"ఊరికే నువ్వు కాఫీ ఎలా కలుపుతావో చూద్దామని"అన్నాడు ఆమె చేతిలోంచి కాఫీకప్పు అందుకుని.
"ఆ మాట ముందే చెబితే డికాషన్ వేసిన దగ్గర్నించీ కాఫీ ఎలా చేయాలో చెప్పేదాన్ని" కొంచెం సీరియస్ గా, మరికొంచెం నవ్వుతూ అంటూ హాల్లోకి నడిచింది. సమాధానం చెప్పకుండా ఆమె వెనుకనే చాలా మెల్లిగా నడుస్తున్న లోకేష్ వైపు తిరిగి అంది "ఏంటి అంత నెమ్మదిగా నడుస్తున్నావు."
"నువ్వు నడుస్తుంటే నీ సన్నటి నడుము మీద పొడుగాటి జడ కదుల్తుంటే చాలా బాగుంది. శ్రావ్యా ఇంత పెద్ద జడ ఈ రోజుల్లో తక్కువమంది అమ్మాయిలకు వుంటోంది. అలా చూస్తూ వుండి పోవాలనిపిస్తోంది.
శ్రావ్య కి లోకేష్ మాటలు , ప్రవర్తన చాలా ఇబ్బందిగా అనిపించింది. గట్టిగా ఏమన్నా అందామంటే 'అరె ఎందుకలా సీరియస్ అవుతావు పాతకాలం అమ్మాయిలాగా,బి స్పోర్టివ్ యార్" అంటాడని తెలుసు.
అందుకే హాల్లో సోఫాలో కూర్చుని జడ ముందుకేసుకుని నవ్వుతూ "ఇప్పుడు చూడు నా జడ ఎంతసేపు చూడాలనుకుంతున్నావో" అంది.
"శరత్ లక్కీ ఫెలో" అన్నాడు.
శ్రావ్యకి చిరాకేసింది. రిమోట్ తీసుకుని టీవి వాల్యూమ్ పెంచుతూ మౌనంగా వుండిపోయింది. లోకేష్ కాఫీ తాగడం పూర్తీ చేసి "కాఫీ చాలా బాగుంది తెలుసా.... నీలాంటి అందమైన ఆడపిల్లలు ఏం చేసినా అందంగా వుంటుంది కాబోలు" అన్నాడు.
శ్రావ్యకి ఒళ్ళు మండిపోయింది. ఏమనుకుంటున్నాడితడు. తన భర్త స్నేహితుడని ఇంతసేపూ గౌరవం ఇచ్చింది. ఇంకాసేపు ఇలాగే వాగితే చెంప పగలగోట్టాల్సిందే. లోకేష్ సడన్ గా తను కూర్చున్న సింగల్ సోఫా లోంచి లేచి శ్రావ్య పక్కకి వచ్చి "ఆ రిమోట్ ఇలా ఇవ్వు మంచి చానల్ పెడతాను" అంటూ ఆమె చేతిని స్పృశిస్తూ ఆమె చేతిలోంచి రిమోట్ లాక్కుని ఛానల్ మార్చసాగాడు. ఆ చర్యకి శ్రావ్య దిగ్బ్రాంతిగా చూడసాగింది. ఇంగ్లీషు ఛానల్ పెట్టి శ్రావ్య వైపు చూస్తూ "ఈ మూవీ చూద్దాం చాలా బాగుంటుంది. చాలా రొమాంటిక్ గా వుంటుంది." అన్నాడు.
శ్రావ్య గభాల్న కూర్చున్న దగ్గర నుంచి లేచింది. 'మిస్టర్ నాకు వేరేపనుంది . ఆఫీసు పని చేసుకోవాలి. ఇంక నువ్వు వెళితే బాగుంటుంది." అంది.
"ఇవాళ వీకెండ్ పనేంటి శ్రావ్యా.... కమాన్ ఎంజాయ్ ద డే" అన్నాడు.
శ్రావ్య కోపం అణచుకుంటూ అంది "నో సారీ నాకంత టైం లేదు."
"కమాన్ శ్రావ్యా...."అతనింకేదో అనబోతుండగా రిమోట్ అతని చేతిలోంచి లాక్కుని టివి ఆఫ్ చేసి "ప్లీజ్ యు కెన్ గో"అంది.
లోకేష్ కొన్ని క్షణాలు ఆమె మొహం లోకి తదేకంగా చూసి భుజాలెగరేసి "ఒకే సీ.యూ"అంటూ లేచి బయటికి వెళ్ళిపోయాడు.
"రాస్కెల్ పళ్ళ బిగువున తిట్టుకుంటూ రిమేట్ సోఫాలో విసిరేసి తలుపు వేయడానికి వెళ్ళింది. గేటు దాటుతున్న లోకేష్ ఫోన్ లో మాట్లాడుతున్న మాటలు వినిపించి ఆగిపోయింది.
"వెళ్ళారా.... నువ్వు వెళ్ళమన్నాక వెళ్ళక పొతే ఊరుకుంటావా? ఇప్పుడే మీ ఇంటి నుంచే బయటికి వస్తున్నా. నో ప్రాబ్లమ్ . మీ ఆవిడ శీల పరీక్ష లో నెగ్గింది. నన్ను ఒక విధంగా వెళ్ళగొట్టి మొహం మీదే తలుపెసు కుంది."'
"శ్రావ్య నిశ్చేష్టురాలైపోయింది. ఏమంటున్నాడు లోకేష్. మీ ఆవిడ శీలపరీక్ష లో నెగ్గింది. అంటే ఎవరావిడ? తనేనా? అంటే తనని పరీక్షించడానికి లోకేష్ అల బిహేవ్ చేశాడా? ఎందుకు? ఎవరు పరీక్షించమన్నారు? వణికే చేతుల్తో తలుపు గడియ వేసి వచ్చి నిస్సత్తువగా సోఫాలో వాలిపోయింది.
ఎవరితో మాట్లాడాడు లోకేష్... మీ ఇంటి నుంచే వస్తున్నాను అంటున్నాడు. అంటే శరత్ తో మాట్లాడాడా? శరత్...శరత్.... అంటే కాళ్ళ కింద భూమి కదిలి పోతున్నట్టుగా అనిపించింది శ్రావ్యకి.
ఆరోజంతా పిచ్చిదానిలా చేష్టలుడిగి కూర్చుండి పోయింది.
తన వెనకాల ఏదో పెద్ద గూడుపుఠాణీ జరుగుతోందన్న ఆలోచనతో వణికిపోయింది. శీలపరీక్ష పెట్టాడా? ఎందుకు? తన క్యారెక్టర్ మీద శరత్ కి నమ్మకం లేదా? అతనికి నమ్మకం లేకపోవడానికి కారణం ఏమిటి? తనేమన్నా తప్పుగా ప్రవర్తించిందా? తనకి పెళ్ళికి ముందు ఏదన్నా లవ్ ఎఫైర్ వుందని చెప్పిందా? అలాంటిదేం లేదే? ఆ రాత్రి శివరాత్రి అయింది శ్రావ్యకి. తెల్లవారి లేచేసరికి అద్దంలో తన ప్రతిబింబం వంద లంఖణాలు చేసిన దానిలా ప్రేతకళ పడి కనిపించింది. కళ్ళు గాజుకళ్ళలా మారాయి.
తలుపు చప్పుడైంది. పనిమనిషి వచ్చినట్టుంది అనుకుంటూ నీరసంగా నడుస్తూ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా శరత్.
నిర్ఘాంతపోయి చూసింది. వారం దాకా రానన్న శరత్ అప్పుడే రావడం.... నిన్న అతని తరపున తనని శీలపరీక్ష చేయడానికి లోకేష్ రావడం.
ఆమెలో అనేక అనుమానాలు, వేల సందేహాలు , శతకోటి భయాలు....
అందమైన ఈ శరత్ రూపం వెనకాల ఎంత క్రూరమైన మనస్తత్వం!
ఎంతటి శాడిజం! కట్టుకున్న భార్య శీలాన్ని పరీక్షించడానికి పరాయి వాడిని భార్య మీదికి పంపిస్తాడా? ఎంత నీచత్వం!
"ఏంటలా చూస్తున్నావు? త్వరగా వచ్చానేంటి అనా... నిన్ను విడిచి వుండలేక పోయాను శ్రావ్య నిజం! వెళ్ళిన దగ్గర్నించీ పిచ్చిపట్టినట్టు అయింది. నీ కౌగిట్లో ని వెచ్చదనం, నీ పెదవుల్లోని తెయదనం, నీ పొందు లోని సుఖం.... అన్నీ గుర్తొస్తూ నన్ను పిచ్చివాడ్ని చేశాయి. అందుకే టూర్ లేదు , ఏంలేదు అని పరిగెత్తుకుని వచ్చాను డియర్.... రియల్లీ ఐ మిస్ ఏ లాట్" అంటూ భుజాన వున్న ఎయిర్ బ్యాగ్ కింద పడేసి ఆమెని గభాల్న దగ్గరకు లాక్కున్నాడు. ఆమె చేయి అతని చెంపను ఫేడేల్మని తాకింది.
"శ్రావ్యా!..." గభాల్న ఆమెని వదిలేసి చెంప తడుముకుంటూ విభ్రాంతిగా పిలిచాడు . కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ చూసింది శ్రావ్య.
"నీ ఫ్రెండ్ లోకేష్ ని ఎందుకు పంపించావు నా దగ్గరికి?"
"నేను పంపడం ఏంటి నీకేమన్నా మతిపోయిందా? నేను లేనని తెలియక వచ్చి వుంటాడు."
"అబద్దాలు చెప్పకు" కఠినంగా అంది. "నా శీలపరీక్ష చేయడానికి వాడేవాడు? చేయించడానికి నువ్వెవరివి? శీలపరీక్ష చేస్తావా? ఎలా చేస్తావు? నేనెవరితో పడుకున్నావో నీకెలా తెలుస్తుంది? వాడు నాతొ అసభ్యంగా ప్రవర్తించినందుకు నేను వెళ్ళి పొమ్మనగానే నేను మంచిదాన్నని , నా క్యారెక్టర్ చాలా గొప్పదని డిసైడ్ అయిపోయారా."
"శ్రావ్యా ఏం మాట్లాడుతున్నావు నువ్వు."
"ఏం అర్ధం కావడం లేదా? తెలుగులోనేగా మాట్లాడుతున్నాను. అఫీసు టూర్ అని అబద్దం చెప్పి రెండు రోజులు ఎక్కడో ఉండి , నేను లూజు క్యారెక్టర్ అవునా, కాదా అని పరీక్షించదానికి నీ ఫ్రెండ్ ఎవడినో ఇంటికి పంపిస్తావా? ఆ వెధవ నా అందం పొగడగానే పడిపోతాననుకున్నావా?"
"పిచ్చి పిచ్చి గా మాట్లాడకు. నేనేం అబద్డం చేప్పలేదు... నీకు తెలుసా నేను అబద్దం చెప్పానని."
"యస్! నువ్వు అబద్దం చెప్పావు."
"ఓ! నీ దగ్గర ఫ్రూఫ్ వుందా?"
"నీ అంతరాత్మే నీకు ఫ్రూఫ్."
"ఎక్కువగా మాట్లాడకు. అయినా నేను నీ మొగుడిని.... నీకంత మంది మగపిల్లలు ఫ్రెండ్స్ వుంటే నీతిగా వున్నావని నమ్మమంటావా? ఏ మగాడి కైనా నా కొచ్చిన అనుమానమే వస్తుంది? తప్పా ? మొగుడిగా నా హక్కు."
"హక్కా....మరి నా హక్కు.... నీకంత మంది ఆడపిల్లలు ఫ్రెండ్స్ వుంటే, వాళ్ళంతా నిన్ను పబ్లిక్ గా కావలించుకుని ముద్దు పెట్టుకుంటే మరి నాకూ రావాలిగా నీమీద అనుమానం."
"నేనూ, నువ్వు ఒకటేనా? నేను మగాడ్ని..."
"మగాడ్ని , మగాడ్ని అంటూ పదే పదే నొక్కి వక్కాణిస్తున్నావు.... ఏంటి నీ గొప్ప? మగాడివైతే నువ్వు ఏ వెధవ పనైనా చేయచ్చా? అంటే మగాడికో నీతి, అడదానికో నీతా? తప్పు చేస్తేనే శీలం పోయినట్టు కాదు మిస్టర్ శరత్. తప్పుగా ఆలోచించినా శీలం కోల్పోయినట్టే."
"అబ్బా శ్రావ్యా ఏదో జరిగిపోయింది. నా అనుమానం క్లియర్ అయింది. ఇప్పుడు నీమీద నాకేం అనుమానం లేదు. నిన్ను మనస్పూర్తిగా ప్రేమిస్తున్నా . ఇకనుంచీ ఇలాంటివెం జరగవు. నా మాట నమ్ము ప్లీజ్...."
"నీ అనుమానం తీరింది. మరి నాకు నీ పట్ల చాలా రకాలా అనుమానాలు, సందేహాలు వున్నాయి. అవి తీరేదెలా? నీలా నేనూ ప్రవర్తిస్తే వివాహబంధానికి విలువేముంది. అందుకే విలువలేని బంధం నాకవసరం లేదు. గుడ్ బై" శ్రావ్య చరచరా లోపలికి వెళ్ళి తన బట్టలన్నీ కుప్పలా పోసి సూట్ కేసుల్లో కుక్కి రెండు సూట్ కేసు లూ ఈడ్చుకుంటూ బయటికి వచ్చింది.
"శ్రావ్యా ప్లీజ్ నా మాట విను. తప్పయింది సారీ... వెళ్ళద్దు..."
శరత్ పిలుపు , అతని పలుకులు తన చెవులకి వినిపించకుండా చున్నీతో రెండు చెవులూ కప్పేసుకుని ఆ రెండు సూట్ కేసులూ ఈడ్చుకుంటూ గబగబా బయటకి నడిచింది.
---------
