Previous Page Next Page 
ఒక కోయిల గుండె చప్పుడు  పేజి 39

    అతని స్వరంలో అణచుకున్న బాధా, వేదనా తొంగి చూశాయి. కానీ అవెం అనుపమని తాకలేదు.'
    "శాశ్వతంగా వుండండి. నేనేం వద్దనడం లేదు, కానీ నా బాబుని మాత్రం నాకు ఇచ్చేసి వెళ్ళండి."
    "ఇవ్వను.... నీ ఇష్టం ..... నీకు రావాలనిపిస్తే ఇప్పుడు రా.... లేదంటే ఇక్కడి వాళ్ళు మెడ పట్టి గెంటిందాకా వుండి రా: అంటూ గుమ్మం దాటుతున్న సారధి మొండితనానికి నిర్ఘాంత పోయిన అనుపమ చకచకా గదిలోకి వెళ్ళి నాలుగు చీరలు, జాకెట్లు , పేటీ కోట్లు ఎయిర్ బ్యాగ్ లో పెట్టుకుని ఉన్నదున్నట్లు బయలుదేరి , సారధిని కలుసుకుని, అతడిని అనుసరించింది.
    ఆమె అలా రావడంతో సారధికి విజయం సాధించానన్న తృప్తితో పాటు ఆనందం కూడా కలిగింది.
    బస్సులో పక్కన కూర్చున్న భార్యతో "థాంక్స్!' అన్నాడు.
    విసురుగా "మీ కోసం రావడం లేదు. నా కొడుకు కోసం వస్తున్నాను. అక్కడికి తీసుకెళ్ళి ఆ పెడ, మురుగులో నా కొడుకుని పడేస్తారేమో అనే భయంతో వస్తున్నాను."
    "పోనీలే! ఎలా అయితే ఏం, వస్తున్నావు చాలు' అనుకున్నాడు సారధి మనసులో.
    కానీ బాబుని ఒళ్ళో పెట్టుకుని ముభావంగా కూర్చుని, మధ్య మధ్య కళ్ళు తుడుచుకుంటున్న అనుపమని చూడగానే జాలేసి అన్నాడు మృదువుగా.
    "అనూ! చదువుకున్నదానివి. నువ్వు ఒక మామూలు స్త్రీలా ప్రవర్తిస్తున్నావు. పెద్దావిడ ఆవిడ భావాలు అర్ధం చేసుకోకపోతే ఎలా? ఎనభై ఆరేళ్ళు ఆవిడకి. ఎంతకాలం బతుకుతుంది చెప్పు?" పెంచిన నామీదా, రక్త సంబంధంతో కూడినా మమత వాడి మీదా ... ఆవిడకి ప్రేమ వుండదా?"
    "నేను పరాయిదాన్ని కదా.... నామీద లేదుగా! నేనెందుకు రావాలి?" - చటుక్కున అడిగింది.
    ఆమె వైపు నిశితంగా చూస్తూ అన్నాడు.
    "ఆ ప్రశ్నకి నీకే తెలుస్తుంది సమాధానం, కొంచెం ఆలోచిస్తే ."
    అనుపమ మాట్లాడకుండా కిటికీ లోంచి బయటకి చూస్తూ కూర్చుంది. అద్దాల్లోంచి సిటీ లైట్లు ధగధగా మెరిసిపోతున్నాయి. బస్సు దిల్ షుక్ నగర్ డిపో దాటి ముందుకు వెళ్ళిపోయింది. గమనించలేదు. కానీ, దాదాపు రామోజీ ఫిల్మ్ సిటీ కి చేరుతోంది.
    ఏసీ చల్లగా తగులుతోంది.
    సారధి మీద పీకల దాకా కోపం వచ్చింది అనుపమకి. 'నానమ్మ నానమ్మ అంటూ చిన్నపిల్లాడిలా ఆవిడ దగ్గరకు ఈ పరుగులెంటో! అయినా ఎనభై ఆరేళ్ళు వచ్చినావిడకి ఆరోగ్యం బాగాలేకపోవడం అనేది చాలా కామన్. దానికోసం ఈయన ఆఫీసు కి లీవు పెట్టి మరీ వెళ్ళాలా? పైగా 'మా ఊరు వెళ్తాను, మా ఊరు వెళ్తాను ....అక్కడే హాయిగా పంటలు పండిస్తాను' అంటూ గెంతు లొకటి. వెళ్ళి చూస్తె తెలుస్తుంది.
    ఇదివరకటి కంటే అక్కడ పుట్టి పెరిగాడు కాబట్టి హాయిగా వున్నాడు. ఇప్పుడు మూడేళ్ళ నుంచీ హైదరాబాద్ వాతావరణం , ఇక్కడి జీవన విధానం, ఈ సౌకర్యాలు -- ఇవన్నీ చూశాక అక్కడ వుంటాడా? చూద్దాం ఎలా వుంటాడో ! అసలు ఈ మూడు రోజులు ఎలా వుంటాడో చూస్తాను . కనీసం ఒక్కసారన్నా కచ్చితంగా అంటాడు తనతో - 'అనవసరంగా వచ్చాను అనూ! ఉండలేక పోతున్నాను ' అని' అనుకుంది అనుపమ. ఆలోచిస్తుండగానే కళ్ళు మూతలు పడ్డాయి.
    మెలకువ వచ్చేసరికి బస్సు గుంటూరు చేరింది. అక్కడి నుంచి మరో బస్సు ఎక్కాలి. అదృష్టవశాత్తు కావాల్సిన బస్సు వెంటనే దొరికింది.
    సారధి గబగబా బాబు నెత్తుకుని ఎక్కి అనుపమకి సీటు పెట్టాడు. అనుపమ కూడా ఎక్కి మొహం చిట్లించుకుని వచ్చి కూర్చుంది.
    ఓ గంటలో వాళ్ళు దిగాల్సిన ఊరు రావడంతో దిగేశారు. అటుగా వచ్చిన రిక్షా సుబ్బయ్య సారధిని చూసి గుర్తుపట్టి ఆప్యాయంగా నవ్వుతూ రిక్షా తీసుకొచ్చి సారధి చేతిలోంచి, అనుపమ చేతిలోంచి బాగులందుకుని రిక్షాలో పెట్టాడు.
    "బాబునివ్వండి" అంటూ చేతులు చాపుతుంటే అనుపమ చటుక్కున తను ఎత్తుకుని రిక్షా ఎక్కుంది. ఆ మట్టి చేతుల్తో ఎత్తుకుంటాడు కాబోలు అనుకుంటూ.
    సారధి కూడా రిక్షా "పోనీయ్" అన్నాడు.
    మూడేళ్ళ నాడు ఎలా వుందో అలాగే వుంది ఊరు. కాకపొతే అక్కడక్కడా ఆటోలు, కనిపిస్తున్నాయి. కాలేజీలకు వెళ్ళే అమ్మాయిలూ చుడీదార్లు వేసుకుని సైకిళ్ళ మీద వెళ్తున్నారు. పొలాల మీంచి చల్లగాలి వీస్తోంది.
    అనుపమకి చాలా హాయిగా ఆహ్లాదంగా అనిపించింది కానీ, ఆ మాట పైకి అనడానికి పౌరుషం అడ్డొచ్చింది.
    ఇల్లు చేరేటప్పటికి మావగారు, అత్తగారు, మరుదులు, తోతికోడళ్ళు, ఆడపడుచు- అందరూ కనిపించడంతో , ఆశ్చర్యంతో పాటు కొంత ఆందోళన కూడా చోటు చేసుకుంది అనుపమ మనసులో.
    సారధి అందర్నీ చూసి గాభరాగా అడిగాడు.
    "నానమ్మకేలా వుంది?" అంటూనే ఎవరి సమాధానం ఆశించకుండా లోపలికి పరిగెత్తాడు.
    సారధి వెనకే బాబు నెత్తుకొని గదిలోకి వచ్చిన అనుపమ స్థాణువైపోయింది.
    మంచానికి అంటుకుని పడుకుని వుందావిడ. మంచం పక్కన స్టూలు మీద మందులు, మంచినీళ్ళ గ్లాసు.
    ముడతలు పడిన మొహం, చూస్తుంటే ఆవిడ మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి.
    "ఈ వెధవ టమాటా కుళ్ళి చచ్చింది. దీన్ని తీసుకెళ్ళి ఆ పెరట్లో పారెయ్."
    అచ్చు కుళ్ళిన టమాటా లాగే వుంది ఆవిడ మొహం.
    అనుపమ ఒళ్ళు జలదరించింది. ఆ పరిసరాలు, వాతావరణం లో బాబుని ఎక్కడ దింపాలో , ఎక్కడ కూర్చో బెట్టాలో అర్ధంకాలేదు.
    ఇల్లంతా జనం.
    "ఈవిడ పోతుందో, పాదో కానీ ఏడాది కోసారి హడావుడి చేసి అందర్నీ పిలిపించుకోవడం బాగా అలవాటై నట్టుంది. ముసలమ్మ తక్కువది కాదు' తిట్టుకుంది అనుపమ.
    అందరూ అటూ ఇటూ తిరగడంతో అంతా మట్టి మట్టిగా వుంది. అందుకని వాడిని ఎత్తుకునే లోపలికి వెళ్ళింది. వాడిని ఎత్తుకునే నిలబడ్డది.
    అనుపమ వెనకే వచ్చిన ఆడపడుచు బాబుని అనుపమ భుజం మీద నుంచి తీసుకుంటూ "బుజ్జిగాడోచ్చాడే .... కన్నగాడు" అంటూ అన్నపూర్ణమ్మ మంచం దగ్గరగా వెళ్ళి, "నానమ్మా ...ఇదుగో నీ మునిమనవడు....లే.... లేచి కళ్ళు తెరువు" అంది.
    అనుపమకి కాళ్ళు, చేతులు వణికాయి.
    ఆడపడుచు ఈడ్చి తన్నాలని పించింది.
    రోగిష్టి మనిషి దగ్గరకు పసివాడ్ని అలా తీసుకెళ్ళడమేనా , వాడికి ఏదన్నా అయితే?! పిల్లలకి ఇన్ఫెక్షన్స్ త్వరగా వస్తాయి. ఈ మనుషులు నిజంగా పల్లెటూరి వాళ్ళంటే పల్లెటూరి వాళ్ళు' అనుకుంటూ బాబుని తీసుకోడానికి మంచం దగ్గరకు నడవబోతుంటే అత్తగారు వచ్చి అంది - "రామ్మా అనూ.... మొహం కడుక్కో ...స్నానం కూడా చేస్తే చేసేయ్.... నీళ్ళు కాగి వున్నాయి. కాఫీ తాగుదువు గాని" అని.
    సారధి మంచం దగ్గరగా వెళ్ళి డగ్గుత్తికతో పిలిచాడు "నానమ్మ" అంటూ.
    ఆవిడ నెమ్మదిగా కళ్ళు తెరిచింది.
    సారధి కళ్ళు మెరిశాయి.
    చెల్లెలి చేతిలోంచి బాబు నందుకుని ఆవిడ దగ్గరగా చూపిస్తూ .... "ఇదుగో నీ ముని మనవడు" అన్నాడు.
    ఆవిడ గాజు కళ్ళతో రెప్ప కాలం  ఆనందం. తరువాత కన్నీళ్ళు వచ్చాయి. వణుకుతున్న స్వరంతో " నా తండ్రిని ఎట్టుకోలేనురా నాయనా! అయిపొయింది .... ఇంక ఆదేవుడు పిలుస్తున్నాడు.... వెళ్ళిపోతున్నాను ' అంది.
    'అలా అనకు నానమ్మా! ఎక్కడికీ వెళ్ళవు. నా దగ్గరే వుంటావు. నిన్ను హైదరాబాద్ తీసుకెళ్తాను." ఏడుస్తూ అన్నాడు సారధి.
    జీవం లేని ఆ మొహం లో నవ్వు శవం దగ్గర వెలుగుతున్న దీపంలా అనిపించింది అనుపమ కి.
    గిర్రున తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోతూ "తీసుకురా ....నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను"అనుకుంది కసిగా.
    "నానమ్మా" అన్నాడు సారధి పొంగి వస్తున్న దుఃఖంతో.
    "నాన్నా! మీ ఆవిడకి నచ్చచెప్పి ఇక్కడికి వచ్చేయ్. ఈ ఇల్లు నీకే రాశాను. హైదరాబాదు లో వుండలేవు. అది మనది కాదు. మనవాళ్ళు ఎవరూ అక్కడ లేరు. మనకక్కడ స్థాన బలిమి వుండదు నాయనా! ఆంధ్రులంటే ఆత్మాభిమానం, పౌరుషం వున్నవాళ్ళు - అక్కడ అందరూ ఆంధ్రా వాళ్ళు, ఆంధ్రా వాళ్ళు అంటూ వాగుతున్నారుటగా , మనదేశం, వాళ్ళ దేశం వేరు వేరుటగా.... ఇక నుంచీ వాళ్ళ చేత మాటలు పడుతూ ఎందుకురా అక్కడ? నా మాట విని వచ్చేయండి నాన్నా. మనదేశానికి వచ్చేయండి.... మనకేం రా మహారాజులం.... దర్జాగా బతకచ్చు ఇక్కడ"అంది.
    సారధికి ఉప్పెనలా ముంచుకొచ్చింది దుఃఖం.
    "అలాగే నానమ్మ" అన్నాడు.
    ఆవిడ మాటలు, సారధి దుఃఖం ఎంత వద్దనుకున్నా వినిపిస్తుంటే అనుపమకి అయోమయంగా అనిపించింది.
    వాళ్ళ మాటలు వింటూ శిలలా నిలబడిన అనుపమకి అత్తగారు టవల్ అందిస్తూ అంది "వెళ్ళమ్మా ....నువ్వు వెళ్ళి మొహం కడుక్కో."
    అనుపమకి సారధి అలా ఏడుస్తుంటే తిక్క రేగుతోంది. "ముసలావిడ పోక ఇంకా వుంటుందా? ఈయనకేం పిచ్చా? ఆ ఎడుపెంటి?" అనుకుంటూ బ్యాగ్ లోంచి బ్రష్ టంగ్ క్లీనర్ తీసుకుని కొత్తగా కట్టిన బాత్ రూమ్ లోకి వెళ్ళిపోయింది.
    అనుపమ స్నానం చేసి వచ్చేసరికి సారధి బ్రష్ చేసుకుని వచ్చాడు. అతను కాఫీ తాగుతున్నాడు. బాబుకి పాలు పడుతోంది ఆడపడుచు. అనుపమకి మతిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS