దానికి అన్నపూర్ణమ్మ కూడా పెద్ద మనసుతో స్పందిస్తూ అంది. "మీ అమ్మాయి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. మా ఇంట్లో దేనికీ లోటు లేదు. సుఖంగా వుంటుంది. మీరేం బెంగ పెట్టుకోకండి."'
అయన, అయన భార్యా ఆవిడ విశాల హృదయానికి మురిసిపోయారు.
అయితే అనుపమ కాపురానికి వచ్చాక కొంతకాలం బాగానే అనిపించింది. కమ్మగా వండి పెట్టె నానమ్మ, ప్రేమగా చూసుకునే భర్త , దేనికీ లోటు లేని జీవితం పుట్టినప్పటి నుంచీ నగరపు గందరగోళం లో గడిపిందేమో ప్రశాంతమైన ఊరు, ఆ ఉళ్ళోని మనుషులు, పచ్చటి పొలాలు, ఏంతో నచ్చాయి. పేరుకి పల్లెటూరు అయినా ,మూడు సినిమా దియేటర్లు వున్నాయి. వారానికి రెండు రోజులు సినిమాకి వెళ్ళిపోతారు మొగుడూ, పెళ్ళాం. బోరు కొట్టినప్పుడల్లా అలా పొలాల మీదికి షికారు వెళ్తారు. ఇప్పటి దాకా సారధి తనేం కోరినా చేస్తున్నాడు. కాదని అనడం లేదు. అయితే అది కొద్ది కాలమే!
దానికి కారణం కొన్నాళ్ళు కొత్త కదా అని వదిలేసినా అనుపమ ఇంట్లో పూచిక పుల్ల కూడా తీయకుండా టివి చూస్తూ రేడియో వింటూ కూర్చోడం, లేకపోతె నిద్రపోవడం చూసి నానమ్మ "ఈ అమ్మాయికి నెమ్మదిగా పనీ, పాటా నేర్పాలి. ఇంక ఈ ఇంటి వాతావరణానికి పద్ధతులకి అలవాటు చేయాలి' అనుకుంటూ నెమ్మదిగా అనుపమని పనిలో పడేసే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం లో తనకు తెలిసిన పాత పద్దతే పాటించింది.
ఆ పద్దతి అనుపమకి నచ్చలేదు.
"అమ్మాయ్ , ఆడపిల్లవి - పని పాటా వచ్చి వుండాలి... ఇలారా.... వంటలో నాకు సాయం చేయి" అంటూ పిలిచి ఆ పనీ, ఈ పనీ చెబుతూ, చేయిస్తూ వుంటే ఆ వంటగది, కట్టెల పొయ్యి పొగ, ఒక పక్క పెద్ద రోలు, రోకలి, పొత్రం, కాఫీ డికాషన్ వడగోట్టిన బట్ట....అదంతా చూడగానే 'ఛీ ఛీ వంటిల్లు ఇలాగా ఉంచుకునేది . ఇక్కడ చేస్తున్న వంట తింటున్నానా ఛీ' అనుకుంది.
"నేనిక్కడ వంట చేయను. నాకు వంట రాదు" అని తప్పించుకోబోతుంటే....
"ఇప్పుడంటే నేనున్నాను. ఎంతకాలం వుంటాను. నేనుపోతే మొగుడికి వంట చేసి పెట్టవూ. ఇలారా.... నేను వంట చేస్తాలే గానీ పై నుంచి నాకు నువ్వు అన్నీ అందించాలి. చేతికింద సాయానికి వుండాలి. అలా ఊరికే కూర్చో కూడదు. ఇలారా ఈ తామాటా పండు కుళ్ళి పోయింది గానీ తీసుకెళ్ళి పెరట్లో పడేసిరా... ఇదిగో ఈ కాకరకాయ పండిపోయింది ఇది కూడా పెరట్లో పడేయ్. అలాగే కాసిని బెండకాయలు, దొండకాయలు కసాయేమోచూసి తెంపుకురా" అంటూ పనులు పురమాయిస్తుంటే ఒళ్ళు మండిపోసాగింది అనుపమకి.
వంటగదే కాదు , పెరట్లోకి వెళ్ళడం కూడా ఏ మాత్రం ఇష్టంలేదు అనుపమకి. కాపురానికి వచ్చిన నేలలోపలే సారధిని పోరి దక్షిణం వైపు సందులో ఒక బాత్రూం కట్టించింది. లేకపోతె తడికలు దడిగా కట్టిన ఓపెన్ ఏరియాలో స్నానం చేయాల్సి వచ్చేది.
ఓ పక్క బావి, మరో పక్క పంపు. దేని చుట్టూ సిమెంటు తో హద్దులు కట్టి లేదు. మరోపక్క గొడ్ల చావిడి, కాంపౌండ్ వాల్ , ఆవాల్ మీద అంటించిన పిడకలు, ఆవులు, గేదెల పెడ వాసన . కాళ్ళు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు , బట్టలుతికిన నీళ్ళు పోసి పెంచే కూరగాయల చెట్లు, చిత్తడిగా వుండే నేల. పైగా గోడమీదకి పాకిన దొండ పాదు , కాకర పాదు నుంచి కాయలు తెంపాలంటే ఆ చిత్తడి లోంచి నడవాలి. కప్పలు పెరడంతా తిరుగుతూ వుంటాయి. ఆ పెరడు చూస్తె వాంతి వచ్చినట్టు అవుతుంది అనుపమ కి. కుళ్ళిన, పాడైన కూరగాయలు చెత్తతో పడేసి బయట పారేయకుండా అన్నీ పెరట్లో పారేయడంతో వాసన వస్తున్నట్టు అనిపిస్తుంది అనుపమకి. ఏంటో ఈ మనిషి... బొత్తిగా శుచి, శుభ్రం లేవు అని తిట్టుకోడం దాకా వచ్చింది పరిస్థితి.
బెండకాయలు తెంపుకొస్తే 'అయ్యయ్యో ఇవి ముదిరాయి. రేపట్నించీ ఏ రోజు కాసినవి అ రోజు తెంపేస్తూ వుండు. ఒక్కరోజు అయినా ముదిరి చస్తాయి. ఇంద తీసుకెళ్ళి ఇలా చీల్చీ పెరట్లో పడేసిరా.... మళ్ళీ మొక్కలోస్తాయి. అన్నట్టు గోంగూర వలచిన కాడలు పారేయకు. కొద్దిగా తవ్వి పాతిపెట్టు. మళ్ళీ గోంగూర వస్తుంది' అంటూ పనిమీద పని చెబుతుంటే, 'ఈవిడకి ఇంత కక్కుర్తి ఏంటి? పదిరూపాయలు పడేస్తే కిలోలకు కిలోలు వస్తాయి కూరలు. వాటికోసం ఈ కుళ్ళి పోయినవి, ఎండి పోయినవి వేయాలా? వీటితో ఎంత పంట పందిస్తుందో ఈపిసినారి మహాతల్లి" అనిపించేది. గొడ్ల చావిడి లో పనివాడున్నా ఈవిడ కచ్చితంగా ఉదయమే చావిట్లోకి వెళ్ళి , 'ఈ వెధవ సరిగా పనిచేసి చావడం లేదు" అంటూ చేత్తో పేడ తీసి శుభ్రం చేస్తుంటే కంపరం పుట్టేది. ఆ చేతులు డెట్టాల్తో కడుక్కోకుండా నీళ్ళతో కడిగేసుకుని వచ్చి వంట చేస్తుంటే చూసిన అనుపమకి 'ఈవిడ వంట ఇంత అన్ హైజేనిక్ గా చేస్తుందా... బాబోయ్ దీన్నైనా నేనిన్నాళ్ళూ లొట్టలేసుకుంటూ తిన్నాను' అని భయపడిపోయింది. అప్పటికప్పుడు ఆమెకి తన కడుపులో రకరకాల పురుగులు తిరుగుతున్నట్టు అనిపించింది.
"అమ్మో ఇలాంటి చోట తనని తీసుకొచ్చి వదిలారా అమ్మా.... నాన్నా... వెళ్ళిపోవాలి. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి'అనుకుని, వెంటనే సారధితో అంది - "మనం వెంటనే హైదరాబాదు వెళ్ళిపోవాలి... తక్షణం వెళ్ళాలి" అని.
"ఇక్కడ నీకొచ్చిన ఇబ్బందేంటి?" అని అడిగిన సారధితో - "అన్నీ ఇబ్బందులే!అవన్నీ మీకు చెప్పినా అర్ధం కావు. అయినా ఇంత చదువు చడువి పల్లెటూరి బైతులా వ్యవసాయం చేయడం ఏంటి మీరు? మంచి ఉద్యోగాలు వస్తాయి . అప్లయి చేయండి."
హైదరాబాదు వెళ్దాం అంటున్న భార్య వైపు పరిశీలనగా చూస్తూ అన్నాడు సారధి.
"అనూ అలా అంటున్నావు కానీ, ఒక్కసారి అద్దంలో నిన్ను నువ్వు పరిశీలనగా చూసుకో.... వచ్చినప్పటికన్నా ఇప్పుడు రంగు వచ్చావు.... నిగానిగలాడుతున్నావు.... సన్నగా వుండే దానివి చక్కగా ఒళ్ళోచ్చింది. ఇక్కడ మనం తినే తిండి ఆర్గానిక్ తిండి. మనం ఎటూ వెళ్ళకుండా వెతుక్కోకుండా ఆర్గానిక్ తిండి లభిస్తోంది. కెమికల్స్ వేసి పండించే పంట వలన ఆరోగ్యం పాడవుతుందని సూపర్ మార్కెట్ వాళ్ళు ఎంత ధరకు అమ్ముతున్నారో నీకు తెలియదా? నా మాట విను . ఇది మరీ పల్లెటూరేం కాదు. డెవలప్ .... కాలేజీ వుంది, మంచి హాస్పిటల్ వుంది. సినిమా హాల్స్ చూశావుగా.... బానే ఉన్నాయి వున్న మూడు, తోచనప్పుడు అలా పొలాల వైపు స్వచ్చమైన గాలి పీలుస్తూ నడుస్తుంటే ఏంతో హాయిగా వుంటోంది. హైదరాబాదు లో ఆ ట్యాంక్ బండ్ మీద నడుస్తుంటే కంపుతో ముక్కు బద్దలై పోతుంది. వాహనాల పొగతో నిండిన కాలుష్యపు గాలి ఏం బాగుంటుంది?" అంటూ నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు.
కానీ ససేమిరా అంది అనుపమ.
"మీ నాన్నమ్మ చాదస్తం కన్నా నాకు ఆ కాలుష్యమే బాగుంటుంది" అంది.
అప్పటికే తెలంగాణా, ఆంధ్రా ఉద్యమం మొదలై , తెలంగాణా ప్రత్యెక రాష్ట్రంగా ఏర్పడడం అనివార్యం అని తెలిసిపోయిన సారధికి అనుపమ మొండి పట్టు పడుతుంటే చికాకొచ్చింది.
"మళ్ళీ నన్నక్కడ నుంచి వెళ్ళగోడితే ఏం చేయను?' అన్నాడు.
"ఎందుకు వెళ్ళగొడతారు? వాళ్ళ రాష్ట్రం వాళ్ళు పాలించుకుంటాం అంటున్నారు కానీ ఉన్నవాళ్ళ ని వెళ్ళగోడతాం అనలేదు.ఇదంతా రాజకీయ లబ్ది కోసం ఏడిచే ఏడుపు. కామన్ మాన్ కి వచ్చే ఇబ్బంది ఏం వుండదు. ఎట్టి పరిస్థితుల్లో నేనిక్కడ వుండను.మీరు రాకపోతే నేనొక్కదాన్నే వెళ్ళిపోతాను." అని పంతం, పట్టుపట్టడంతో అన్నపూర్ణమ్మ మనవడికి చెప్పింది.
"వెళ్ళు నాయనా.... కొంతకాలం అక్కడా వుండి ఆ జీవితం కూడా చూసిరా..."
నాన,మ్మ కూడా అలా అనడంతో సారధికి తప్పలేదు.
హైదరాబాదు వచ్చాక ఆ గందరగోళంలో అతనికి చాలా కాలం ఏమీ అర్ధం కాలేదు.ఏనాడూ ఒక్క పది రూపాయలు పెట్టి ఏమీ కొనని అతను పాలకూర కట్టలు పదికి నాలుగు కొంటుంటే గుండె ఆగిపోయింది.
'ఈ లెక్కన నెలకి తనకొచ్చే జీతం సరిపోదు' అనుకుని అనుపమని అడిగాడు- "ఉద్యోగం చేస్తావా?" అని.
"నేనా? ఉద్యోగమా? నో, నెవ్వర్.... నాకు అడ్డమైన వాళ్ళని సార్ సార్ అంటూ వాళ్ళ దగ్గర పనిచేయడం అంటేనే అసహ్యం. అయినా నేనెందుకు చేయాలి? ఉద్యోగం అనేది మీ బాధ్యత. మీకు వండి పెట్టడం నా భాద్యత... అంతే!" అంటున్న ఆమె వైపు చూస్తూ "ఈమె ఈ ట్వంటీ యత్ సెంచరీ లో ఎలా పుట్టిందిరా బాబూ" అనుకున్నాడు.
సారధికి గడిచిన రోజుల జ్ఞాపకాలతో అనుపమ అంటే మొండితనానికి మారుపేరు అనిపించింది. ఈమెకి సమాధానం తనూ మొండిగా వుండడమే అని ఆ క్షణమే నిర్ణయించుకుని అన్నాడు.
"నేను బాబుని తీసుకుని వెళ్తున్నాను. నువ్వుకూడా వస్తే బాగుంటుంది. లేకపోతె నేను తిరిగి ఇక్కడికి రాను. మనది కానిచోట వుండటం నా కిష్టం లేదు."
"అంటే నా ఇష్టం లేకుండా బాబుని తీసుకెళ్తారా?"
"ఏం? ఎందుకు తీసుకెళ్లకూడదు? వాడు నాకు కూడా కొడుకే."
"కన్నది నేను."
"అందుకు కారణం నేను."
"అలాగా! సరే అయితే తీసుకెళ్ళండి. నేను మాత్రం రాను. మీ ఇష్ట్టం . ఏం చేసినా సరే."
"ఏం చేస్తాను? ఏమీ చేయను... మొండివాడు రాజుకన్నా బలవంతుడు" అని సారధి వెళ్ళిపోతుంటే -- మండిపడుతూ చూసింది అనుపమ.
అయితే అన్నట్టుగానే మర్నాడు బాబుని ఎత్తుకుని, సూట్ కేసు తీసుకుని వెళ్తున్న సారధి వైపు నివ్వెరపోతూ చూసిందామే.
"నిజంగా తీసు కెళ్తున్నారా వాడిని? నాకేం విలువ లేదా ఇక్కడ?"
"నీకు ఇంతకాలం చాలా విలువ ఇచ్చాను అనూ! కానీ, నువ్వే అది నిలుపుకోవడం లేదు. నేనేం శాశ్వతంగా నిన్ను వదిలి వెళ్ళడం లేదుగా! నానమ్మ కి ఏ క్షణానైనా ఏమైనా కావచ్చు. ఆవిడకి ఏదన్నా అయితే జీవితాంతం నన్ను నేను క్షమించుకోలేను. మునిమనవాడిని చూడాలని ఆవిడ ఎంత తహతహలాడుతోందో నాకు తెలుసు. అమ్మా నాన్నా అయినా ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళారు కానీ, నానమ్మ అసలు చూడలేదు. నువ్వు పెద్దదానివై నీకూ మనవడు, మునిమనవడు వస్తే తెలుస్తుంది ఆవిడ బాధ" అన్నాడు సారధి.
