కొడుకు
వాతావరణం లో హటాత్తుగా మార్పొచ్చింది. నా మానసిక , శారీరక ఆరోగ్యం లోనూ మార్పొచ్చింది. తగిలిన గాయం నుంచి నెమ్మదిగా తేరుకున్నాను. నొప్పి, మంట తగ్గింది కానీ, సన్నగా రప్పర్, కిటికీ లోంచి సన్నగా కొంచెం చల్లగా గాలి వీచింది. వేడిగా , వాడిగా వున్న ఎండ తగ్గుముఖం పట్టింది. చెమటలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం కొద్దిగా సేద తీరుతున్నారు.
పనిమనిషి లక్ష్మీ టీ కప్పు , బిస్కెట్లు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి నా మంచం దగ్గరగా టేబుల్ మేట్ తీసుకొచ్చింది.
నెమ్మదిగా లేచి కూర్చున్నాను. పడుకుని, పడుకుని తలంతా దిమ్మగా అనిపిస్తోంది. అస్తమానం ఎసి లో వుండి, వుండి విసుగొచ్చి హల్లో ఫ్యాను కింద పడుకున్నానేమో వీపు చెమటతో తడిసింది. టీ తాగుతూ కిటికీలోంచి బయటికి చూశాను.
కాలనీ పార్కులో జనం కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్న వాళ్ళు కొందరు, వాక్ చేస్తున్నవాళ్ళు కొందరు.వేసవి మొదలయ్యాక ఈ టైం లో ఎవరూ పార్కు కి రావడం లేదు. బాగా పొద్దు పొతే కాని సూర్యుడి ప్రతాపం తగ్గటం లేదు. ఈరోజు వాతావరణం బాగుంది.
రెండు నెలల నుంచీ ఎక్కడికీ వెళ్ళకుండా నాలుగు గోడల మధ్య కూర్చుని కుమిలి పోతున్నానేమో ఈరోజు నాక్కూడా కాసేపలా పార్కులో నడవాలనిపించింది.
ఖాళీ కప్పు పనమ్మాయి కిచ్చి "నా కర్ర ఇలా ఇవ్వు. వాకింగ్ చేసి వస్తాను" అన్నాను.
"చేయగలుగుతారా అమ్మా" కొంచెం భయంగా , మరి కొంచెం అనుమానంగా అడిగింది.
నవ్వాను. "చేయాలి నెమ్మదిగా నడుస్తుంటే కాస్త ఓపిక వస్తుంది" అన్నాను. ఆమె ఇచ్చిన నా చేతికర్ర అందుకుంటూ.
నేను మంచం మీంచి లేస్తుంటే సాయం పట్టుకుంది లక్ష్మీ. షూరాక్ లో వున్న స్లిప్పర్స్ తెచ్చిచ్చింది. స్లిప్పర్స్ తొడుక్కుని కర్ర పట్టుకుని గుమ్మం దాటాను. నెమ్మదిగా నడుస్తుంటే ముందు ఒళ్ళు తూలినట్టు అయింది గానీ, నిలదొక్కుకుని అలాగే నడుస్తూ పార్కు చేరాను.
గేటుకి రెండు పక్కలా నమస్కారం పెడుతూ నిలబడిన అమ్మాయిల విగ్రహాలు 'వెల్ కమ్ ' అన్నట్టు చిరునవ్వు నవ్వాయి. పిల్లగాలి 'హలో' అంటూ నా చెంప మీద తట్టి పారిపోయింది. ఏపుగా పెరిగిన పసుపుపచ్చ పూలచెట్టు రాల్చిన పూలతో వున్న ఆకుపచ్చని పచ్చిక కాళ్ళకు మెత్తగా , చల్లగా తగిలి "ఎలా వున్నావు రమణీ" అని పరామర్శించింది. క్రోటన్స్ అన్నీ నా వైపు సానుభూతిగా చూసి రా, రా అంటూ తలలూపాయి.
ప్రకృతి పరామర్శలు , పలకరింపులతో ఇన్నాళ్ళ అశాంతి, మనోవేదన ఎగిరిపోయి కొత్త శక్తి ఏదో పుంజు కున్నట్టు అనిపించింది.
వాకింగ్ ఏరియా వైపు నడిచాను. బాగా పరిచయం వున్న అపార్ట్ మెంట్ వాళ్ళంతా చూసి పలకరింపుగా నవ్వారు. "ఎలా వుంది ఆరోగ్యం" అంటూ పలకరించారు. ఇలాంటి పలకరింపులు అలవాటే అయినా ఇవాళ మాత్రం ఆ పలకరింపులు నాకు కొండంత ధైర్యాన్నిస్తున్నట్టు అనిపించింది.
నేను ఒంటరిని కాను అన్న ఆత్మవిశ్వాసానికి ఊపిరి పోస్తున్నట్టు అనిపించింది.
నేను కోల్పోయిన మనోస్థైర్యాన్ని వాళ్ళ చిరునవ్వులు రాల్చే అమృతబిందువులు నా ఆణువణువూనా జారుతూ నాకు తిరిగి బతుకు మీద మమకారాన్ని కలిగిస్తున్నట్టుగా ఎంతో ఊరటగా, మరెంతో శాంతిగా అనిపించసాగింది.
ఎప్పుడో విన్న పాట గుర్తొచ్చింది. 'అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం. ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం... వింత నాటకం ....' ఎంత వాస్తవం! అయన పోయిన దగ్గర్నుంచి నాకంటి పాపల్లా చూసుకున్నాను.
అలా చూసుకునేటప్పుడు వీళ్ళు నాకేదో చేస్తారన్న ఆశ కానీ, చేయాలన్న కోరిక కానీ నాలో లేవు. మరిప్పుడు వాళ్ళు నన్ను వదిలి వెళ్ళి పోయినందుకు ఎందుకు బాధపడాలి? ఎందుకు నన్ను నేను దహించు కోవాలి? అవసరం లేదు.
వాళ్ళు వెళ్ళిపోయి మంచి పని చేశారు. నాకోసం నేను బతకాలన్న చిన్న సూక్తిని నాకు తెలియజేశారు. బతకాలి.... బతుకుతాను కానీ , నా కళ్ళ ముందు అమాయకంగా నా ఒళ్ళో పడుకుని, నా వీపు మీద వాలి కబుర్లు చెప్పే నా మనవళ్ళు, మనవరాళ్ళు గుర్తొస్తే, వాళ్ళకి దూరంగా నాకీ బతుకు అవసరమా అనిపిస్తోంది.
వాళ్ళని చూడకుండా రెండు నెలల నుంచి ఒంటరిగా వుంటున్నాను. నిత్యం సందడిగా పిల్లల అల్లరితో గోలగోలగా వున్న ఇల్లు ఇప్పుడు నిశ్శబ్దంగా , ఎడారిగా వుంటోంది. ఎలా వుంటున్నాను? నాకే అర్ధం కావడం లేదు. ఎగసిపడే భాదను అణగదోక్కేస్తూ ఆత్మాభిమానం అనే కవచం తొడుక్కుని శిలలా బతుకుతున్నాను.
నీళ్ళు నిండిన నా కళ్ళకు తాతగారి చిటికిన వేలు పత్తుకుని ఓ చేత్తో ఐస్ క్రీమ్ తింటూ వస్తున్న మూడేళ్ళ బాబు కనిపించాడు. గుండె మెలితిప్పి నట్టయింది. "భాధపడకు రమణీ...." అంటూ ఒదార్చిందో పిల్లగాలి కెరటం. ఎవరూ చూడకుండా కళ్ళు తుడుచుకుని నడవడం ప్రారంభించాను. పార్కు నిండా జనం.... కళకళలాడుతూ , నవ్వులతో, కబుర్ల తో సందడిగా....
వేసవి ఉక్కు సంకెళ్ళలో బందీలుగా వున్న జనమంతా చల్లగాలికి విముక్తి పొంది స్వేచా జీవులైనట్టుగా కబుర్లు చెప్పుకుంటున్నారు అడ, మగా.... ముందుకు అడుగులు వేశాను. ముందు నీరసంగా పడిన అడుగులో నెమ్మదిగా బలం వచ్చింది.
ఉత్సాహం పెరిగింది. మరింత వేగం పెంచాను. ఒకటో రౌండు పూర్తీ అయింది. "హమ్మయ్య నడవగలను. అవును నా కాళ్ళతో నేను నడవగలను. నా కాళ్ళ మీద నేను నిలబడగలను."
పల్చగా కమ్ముకున్న నీటి పొర ఒక్క క్షణం పరిసరాలను మసక బార్చింది. కానీ నా మనోబలం దాన్ని జయించి మరో అడుగు ముందు కేసింది.
రెండో రౌండు, మూడో రౌండు ..... పెద్దాడా! చిన్నాడా! మీరు నా గుండెల మీద తన్ని వెళ్ళిపోయినంత మాత్రాన నేను బతకలేనా? బతకగలనురా చూశారా!బతుకుతున్నాను అనుకున్నాను.
సరిగ్గా రెండు నెలల క్రితం నా ఇద్దరు కొడుకులు వాళ్ళ భార్యలకి ఎదురు చెప్పలేక నన్ను నా మానాన వదిలేసి వెళ్ళిపోయారు. "ఏమనుకోకమ్మా.... మాకుఇక్కడి నుంచి మాదాపూర్ వెళ్ళడానికి చాలా కష్టంగా వుంది. వేరే వెళ్ళిపోతున్నాం..... మధ్య మధ్యలో వస్తుంటాం లే" అన్నాడు రవి.
"పోనీ ఈ ఇల్లు అద్దెకిచ్చేసి మాతో రామ్మా" అన్నాడు వాసు.
"పాపం మామయ్యగారి జ్ఞాపకాలున్న ఇంట్లోంచి ఎలా వస్తారండీ.... మీరు మరీను.... మనమే వచ్చి వెళ్తూ వుందాం లెండి . వేరే ఊరు పారిపోవడం లేదుగా" అంది కోడలు స్వప్న.
అప్పటికీ మౌనమే సమాధానంగా వుండిపోయాను. ఎంత గంబీరంగా వుందాలను కున్నానో అంత బేలనై మంచాన పడ్డాను.
అయినా వాళ్ళ దగ్గరకు వెళ్ళడానికి నా ఆత్మాభిమానం అడ్డొచ్చింది. పనిమనిషి లక్ష్మీ సొంత కూతురిలా చేసింది సేవలు. దాని ఋణం తీర్చుకోలేను.
జ్ఞాపకాల తుట్టె కదిలి గుండె లోని నరాలను కోరికేస్తుంటే అప్రయత్నంగానే నాలో నీరసం ఆవహించింది. నడకలో ఉత్సాహం తగ్గింది.
నెమ్మదిగా నడుస్తూ వచ్చి, రావి చెట్టు కింద వున్న అరుగు మీద కూర్చున్నాను.
చేతికర్ర పక్కగా వున్న చెట్టు కానించి పెడుతుంటే కనిపించిందామె. తనవైపు చూస్తున్న నన్ను చూసి ఇబ్బందిగా నవ్వింది. అంత పెద్దావిడ నవ్వుతోంటే నాకా నవ్వులో సిగ్గు, మొహమాటం కనిపించాయి. అయితే ఆ సిగ్గులో అర్ధం వేరు. ఏదో తప్పు చేస్తున్న భావన. ఎందుకలా నవ్వింది.... మరోసారి ఆవిడ మొహంలోకి చూశాను.
లేత నీలం కి ముదురు నీలం రంగు అంచున్న వేంకటగిరి జరీ చీర , మెడలో ఒంటి పేట బంగారు గొలుసు , ముత్యాల హారం.
చెవులకి రాళ్ళ దిద్దులు.... చేతులకి రెండేసి బంగారు గాజులు.... పచ్చగా ఉంది.
కళ్ళద్దాల చాటున వున్న కళ్ళు ప్రశాంతంగా వున్నాయి. వయసులో ఆవిడ చాలా సౌందర్యవతి అనడానికి సాక్ష్యం లా ఆమె మేని మెరుపు అలాగే వుంది. తెల్లగా ముగ్గు బుట్టలా వున్న జుట్టుకి బాగా నూనె రాసి గట్టిగా ముడేసింది.
నా చూపులకి అటూ ఇటూ ఇబ్బందిగా కదిలి అంది "మా అబ్బాయి తీసుకొచ్చాడు. అరగంటలో వస్తాను అని ఎటో వెళ్ళాడు" ఆవిడ అలా చెప్పడం లో నాకేదో సంజాయిషీ కనిపించింది.
ఒంటరిగా ఇక్కడ కూర్చున్నందుకు నేను ఏమన్నా అనుకుంటున్నానెమో అనే సందేహం కలిగినట్టు అనిపించింది. మళ్ళీ అంది ఆవిడ కొంచెం సిగ్గు పడుతూ "నాకు ఈ ఊరు కొత్త.... ఎప్పుడూ రాలేదు. పిల్లలు చాలాసార్లు రమ్మన్నారు. ఇలా పార్కు లో కూర్చోడం ఏమిటోగా వుంది" ఏం అనాలో తెలియలేదు "ఫర్వాలేదు" అన్నాను.
"మీరు రోజూ నడుస్తారు కాబోలు . మా అబ్బాయి నన్ను కూడా కాసేపు నడవమన్నాడు. కానీ, నా వల్ల కాలేదు. కాళ్ళు నొప్పులు, పెద్దదాన్నయ్యాను" అందావిడ.
" ఎక్కడుంటారు" అడిగాను.
ఆవిడ మొహం నాకు బాగా కొత్త. ఇంతకాలంగా ఈ కాలనీ లో వుంటున్నా ఎప్పుడూ ఆవిడ్ని చూడలేదు. ఏ పెటో నాకు తెలియదు. "మా అబ్బాయి దగ్గరకు వచ్చాను. అయన.... అదే నా దేవుడు పోయి నాలుగు నెల్లయింది.. నర్సాపూర్ మాది. మా తమ్ముడు తీసుకొచ్చి అబ్బాయి దగ్గర దింపాడు. వీడికి పాపం లీవు దొరకలేదు ఆఫీసులో."
