికి వెళ్ళడానికి ఆరు మెట్లు, గ్లాస్ డోర్ .... మెట్ల మీద రెండు పక్కలా ఖరీదైన కుండీ ల్లో క్రోటన్స్.
    ముందు వైపు ఖాళీ స్థలం లో డాక్టర్ ప్రవీణ కారు పార్కు చేసి ఉంది. అది కాక మరో రెండు కార్లు మాత్రం పార్క్ చేసే స్థలం ఉంది. కాకపోతే స్కూటర్లు పార్క్ చేయడానికి కొంచెం దూరంలో రేకుల షెడ్డు వేసి ఉంది. కాంపౌండ్ వాల్ ని అనుకోని వరసగా కొన్ని మొక్కలున్నాయి.
    వాటిలో ఎర్ర మందారం, నిత్య మల్లెలు, బోగన్ విల్లా మొదలైనవి విరగబూసి ఉన్నాయి. బోగన్ విల్లా కొమ్మలు ఇనపగేటు వైపు నుంచి , గోడ బయటకి తొంగి చూస్తున్నట్టుగా వంగి ఉన్నాయి.
    వాచ్ మాన్ బహదూర్ గెట్ కి కొంచెం ఎడంగా స్టూలు మీద చేతిలో కర్ర పట్టుకొని కూర్చొని ఉన్నాడు.
    అశోక వృక్షాల కి కొంచెం దూరంలో ఆవరణ వెనుక భాగంలో సుమారు ఇరవై ఏళ్ళ వయసున్న కుర్రాడు అసహనంగా , అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. అతను ఆదిత్య. మధ్య, మధ్య ఎడం చేయి ఎత్తి లైట్ వెలుగులో టైం చూస్తున్నాడు. అప్పుడప్పుడూ ఆసుపత్రి లోపలికి కిటికీల్లోంచి తొంగి చూస్తున్నాడు.
    అతని ముఖంలోకి పరిశీలనగా చూస్తె ఆతృత, ఆదుర్దా , కొంచెం భయం కూడా కనిపిస్తున్నాయి. నడుస్తూ, నడుస్తూ కొంచెం ముందుకి వచ్చి గేటు బైట అవతల వైపు రోడ్డు మీద ఆపిన కారు వైపు చూస్తున్నాడు.
    దాదాపు గా అతను ఆసుపత్రి చుట్టూ పక్కల ప్రదక్షిణ చేస్తున్నట్టు ఉంది.
    ఆసుపత్రి లోపల కారిడార్ కి రెండు ప్రక్కల రూమ్స్ ఉన్నాయి.
    అందులో అన్నీ ప్రత్యేకమైన గదులే తప్ప జనరల్ వార్డు అంటూ లేకపోవడం చేత అది కేవలం డబ్బున్న వాళ్ళ కోసమే అన్నట్టుగా అనిపిస్తోంది.
    అన్ని గదుల్లో పేషెంట్స్, వారితో పాటు వచ్చిన అటెండెంట్స్ నిద్రపోతున్నారు. కొందరు నర్సులు యూనిఫాం లో శాంతి దూతల్లా అటూ, ఇటూ తిరుగుతున్నారు.
    చివరగాఉన్నలేబర్ రూమ్ లోంచి ఉండుండీ బాధాకరమైన అరుపులు వినిపిస్తున్నాయి.
    లేబర్ రూం బయట విజిటర్స్ కుర్చీలో కూర్చున భానుప్రియ టెన్షన్ గా రెండు చేతులూ నలుపు కుంటూ లేబర్ రూం తలుపు వైపు ఆ గది తలుపులు ఎప్పుడూ తెరుచు కుంటాయా అని చూస్తోంది.
    ఆమె తలుపు మీద గులాబీ రంగులో చిన్న చిన్న పూలున్న క్రేప్ సిల్కు పంజాబీ డ్రెస్ వేసుకుంది. జుట్టు పైకి మడిచి వెడల్పాటి క్లిప్పు పెట్టుకుంది. భుజానికి పెద్ద హ్యాండ్ బ్యాగు వెళ్ళాడుతోంది.
    ఆమెకి కొంచెం ఎడంగా తల వంచుకొని కూర్చొని ఉంది శిరీష.
    భానుప్రియ శిరీషని గమనించనట్టు కూర్చుంది.
    లోపల ప్రసవ వేదన పడుతున్న ఆమె ఒక్క గానొక్క కూతురు ప్రఖ్య చిన్న వయసులో అంత బాధ భరించడం ఆమె తట్టుకోలేక పోతోంది. 
    ఆమె ముఖంలో ఆపుకోలేని కోపం కనిపిస్తోంది. మధ్య, మధ్య తలవంచుకొని కూర్చున్న శిరీష వైపు మండిపడుతూ చూస్తోంది. వీలైతే ఆమె గొంతు పిసికి చంపేయాలన్నంత కసి ఆమె చూపుల్లో కనిపిస్తోంది.
    శిరీష మధ్య, మధ్య కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ మౌనంగా కూర్చుంది.
    శిరీష పసుపు రంగు కాటన్ చీర కట్టుకుంది. దానికి వైలెట్ కలర్ బోర్డరు ఉంది. ఆ చీర అందమైన ఆమెకి ఇంకా అందాన్నిస్తోంది.
    ఆమె మనసులో అగ్ని పర్వతాలు పేలుతున్నాయి.
    తన కొడుకు చేసిన పనికి ఈ అమ్మాయి భవిష్యత్తు పాడు కాకూడదు అన్నదే ఆమె ప్రార్ధన. మనసులో భగవంతుడి ని క్షమార్పణ అడుగుతూ, పదే పదే ప్రఖ్య క్షేమం కోసం ప్రార్ధిస్తూ కూర్చుంది.
    తన కొడుకు అంతపని చేశాడంటే నమ్మలేక పోతోంది. నూనూగు మీసాలతో అమాయకంగా, బెదురూ కళ్ళతో చూసే ఆదిత్య అంత పని చేశాడా....?
    ఒకమ్మాయిని గర్భవతిని చేయడం, ఆమెని పెళ్ళి చేసుకోమని బెదిరించడం.... అడిత్యేనా....? ఏ దుష్టశక్తి వాడిని అవమానించిందో ...ఎందుకిలా చేశాడు...?
    ఇద్దరూ కలిసి చదువుకుంటారని, స్నేహంగా ఉంటారని అనుకుంది...కానీ, ఇలా జరుగుతుందని ఎన్నడన్నా ఊహించిందా....?    అసలు వాళ్ళిద్దరి మధ్యా అలాంటి అభిప్రాయం ఉందని తనేనాడైనా ఊహిచిందా....?
    ఆదిత్య కి వయసు వస్తోందని యవ్వనం సంతరించు కుంటునన్నాడని, యవ్వన సహజమైన వాంఛలతో రగిలి పోతున్నాడనే ఆలోచనే రాలేదు.
    అకారణంగా వివేక్ మీద ద్వేషం పెంచుకొని తనతో గొడవ పడుతున్నాడని కొంచెం కథినంగా ఉంది.
    తనకీ, వాడికీ మధ్య ఒక దూరం పెంచింది. అందుకే ఆదిత్య మనసులోని భావాలు తను గ్రహించ లేకపోయింది.
    అయినా పిచ్చి గానీ, ఎలా గ్రహించ గలదు....? వాడు మనసు విప్పి మాట్లాడితే గా .
    ఆఖరికి నువ్వు నాకక్కర్లేదు అనేంత కఠిన్యం, తన పట్ల అంత విముఖత ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది...? ఎక్కడున్నాడో...వారం అయింది తనని ఎదిరించి వెళ్ళిపోయి.... వాడికి అమ్మ అక్కర్లేదు కానీ , తనకి కొడుకు కావాలి.... తన కొడుకుని ప్రయోజకుడిని చేయాలి.... తన వాళ్ళు అనే వాళ్ళు ఎప్పుడన్నా, ఎక్కడన్నా కనిపిస్తే గర్వంగా తలెత్తుకు బతకాలి అనుకుంది. కానీ , ఇదేంటి ఇలా జరిగింది...? ఇలా జరగడానికి తనేనా కారణం. వాడిలా తయారవడానికి తన ప్రేమ వ్యవహారమా....? వివేక్ మీద ద్వేషం ఎందుకు పెంచుకున్నాడు...?
    ఆమె ఆలోచనలను చెల్లా చెదురు చేస్తూ...
    లోపలి నుంచి కేవ్వుమన్న పసిపాప ఏడుపు. ఆ వెంటనే తలుపు తెరచుకోడం జరిగింది...
    తెల్లని దుస్తుల్లో, చిరునవ్వు చిందిస్తూ భాను ముందుకు వచ్చిన నర్సు..."కంగ్రాట్స్ మేడం.. ఆడపిల్ల...." అంది... ఆవిడతేలిగ్గా నిట్టూర్చి "మా అమ్మాయి ఎలా ఉంది...?" అడిగింది.
    "తల్లీ, పిల్లా ఇద్దరూ క్షేమమే వెళ్ళండి చూడొచ్చు..." నర్సు ముందుకి నడుచుకుంటూ ఎటో వెళ్ళిపోయింది. భానుప్రియ ఒక్కసారి హమ్మయ్య అన్నట్టుగా కళ్ళు మూసుకుని తెరచి డోర్ తీసుకుని లోపలికి నడిచింది.
    డాక్టర్ ప్రవీణ చిరునవ్వుతో "రండి.... వైట్ రోజ్ మీ గ్రాండ్ డాటర్" అంది.
    ఆవిడ ముఖంలో గంబీరం కమ్ముకుంది. గబగబా లోపలికి వెళ్ళింది.
    శిరీష లేచింది తనూ లోపలికి వెళ్ళడానికి.... కానీ, భానుప్రియ తలుపు వేసేసింది.
    శిరీష ముఖం అవమానంతో ఎర్ర బడింది... చివ్వున అక్కడి నుంచి లేచి బయటకి వెళ్ళి పోయింది... పోనీలే... ప్రసవం సుఖంగా అయి, ప్రఖ్య క్షేమంగా ఉంది... పాపని వాళ్ళెం చేసుకుంటారో వాళ్ళిష్టం ....తనకి ఎలాంటి సంబంధం లేదు.
    తన కొడుకు కారణంగా ప్రఖ్యకి చిన్న వయసులో గర్భం రావడం, అబార్షన్ కి ఆమె లేత శరీరం అనుకూలించక పోవడంతో అటు భానుప్రియ, ఇటు శిరీష కూడా ప్రఖ్య గర్భవతి అని తెలిసిన దగ్గర్నుంచీ టెన్షన్ గానే ఉన్నారు.
    ఒకళ్ళ తో ఒకళ్ళు మాట్లాడుకోకపోయినా , ఒకళ్ళింటికి మరొకళ్ళు వెళ్లక పోయినా తరచూ ప్రఖ్య క్షేమ సమాచారాలు తెలుసుకుంటూనే ఉంది శిరీష.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS