శశాంక్ వచ్చి కూర్చోగానే నెయ్యి వేస్తూ అంది "ఆఫీసులో చాలా పని చేస్తున్నట్టున్నావురా.... చేయాలి తప్పదు కానీ, ఆరోగ్యం సంగతి కూడా చూసుకోవాలి నాన్నా."
శశాంక్ గుండె ఆర్ద్రమైంది. అమ్మకి తనంటే ప్రాణం. తనకి తన భార్యంటే ప్రాణం. అమ్మంటే ఇష్టమే కానీ, అమ్మ కోసం భార్యని వదులుకోలేడు.
భోజనం చేశాక , "బయటికెళ్ళి వస్తానమ్మా ప్రత్యూష వచ్చేసరికి వచ్చేస్టాలే" అంటూ వెళ్ళిపోయాడు.
బండి స్టార్ట్ చేసి రెంటల్ ఏజన్సీ ని వెతుక్కుంటూ వెళ్ళాడు. వాళ్ళు చెప్పిన నిబంధనలు విని ఐదొందలు కట్టి పేరు రిజిష్టరు చేయించుకున్నాడు.
"రెండు ప్లాట్స్ ఇప్పుడే చూపిస్తాను సార్ వస్తారా" అడిగాడు ఏజెంట్.
"ఖాళీగానే వున్నాయా?"
"ఫస్ట్ కి అవుతాయి సార్, మంచి ప్లాట్స్! నచ్చకపోతే వేరేది చూపిస్తా. ఇప్పుడున్న గుజరాతీ కపుల్ ఆస్ట్రేలియా వెళ్ళిపోతుంది."
"సరే చూపించు."
ఏజెంట్ హుషారుగా అడిగాడు. "మీ బండి మీద వెళ్దామా సార్ లేక నా బండి తేవాలా?"
"అవసరం లేదు రా కూర్చో" అంటూ బండి స్టార్ట్ చేశాడు శశాంక్.
ఏజెంట్ సూచనల ప్రకారం మెయిన్ రోడ్డు దాటి ఓ సందులోంచి కాలనీ లోకి పోనిచ్చాడు.
ఐదు అంతస్తుల అపార్ట్ మెంట్.
బండి దిగి ఇద్దరూ అపార్ట్ మెంట్ లోకి నడిచారు. లిప్ట్ ఎక్కి నాలుగో అంతస్తులోకి వెళ్ళారు. ఒక ప్లాట్ ముందు ఆగి బెల్ నొక్కాడు ఏజెంట్.ఒక యువతి వచ్చి తలుపు తీసింది.
"ప్లాట్ చూసుకోవడానికి వచ్చారు మేడమ్ " అన్నాడు ఏజెంట్.
యువతి అయిష్టంగానే పక్కకి తొలగి "రండి" అంది హిందీలో.
లోపల విశాలమైనహల్లో ఖరీదైన సోఫాలో కూర్చుని సీరియస్గా టీవిలో ఏదో సినిమా చూస్తున్నాడు ఆమె భర్త. ఆమె శశాంక్ వైపు తిరిగి "వెళ్ళి చూడండి" అని చెప్పి తనూ భర్త పక్కన కూర్చుని సీరియస్ గా టీవీ చూడసాగింది.
ఇల్లు మొత్తం చూపించాడు ఏజెంట్. రెండు పడకగదుల ఫ్లాట్. ఆధునికంగా వుంది. పెద్ద బాల్కనీ. మంచి గాలీ, వెలుతురూ.
"అద్దె ఎంత?"
"అడుగుదాం సార్" అంటూ హాల్లోకి నడిచాడు ఏజెంట్.
"సార్ రెంట్ ఎంత? " అడిగాడు.
వాళ్ళు తలతిప్పి చూడలేదు. సమాధానం చెప్పలేదు.
అంత శ్రద్దగా , ఆసక్తిగా వాళ్ళు చూస్తున్న కార్యక్రమం ఏంటో అన్నట్టు శశాంక్ టీవీ వైపు చూశాడు. ఏదో పరభాషా చిత్రం. బ్లాక్ అండ్ వైట్. వీపు మీద ఒక మూటలా పడుకున్న వృద్దురాలిని మోసుకుంటూ ఒక బక్కచిక్కిన వ్యక్తీ కొండమీదకి ఎక్కుతున్నాడు.
ఆ నటుణ్ణి చూస్తుంటే ఖచ్చితంగా భారతీయ భాషా చిత్రం కాదని తెలుస్తోంది.
"ఇది ఏ భాషా చిత్రం అన్నట్టు" ఏజెంట్ వైపు చూశాడు శశాంక్.
తెలీదన్నట్టు భుజాలెగరేశాడు ఏజెంట్. వాళ్ళు సమాధానం చెప్పకపోవడంతో "మేడమ్" అంటూ మరోసారి పిలవబోతుంటే శశాంక్ వారించాడు అగు అన్నట్టు సైగ చేస్తూ.
ఇద్దరూ అలాగే నిలబడి ఆ జంటతో పాటే టీవీ చూడసాగారు.
ఆ బక్కచిక్కిన వ్యక్తీ కుమిలికుమిలి ఏడుస్తూ ఆ వృద్దురాలిని మోస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నెమ్మదిగా వస్తోంది. ఆ సన్నివేశం చాలా విషాదంగా అనిపిస్తోంది. ఆ వ్యక్తీ గానీ, అతని వీపు మీద వున్న వృద్దురాలు గానీ ఏమీ మాట్లాడడం లేదు. కేవలం నేపధ్య సంగీతం, వాళ్ళ మూమెంట్.... కొండలు, లోయలు, గుట్టలుగా పడున్న అస్తిపంజరాలు....! మరికొంత దూరం నుంచి మరో బక్క వ్యక్తీ పరుగెత్తుకు వస్తున్నాడు. ఇంకో వృద్దుడు భయంతో వణికిపోతూ అతనితో ఏదో అంటున్నాడు. ఆ వ్యక్తీ అత్యంత క్రూరంగా ఆ వృద్దుడిని కొండ మీంచి తోసేశాడు.
టీవీలో ఆ దృశ్యం చూస్తున్న యువతి కెవ్వుమని అరిచింది.
శశాంక్ తెల్లబోయాడు. సినిమా చూస్తూ ఇంతలా లీనమైపొతారా? అనిపించింది.
ఆ యువతి కన్నీళ్లు తుడుచుకుంటూ హిందీలో అంటోంది. "పాపం, ఆ రోజుల్లో ఎలాంటి సంప్రదాయమో కదా! ఇప్పుడైనా ఆ సంప్రదాయం మారిందంటావా గౌరవ్?"
ఆ యువకుడి పేరు గౌరవ్ కాబోలు సమాధానం చెప్పాడు. "ఇప్పుడు మారకుండా ఎలా వుంటుందిలే, కాకపొతే ,మనదేశంలో ఉన్నట్టే అక్కడ కూడా ఇంకా అణగారిన దురాచారాలు వుండే వుంటాయి. ఇంత దారుణంగా వృద్దుల్ని చంపే ఆ సంప్రదాయం ఆ ఒక్క దేశంలోనే వుంది."
వాళ్ళ సంభాషణ చాలా ఆసక్తిగా , కుతూహలంగా అనిపించింది శశాంక్ కి.
"ఆ మూవీ పేరేంటి?" ఇంగ్లీషు లో అడిగాడు శశాంక్.
ఇద్దరూ ఒక్కసారి వెనక్కి తిరిగి సోఫా వెనుక నిలబడిన ఏజెంట్ ని, శశాంక్ ని చూశారు. అతనేదో అనబోతుంటే ఆ యువతి అరిచింది "వెయిట్' అంటూ .... "చూశావా అతనికి వాళ్ళమ్మంటే చాలా ఇష్టం. అందుకే భార్య మాట కాదనలేక వాళ్ళ ఆచారం ప్రకారం లోయలో పడేయడానికి తీసుకొచ్చి పడేయకుండా అక్కడ పడుకో బెట్టి వెళ్ళిపోతున్నాడు. పాపం చూడు ఎంత వేదన అనుభవిస్తున్నాడో, ఆమె యాక్షన్ చూడు ఎంత బాగుందో.... '
శశాంక్ టీవీ వైపు చూశాడు.
ఆ వృద్దురాలీని కొండ మీద నిర్జన ప్రదేశంలో వీపు మీంచి దింపి, కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు ఆ నటుడు. ఆమె అతికష్టం మీద నేల మీద ఏదో చాపలాంటిది పరచుకుని మోకాళ్ళ మీద కూర్చుని కళ్ళు మూసుకుని చేతులు జోడించి ధ్యానం లోకి వెళ్ళిపోయింది.
అతను ఏడుస్తూ పరుగెత్తుకుని వెళ్ళిపోయాడు.
"ఓ గాడ్ .... హరిబుల్ " అంటూ ఆ అమ్మాయి సోఫాలోంచి లేచింది. ఆమెతో అతనూ లేచి శశాంక్ వైపు తిరిగాడు.
"సారీ సార్ .... మూవీ వెరీ ఇంట్రస్టింగ్... చాలా మూడనమ్మకాలు, దురాచారాలు మనదేశం లోనే వుంటాయి అనుకుంటాం గానీ, దేశదేశాల్లో జీవన విధానాలను అనుసరించి వుండే మూడ నమ్మకాల గురించి తెలుసుకోవాలంటే విభిన్నమైన భాషా చిత్రాలు చూడాలి. బుక్స్ చదవాలి. ఇది ఒక కొరియన్ మూవీ సార్. చాలా పాతది. నా ఫ్రెండ్ ఒకతను చెప్పాడు. ఈ మూవీ చూడమని. వాళ్ళ ఆచారం ప్రకారం వృద్ధులకి తిండి దండగ అని తొంబై ఏళ్ళు రాగానే కొడుకులు వాళ్ళని తీసుకెళ్ళి ఆ కొండ మీద నుంచి లోయలోకి పడేస్తారు. చూశారుగా ఆ ఆస్తిపంజరాలన్నీ వృద్దులవే. కానీ ఈ మూవీ లో హీరో కొంచెం బ్రాడ్ అవుట్ లుక్ వున్నవాడు, మనసున్న వాడు, దురాచారాల్ని ఖండించేవాడు. వాడికి వాళ్ళమ్మ ని అలా పడేయడం ఇష్టం లేదు. కానీ భార్య టార్చర్ భరించలేక తీసుకొచ్చి ఇలా వదిలేశాడు. చూడండి. కొండ కిందికి వెళ్ళి తను చేసింది పాపం అని తిరిగి వస్తాడు. కానీ ఈలోగా విపరీతంగా కురిసిన మంచులో ఆ తల్లి కూరుకు పోతుంది. ఆ దృశ్యం గుండెను కరిగించేస్తుంది సార్.... మా ఫ్రెండ్ సినిమా పిచ్చోడు..... వాడికి భాషా భేదం, కొత్త పాత అనేమీ లేదు. ఏదంటే అది చూస్తాడు. యూ ట్యూబ్ లో వెతికి వెతికి చూస్తాడు.
అదిరే గుండెను చిక్కబట్టుకుంటూ స్వరంలో వణుకు కనిపించకుండా శశాంక్ అడిగాడు, "మీరిది ఇప్పుడు యూ ట్యూబ్ లో చూస్తున్నారా?"
"అవును సార్.... నా దగ్గర క్రోమ్ కాస్ట్ వుంది. దాంతో వాడు చెప్పిన ప్రతి మూవీ చూస్తాం. ఆ చెప్పండి సార్ , సారీ మిమ్మల్ని నిలబెట్టి మాట్లాడుతున్నా కూర్చోండి" అన్నాడు.
శశాంక్ వారిస్తూ "లేదు, నేను అర్జెంటు గా వెళ్ళాలి.... వస్తాను" అన్నాడు.
'సార్ రెంట్ ఎంత?' ఏజెంట్ అడుగుతుంటే శశాంక్ వారించాడు . "అవసరం లేదు. నాకు ఇల్లు అవసరం లేదు." అంటూ వేగంగా అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు.
వెనుక నుంచి ఏజెంట్ , "సార్....సార్ " అంటూ పిలుస్తున్నా వినిపించుకోకుండా లిప్ట్ కోసం కూడా వెయిట్ చెయ్యకుండా రెండేసి మెట్లు చొప్పున దిగి బండి పార్క్ చేసిన చోటుకు వచ్చి బండి స్టార్ట్ చేస్తూ అనుకున్నాడు. "యస్.... భార్య వెళ్ళిపోతే మరో భార్య వస్తుంది. కానీ, అమ్మ గుండె పగిలి చనిపోతే మళ్ళీ వస్తుందా..."
---------
