Previous Page Next Page 
ఒక కోయిల గుండె చప్పుడు  పేజి 37

            మట్టి పరిమళం
    "రేపు రాత్రికి మనం ఊరు వెళ్తున్నాం అనూ!" -- ఆఫీస్ నుంచి వస్తూనే చెప్పిన సారధి వైపు మింగేసేలా చూసింది అనుపమ.
    "మీ నానమ్మ దగ్గరికేగా... నేను రానని తెలిసీ పదేపదే ఎందుకు చెప్తారు?" అంది.
    "నీకోసంకాడు.... బాబు కోసం నిన్ను కూడా రమ్మంటున్నాను. వాడు పుట్టిన ఈ మూడేళ్ళ లో ఆవిడ వాడిని చూడలేదు. చూడాలని తహతాహ లాడుతోంది. పైగా ఆరోగ్యం కూడా బాగాలేదు. ఏ క్షణాన ఏమవుతుందో..... మొండితనం మానేసి వెంటనే బయల్దేరు"అంటున్న సారధితో కచ్చితంగా చెప్పింది.
    "రానుగాక రాను. ఆ ముసలావిడ చాదస్తం నేను భరించలేను. వాడిని కూడా తీసుకుకెళ్ళి ఆ అపరిశుభ్ర పరిసరాల్లో , ఆపిచ్చి తిండి పెట్టి ఆరోగ్యం పాడుచేయలేను" అంటూనే గిరుక్కున తిరిగి లోపలికి వెళ్ళిపోయిన అనుపమ మాటలకు నిశ్చేష్టుడై చూసాడు సారధి. 
    నానమ్మకీ, తనకీ ఉన్న అనుబంధం గురించి ఈమెకి ఎంత చెప్పిన అర్ధం కాదేం? ఏమైంది ఆ ఊరికి, ఇంటికి? అభిమానం, ఆప్యాయత, రంగరించి పోసి చేసిపెట్టే కమ్మని వంటలు, ఇంట్లో పాడి అందించే కమ్మటి గడ్డ పెరుగు , చిక్కటి పాలతో స్ట్రాంగ్ గా , రుచిగా చేసిచ్చే కాఫీ ఎక్కడ దొరుకుతాయి? ఏ మందులూ, కెమికల్స్ లేకుండా పెరట్లో నానమ్మ అనుభవంతో పండించి వండే కూరగాయలు....
    "ఆర్గానిక్ కూరలు తెచ్చుకుందాం... బిగ్ బజార్ కి వెళదాం.... అక్కడ ఆర్గానిక్ కందిపప్పు, కూడా అమ్ముతున్నారట' అంటూ పరుగులు తీయించే అనుపమ కి అసలు ఆర్గానిక్ అంటే ఏంటో తెలుసా!' నానమ్మ ఏ ఎరువులూ లేకుండా పండించే కూరగాయలు ఆర్గానిక్ అంటే వినిపించుకోదు.
     "అవి ఆర్గానిక్ ఏంటి? ఒక పద్దతి  పాడూ లేకుండా మోలిచినవి. మొక్కల నిండా పురుగు చీడా.... ఆకులూ, కొమ్మలు విరిచేస్తే పోతాయా పురుగులు? బయోటేక్నాలిజీ ఉపయోగించే పెంచే తోటలు, అ తోటల్లో పండే కూయగూరలు , ధాన్యాలు..... అవి ఆర్గానిక్ అంటే: అని వాదిస్తుంది.
    అందుబాటులో వున్నా ఆరోగ్యం విలువ ఆమెకీ అర్ధం కావడం లేదు. ఎలా చెప్తే తెలుస్తుంది? ఇప్పటికీ మూడేళ్ళు అవుతోంది నానమ్మ ని కాదని, ఆ ఊరు కాదని, ఆ ఇల్లు కాదని ఈ నగరానికి వచ్చి. ఏం వుంది క్కడ? తనకి ఎంతమాత్రం ఇష్టం లేకపోయినా అనుపమ కోసం తప్పనిసరిగా వుంటున్నాడు. కనీసం తనకోసం ఏడాది కొక్కసారి అయినా వచ్చి నాన్నమ్మ ని సంతోష పెట్టడానికి ఏమైంది? మునిమనమడు పుట్టాడని మురిసిపోయి , "ఆరో నెల్లో తీసుకు రారా ఇక్కడే అన్న ప్రాసన చేద్దాం.... నా ముచ్చటా తీరుతుంది" అని బతిమాలింది నానమ్మ. ససేమిరా అంది అనుపమ. "అమ్మో నా కొడుకుని ఆ అన్ హైజేనిక్ కండిషన్స్ లో పెంచను' అని రాలేదు. పసివాడిని నానమ్మ ఇంతవరకు చూడలేదు. పెద్దావిడ ఎంతకాలం బతుకుతుంది!? ఆవిడ చూడకుండా పొతే తనని తాను క్షమించుకోలేడు.'
    "అనూ! మళ్ళీ చెబుతున్నాను. మనం వెళ్ళాలి. వెళ్ళి తీరాలి. నువ్వేక్కువ గొడవ చేస్తే నేను ఉద్యోగం రిజైన్ చేసి నా ఊరు వెళ్ళి పోతాను." అన్నాడు తనూ మొండిగా. అతనికీ ఎలాగైనా ఈసారి అనుపమ ని కూడా తీసుకెళ్లాలని వుంది. ఇప్పుడు ఆమె రాకపోతే నానమ్మ ని ఎప్పటికీ చూడలేదు. అందుకైనా తనూ మొండిగా వుండి తీసుకెళ్ళాలి. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు.
    "ఎందుకు? అక్కడ ఏం వుంది మీకు, మట్టి/ ఏం చేస్తారక్కడికి వెళ్ళి ?" మండిపడుతూ అరిచింది.
    "మట్టే...... అ మట్టిలో బంగారం వుంది. అది తవ్వుకుంటాను సరేనా... అయినా ఇక్కడేముంది? కక్షలు, రాజకీయాలు ....ఈర్శాద్వేషాలతో రగిలే మనుషులు.... వీళ్ళ చేత మాటలు పడడం దేనికి? మెడ పట్టుకుని గెంటించు'కోవడం దేనికి? చూస్తున్నాగా ఈ మధ్య ఈ ప్రాంతీయ గోల " కసిగా అన్నాడు సారధి.
    "నేను తెలంగాణా లో పుట్టాను.... ఇక్కడే పెరిగాను.... నన్నెవరూ వెళ్ళగోట్టరు. నా భర్తనీ, నా కుటుంబాన్నీ కూడా ఎవరూ వెళ్ళగొట్టరు. ఆ మట్టి కూడు నేను తినలేను." అంటూ చాలా కచ్చితంగా, పరుషంగా మాట్లాడింది.
    "వెళ్ళగొట్టించుకునేదాకా వుండడం ఎందుకసలు?" అన్నాడు సారధి.
    "హైదరాబాద్ ఎవరి బాబు సొత్తు కాదు . ఇది కస్మాపాలిటన్ సిటీ.... మనం వెళ్ళాల్సి వస్తే ఇక్కడ ఉన్న ఎంతోమంది ఇతర మతాల వాళ్ళు , జాతుల వాళ్ళు , రాష్ట్రాల వాళ్ళు కూడా వెళ్లిపోవాలి."
    "ఇలాటి మొండి ఘటాన్నిచ్చి చేసినందుకు నానమ్మ నే తిట్టుకోవాలి" అనుకున్నాడు సారధి. తను పట్టిన కుందేలుకు మూడేళ్ళ కాళ్ళు అని సాధించే వాళ్ళతో ఏం మాట్లాడగలడు?
    నానమ్మ కి తోడుగా, ఉన్న ఊళ్ళో నే ఆధునిక పద్దతుల్లో వ్యవసాయం చేసుకుంటూ హాయిగా వుండాలనుకున్న సారధి , అనుపమ పోరు పడలేక అగ్రికల్చర్ యూనివర్శిటీ ఉద్యోగం చూసుకుని, భార్యని తీసుకుని హైదరాబాద్ వచ్చేసి కాపురం పెట్టాడు.
    శివరామయ్య కి నలుగురు మగపిల్లలు. ఇద్దరాడపిల్లలు. అయన మాత్రం ఒక్కడే కొడుకు. శివరామయ్య జిల్లా పరిషత్ స్కూల్లో పనిచేసేవారు. ఆయనకి తరచూ బదిలీలు అవుతుండడంతో తండ్రి పోయాక తల్లి  ఒంటరిదై పోవడంతో తన కొడుకుల్లో రెండో వాడైన సారధిని, మూడో కొడుకు చక్రవర్తిని తల్లి దగ్గరే వుంచేశాడు. పిల్లలిద్దరూ నానమ్మ దగ్గర ఉంటూ చదువు పూర్తీ చేశారు. సారధి అగ్రికల్చర్లో ఎమ్మెస్సీ చేశాడు. చక్రవర్తి ఏం. ఏ. బి.ఇడి చేసి టీచర్ అయ్యాడు. చక్రవర్తి కి విజయవాడ లో గవర్నమెంటు స్కూల్లో ఉద్యోగం రావడంతో వెళ్ళిపోయాడు. ఆ ఇద్దరు పిల్లల పెళ్ళిళ్ళు కూడా తన ఆధ్వర్యం లోనే , తనకు నచ్చిన అమ్మాయిల తోటే చేసింది నానమ్మ. చక్రవర్తీ భార్యతో విజయవాడ వెళ్ళిపోయినా, సారధి మాత్రం నానమ్మ మీద వున్న అభిమానంతో చదువు పూర్తీ అయ్యాక, "నానమ్మ నేను ఉద్యోగం చేయను. ఆధునిక పద్దతుల్లో ఎంచక్కా వ్యవసాయం చేసి మన ఊరిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాను." అనడంతో ఆవిడ ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఒక మనవడు దూరం వెళ్ళినా ఇంకో మనవడు ఈ చివరి రోజుల్లో తన దగ్గర వుంటాననడంతో కొత్త శక్తి వచ్చినట్టే ఆవిడకి ఆనందంతో కళ్ళనీళ్ళు వచ్చాయి.
    అన్నపూర్ణమ్మకి భర్త సంపాదించి ఇచ్చిన పెద్ద ఇల్లు, కొంత డబ్బు, వుంది కాబట్టి కొడుకు సంపాదన అతని సంసారానికే సరిపోతుందని ఎన్నడూ కొడుకుని డబ్బు లడగదు. ఆవిడకి రెండు గేదెలు, ఒక ఆవు వున్నాయి. ఇంటి వెనకాల వున్న ఖాళీ స్థలంలో తనకీ సారధికీ సరిపడా ఎన్నో కూరగాయలు పండించుకుంటూ వాటితో కాలక్షేపం చేస్తుంది. అన్నపూర్ణమ్మ శివరామయ్యని కడుపుతో వున్నప్పుడు చాలా అనారోగ్యం చేసి, మనిషి పోతుందనుకున్నారు. నెలలు నిండుతుంటే మద్రాసు తీసుకెళ్ళి మంచి హాస్పిటల్లో చేర్పించాడు భర్త.
    దాదాపు నెల రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో వున్న అన్నపూర్ణమ్మ పండంటి పిల్లాడిని ప్రసవించాక మరోసారి గర్భం వస్తే ఆవిడ ప్రాణానికి ముప్పు అని గర్భసంచి తీసేశారు. అంచేత ఒక్కడే కొడుకు అయ్యాడు. చాలాకాలం 'ఒక పిల్లాడు పిల్లాడా.... గొడ్డు మోతుకీ , ఈవిడకీ పెద్ద తేడా ఏం వుంది?" అనే అమ్మలక్కల మాటలు శూలాల్లా తగిలి బాధపేట్టేవి. క్రమంగా అన్నిటికీ అలవాటు పడింది.
    శివరామయ్యకి పద్దెనిమిదేళ్ళు వచ్చేసరికి తన భర్త పోవడంతో పీయుసీ పాసైన శివరామయ్యని టీచర్ ట్రైనింగ్ లో చేర్పించింది అన్నపూర్ణమ్మ.
    శివరామయ్య కి టీచర్ గా ఉద్యోగం రాగానే అన్నగారి కూతుర్నిచ్చి పెళ్ళి చేసింది.
    మేనత్తే కాబట్టి రత్నమాల కూడా తన పిల్లల్ని భర్త తల్లి దగ్గర వదిలి పెడుతుంటే పెద్దగా అభ్యంతరం పెట్టలేదు.
    భార్యాభర్తలు మిగతా పిల్లల్ని తీసుకుని వినాయకచవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండగలకే కాక శివరాత్రి క్కూడా వచ్చేస్తుంటారు. అప్పుడు అందరూ కలుసుకుని ఆనందంగా గడిపేస్తారు. ఇల్లంతా గంపెడు పిల్లలతో కళకళలాడుతుంటే అన్నపూర్ణమ్మ ఆనందానికి హద్దుండదు. ఎక్కడ లేని ఓపికా వచ్చేసి రకరకాల వంటలు, పిండి వంటలు చేసిపెట్టి, అందరికీ తనకి చేతనైన విధంగా కానుకలిచ్చి పంపిస్తుంది. అందుకే నానమ్మ అంటే పిల్లలందరికీ చాలా ఇష్టం. సారధికి మరీ ఇష్టం. అందుకే ఆ ఊళ్ళోనే వుండిపోవాలని అతని కోరిక. అన్నట్టుగానే ఊరి పెద్దల సహకారంతో ఏడాది లో ఆ ఊళ్ళోని పొలాల్లో బంగారం పండించాడు సారధి.
    ఒకసారి ఆ ఊరికి ఏదో పని మీద వచ్చిన ఎమ్మార్వో ఉమాపతి ఆ ఊరిని, పచ్చగా కళకళలాడుతున్న పంట పొలాలను చూసి ముగ్ధుడై పోయాడు. దీనికంతటికీ కారణం ఒక ఆధునిక యువకుడని తెలుసుకుని సారధిని చూసి ముచ్చట పడి హైదరాబాదు లో ఎం.బి.ఏ పూర్తీ చేసిన తన కూతురు అనుపమని ఇచ్చి పెళ్ళి చేయాలనీ నిర్ణయించుకోవడం , అందుకు అన్నపూర్ణమ్మ గారి అంగీకారం కోరడం, ఆవిడ అంగీకరించి కొడుకు, కోడలుతో కూడా అవుననిపించడం జరిగిపోయి, హైదరాబాదు లో అంగరంగ వైభవంగా పెళ్ళి జరిగింది.
    తనే స్వయంగా బస్సు మాట్లాడి ఊరి వాళ్ళను కూడా తీసుకుని వెళ్ళింది అన్నపూర్ణమ్మ. కోడల్ని తీసుకుని తన ఊరు వచ్చేటప్పుడు వియ్యపురాలు కళ్ళనీళ్ళతో చెప్పింది. "మా అమ్మాయికి మొండితనం ఎక్కువ. తన మాటే నెగ్గాలనే తత్త్వం. చిన్న పిల్ల ఏదన్నా తప్పు చేసినా పెద్దమనసుతో క్షమించి కడుపులో పెట్టుకోండి. దానికి ఉద్యోగం చేయడం కూడా ఇష్టం లేదు. పెద్ద చదువే చదివించాం. ఎందుకైనా మంచిదని. దానికి తనని కూర్చోపెట్టి పోషించే మొగుడు కావాలని కోరిక చిన్నప్పట్నించి. భర్తంటే భార్యని పోషించేవాడు , భార్య మనసు కష్టపెట్టకుండా చూసుకునేవాడు అని తప్ప భర్త పట్ల తన కర్తవ్యాలు, బాధ్యతలు కొన్ని వుంటాయని కూడా తోచదు. నేను చెప్పి చెప్పి అలసిపోయాను. అందుకే మిమ్మల్ని చూసి నా కూతురు మీ దగ్గర సుఖంగా వుంటుందని, దాన్ని మీరు అర్ధం చేసుకుంటారని ఆశించి ఈ పెళ్ళి చేశాను."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS