Previous Page Next Page 
ఒక కోయిల గుండె చప్పుడు  పేజి 34

    తండ్రి చనిపోతే తల్లిని దగ్గరకు తెచ్చుకోడానికి లీవు దొరకలేదా కొడుక్కి , నాకెందుకో నమ్మబుద్ది కాలేదు. నా కొడుకులు చాలాసార్లు వాళ్ళ కిష్టం లేనివి అవాయిడ్ చేయడానికి లీవు లేదని వంక పెట్టడం నాకు తెలుసు. పెద్దావిడను చూస్తుంటే జాలేసింది. ఎనభై దాటి వుంటాయి. నడవలేని తల్లిని ఎంత దూరం నుంచి తీసుకొచ్చి ఇక్కడ వదిలేశాడో .
    "ఎంతసేపైంది మీరిక్కడకు వచ్చి"అడిగాను.
    "గంట దాటుతుందేమో అందావిడ."
    పరిసరాలను పరికిస్తూ ....మళ్ళీ అంది "ఏదో పనుంది. అది చూసుకుని అరగంటలో వస్తానమ్మా! ఇక్కడే కూర్చో అందరూ వున్నారుగా భయమెం లేదు అని చెప్పి వెళ్ళాడు .వస్తాడు లెండి."
    "గంట దాటుతోందా? అరగంటలో వస్తానని వెళ్ళాడా?" విస్తుబోయాను. ఆవిడకి కొడుకు మీద ఎంత నమ్మకం... నేనూ ఇలాగే నమ్మాను. కానీ ఏం జరిగింది? ప్రతి తల్లి తన పిల్లల్ని నమ్ముతూనే వుంటుంది కాబోలు గొర్రె కసాయివాడిని నమ్మినట్టు. నాలో అనుమానం.... చిన్న మొక్క నుంచి మహావ్రుక్షంగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు.
    కచ్చితంగా తల్లినిక్కడ వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడు. బలవంతంగా మేనమామ తెచ్చి తన దగ్గర వదిలేసి నందుకు ఇలా వదిలించుకున్నాడు కాబోలు. ఎంత దారుణం.... బహుశా భార్య చెప్పి వుంటుంది. ఎక్కడైనా వదిలేసి రండి ఈ ముసల్దాని సేవలు నేను చేయలేను అని.... భార్య మాట జవదాటక తల్లినిక్కడ ఈ పార్కులో వదిలాడు.
    ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. నాకో సొంత ఇల్లంటూ వుంది కాబట్టి నా కొడుకులు వాళ్ళే వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ ఇళ్ళల్లో వుండి వుంటే నా బతుకు కూడా ఈవిడ బతుకులాగే ....దేవుడు కరుణామయుడు.... "ఎంతమంది పిల్లలు మీకు?" ఆవిడ అడిగింది. నేను సమాధానం చెప్పకుండా ఎదురు అడిగాను "మీకు?"
    "నాకు ఇద్దరు మగపిల్లలు. ముగ్గురాడపిల్లలు.... అమ్మాయిలూ ముగ్గురు అమెరికా వెళ్ళారు.
    చిన్నాడు బెంగుళూరు.... పెద్దాడు ఇక్కడ హైదరాబాదు ....అదేదో కంపెనీ లో పెద్ద ఆఫీసరు.
    కోడలు కూడా ఉద్యోగమే. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. అందరికీ ఇద్దరేసి పిల్లలు. ఏదో ఆ భగవంతుడి దయ వలన అంతా బాగున్నారు తల్లీ" ఆవిడ మాటల్లో నిశ్చింత.
    'అదృష్టవంతురాలు" అనుకున్నాను. వెంటనే మళ్ళీ అనిపించింది. ఏం అదృష్టం! నాలాగే ఆవిడా అనుకుంటోంది కాబోలు. ఇప్పుడు తెలుస్తుంది . తెలివైన కొడుకు ఊరు కాని ఊరులో ఏమీ తెలియని తల్లిని, నడవలేని తల్లిని ఇలా వదిలేసి వెళ్ళిపోవడం అంటే అతని తెలివితేటలకి శభాష్ అనాలనిపిస్తోంది. నా కొడుకులకన్నా రెండాకులు ఎక్కువే చదివినట్టున్నాడు గొప్ప నటుడు కాబోలు.
    పాపం ఈవిడ ఎక్కడికి వెళ్తుందిప్పుడు? ఏం చేస్తుంది? ఇప్పటికే ఏడు దాటుతోంది. కొడుకు వుండే ఏరియా కూడా తెలియదు పాపం. నేనేదన్నా సాయం చేయగలనా? నాకు ఇల్లుంది. నా పెన్షనూ, అయన పెన్షనూ కలిపి నెలకి బాగానే వస్తుంది.
    ఆర్ధికంగా ఇబ్బంది లేదు. ఒకరికొకరు తోడుగా వుండచ్చు. నాతొ తీసుకెళ్ళి పొతే.... నిజమే.... అలవాటు లేని ఒంటరితనం నరకంలా అనిపిస్తోంది.
    తీసుకెళ్ళి పొతే వస్తుందా? ' నా కొడుకు వస్తాడు తీసుకెళ్తాడు ' అని ఇలాగే ఎదురు చూస్తూ ఇక్కడే కూర్చుంటుందా? ఎంతసేపు రాత్రి అవుతుంది?
    పార్కువాచ్ మెన్ ఇంకో అరగంట లో అందర్నీ వెళ్ళి పొమ్మని చెప్పి గేటు మూస్తాడు. అప్పుడు ఎక్కడి కేళ్తుంది? ఈమెకి చెప్పాలి. నీ కొడుకు రాడమ్మా పిచ్చి తల్లి అని చెప్పాలి.
    నమ్ముతుందా? నమ్మకేం చేస్తుంది. ఇవాళ కాకపొతే రేపైనా, ఈ రాత్రంతా పుట్ పాత్ మీద గడిపాక అయినా నమ్మాలి.
    తీరా నేనింత జాలిపడి సాయం చేశాక ఏం జరుగుతుందో! ఆవిడ ఎలాంటిదో.... ఎలాంటి దైనా తోటి స్త్రీని.... పైగా ఇలా ఊరు కానిఊరులో ఒంటరిగా వదిలేసి వెళ్ళడానికి మనసొప్పలేదు.
    కొడుకు కసాయి వాడు. వృద్దురాలైన తల్లి, పాతవైనా ఫర్నిచర్ అన్నీ ఒకటే వాడి దృష్టి లో.... అందుకే టీవీ, ఫ్రిజ్ పారేసినట్టు తల్లిని కూడా ఈపార్కులో పడేసి వెళ్ళాడు. ఎన్ని వార్తలు చూడడం లేదు. వృద్దురాలైన తల్లిని చెత్త కుండీల దగ్గర, అక్కడా, ఇక్కడా వదిలేసి, వెళ్ళే కొడుకుల గురించి.
    ఈవిడ కొడుకు కొంచెం పెద్ద మనిషి కాబోలు పార్కులో వదిలాడు. అవును ఈ పార్కు కి చాలామంది వస్తుంటారు. ఎవరో ఒకరికి ఆవిడ అవసరం వుండే వుంటుంది. అలా ఎవరో ఒకళ్ళు తీసు కెళ్ళిపోతారని ఆశించినట్టున్నాడు. కాని ఎవరు తీసుకెళ్తారు? కనీసం ఓ ఇరవై ఏళ్ళు తక్కువ వుండి నాలా యాభై లలో వుండి వుంటే కాస్త ఇంట్లో వంటా వార్పూ చేస్తుందని తీసుకెళ్ళే వాళ్ళు.
    ఈవిడని ఈ వయసులో ఎవరు తీసుకెళ్తారు? సొంత పిల్లలకే పనికిరాని ఈస్త్రీ పరాయి వాళ్ళకి ఎవరికి పనికి వస్తుంది? పోనీ ఈవిడని ఏదన్నా వృద్దాశ్రమానికి అప్పగిస్తే... సన్నగా మూలుగుతూ రోడ్డు చివరి దాకా ఆశగా ఎదురు చూస్తున్న ఆమెని చూస్తుంటే గుండె తరుక్కు పోయింది.
    నెమ్మదిగా సూర్యుడిని తరిమేస్తూ చీకటి ఆక్రమించుకుంది. గాలిలో చల్లదనం మరింత పెరిగింది. ఒక్కొక్కటే స్ట్రీట్ లైట్స్ వెలగడం మొదలు పెట్టాయి. పార్కులో జనం నెమ్మదిగా ఇంటి ముఖం పట్టరేమో బాగా పల్చబడ్డారు.
    ఆవిడ తలతిప్పి రోడ్డు వైపు చూస్తూ అంది . "చీకటి పడింది.ఎక్కడి కెళ్ళాడో... అసలే ఈ పట్నం లో మోసాలేక్కువట. మనుషులు కూడా ముందూ, వెనుకా చూసుకోకుండా బళ్ళు నడుపుతారట. పిచ్చి తండ్రి జాగ్రత్తగా వస్తే చాలు..." అవిడ స్వారంలో ఆదుర్దా, కొడుకు క్షేమం పట్ల ఆందోళన.
    మాతృ ప్రేమ.... అరగంట లో వస్తానని వెళ్ళిన కొడుకు తనని మోసం చేసి వెళ్ళినా ఆ తల్లి హృదయం అతనెలా వున్నాడో అని ఆరాటపడుతుందే కానీ, కొడుకు తనని మోసం చేసి వెళ్ళాడేమో అని అనుకోవడం లేదు.
    ఆవిడ అమాయకత్వానికి జాలేసింది. చాలా రోజుల తరువాత నడిచానేమో నాకాళ్ళ నొప్పి మొదలైంది. నీరసం వచ్చేస్తోంది. కొంచెం చీదరగా కూడా ఉంది. ఇంటికెళ్ళి స్నానం చేసి, ఇంత తిని పడుకోవాలి కానీ, ఈ పెద్దావిడని వదిలేసి వెళ్ళడానికి మనస్కరించడం లేదు. ఇంకెవరన్నా చుట్టాలు వున్నారా? కొడుకు ఫోన్ నెంబరు తెలుసేమో..... "మీ అబ్బాయి ఫోన్ నెంబరు వుందా?" అడిగాను.
    "లేదమ్మా! నాకేం తెలుస్తాయి అవన్నీ. వాడే వస్తాడు....ఎవరన్నా స్నేహితులు కలిశారో, ఏదన్నా ఇబ్బంది వచ్చిందో ....వస్తాడు...."
    ఆవిడ స్వరం దృడంగా పలికింది. లైట్ల వెలుగులో ఆ కళ్ళద్దాల చాటున వున్న కళ్ళల్లో మెరుస్తున్న విశ్వాసం చూస్తుంటే 'ఓ తల్లీ ఈ ప్రపంచంలో ఎవరినైనా నమ్ముకానీ, ఈ వయసులో కొడుకుల్ని నమ్మకు" అని అరవాలనిపించింది.
    అప్రయత్నంగా అన్నాను 'వస్తాడా? మిమ్మల్నిలా వదిలేసి వెళ్ళాడు తప్పు కదా."
    చటుక్కున అందావిడ "వాడి వెనకాల నేనెక్కడికి వెళ్ళగలనమ్మా! వాడేదో పని మీద వెళ్ళాడు.... వస్తాడు. తప్పకుండా వస్తాడు. కాస్త అటూ, ఇటూ."
    గొర్రె కసాయి వాడిని నమ్ముతుంది. తల్లి తన పిల్లలేలాంటి వాళ్ళయినా పిల్లల్నే నమ్ముతుంది. రాడు, రాడు నా అంతరాత్మ ఘోషించింది.
    నాకింక చేతకావడం లేదు. వెళ్ళాలి నెమ్మదిగా అన్నాను. "మా ఇల్లు అదిగో అదే" చేత్తో చూపిస్తూ అన్నాను. "నా ఆరోగ్యం బాగాలేదు వెళ్తున్నాను.... కానీ మీరొక్కరే ." 
    "నాకేం భయం లేదు వెళ్ళమ్మా.... నాకోసం నువ్వెందుకు కూర్చోవడం పాపం...."
    ఆవిడకి కొడుకు మీద నమ్మకంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా బాగా ఎక్కువ అనిపించింది.
    నెమ్మదిగా కర్ర అందుకున్నాను. నా మనసు లేవడానికి అంగీకరించడం లేదు. కొడుకు చేతిలో మోసపోయిన ఈ తల్లినిలా ఒంటరిగా వదిలి ఎలా వెళ్ళను? నేనూ ఒక తల్లినే నా కొడుకిలా మోసం చేయకపోయినా మరోలా చేశాడు.
    ఆ బాధ ఏంటో నాకు తెలుసు.... ఆవిడ వయసులో లేకపోవచ్చు. ఆవిడ ఇక్కడే, ఇలాగే కూర్చుంటే తెల్లారేసరికి ఈ పార్కు లో ఇక్కడే ఈవిడ శవంగా పడి వుండే అవకాశం కచ్చితంగా వుంది.
    వణికిపోయాను ఆవిడని బలవంతంగా నైనా తీసు కెళ్ళాలని పించింది. "ఓ పని చేయండి."
    నా నోట్లో మాట నోట్లో వుండగానే పార్కు గెట్లోంచి వడివడిగా ఒక ఆకారం కనిపించింది. తెల్ల పైజమా, లాల్చీ.... దృడమైన పర్సనాలిటీ . "అడుగో వచ్చాడు" ఆవిడ స్వరంలో ఉత్సాహం.
    "వెధవ ట్రాఫిక్.... ఎంత ట్రాఫిక్కో అరగంట ఇరుక్కుపోయాను. పద్మవ్యూహం లాంచి వచ్చినట్టుగా వుందమ్మా. ఎంత టెన్షన్ పడ్డానో, నిన్నోక్కదాన్నే వదిలేసి వెళ్ళాను. చీకటి పడింది. పద, పద బాగా ఆకలేస్తోందమ్మా .....మిరపకాయ బజ్జీలు తెచ్చాను. కారులో ఉన్నాయి తిందువు గాని పద."
    "ఈవిడ పాపం నాకు తోడుగావున్నార్రా..... నేను కంగారు పడ్డాను. నీకేం ఇబ్బంది కాలేదు కదా" ఆవిడ ప్రేమగా అంటూ నెమ్మదిగా లేవబోతుంటే 'అలాగా" అంటూ నా వైపు కృతజ్ఞతగా చూస్తూ ఆవిడ రెండు భుజాలు పట్టుకుని పసిపిల్లని లేపినట్టు లేపి అత్యంత శ్రద్దగా, భక్తిగా తీసుకు వెళ్తున్న ఆ కొడుకుని పల్చటి కన్నీటి తెరల మధ్య నుంచి చూస్తూ వుండి పోయాను.
    విసురుగా వీచిన ఓ గాలి అల నా వీపు మీద చెళ్ళున చరిచి హేళనగా నవ్వింది.

                                                    -------- 
     
     


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS