ఏం చేస్తున్నావురా? పూర్తిగా రంగుల్లో మునిగిపోయిన శిరీష అడుగుతూనే గబగబా బాత్ రూమ్ లోకి వెళ్ళిపోయింది.
హమ్మయ్య అనుకుంటూ ఆదిత్య తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆల్బమ్ లోంచి రెండు ఫోటోలు తీసుకున్నాడు. ఒకటి శిరీష తల్లితండ్రులతో ఉన్నది. మరోటి తాతయ్య, అమ్మమ్మ మాత్రమే ఉన్నది. తీసుకుని తన పుస్తకాల సొరుగు లో దాచేసి, ఆల్బమ్ పైన పెట్టేశాడు.
అమ్మ ఇంతకాలం తనకి ఈ ఆల్బమ్ ఎందుకు చూపించలేదో?
అసలైనా ఇన్నాళ్ళ నుంచి ఈ బుక్స్ రాక్ తను వాడుకుంటూ ఈ ఆల్బమ్ చూడక పోవడం ఏంటి?
ఎక్కడి నుంచి అయినా తీసి అమ్మ ఈ మధ్యే ఇక్కడ పెట్టి ఉండాలి.
అయినా తనకి ఒక్కసారన్నా ఎందుకు చూపించలేదు. అన్యాయం. తనకి మాత్రం తన తండ్రిని చూడాలని అనిపించదా? నాన్న ఎక్కడో ఉన్నాడో....? అమ్మమ్మ, తాతయ్య ఈ ఇంటికి ఎందుకు రారో, అమ్మకి అన్నయ్య లు , అక్కయ్య లు లేరా? వాళ్ళంతా ఎందుకు రారు?
ఆదిత్య ఆలోచిస్తూ అలాగే కూర్చుండి పోయాడు.
తను మాత్రం అమ్మ లాగా ఒంటిగా బతక కూడదు. తను పెళ్ళి చేసుకోవాలి. అవును ప్రఖ్య తను పెళ్ళి చేసుకోవాలి. బోలెడు మంది పిల్లల్ని కనాలి. తనకి పెద్ద కుటుంబం కావాలి. తనింటికి నిత్యం ఎవరో ఒకళ్ళు వస్తూ పోతూ ఉండాలి. ఈ ప్లాట్ లో అందరిలా తను కూడా పండగ లోస్తే గుమ్మాలకి మావిడితోరణాలు కట్టుకోవాలి. ప్రఖ్య గడపకి పసుపు రాసి, కుంకుమ పెడుతుందా? నేర్పించవచ్చులే.
ఆదిత్య కి ఆ మధ్య దసరా పండక్కి ఎదురింటి ప్లాట్ లో అంటీ గడపకి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టడం గుర్తొచ్చింది ఎంత అందంగా ఉండిందో ఆ గడప. గుమ్మలకి మావిడాకులు , బంతిపూలు ఎంతసేపూ చూసినా చూస్తూ ఉండాలని పించింది. అమ్మ అవన్నీ ఎందుకు చేయదు?
"అదీ ఏం చేస్తున్నావు? రా భోం చేద్దాం ఆకలేస్తోంది" అంటూ శిరీష పిలిచేసరికి ఆలోచనల్లోంచి తేరుకుని డైనింగ్ టేబిల్ దగ్గరకు వెళ్ళాడు.
శిరీష డిషెస్ అన్నీ టేబిల్ మీదకు చేరుస్తూ "సరదాగా నువ్వు కూడా పిల్లలతో కలిసి కాసేపు అడుకోక పోయావా? హోలీపండగసరదాగా ఉంటుంది"అంది.
"నాకిశ్యం లేదు" అన్నాడు ముక్తసరిగా.
ఇతని స్వరం విని తలెత్తి కొడుకు వైపు ప్రశ్నార్ధకంగా చూసింది శిరీష.
ఉదయం స్నానం చేసి తయారయిన లక్షణాలు లేవు.జుట్టంతా చెరిగి ఉంది.ఏదో తేడాగా కనిపించాడు.
"ఏమైందిరా ? పడుకుని లేచావా?" అడిగింది.
ఉలిక్కిపడ్డాడు. తడబడుతూ "ఆ....అవును" అన్నాడు కంచంలో పెట్టిన అన్నం కలుపుతూ.
"నీ పడకకి ఒక టైం అంటూ ఉండడం లేదు. చదువు నెగ్లెక్ట్ చేస్తున్నావు. ఎప్పుడూ నిద్రేనా?" తనూ కుర్చీలో కూర్చుని కంచం దగ్గరగా జరుపుకుంది.
ఆదిత్య మాట్లాడలేదు. కొన్ని క్షణాలాగి అడిగారు. "అమ్మా... అమ్మమ్మ, తాతయ్య ఎక్కడ ఉంటారు?"
ముద్ద నోట్లో పెట్టుకోబోతున్న శిరీష ఆశ్చర్యంగా చూసింది. "ఎందుకిప్పుడు నీకు వాళ్ళ విషయం?"
"ఊరికినే ...ఏం? మనం ఎప్పుడూ అమ్మమ్మ వాళ్ళింటి కి వెళ్ళకూడదా? నాకు వెళ్లాలని ఉంది. మనకెవరూ చుట్టాలేందుకు లేరు."
శిరీష మౌనంగా ఉండిపోయింది. ఈమధ్యే ఆమె క్కూడా తల్లిని చూడాలని బాగా అనిపిస్తోంది. వెళ్ళాలంటే అహం అడ్డోస్తోంది. అమ్మ ఎలా ఉందొ, వెళ్ళి ఇక్కడికి తీసుకొచ్చి తనతో ఉంచుకోవాలని చాలసార్లు అనిపించింది. గట్టిగా నిట్టూర్చి కొన్ని క్షణాల తర్వాత అంది. ఆమె స్వరంలో ఇందాకటి ఉత్సాహం కానీ అధార్టీ కానీ లేదు. కొంచెం వేదన కలగలిసిన స్వరంతో అంది. "తాతగారు పోయారు. అమ్మమ్మ తన విలేజ్ లోనే ఉంది. నాకూ అమ్మమ్మని చూడాలని ఉంది. కానీ ఆవిడ రాడు, నేను వెళితే రానిస్తుందో లేదో తెలియదు."
"ఎందుకని? ఎందుకు రానీయదు?"
శిరీష ఇదివరకులా నీకెందుకురా నోర్మూసుకో అని అనలేకపోయింది. అవును వీడూ పెద్దవాడవుతున్నాడు. వాడి సందేహాలు తీర్చాల్సిన బాధ్యత నాకుంది అనుకుంది.
"వాళ్ళకిష్టం లేని పెళ్ళి చేసుకున్నానని కోపం" అంది.
"మరి నాన్న ఎక్కడమ్మా?" అడిగాడు.
శిరీష గొంతులో ముద్ద అడ్డుపదినట్లు అయి మంచినీళ్ళు తాగింది. కాస్సేపు ఏం మాట్లాడకుండా కంచంలో చేయి పెట్టి అన్నం అటూ ఇటూ కెలుకుతూ ఉండిపోయింది.
తరవాత లేచి సింక్ లో చేయి కడిగేసుకుని నాప్ కిన్ తో చేయి తుడుచుకుంటూ అంది. అదీ...! నీకు ఏవేవో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉన్నట్టుంది. రాత్రికి చెప్తాను. అందాకా నన్ను వదిలేయ్ సరేనా?" అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
ఆదిత్య కి తల్లి అలా అన్నం తింటూ , తింటూ మధ్యలో వదిలేయడం బాధనిపించింది.
తనూ లేచి ఆవిడ వెనకాలే వెళ్ళి "సారీ అమ్మా!" అన్నం తినేటప్పుడు అడగాల్సింది కాదు నేను. సారీ! ప్లీజ్ వచ్చి అన్నం తిను" అన్నాడు బతిమాలుతూ.
శిరీష కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అవి ఆదిత్య చూడకుండా తుడుచుకుని "నాకాకలి లేదురా... నువ్వు తిను" అంది.
"ఇప్పుడేగా ఆకలేస్తోంది అని పిలిచావు. రామ్మా....! నువ్వు తినకపోతే నేనూ తినను." అన్నాడు గారంగా.
'అదీ...!" భావోద్వేగంతో అదిత్యని దగ్గరకు తీసుకుని తల మీద ముద్దు పెట్టుకుంది. తరవాత నెమ్మదిగా అంది. నువ్వు పెద్దవాడివి అవుతున్నావురా. సరే రా తిందాం." అంటూ డైనింగ్ టేబిల్ దగ్గరకు నడిచింది.
ఆదిత్య కి ఆమాట వినగానే ఛాతీ ఉప్పొంగినట్టు అయింది. "యస్ నేను పెద్ద వాదినయాను." అనుకున్నాడు గర్వంగా.
ఆ రాత్రి శిరీష క్లుప్తంగా తన గురించి తన తల్లిదండ్రుల గురించి ఆదిత్య కి చెప్పింది.
"మీ నాన్న మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడురా! కానీ, నీకోసం నేను మాత్రం పెళ్ళి చేసుకోలేక పోయాను" అంది.
"వివేక్ అంకుల్ ని నువ్వు పెళ్ళి చేసుకోవచ్చు గా" సడన్ గా అన్నాడు.
శిరీష మ్రాన్పడి పోయింది. ఆదిత్య చాలా పెద్ద వాడయాడు అనుకుంది.
ఆదిత్య అవిదనా స్థితిలో చూసి మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు.
శిరీష అలాగే చాలాసేపు కూర్చుండి పోయింది.
"వివేక్ తో తన అనుబంధం వీడికి తెలిసి పోతోందా?' తెలిసిపోయింది.
ఎలా? ఇప్పుడెలా?
ఆ రాత్రి ఆమెకి శివరాత్రే అయింది.
2
డాక్టర్ ప్రవీణ నర్సింగ్ హోమ్ . బైట డాక్టర్ ప్రవీణ, ఏం.డి. గైనిక్ అని బోర్డుంది. గ్లాస్ డోర్ కి చిన్న బోర్డు డాక్టర్ ఇన్ అని రాసి ఉన్నది వెలాడుతోంది. కారిడార్ లో పేషెంట్స్ కుర్చీల్లో కూర్చుని ఉన్నారు. అందరూ గర్బిణులే . కొందరు భారంగా లోపల్నించి బైటకి వెళ్తున్నారు. ఆయా ఒక్కొక్కరినే లోపలికి పంపిస్తోంది.
సాయంత్రం ఏడున్నర దాటి ఉండచ్చు.
అప్పుడే భానుప్రియ వెహికల్ వచ్చి గేటు ముందు ఆగింది. వెనక కూర్చున్న ప్రఖ్య దిగింది. భాను వెహికల్ దిగి ఓ పక్కగా పార్క్ చేసి, ప్రఖ్య చేయి పట్టుకుని లోపలికి నడిచింది.
ఆవిడ ముఖం గంబీరంగా ఉంది. కోపంగా కూడా ఉంది. ప్రఖ్య మోహంలో భయం, బాగా ఏడ్చినట్టు కళ్ళు ఉబ్బి ఉన్నాయి. మొహం వాడిపోయి ఉంది.
ఇద్దరూ లోపలికి నడిచారు.
ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చోమని చూపించింది ఆయా.
భానుప్రియ తన విజిటింగ్ కార్డ్ తీసి ఆయా కిచ్చింది. ఆయా అది తీసుకుని లోపలికి వెళ్ళి రెండు నిమిషాల్లో వచ్చి "కూర్చోండి పిలుస్తారు." అంది.
భానుప్రియ అసహనంగా కూర్చుంది. ప్రఖ్య మొహం దించుకుని ఏదో ఆలోచిస్తూ కూర్చుంది.
ఏం జరుగబోతోందో ఆమెకి విపరీతమైన టెన్షన్ గా ఉంది. తనూ, ఆదిత్య తపించి, తపించి పొందిన మధురానుభవం తాలుకూ ఫలితం భయంకరంగా ఉండబోతోందా? ప్రతి నెలా తొమ్మిది, పది తారీకుల్లో రావాల్సిన పీరియడ్స్ రాకపోడానికి అదే కారణమా? రోజూ నిద్రలేవగానే కళ్ళు తిరగడం, వాంతులు అవడం ఇదంతా ఆ అనుభవం తాలుకూ పరిణామమా? తను, తను అమ్మ అన్నట్లు అన్ మారీడ్ మదర్ కాబోతోందా?
అదేనిజమైతే తన కెరియర్ ఏం అవుతుంది? అందరూ తనని ఆహ్యించుకుంటారేమో....?" యెంత తప్పు చేసింది... ప్రఖ్య కి ఏడుపొస్తుంది.
ఆదిత్య కి చెబితే పెళ్ళి చేసుకుందాం అని వెంట పడుతున్నాడు. ఇది పెళ్ళి చేసుకునే వయసా? ఇప్పటి నుంచే పెళ్ళి చేసుకుంటే తన భవిష్యత్తు వంట ఇంటికి, పిల్లల్ని పెంచడానికి మిగిలిపోతుంది.... అది కాదె కావాల్సింది ....మమ్మీ ఆశలు, తన ఆశయాలు అన్నీ కొట్టుకు పోవడమేనా?
"ఏడవకు" భుజం మీద కొంచెం గట్టిగా కొట్టి తట్టి హెచ్చరించింది భాను. అలా హెచ్చరించడం లో ఓదార్పు లేదు చిరాకుంది. తన చేతి మీద పడిన రెండు కన్నీటి బొట్లు పైజమాకి తుడిచేసుకుంది ప్రఖ్య.
"వెళ్ళండి" ఆయా స్వరం వినబడడంతో తలెత్తింది. పేషెంట్స్ అందరూ వెళ్ళిపోయి నట్టున్నారు. ఖాళీగా ఉంది.
"పద" భాను లోపలికి నడిచింది. ప్రఖ్య అనుసరించింది.
నిమ్మపండు రంగు కాటన్ చీర, తెల్లని కోటు ప్రశాంతమైన చిరునవ్వుతో కూర్చుని ఉంది డాక్టర్ ప్రవీణ.
విష్ చేసిన భానుకి కుర్చీ చూపించింది . ప్రఖ్య ని తన పక్కనే ఉన్న స్టూల్ మీద కూర్చోమని సైగ చేసింది.
"ఈ అమ్మాయికి అబార్ధన్ చేయాలి" అంది భానుప్రియ సూటిగా విషయంలోకి వస్తూ.
ఆవిడ ముందు నిర్ఘాంతపోయింది. తరవాత అంది "ఎన్నో నెల?"
"తెలియదు."
"గర్భం అని ఎలా తెలుసు?" చిత్రంగా చూస్తూ అడిగింది.
