గెలుపు
శ్రావ్యది విజయవాడ . అత్యంత సంపన్నులుండే ఓ మూడంతస్తుల మేడ రంగు రంగుల లైట్ల అలంకరణ తో దేదీప్య మానంగా వుంది. ఆరోజే శ్రావ్య,శరత్ ల పెళ్ళి ఎంతో ఆడంబరంగా జరిగింది.
శరత్ , శ్రావ్యలది పెద్దలు కుదిర్చిన పెళ్ళి, నక్షత్రాల , వంశం , కుటుంబ నేపధ్యం , అమ్మాయి, అబ్బాయిల చదువు , ఉద్యోగాలు, ఈడూ, జోడూ అన్నీ తరచి , తరచి చూసి కుదిర్చిన పెళ్ళి ఎంత సంప్రదాయ బద్దంగా , శాస్రోక్తంగా జరిగిందో అంత అద్భుతంగానూ జరిగింది.
మర్నాడు మగపెళ్ళి వాళ్ళ కార్లన్నీ హైదరాబాద్ బయల్దేరాయి. హైదరాబాద్ లోని అమీర్ పేటలో వుంటారు వాళ్ళు. శ్రావ్యని కొంచెం బాధగా, కొంచెం ఆనందంగా శరత్ కి అప్పగించారు ఆమె తల్లిదండ్రులు. శ్రావ్యతో పాటు శ్రావ్య పిన్ని వసుంధర, పిన్ని కూతురు మందాకినీ హైదరాబాద్ బయల్దేరారు. శ్రావ్య , శరత్ ల లగ్జరీ కారు పెళ్ళి వారి కార్లతో పాటు బయల్దేరింది.
శ్రావ్య పుట్టి పెరిగింది. చదువుకుంది. విజయవాడ అయినా ఉద్యోగం మాత్రం హైదరాబాదు లోని డెల్ కంపెనీ లో చేస్తోంది. హాస్టల్ లో ఉంటూ సాప్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్న శ్రావ్య కి టిసి ఎస్ లో చేస్తూ, హైదరాబద్ లోని అమీర్ పెట్ లో వుంటున్న శరత్ కి ఎలా ఈ సంబంధం కుదిరింది అని తెలియని వాళ్ళు విస్తుబోయినా, రాసిపెట్టి వుంటే ఎలాగోలా కలుస్తుంది అని నిర్ణయించేశారు మరికొందరు.
మర్నాడు శరత్ ఇంట్లో పెళ్ళి సందడి వచ్చింది. సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
విజయవాడ లో జరిగిన పెళ్ళికి రాలేకపోయిన శ్రావ్య ఫ్రెండ్స్ , శరత్ ఫ్రెండ్స్ అతని వైపు బంధువులు అందరూ కలిసి దాదాపు నాలుగొందల మంది రిసెప్షన్ కి వచ్చారు. కిక్కిరిసిపోయింది బ్యాంకేట్ హాలు.
శ్రావ్య ని దగ్గరుండి అందంగా బొమ్మలా తయారు చేసింది మందాకినీ. అసలే కుందనపు బొమ్మ మేకప్ లో మరింత అందంగా ధగధగా మెరిసిపోతోంది శ్రావ్య.
శరత్ మహేష్ బాబుకి తక్కువగా, ప్రభాస్ కి సమానంగా అందంగా వున్నాడు. పక్కపక్కన నిలబడిన ఆ జంట రతీమన్మదుల్లా వున్నారు.
శ్రావ్య కొలీగ్స్ చాలామంది వచ్చారు. ఆమెని అభినందనలతో ముంచెత్తారు. అందరినీ శరత్ కి పరిచయం చేసింది శ్రావ్య. ఇది నిరుపమ, తను నిధి, ఇతను కైలాష్ , అరవింద్ , మా టీమ్ మేనేజర్ గౌరవ్ , ఇలా అడ, మగ అందరూ కలిసి ఇరవై మంది దాకా వున్నారు. అందరూ శరత్ ని గగ్రీట్ చేశారు. సరదాగా కబుర్లు చెప్పారు. నవ్వులు, పాటలు, అటు శరత్ స్నేహితులు కూడా దాదాపు యాభై మంది వచ్చారు. అడ, మగా కాలేజీ ఫ్రెండ్స్, ఆఫీసులో కొలీగ్స్ , ఇంటి చుట్టుపక్కల వుండే స్నేహితులు.... శరత్ కి బాగా క్లోజ్ ఫ్రెండ్ షీలా శరత్ ని కౌగలించుకుని "యువర్ వైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్" అంది.
చాలా గ్రాండ్ గా , సరదాగా రిసెప్షన్ అయిపొయింది. ఆరోజే వాళ్ళకి మొదటి రాత్రి కూడా.
ధరమ్, కరమ్ రోడ్ లో శరత్ కోసం ప్రత్యేకంగా కొన్న ప్లాట్ అది. లాంచనంగా గృహప్రవేశం చేయించి, అందులోనే వాళ్ళకి మొదటి రాత్రి ఏర్పాట్లు చేశారు. ఆరోజు నుంచి అదే ప్లాట్ లో వాళ్ళ కాపురం కూడా కొనసాగేలా ఏర్పాట్లు చేసి అతని తల్లి తండ్రి, తమ్ముడు అక్కడికి దగ్గర్లోనే వున్న వాళ్ళ మరో ప్లాట్ కి వెళ్ళిపోయారు. పాలగ్లాసుతో లోపలికి వచ్చింది శ్రావ్య.
రిసెప్షన్ అలంకరణకి పూర్తీ భిన్నంగా వుంది. తెల్లటి క్రేప్ సిల్క్ చీర, పెద్ద జడ వదులుగా వేసుకుని నాలుగు మూరల మల్లెపూలు పెట్టుకుంది. మెడలో పసుపు పచ్చ పుస్తెల తాడు, గుండెల మీద మెరిసిపోతున్న తాళి బొట్టు, ముత్యాల హారం, చెవులకి ముత్యాల జూకాలు... ఆమెని చూసి శరత్ మనసు పరవశించి పోయింది. గుండె గర్వంతో ఉప్పొంగి పోయింది. ఇంతటి అందగత్తె నా భార్య అనుకున్నాడు. నా భర్త ఎంత అందగాడు అనుకుంది శ్రావ్య. వాళ్ళిద్దరూ ఎన్నో జన్మల నుంచి ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నట్టు కబుర్లతో కాలం వ్యర్ధం చేయకుండా రసాంబుధి లో ఒలలాడారు. తెల్లవారింది. ఆ రోజే శ్రావ్య పిన్ని వసుంధర, చెల్లి మందాకినీ తిరుగు ప్రయాణం పట్టారు.
"జాగ్రత్తమ్మా ....కొత్త కాపురం , కొత్త మనుషులు, కొత్త వాతావరణం... కొంచెం అలావాటై దాకా కష్టంగా వుంటుంది జాగ్రత్తగా వుండు" చెప్పింది వసుంధర.
"అలాగే పిన్నీ " నవ్వుతూ అంది శ్రావ్య.
ఆవిడ శ్రావ్యకి కొంచెం దగ్గరగా జరిగి చెవిలో రహస్యంగా చెప్పింది 'అతనికి అంతమంది అమ్మాయిలూ ఫ్రెండ్సెంటే.... పైగా ఆ అమ్మాయి అతన్ని కౌగలించేసుకుని ఆ ముద్దులేంటి అసహ్యంగా...."
శ్రావ్య ఫకాల్న నవ్వింది. "నాకు అబ్బాయిలు ఫ్రెండ్స్ లేరా పిన్నీ. అలాగే అతనికి కూడా. ఇందులో తప్పేం లేదు. ఈరోజుల్లో అమ్మాయిలూ, చాలా ఫ్రీగా వుంటున్నారు. మీ కాలంలో లాగా అబ్బాయిలని చూడగానే అమ్మాయిలు మెలికలు తిరగరు. ఇదంతా కామన్. నువ్వేం బెంగపెట్టుకోకు" అంటూ ఓదార్చింది.
"ఏమో ఏం దిక్కుమాలిన స్నేహలో! ఎందుకైనా మంచిది ఓ కంట అతడిని కనిపెట్టి వుండు."
ఆ రాత్రి పిన్ని చెప్పిన విషయం శరత్ కి చెప్పాలనిపించింది శ్రావ్యకి. కానీ అతనా అవకాశం ఇవ్వలేదు. గదిలోకి వస్తూనే ఆబగా అక్రమించేసుకుని ఆమెని ఉక్కిరిబిక్కిరి చేశాడు. వారం రోజుల పాటు ఇద్దరూ పగలూ, రాత్రీ తేడా లేనట్టుగా గడిపారు. వాళ్ళు తిరిగి డ్యూటీల్లో జాయిన్ అవ్వాల్సిన రోజు వచ్చింది.
ఉదయాన్నే లేచి గబగబా తయారై ఇద్దరికీ టిఫిన్ బాక్స్ లు రెడీ చేసింది శ్రావ్య. బ్రేక్ ఫాస్ట్ గా కార్న్ ఫ్లేక్స్ తినేశారు.
"నిన్ను ఆఫీసు దగ్గర దింపేస్తాను. ఈవినింగ్ పికప్ చేసుకోనా" అడిగాడు శరత్.
"నీ పని త్వరగా అయిపోతే నాకు కాల్ చేయి.... నా పనిని బట్టి చెప్తాను. లేదంటే ఎవరో ఒకళ్ళు డ్రాప్ చేస్తారు" అంది శ్రావ్య తేలిగ్గా.
శరత్ కి ఆ మాట నచ్చలేదు. ఎవరో ఎందుకు డ్రాప్ చేయాలి అనుకున్నాడు. కానీ పైకి ఏమీ అనలేదు. సాయంత్రం త్వరగా ముగించుకుని ఆమెకి ఫోన్ చేశాడు. 'అరె అప్పుడే అయిపోయిందా నీపని! సరే మా ఆఫీసు దగ్గరికి వచ్చేయ్ కలిసి వెడదాం" అంది శ్రావ్య.
అతను వచ్చేసరికి శ్రావ్యా , ఆమె పక్కన ఒక యువకుడు నిలబడి వున్నారు. వాళ్ళు హాయిగా సరదాగా మాట్లాడుకుంటున్నారేమో మొహం నిండా నవ్వులతో వెలిగి పోతున్నారు.
శరత్ ని చూడగానే 'హాయ్' అన్నాడతను.
శరత్ కూడా చిరునవ్వుతో 'హాయ్' అన్నాడు. శ్రావ్యా 'బై సంజూ' అంటూ అతనికి షేక్ హ్యాండిచ్చి శరత్ వెనకాల బైక్ మీద కూర్చుంది.
సంజు ఇద్దరికీ చేయి ఊపి తన బైక్ దగ్గరికి వెళ్ళిపోయాడు.
శరత్ బండి స్టార్ట్ చేశాడు. "నేను రాకపోతే అతను డ్రాప్ చేసేవాడా" అడిగాడు.
"అప్పుడప్పుడు డ్రాప్ చేస్తాడు" అందిశ్రావ్య చాలా మాములుగా.
శరత్ కి ఆ మాట అసలు నచ్చలేదు. మరో పదిరోజులు గడిచాయి.
అనుకోకుండా శరత్ ఆఫీసు పని మీద బెంగుళూరు వెళ్ళాల్సి వచ్చింది. 'అబ్బా అప్పుడే మన మధ్య ఈ గ్యాప్ ఏంటి?" దిగులుగా అంది.
"ఆఫీసు పని కదా లేకపోతె నేను మాత్రం నిన్నోదిలి వుండగలనా చెప్పు..." కౌగిట్లో కి తీసుకుంటూ అన్నాడు. కరిగిపోయింది శ్రావ్య.
శ్రావ్య క్యాబ్ లో ఆఫీసు కి వెళ్ళి వస్తోంది. శ్రావ్య శుక్రవారం రాత్రి బాగా పొద్దు పోయిందాకా శరత్ తో వాట్సప్ కాల్ లో వుండి ఆలస్యంగా పడుకుంది. ఆరోజు వీకెండ్ అని తొమ్మిది దాటాక కళ్ళు తెరిచి , తీరుబడిగా ఆవలిస్తూ లేచింది. బ్రష్ చేసుకుని కాఫీ తాగి, న్యూస్ పేపర్ చదువుకుని బట్టలన్నీ వాషింగ్ మిషిన్ లో వేసి స్నానం చేసింది. అప్పటికి మధ్యాహ్నం పన్నెండు దాటింది. వంట పూర్తీ చేసి, ఆకలి దంచేస్తుండడం తో కంచం లో అన్నీ పెట్టుకుని హాల్లోకి వచ్చి టి.వి అన్ చేసింది.
అప్పుడే బయట బండాగిన శబ్దం. శరత్ స్నేహితుడు లోకేష్ లోపలికి వచ్చాడు. "హాయ్ శ్రావ్యా"అంటూ .
అనుకోని అతిధి రావడంతో కంచం టీ పాయ్ మీద పెట్టి "రా లోకేష్ ఎలా వున్నావు?" అంటూ ఆహ్వానించింది.
"ఆయామ్ ఒకే. హౌ ఆర్ యూ? ఏడీ వీడు లేడా?' అడిగాడు.
"శరత్ అఫీషియల్ టూర్ కి వెళ్ళాడు తెలియదా?" అడిగింది.
"ఓ అవునా....నాకు చెప్పలేదే.... ఎప్పుడొస్తాడు " అడిగాడు.
"ధర్స్ డే వెళ్ళాడు.... నెక్ట్స్ ధర్స్ డే కి వస్తాడు. భోజనం చేయకూడదూ " అంది శ్రావ్య.
"థాంక్యూ చేసే వచ్చాను. యూకెన్ క్యారీ అన్ " అన్నాడు.
శ్రావ్య కంచం తీసుకుని తింటూ లోకేష్ చెప్పే కబుర్లు వినసాగింది.
శ్రావ్య భోజనం పూర్తీ చేసి "కాఫీ కలపనా? టీనా" అనడిగింది.
"కాఫీ" అన్నాడు లోకేష్.
"జస్ట్ ఫ్యూ సెకండ్స్" అంటూ వంటగది లోకి వెళ్ళిపోయింది శ్రావ్య.
శ్రావ్య పాలు వేడి చేసి, వేడి పాలతో కాఫీ డికాషన్ వేసి, పంచదార వేసి నురగ వచ్చేదాకా కలిపి వెనక్కి తిరిగింది. తనకి బాగా సమీపంగా లోకేష్. శ్రావ్య అదిరిపడి వెంటనే సర్దుకుంటూ "ఏం కావాలి?' అడిగింది.
