"బాబుకి ఏం పాలు పడుతున్నారు?' అడిగింది అత్తగారిని.
"ఏం పాలెంటమ్మా! ఆవుపాల కన్నా శ్రేష్ఠమైనవి ఏమున్నాయి? మన ఇంటి పాడి, కమ్మటి పాలు , అడిగి మరీ తాగుతున్నాడు"అంది నవ్వుతూ.
అనుపమ కోపం అణచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
కాస్సేపటికి అత్తగారిపిలుపు వినిపించింది.
"అమ్మాయ్ అనూ.... రామ్మా ఇడ్లీ వేడిగా ఉంది తిందువు గాని."
అనుపమ వీధి వాకిలి అరుగు మీద కూర్చుని వీధిలో తిరుగుతున్న జనాన్ని, పశువులని, పక్షులని చూస్తోంది . ఆమె మనసు కుతకుతలాడుతోంది.
"ఇంక ఇక్కడ తనమాట ఎవరూ వినరు. విన్నా విలువ ఇవ్వరు. బాబుని కూడా తన చేతుల్లోంచి లాగేసుకుని వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. వాళ్లకి తోచిన తిండి పెడుతున్నారు. వాడి ఆరోగ్యం ఏమన్నా కావాలి. వీళ్ళ సంగతి తీస్తాను" అనుకుంటోంది.
వెనుక నుంచి వచ్చిన సారధి , "అనూ వినిపించడం లేదా ? అమ్మ పిలిచింది. నేను పిలిచాను. ఏంటి... ఇక్కడ ఏం చేస్తున్నావు?' అడిగాడు.
అనుపమ విసురుగా తలతిప్పి చూసి, "గాడిదలు కాస్తున్నాను. నా జోలికి రాకండి. వెళ్ళండి మీ నానమ్మ దగ్గరకు. ఛీ, ఛీ డిసిప్లిన్ లేదు, నీట్ నేస్ లేదు ఎవరికీ . ఈ మురికి మనుషుల దగ్గరకు వద్దన్నా తీసుకోచ్చారుగా! ఇంక నా జోలికి రావద్దు" అంది.
సారధికి అర్ధమైంది.
ఆమె అలిగింది.
బాబుని అందరూ ఎత్తుకుని తిప్పుతూ వాళ్ళే పాలు తాగిస్తున్నారు. వాళ్ళే ఇడ్లీ పెట్టారు.
నీళ్ళు పోశారు.
ఇప్పుడు ఆమెని బతిమాలే సమయం కాదు, సందర్భం కాదు. అందుకే అన్నాడు నెమ్మదిగా.
"అలిగితే అలిగావు కానీ వచ్చి టిఫిను తిను."
"తినను " - గట్టిగా అంది అనుపమ - "తినను.. వెళ్ళండి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి."
"ఏంటి అనూ ఈ మొండితనం..."
'అవును నేను మొండి దాన్నే సరేనా ?"
"సారధి చేసేది లేక లోపలికి వెళ్ళాడు.
అతనికి ఎదురు వచ్చిన చెల్లెలు శోభ "ఏంటి సంగతి' అన్నట్టుగా చూసింది.
"ఏముంది? మీ వదిన మొండిది. ఆవిడ ఏదంటే అదే కరెక్టు అనాలి. అనకపోతే అలుగుతుంది. ఆవిడ కుందేలుకు మూడే కాళ్ళంటే నాలుగోది విరగొట్టి అయినా మూడే కాళ్ళు అనాలి" అంటూ నానమ్మ గదిలోకి వెళ్ళిపోయాడు.
అనుపమ టిఫిను తినకుండా అలా పంతం పట్టి కూర్చోడంతో విషయం అర్ధం చేసుకున్న అత్తగారు పిల్లావాడిని తీసుకొచ్చి ఆమె చేతికి ఇచ్చింది.
"రామ్మా లోపలికి.... ఇక్కడ కూర్చుంటే బాగుండదు. ఇది పల్లెటూరు. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు." అంటూ బలవంతంగా లోపలికి తీసుకు పోయింది.
ఆ సాయంత్రానికి తెలిసిన సంగతి ఏంటంటే అన్నపూర్ణమ్మ పెరట్లో పనిచేస్తూ చేస్తూ జారి పడింది.
మోకాలు వాచిపోయింది. నడుం విరిగింది. దాని వలన జ్వరం వచ్చింది. దాంతో ఖంగారు పడి అందరికీ ఫోన్లు చేయించింది.
అది విన్న అనుపమకి అరికాలి మంట నెత్తి కెక్కింది.
"ఈవిడకి ఎప్పుడో నాన్నా పులి కధలోలా అవుతుంది" అనుకుంది.
ఆయుర్వేద వైద్యుడు శంకరాచారి వచ్చి రెండు పూటలా కాళ్ళకి ఏదో మూలికల నూనేతోమర్ధన చేసి మందులిచ్చి వెళ్తున్నాడు.
రెండు రోజులు గడిచాయి.
అనుపమ సంగతి తెలిసిన ఇంటిల్లిపాదీ బాబుని ఎత్తుకోవడం మానేశారు. ఆమెతో జాగ్రత్తగా మెలగసాగారు.
అన్నపూర్ణమ్మ కొంచెం కోలుకుంది.
గాజుకళ్ళ లలో కొంత వెలుగు వచ్చింది.
ఆరోజు సోమవారం సాయంత్రం బస్సుకి సారధి కుటుంబం బయలుదేరాలి.
శంకరాచారి వచ్చి, కాళ్ళకి మార్చనా చేసి, "మామ్మగారూ! మీ ముద్దుల మనవడు వచ్చాడు. మునిమనవడు వచ్చాడు. ఇంక లేచి తిరుగుతారా? నాలుగు అడుగులు వేయండి నెప్పి తగ్గిందేమో చూద్దాం" అన్నాడు.
ఆవిడ అంటోంది - "నాలుగేం ఖర్మ... నలభై అడుగులు వేస్తాను.. నా బుజ్జి కన్న వచ్చాడు. నా ఇంట్లో వెలుగొచ్చింది.
"నాకు తెలుసులెండి మీరు నడవగలరని. మీకేమండి, ఇనుప శరీరం మీది. సారదీ! మీ నాన్నమ్మ ఇంకా పదేళ్ళు గ్యారంటీ నయ్యా. ఆవిడ తినే తిండి మామూలు తిండా? ఈ రోజుల్లో మందులు వేసి కృత్రిమంగా పండించిన పంట తాలుకూ ధాన్యాలు, కూరలు , పండ్లు తింటూ మనుషులు అర్ధాయుష్కులై పోతున్నారు. ఉన్నవాళ్ళకి చిన్నవయస్సు లోనే బిపీలు, షుగర్లు . మీ నానమ్మ గారు ఆవిడ చేతుల్తో స్వయంగా పండించుకున్నవి తిని ఎంత ఆరోగ్యంగా వున్నారో! ఇంక నా అవసరం ఏం లేదీవిడకి" అంటుంటే అందరి మొహాల్లో ఆనందం పొంగి పోసాగింది.
బాబుకి అన్నం తినిపిస్తూ ఎత్తుకుని అటూ ఇటూ తిరుగుతున్న అనుపమ కి వాళ్ళ నవ్వులు, ఆచారి మాటలు చిరాకేశాయి. ఆ మాటలు వినిపించుకోకుండా వంటింటి తలుపు తీసుకుని పెరటి గేటు దగ్గరకు వచ్చింది.
అక్కడి దృశ్యం చూసి స్థాణువై పోయింది.
ఆమె వచ్చిన దగ్గర్నించీ పెరటి వైపు వెళ్ళకుండా జాగ్రత్త పడింది. ఆమెకి తెలుసు అటు వెడితే తనకి తిండి సయించదని.
ఈమధ్య పెరడు కాంపౌండ్ వాల్ అవతల వున్న ఖాళీ స్థలంలో కుక్కలు, పంది కొక్కులు వచ్చ్గేస్తున్నాయని పెరటి వైపుకి ఓ చెక్క గేటు పెట్టించారు.
ఆ గేటు తీసుకుని వెళ్ళి తోటికోడలు కూరగాయలు తెంపుకుని రావడం చూసింది అనుపమ.
కాకపొతే ఆ గేటు తీసిన వాళ్ళు ఎప్పటి కప్పుడు వేసేసి వస్తున్నారు. అందుకే అనుపమకి అటు వెళ్ళినా పెరడు కనిపించలేదు ఈ రెండు రోజులూ.
ఈ రోజు ఎవరు తీశారో వేయలేదు. తెరిచి వున్న గేటులోంచి కనిపిస్తున్న పెరదుని అనుపమ కళ్ళప్పగించి చూస్తూ వుండిపోయింది.
పచ్చని ఆకుల్తో రంగురంగుల పూలతో, విరగబూసిన కాయగూరల మొక్కలతో నిండి పక్షుల కిలకిలా రావాలతో శోభాయమానంగా ఆహ్లాదకరంగా వున్న ప్రకృతి సోయగం.
ఎంత బాగుంది పెరడు! ఏంటి ఇన్ని చెట్లు ,ఇన్ని మొక్కలు ఎక్కడి నుంచి వచ్చాయి ? ఇంత పరిశుభ్రంగా ఎలా వుంది? ఈ పక్షులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి.
నెమ్మదిగా అటు నడిచింది. ఏపుగా పెరిగిన గన్నేరు చెట్టు మీద పక్షి గూడు అందులో కువకువ లాడుతున్న పక్షి పిల్లలు.
వాటిని చూడగానే అనుపమ విప్పారిన మొహంతో బాబుకి వాటిని చూపిస్తూ చుట్టూ చూసింది.
ఒక పక్క కాకర తీగ, చిక్కుడు తీగ, దొండపాదు , బెండ పాదు , టమాటా మొక్కలు, దోసపాదు , మరోపక్క సన్నజాజితీగ, గులాబీలు, బావికి వెనగ్గా ఏపుగా పెరిగిన సపోటా, జామచెట్లు, నిండా విరగకాసిన జామకాయలు, సపోటాలు, పక్వానికి రావడానికి సిద్దంగా వున్నాయి.
అప్రయత్నంగానే ఆమె పాదాలు ఆ వైపు నడిచాయి.
విరగకాసిన చిక్కుడు కాయలు, ఆకు, ఆకు చాటునా తొంగి చూస్తున్న దొండకాయలు, దోరగా పండి దోబూచులాడుతున్న టమాటాలు, తీగ మీదా, నేలమీదా బరువుగా జారుతూ తోటి చెలి మొక్కలతో బంతులాడుతున్న దోసకాయలు.
ఎక్కడివన్నీ...!
ఎలా అయింది ఈ కుళ్ళు కంపుకొట్టే పెరడు ఇలా ఇంత పచ్చపచ్చగా , ఎర్ర ఎర్రగా కళకళలాడుతూ!!??
కళ్ళప్పగించి నిలబడిపోయిన అనుపమ భుజం మీద చెయ్యేసి అంది తోటికోడలు మీర.
"నానమ్మ గారు కుళ్ళిన టమాటాలు, పండిన కాకరకాయలు, పాడైపోయిన బెండకాయలు పడేసి పెంచిన తోట అనుపమా ఇది. ఆవిడకి గొప్పులు తీయడం, విత్తనాలు నాటడం, మండులేయడం ఏమీ తెలియదు. దోసకాయ తరిగి ఆ గింజలు తీసి చల్లేది ఇక్కడంతా. ఎన్ని దోసకాయలో.... ఊరంతా పంచి పెట్టినా కాస్తూనే వుంటాయి. నీకు తెలుసా! ఈ చుట్టూ పక్కల వాళ్ళెవరూ కూరగాయలు ఎక్కడా కొనరు. ఇక్కడి నుంచి కావాల్సినన్ని తెంపుకుని వెళ్తారు. పాపం నానమ్మ గారు ఒక్కరే ఒండుకోలేరని వాళ్ళే వండి ఆవిడకీ ఇంత తీసుకొచ్చి ఇస్తూ వచ్చారు. నానమ్మ సారధి వెళ్ళిపోయాక చాలా బాధపడింది. అక్కడి నుంచే ఆవిడకి అనారోగ్యం కూడా మొదలైంది. అంతకు ముందు తలనొప్పి అని కూడా ఎరుగదు."
అనుపమ సమాధానం చెప్పలేదు.
ఆమెకి చిత్రంగా వుంది.
తమాషాగా ఉంది.
ఏదో తెలియని అనుభూతితో మనసంతా నిండిపోయింది.
ఆచారి మాటలు, తోటికోడలి మాటలు పదేపదే చెవుల్లో ప్రతిధ్వనిస్తుంటే అన్యమనస్కంగా వుండిపోయింది.
సాయంత్రం ఆరు దాటింది.
సారధి సాయంతో కర్ర పట్టుకుని నడిచి వచ్చి హల్లో కూర్చుంది అన్నపూర్ణమ్మ.
పిల్లలు, పెద్దలూ అందరూ ఆవిడ చుట్టూ కూర్చున్నారు.
"నేనివాళ వెళ్ళిపోతున్నాను నానమ్మా" అన్నాడు సారధి.
ఆవిడ ఏం మాట్లాడలేదు. కొద్ది సేపటికి అంది.
"తప్పదుగా నాయనా! పట్నం ఉద్యోగం కదా. నీ పైవాడికి సమాధానం చెప్పుకోవాలాయే. కానీ వెళ్ళు....ఏం చేస్తాం?" అంది నిర్లిప్తంగా.
సారధికి బాధగా అనిపించింది.
ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి లేచి పడకగది గుమ్మంలో నిలబడి చూస్తున్న అనుపమతో అన్నాడు.
"సామాను సర్దావా?"
"ఏం సామాను?'అడిగింది అనుపమ.
సారధి చికాగ్గా చూశాడు.
"వెళ్ళిపోతున్నాంగా ఇంకా అలకేనా! సామాను సర్దు ....దేనికీ సమాధానం తిన్నగా రాడు" అన్నాడు.
"మీ సామాను సర్దుకోండి. నేనూ, నా కొడుకూ ఇక్కడే వుంటాం" అంది తప్పటడుగులు వేస్తూ అటుగా నడిచి వచ్చిన బాబుని ఎత్తుకుని అన్నపూర్ణమ్మ దగ్గరకు నడుస్తూ.
అనుపమ అడ్డుగా వున్న వాళ్ళని దాటుకుంటూ అన్నపూర్ణమ్మ దగ్గరకు వెళ్ళి బాబుని ఆవిడ ఒడిలో కూర్చోబెట్టి తాను ఆవిడ పాదాల దగ్గర చతికిల బడి అంది.
"నానమ్మగారూ! ఇవాళ నాకు మీ చేత్తో చేసిన పొట్లకాయ పెరుగు పచ్చడి తినాలని వుంది."
సారధి నోరు తెరచుకుని చూస్తూ వుండి పోయాడు.
---- అయిపొయింది ------
