Previous Page Next Page 
ఒక కోయిల గుండె చప్పుడు  పేజి 31

    తెల్లగా , సన్నగా , నాజుగ్గా వుండే  కోడలు చీపురు పుల్ల ముట్టుకున్నా ఆమెకు గుచ్చుకుంటుందనే భయంతో ఏ పనీ చేయనివ్వడు ఆవిడ.
    "నాకు కోడలైనా కూతురైనా నువ్వే, నీకేం కావాలన్నా మీ అమ్మను అడిగినట్టే నన్నూ అడుగు, నీకేమిష్టమో చెబితే చేసి పెడతాను" అంటూ ప్రేమగా అడిగేది. ప్రత్యూష వచ్చిన ఈ ఎనిమిది నెలల్లోనూ ఏ రోజుకారోజు ఓపిగ్గా కోడలికి ఇష్టమైన వంటకాలు చేసి పెడుతోంది అమ్మ. బైట తిరిగే తను ఏదైనా తింటాడు గానీ, అమ్మ మాత్రం ఎత్తి పరిస్థితుల్లోనూ మంగళవారం , శుక్రవారం , శనివారం ఉల్లిపాయ కూడా తినకుండా ఎంతో నిష్టగా వుంటుంది. అలాంటి అమ్మ కోడలి కోసం ఆమ్లెట్ వేయడం నేర్చుకుంది. అప్పుడప్పుడు బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్ ఆమ్లెట్ చేసి పెడుతుంది.
    అలాంటి అమ్మని..... అలాంటి అమ్మని....
    శశాంక్ కి ఏడుపొచ్చింది.
    దాదాపు నెల నుంచీ ప్రత్యూష తన విశ్వరూపం చూపిస్తోంది శశాంక్ కి.
    "మీ అమ్మ ఇక్కడే ఉంటుందా?" అనడిగింది ఓరోజు.
    "ఇంకెక్కడుంటుంది?" ఆశ్చర్యంగా అడిగాడు శశాంక్. "ఈ ఇల్లు అమ్మది. మా నాన్న కొన్నాడు. అమ్మ పేరునే వుంది. అయినా అదేం ప్రశ్న " అన్నాడు.
    ప్రత్యూష అతని వైపు సూటిగా చూస్తూ ... 'ఆవిడ ఇక్కడ ఉండడం నాకిష్టం లేదు. మనం యాంగ్ కపుల్. మనకి ఫ్రీడం లేకుండా ఆవిడ ఇక్కడ ఎందుకు వుండటం? నాకు చిరాగ్గా వుంది" అంది.
    భార్య ధోరణి నచ్చలేదు శశాంక్ కి. అయినా శాంతంగా అన్నాడు. "తప్పు ప్రత్యూష అమ్మకి మాత్రం ఎవరున్నారు? మనకి ఆవిడ, ఆవిడకి మనం . ఇదే ప్యామిలీ అంటే ఇవాళ నీకేదో ఫ్రీగా లేదని అమ్మని ఎక్కడికో పంపించేస్తే రేపు మనకి పిల్లలు పుట్టాక వాళ్ళని ఎవరు చూస్తారు?నువ్వు ఉద్యోగం , నేను ఉద్యోగం , పిల్లలకి క్రచే గతి అవుతుంది. అంతకన్నా అమ్మ వుంటే తనే పిల్లల్ని చూసుకుంటుంది."
    "ఏంటి మీ అమ్మ మన పిల్లల్ని చూసుకోడమా? అన్ ఎద్యూకేటేడ్ లేడీ, ఆవిడకేం తెలుసు పిల్లల్ని ఎలా పెంచాలో? పిల్లల్ని పెంచడం ఓ కోర్సు తెలుసా నీకు."
    ప్రత్యూష వైపు చిత్రంగా చూశాడు. "కోర్సా...కొత్తగా ప్రవేశపెట్టారా? ఏ యూనివర్సీటీ లో మరి మీ అమ్మకూడా ఆ కోర్సు చదివి నిన్ను పెంచిండా?" హాస్యంగా అడిగాడు.
    "నాన్సెన్స్ మా అమ్మ ఎడ్యూకేటేడ్ , చదువుకొని వాళ్ళకి పిల్లల్ని పెంచడం రాదు. అయినా అదంతా వదిలేయ్. ఇప్పుడు మీ అమ్మ మన దగ్గర వుండడం నాకిష్టం లేదు" అనేసింది.
    "ఎందుకిష్టం లేదు?" అని అడగాలనుకున్నాడు కానీ , ఆ అవకాశం ఇవ్వకుండా మాటలు కట్ చేసింది.
    "ఆరోజు నుంచీ ప్రతీ రోజూ , నేను చెప్పిన విషయం గురించి ఏం ఆలోచించావు? నేను సరదాగా మాట్లాడలేదు. సీరియస్ మేటర్" అంటూ గుర్తు చేస్తూనే వుంది. శశాంక్ మౌనం వహిస్తూ వచ్చాడు కానీ, రాత్రి చాలా సీరియస్ గా అంది "నేను చెప్తుంటే నీకు వేళాకోళంగా వుందా? మీ అమ్మ మనతో వుండడం నాకిష్టం లేదని చెప్పాగా.... ఆ విషయాన్ని ఎందుకంత తేలిగ్గా తీసుకుంటున్నావు " అంది సీరియస్ గా....
    "ఏంటి ప్రత్యూష! అమ్మకి నేనొక్కడినే కొడుకుని. ఆమె ఎక్కడికి వెళ్తుంది? అయినా ఆవిడ మనకేం అడ్డం?" అన్నాడు నచ్చచెప్పే ధోరణి లో.
    "అడ్డమో, గడ్డమో నాకు తెలియదు కానీ, నేను మాత్రం ఆవిడ వున్నచోట ఉండను. నీకు మీ అమ్మని పంపడం ఇష్టం లేకపోతె నేనే వెళ్ళిపోతాను" అంది.
    నిశ్చేష్టుడయ్యాడు. శశాంక్ "ఎందుకంత తీవ్రమైన నిర్ణయం? ఏం జరిగిందని?" అన్నాడు.
    "ఏదన్నా జరిగేదాకా పంపించవా? అయితే ఆవిడతో రేపు నేనే డైరెక్టుగా చెప్పేస్తాను."
    ఆవేశంగా అంటున్న భార్య వైపు వెర్రి వాడిలా చూశాడు. "ఆవిడ నాకు కన్నతల్లి ప్రత్యూ" అన్నాడు.
    "కన్నతల్లి నాకూవుంది గానీ ఆవిడ మనతో వుంటోంది?"
    "ఆవిడకి మీ నాన్నగారు వున్నారు. మీ చెల్లెలుంది. మా అమ్మకి ఎవరూ లేరు."
    "బోలెడన్ని వృద్దాశ్రమాలు వున్నాయి."    
    "వాట్? అమ్మని వృద్దాశ్రమంలో చేర్చాలా" నిర్ధాంత పోతూ అన్నాడు.
    "వృద్దులు వుండాల్సింది వృద్దాశ్రమంలోనే " నిర్లక్ష్యంగా అంది.
    మళ్ళీ దృడంగా అంది. "నాకన్నా నీకు ఆవిడ ఎక్కువా?"
    "ఎందుకు అలా అనుకుంటావు? నువ్వు నా పాణం."
    "అయితే ఆవిణ్ణి పంపించేయ్... లేదంటే నేను వెళ్ళిపోతా..."
    అప్పటిదాకా ఏదో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతోంది. తిక్కది అనుకున్నాడు కానీ , అంత సీరియస్ గా అనేసరికి శశాంక్ కి మతిపోయింది.
    ప్రత్యూషకి అమ్మ చేసిన అపకారం ఏంటి? తమ దాంపత్య జీవితంలో అమ్మ వల్ల ఏదన్నా లోటు వచ్చిందా? ప్రత్యూష కు ఏంటి ఇబ్బంది? అమ్మని ఎందుకు పంపించాలి? అయినా ఎక్కడికి పంపాలి? పరిపరివిధాల ఆలోచిస్తున్నాడు శశాంక్.
    అమ్మ వుంటే  ప్రత్యూష ఉండనంటుంది. ప్రత్యూష లేకుండా తను క్షణం కూడా బతకలేడు.
    భగవాన్ ఏమిటీ సమస్య? ప్రశాంతంగా , హాయిగా సాగిపోతున్న జీవితంలో ఈ తుపాను ఏంటి?
    అమ్మని పంపించేయాలా ? ప్రత్యూషని వదులుకోవాలా ?
    అమ్మ పెద్దదయింది. ఆవిడ జీవితం దాదాపు అయిపొయింది. చివరి రోజులు వెళ్ళదీస్తుంది. అది ఎక్కడైనా వెళ్ళదీయోచ్చుగా. తనూ, ప్రత్యూషా ఇప్పుడే జీవితం ప్రారంభించారు. అమ్మకోసం జీవిత భాగస్వామితో తగవు భావ్యమేనా? ప్రత్యూషంటే ప్రేమ, అనురాగం, ఆరాధన ఇంకా చాలా.... అమ్మంటే గౌరవం, భక్తీ... మరి ప్రేమ లేదా. కేవలం భక్తీ , గౌరవలేనా? అమ్మ తన సంతోషాల్ని, ఆనందాల్ని ఎన్నింటినో తన కోసం త్యాగం చేసింది. ఆత్మాభిమానం పణంగా పెట్టి తన భవిష్యత్తు కోసం అటెండర్ ఉద్యోగం చేసింది. అలాంటి అమ్మ కోసం తను ఏదైనా చేయాలి. ఏం చేయాలి? ఆవిడకు ఏం కావాలి? పెన్షన్ వస్తోంది. ఆవిడ డబ్బు ఆవిడ కుంది. ఈ ఇల్లు అమ్మదే.తనూ, ప్రత్యూషా వేరే ఇల్లు తీసుకుని వెళ్లిపోవాలి! అవును! అదే కరెక్టు. అమ్మ ఇంట్లోంచి అమ్మని పంపించడం భావ్యం కాదు. ధర్మం కాదు. న్యాయం కాదు.
    శశాంక్ ఒక దృడమైన నిర్ణయాని కొచ్చి ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు. నిద్ర పట్టేసింది.
    గంట తరవాత గది బైట నుంచి తల్లి స్వరం వినిపించి నిద్ర లేచాడు. "నాన్నా శశీ ఎలా ఉందిరా?' ఆవిడ స్వరంలో ఆదుర్దా, గుండెల్ని సూదుల్తో గుచ్చినట్లయింది శశాంక్ కి.
    మంచం దిగి తలుపు తీసుకుని బయటికి వచ్చాడు.
    గాబరా నిండిన కళ్ళతో కొడుకు వైపు చూసింది ప్రమీల. "ఎలా వుంది నాన్నా? భోజనం కూడా చేయకుండా పడుకున్నావురా. మొహం కడుక్కురా అన్నం పెడతాను" ఆప్యాయంగా అంది కొడుకు చేయి పట్టుకుని.
    "అలాగేనమ్మా" అంటూ బాత్ రూమ్ లో కెళ్ళిపోయాడు.
    డైనింగ్ టేబుల్ మీద కంచం పెట్టి వేడి వేడి అన్నం, పప్పు, కూర వడ్డించింది. కొడుకు తీసుకెళ్ళాల్సిన లంచ్ క్యారేజీ లో అన్నం తన కంచంలో పెట్టుకుంది . ఉదయం కొడుకు, కోడలి కోసం మాత్రమే అన్నం వండి, మధ్యాహ్నం తన కోసం విడిగా గుప్పెడు బియ్యం వండుకుంటుంది. కూర, పప్పు మాత్రం పొద్దున అందరికీ కలిపే చేస్తుంది. ఇవాళ మాత్రం శశాంక్ కోసం మళ్ళీ అన్నం వండింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS