Previous Page Next Page 
తెల్ల గులాబి  పేజి 17

    'ఒద్దొద్దు అబార్షన్ చేయకండి." ఎలాగోలా వాళ్ళకి నచ్చజెప్పి బేబీని నాకిచ్చేయండి ప్లీజ్."
    "మీ ఇంట్లో పాపని చూసుకోడానికి ఎవరన్నా ఉన్నారా?"
    "అమ్మ ఒక్కతే ఉంది నాకు. అమ్మ అసలు చూడదు. అమ్మకి నేనిలా వచ్చానని తెలిస్తే ఊరుకోదు కూడా."    
    "మరెలా ? ఎవరు చూస్తారు? ఆవిడకి చికాకోచ్చింది. అతని అర్ధం లేని వాదనకి. ఏదన్నా సాయం చేయాలన్నా ఇంత వేగ్ గా ఆలోచించే వాడికి ఏం సాయం చేయచ్చు అనిపించింది."
    "డాక్టరు గారూ! నేను మేజర్ ని కదా! నా బేబీని నేను కావాలనుకోడం తప్పు కాదు. కదా! నేను ప్రఖ్యని పెళ్ళి చేసుకుందాం అన్నాను. తనే కెరియర్ అంటూ వినడం లేదు. కెరియర్ ఏమవుతుంది చెప్పండి. మా అమ్మ ఇప్పటికీ చదువుకుంటోంది . తను బ్యాంక్ మేనేజర్ కూడా మీకెందుకు? నేను చాలా బాగా నా కంటి పాపలా పెంచుకుంటాను. మీరు నాకు సాయం చేయండి చాలు."
    ఇప్పుడావిడకి ముచ్చటేసింది అతని మాటలు వింటోంటే కుర్రాడు బాగున్నాడు చూస్తె మంచివాదిలానే ఉన్నాడు. ఆ పిల్ల తల్లికి పొగరా , పిచ్చా హాయిగా పెళ్ళి చేసేస్తే పోతుంది కదా అనిపించింది.
    "అది కాదు బాబూ . వాళ్ళకి నేనేం చెప్పను?"
    "ఏదో చెప్పండి. అబార్షన్ చేస్తే డేంజర్ అని చెప్పండి."
    ఆవిడ నవ్వింది. అతడినే తదేకంగా చూస్తూ ఆలోచిస్తూ కూర్చుంది. ఆదిత్య ఇబ్బందిగా కదిలాడు కుర్చీలో. ఐదు నిమిషాల తర్వాత అంది ఆవిడ . "సరే రేపు వస్తారుగా నేను చెప్పి చూస్తాను. అబార్షన్ చేయించుకోకుండా ట్రై చేస్తాను. ఆ తరవాత నీ లక్.
    'అలా అనకండి.... నాకు బేబీ కావాలి... అంతే."
    పాపం అనిపించింది ఆవిడకి. ఒంటరితనంతో ఎంత బాధపడ్డాడో ఈ కుర్రాడు నిజంగా మైక్రోప్యామిలిస్ వలన చాలామంది ఏదో డిప్రెషన్ కి గురి అవుతున్నారు. కుటుంబ నియంత్రణ వచ్చిన కొత్తల్లో ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు చాలు అన్నారు. ఆ తరవాత మేమిద్దరం మాకిద్దరు అనే కాప్షన్ వచ్చింది . రాను రానూ ఒకళ్లె చాలను కుంటున్నారు.
    పేరెంట్స్ ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండడం , పిల్లలు ఒకళ్లె ఉండడం, పేరెంట్స్ తో సాన్నిహిత్యం లేకపోడం, ఇదంతా అనారోగ్యకరమైన సమాజం ఏర్పడడానికి దోహదం చేస్తోంది. ఆధునిక సమాజంలో మంచికన్నా చెడె ఎక్కువ జరుగుతోంది. యువతలో దాదాపు యాభై శాతం మంది డిప్రెషన్ తో బాధపడటానికి జీవన విధానంలో వచ్చిన విపరీతమైన మార్పులే కారణం అనడం లో సందేహం ఏ మాత్రం లేదు.
    ఈ కుర్రాడికి తోడూ కావాలి. ఓ స్నేహం కావాలి. తన అనే వ్యక్తీ కావాలి. బహుశా ఆ అమ్మాయికి దగ్గరవడానికి అదే కారణం కావచ్చు. పెళ్ళికి ఆమె ఒప్పుకోక పోవడంతో తన సంతానాన్ని తను పొందాలను కుంటున్నాడు. అది తన రక్తం పంచుకు పుట్టబోయే బిడ్డ అంటే అతను అన్నిటికీ తెగించి ఆ బిడ్డను పెంచుకోడానికి సిద్దపడుతున్నాడు. ఇతనికి సాయపడటంలో తప్పేం లేదని  పించింది ఆవిడకి. అబార్ధన్ చేయడం తప్పు బిడ్డని బతికించడం తప్పు కాదు. తల్లి నుంచి మరొకళ్ళకి బిడ్డని అమ్మడమో, దానం ఇవ్వడమో చేయడం లేదు. శిశువు తండ్రికే ఇవ్వాలనుకోవడం తప్పు కాదు కదా.
    ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా ఉంది. "ఒకే నువ్వు ఎల్లుండి వచ్చి కనిపించు ఏం జరిగిందో చెప్తాను."
    అతని ముఖం వికసించింది. "థాంక్యూ డాక్టర్.... థాంక్యూ వెరీ మచ్ " అన్నాడు. సంతోషం వెల్లి విరుస్తుంటే ....ఆవిడ సన్నగా నవ్వి బెల్ కొట్టింది. ఆయా లోపలికి వచ్చింది. అతను బయటికి వెళ్ళిపోయాడు.
    కాసేపట్లో ఆవిడ కారు వెళ్ళిపోయింది.
    ఆ రాత్రి శిరీష ప్లాట్ కి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు తిట్టింది భానుప్రియ. "మంచిదానివని, ఉద్యోగస్తురాలివని , నా కూతుర్ని నీ ఇంటికి పంపిస్తే నీ కొడుకుతో నా కూతురి మీద అత్యాచారం చేయిస్తావా? ఛీ నీ బతుకు పాడుగాను నీ బుద్దే వచ్చినట్టుంది నీ కొడుక్కి ఆడపిల్ల జీవితం నాశనం చేసారు మీరేం బాగుపడతారు?" అంటూ మధ్య మధ్య ఏడుస్తూ తిరుతుంటే శిరీష దిగ్భాంతురాలై నిలబడిపోయింది.
    "ఏం జరిగింది భానూ...?" అని హీనస్వరంతో అడిగింది.
    "నన్నా పేరుతొ పిలిస్తే నాలుక చీరేస్తా. ఛీ నీ ముఖం నాకు చూపించకు" అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
    శిరీష మ్రాన్పడి పోయింది. ఏం జరిగిందో అర్ధం కాలేదు. స్తాణువై నిలబడ్డ చోటే కూలబడి పోయింది. భాను మాటలు తూటాల్లా గుండెల్ని తూట్లు పొడిచాయి. ఆ గాయాలతో మండుతున్న గుండె చిక్కబెట్టుకొని ఆదిత్య గదిలోకి వెళ్ళింది. ఆదిత్య బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాడు.
    శిరీష ఆదిత్య ను పట్టుకుని ఆ చెంపా, ఈ చెంపా చెళ్ళు చెళ్ళున వాయించేసింది. ఆమె ఆ క్షణంలో ఓ ఉన్మాదిలా మారిపోయింది. "ఏం చేసావురా దరిద్రుడా ఆ అమ్మాయిని." అంటూ కాళికలా అరిచింది. ఆదిత్య చెంప చేత్తో పట్టుకుని స్థిరంగా అన్నాడు. "నేను ప్రఖ్యని లవ్ చేస్తున్నానమ్మా , తనని పెళ్ళి చేసుకుంటాను, కాని ఆవిడే ఒప్పుకోవడం లేదు."
    "నోర్మూయ్ " మరోసారి చెంప పగిలింది.
    కళ్ళలో నీళ్ళు గిర్రున తిరుగుతుంటే రోషంగా అడిగాడు. "ఏం చేశానని కొడుతున్నావు? ప్రేమించడం తప్పా? మీరంతా ప్రేమించలేదా? నువ్వు నాన్నని ప్రేమించి, అమ్మమ్మ వాళ్ళని ఎదిరించి పెళ్ళి చేసుకోలేదా? అదే పని నేను చేస్తే తప్పా?"
    శిరీష ఆదిత్య మాటలకి నివ్వెరపోయి చూడసాగింది.
    ఆదిత్య ఎదిగాడు. శారీరకంగా, మానసికంగా ఎదిగాడు. వాడు చిన్న పిల్లాడు కాదు. తనకెందుకు తట్టలేదు ఈ వాస్తవం ఇంతకాలం? ఆదిత్య వయసు పెరుగుతోందని బాలుడు యువకుడిగా మారుతున్నాడని, మారడం అనివార్యమని తనెందుకు ఆలోచించలేదు. ఒకవేళ అలోచించి ఉంటె ఏం చేసేది? ఎదక్కుండా అడ్డు పడేదా? లేదుకదా , ఎదగడం ఎంత సహజమో వయసుకి తగిన ఆకర్షణసహజమే. ఈ ఎదుగుదల అనేది అవతల ప్రఖ్య కు కూడా ఇంకా సహజం కదా. కొత్తగా యవ్వనం లోకి అడుగు పెతుతున్న ఆ ఇద్దరినీ ఒంటరిగా వదిలేయడం లో తప్పు ఇద్దరిదీ ఉంది కదా! భాను తననే ఎందుకు నేరస్తురాలిని చేసింది? ఎందుకు అన్ని మాటలు అంది? ఎందుకు అంత ద్వేషం పెంచుకుంది?
    "తప్పు చేసి ఉండొచ్చు కానీ, దిద్దుకుంటానన్నాను కానీ, ఆవిడ నాకా అవకాశం ఇవ్వడం లేదు. తప్పు ఆవిడదే. వెళ్ళి అవిడ్నే అడుగు" అంటూ ఆదిత్య చివ్వున అక్కడి నుంచి లేచి బాల్కనీ లోకివెళ్ళి నిలబడ్డాడు.
    శిరీష కి కళ్ళ ముందు చీకట్లు కమ్మినట్టయింది. ఇంక నిలబడలేక రెండు చేతులతో తల పట్టుకుని తన గదిలోకి వెళ్ళి, మంచం మీద వాలి వెక్కి వెక్కి ఏడవసాగింది.
    బాల్కనీ లో నిలబడ్డ ఆదిత్య కి ఆవిడ వెక్కిళ్ళు వినిపిస్తున్నాయి. ఏం చేయాలో అర్ధం కాలేదతనికి. తనేం చేస్తే అమ్మ సంతోషిస్తుంది అని ఆలోచించసాగాడు. ఏం చేయాలో తోచని వాడిలా ఊహించని ఆ స్థితికి ఆదిత్య బిత్తర పోయి ఉండిపోయాడు. కాస్సేపటికి ఏదో నిర్ణయించు కున్నవాడిలా పరిగెత్తుకుంటూ ప్రఖ్య ప్లాట్ కి వెళ్ళాడు.
    ప్రఖ్య గదిలో పడుకొని ఉంది. బెల్ కొట్టగానే భాను తలుపు తీసింది. ఆదిత్యను చూసి అపరకాళీ అయ్యింది. "ఎందుకొచ్చావ్?" అని అడిగింది నిప్పులు కురిపిస్తూ.
    "అంటీ, నన్ను లోపలికి రానివ్వండి చెప్తాను ప్లీజ్..." బతిమాలాడు ఆదిత్య.
    "చంపేస్తాను...." గెటవుట్ " పళ్ళ బిగువున అరిచింది.
    'అంటీ ప్లీజ్ బైట మాట్లాడద్దు పక్కవాళ్ళు చూస్తారు నన్ను లోపలకు రానివ్వండి." అంటూనే ఆమెను తోసుకుని లోపలికి వచ్చి ప్రఖ్య గది వైపు చరచరా వెళ్ళాడు. మంచం పై పడుకున్న ఆమె భుజాలు పట్టుకొని లెవనెత్తీ , "ప్రఖ్యా నీకు చెప్పా కదా మనం పెళ్ళి చేసుకుందాం అని ఎందుకు మీరంతా గొడవ చేస్తున్నారు?" అన్నాడు కోపంగా.
    భాను విసురుగా వచ్చి ఆదిత్య చెంప చెళ్ళుమనిపించింది. "నీ బతుక్కి నా కూతుర్ని పెళ్ళి చేసుకుంటావా? ఇడియట్! నోరు మూసుకొని బైటకి నడువ్. ఇంకోసారి నా కూతుర్ని కన్నెత్తి చూసినా, పన్నెత్తి పలకరించినా నిలువునా నరికేస్తా."
    "అంటీ! నేను ప్రఖ్యని లవ్ చేస్తున్నా.... మేము పెళ్ళి చేసుకుంటే తప్పేంటి?" ఆమె కొట్టిన దెబ్బకి కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరుగుతోంటే రోషంగా అడిగాడు.
    "తప్పా తప్పున్నరా.... వెళ్ళరా! మెడపట్టి గెంటేస్తా ఇంకా స్సేపుంటే " అరిచింది భాను.
    ఆదిత్యకి ఆ క్షణం ఆవిడ అవతారం చూస్తె నిజంగానే భయం వేసింది.
    ఒక పక్క తల్లి దెబ్బలు, మరో పక్క ఈవిడ దెబ్బలు , ఎన్నడూ అనుభవంలోకి రాణి బాధ ఏడుపొస్తోంది తనేం తప్పు చేయలేదని పిస్తోంది. ఒకవేళ తప్పు చేసినా పెళ్ళి చేసేసుకుంటే ఆ తప్పు ఒప్పు అవుతుంది కదా! ప్రఖ్య తన భార్య అవుతుంది , ఏమవుతుంది? అతనికి ఎంత ఆలోచించినా అర్ధం కావడం లేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS