Previous Page Next Page 
ఒక కోయిల గుండె చప్పుడు  పేజి 30

            దిశ మార్చిన ప్రత్యూష పవనం
    
    "నాన్నా శశీ! ఏరా ఇంకా కూర్చున్నావేంటి? ఆఫీసుకి వెళ్ళడం లేదా?"
    సోఫాలో కూర్చుని ఎటో చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్న శశాంక్ ని ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది ప్రమీల.
    పూజగదిలోంచి హాల్లోకి వచ్చి పలకరించిన తల్లిని చూసి ఉలిక్కిపడ్డాడు శశాంక్. "ఆ....ఆ....వెళ్తానమ్మా"అన్నాడు తత్తరపడుతూ.
    కొడుకు వైపు వింతగా చూసింది ఆమె.
    రోజులాగే ఇవాళ  కూడా ఉదయం ఐదున్నర కే లేచింది ప్రమీల. స్నానపానాదులు పూర్తీ చేసుకుని, కొడుక్కి , కోడలికి బ్రేక్ ఫాస్ట్ , లంచ్ సిద్దం చేసింది. ఇద్దరూ ఇడ్లీ తింటుండగానే వాళ్ళ క్యారేజీలు కూడా సర్ది డైనింగ్ టేబుల్ మీద వాళ్ళ పక్కనే పెట్టి పూజ గదిలోకి వెళ్ళిపోయింది.
    తనూ, తన భర్తా కలిసి బ్రేక్ ఫాస్ట్ , లంచ్, డిన్నర్ ఏం చేస్తున్నా ప్రమీల అక్కడ ఉండడం ఇష్టం ఉండదు ప్రత్యూష కి . పెళ్ళయిన కొత్తలో అత్తగారికి ఇన్ డైరెక్టుగా చెప్పేది. రెండు నెలలు దాటాక 'అన్నీ టేబుల్ మీద పెట్టి మీ పని మీరు చూసుకోండి. మేం తింటాం" అని డైరెక్టు గానే చెప్పింది.
    అప్పటి నుంచీ కొడుకూ, కోడలు కూర్చున్న చోట వుండకుండా ఏదో పని కల్పించుకుని అవతలికి వెళ్ళిపోతూ వుంటుంది ప్రమీల.
    ఆ ఇంట్లో రెండు ప్రదేశాలు ఆవిడ సొంతం. ఒకటి వంటగది, రెండు పూజగది, ఆ రెండు గదుల్లోకి కోడలు రాదు. కొడుకు అసలు రాడు. ప్రమీల పూజ కనీసం నలభైనిమిషాలు పడుతుంది. శుక్రవారం , మంగళవారం అయితే గంట సమయం పడుతుంది.
    అందుకే ఉదయం లేవగానే ముందు ఆఫీసుల కెళ్ళి పోయే కొడుకు, కోడల కోసం టిఫిను, వంట చేసేస్తుంది. వాళ్ళు బ్రేక్ ఫాస్ట్ తినేటప్పుడు క్యారేజీ లు సర్ది వాళ్ళ పక్కనే పెట్టి తను పూజకి  వెళుతుంది. ఆ తరువాత ఎవరి బండి మీద వాళ్ళు ఆఫీసు లకి వెళ్ళి పోతారు. పూజ పూర్తయ్యాక తను షుగర్ టాబ్లెట్ వేసుకుని రెండు ఇడ్లీలు తింటుంది ప్రమీల.
    ఆ రోజు ఆమె టాబ్లెట్ కోసం హాల్లోకి వచ్చేసరికి శశాంక్ ఆఫీసుకి వెళ్ళకుండా సోఫాలో అలా పరధ్యానంగా కూర్చోవడంతో ఆవిడకి ఆశ్చర్యంతో పాటు చిన్న అనుమానం కూడా వచ్చింది.
    ఏమైంది వీడికి? ఉరుకులు పరుగులు పెడుతూ "టైం అయిపొయింది , నా సాక్స్ ఎక్కడ? నా షూస్ ఎక్కడ?" అంటూ చిందులేసే శశాంక్, బ్రేక్ ఫాస్ట్ కూడా సరిగా తినకుండా క్యారేజీ తీసుకుని పెద్ద శబ్దంతో బండి స్టార్ట్ చేసి రయ్ మంటూ వెళ్ళిపోయే శశాంక్ ఈరోజు ఎందుకిలా వున్నాడు? ఆఫీసులో ఏదైనా సమస్యా? ఆరోగ్యం బాగాలేదా?
    ఆలోచిస్తూ కొడుకు దగ్గరకు వచ్చి పక్కనే సోఫాలో కూర్చుంది. అతని భుజం మీద చెయ్యి వేసి మృదువుగా అడిగింది "ఏమైంది నాన్నా? అలా వున్నావేం?"
    దీర్ఘంగా శ్వాస తీసుకుని తల అడ్డంగా ఊపుతూ "ఏం లేదమ్మా" అన్నాడు శశాంక్.
    "మరి ఆఫీసు కి వెళ్ళకుండా కూర్చున్నావేం? టైం పది దాటింది కదరా" అంది.
    గోడ గడియారం పదిం పావు చూపిస్తోంది.
    శశాంక్ తలెత్తి గడియారం వైపు చూసి నెక్ టై వదులు చేస్తూ అన్నాడు "లేదమ్మా కొంచెం డల్ గా వుంది. నాకు వెళ్ళాలని లేదు. ఇవాళ వెళ్ళను" అంటూ లేచాడు.
    ఆదుర్దాగా తనూ లేచి అడిగింది. "ఏమైంది నాన్నా? తలనొప్పా?"
    "కాదమ్మా?"
    "మరి? ఒళ్ళు నొప్పులా?"
    "లేదమ్మా ఏం లేదు. ఊరికే డల్ గా వుంది. కాసేపు పడుకుంటాను" అంటూ తన గది వైపు వెళ్ళాడు.
    "మాత్రేదన్నా వేసుకుంటావా? కాఫీ ఇవ్వనా' ఆవిడ అతని వెనకే నడుస్తూ అడిగింది.
    "వద్దమ్మా విశ్రాంతి తీసుకుంటాను. కాసేపు ప్రశాంతంగా పడుకుంటే చాలు తగ్గిపోతుంది."
    అతని గది గుమ్మం బయటే ఆగిపోయింది ఆమె, శశాంక్ తలుపులు దగ్గరగా లాగి లోనికి వెళ్ళిపోయాడు.
    ఆవిడ నెమ్మదిగా అక్కడి నుంచి వచ్చేసింది.
    ఎన్నడూ లేనిది కొడుకు అలా వుండడం ఆవిడకి బాధగా అనిపించింది. శశాంక్ చిన్నప్పటి నుంచి ఆరోగ్యంగానే వుండేవాడు. పిల్లలకు తరచూ సహజంగా వచ్చే జలుబు, విరేచనాలు, కడుపు నొప్పులు కూడా శశాంక్ కి రాలేదు. చదువుకునేటప్పుడు కూడా అనారోగ్యంతో స్కూలుకి డుమ్మా కొట్టిన సందర్భాలు చాలా తక్కువ. అలాంటిది ఇవాళ ఆరోగ్యం బాగాలేదని శశాంక్ నీరసంగా, నిస్తేజంగా కూర్చోవడం తట్టుకోలేక పోయింది. ప్రమీల. ఇడ్లీ కూడా తినాలనిపించలేదు. కానీ షుగర్ వ్యాధి వల్ల కళ్ళు తిరిగి నీరసం వస్తుందని బలవంతంగా రెండు ఇడ్లీ తిని శశాంక్ గది వైపే చూస్తూ సోఫాలో కూర్చుండి పోయింది.
    శశాంక్ ఇంటర్ లో చేరిన నాలుగు నెలలకే అనుకోని అనారోగ్యంతో తండ్రి చనిపోయాడు. టెన్త్ ఫెయిలయిన ప్రమీలకు ఆమె భర్త పనిచేసిన గ్రామీణ నీటి సరఫరా శాఖ కార్యాలయంలో కారుణ్య నియామకం కింద అటెండర్ పోస్టు ఇచ్చారు. అంతో ఇంతో కలిగిన కుటుంబం లో పుట్టి, పెళ్ళయ్యాక కూడా మంచి ఇల్లాలుగా, మంచి కోడలిగా పేరు తెచ్చుకున్న ప్రమీల అటెండర్ గ ఎంగిలి కప్పులు కడిగే ఉద్యోగం చేయాల్సి వచ్చినందుకు నామోషీగా భావించలేదు. ఆనందంగా అ ఉద్యోగంలో చేరి కొడుకుని ఇంజనీరింగ్ చేసింది. డబ్బుకి లోటు లేదు. కొడుక్కి మంచి ఉద్యోగం వచ్చింది. ఇంక అతనికి పెళ్ళి చేసి మనవలకి, సేవ చేసుకుంటూ బతికితే చాలుకదా అనుకుని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది. ఇంతలో శశాంక్ తనతో పాటు ఇంజనీరింగ్ చదివిన ప్రత్యూష ని ప్రేమిస్తున్నానని చెప్పడంతో సంబంధాలు చూసే బాధ్యత కూడా తప్పడం ఆవిడకీ ఆనందాన్ని కలిగించింది. పోనీలే తను చూస్తె ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయిని చూస్తుంది. వాడికి బాగా తెలిసిన అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటే అంతకన్నా ఏం కావాలి అనుకుంది.
    ప్రత్యూష తండ్రి ఒక జూనియర్ కాలేజీ లెక్చరర్. ఇద్దరాడపిల్లలు. అతి సాధారణ కుటుంబం. పూర్తిగా నాన్ వెజిటేరియన్స్. అయినా ప్రమీల బాధపడలేదు. సంకోచించలేదు. ప్రత్యూష మాత్రం పెళ్ళికి వేలకి వేలు ఖర్చు పెట్టి పట్టుచీరలు, మూడో నాలుగో నెక్లేసు లు కొనుక్కుంది. కానీ పెళ్ళి మాత్రం సింపుల్ గానే చేస్తాం , మాకంటే స్తోమత అంటూ ప్రమీలకి కనీసం వెయ్యి రూపాయల చీర కూడా పెట్టలేదు. అయినా ప్రమీల భాదపడలేదు. కొడుక్కి కనీసం ఉంగరం, సూటు కూడా కొనకపోవడం కొంచెం బాధ కలిగించినా పట్టించుకోలేదు. పోనీలే బంగారానిదేముంది బంగారం లాంటి పిల్ల కోడలుగా వస్తోందని మురిసిపోయింది. స్నాతకానికి భోజనాలు కూడా పెట్టలేదు. తన బంధువులందరికీ తనే క్యాటరింగ్ ఏర్పాటు చేసింది. పెళ్ళిరోజు మాత్రం రెండు పూటలా వాళ్ళే భోజనాలు పెట్టారు. అది కూడా చాలా మామూలు భోజనం.
    "ఇదేమిటి ప్రమీలా ఈ రోజుల్లో ఎంత లేనివాళ్ళయినా ఐదారు స్వీట్లు, బోలెడు కొత్త కొత్త వంటకాలతో భోజనాలు పెడుతున్నారు. మరీ ఇంత అధ్వానమా? ఇది పెళ్ళి భోజనం లా లేదు" అన్నారు ప్రమీల అన్నదమ్ములు, బంధువులు ప్రమీల కి కూడా నిజమే అనిపించింది గానీ, ఏం మాట్లాడలేక పోయింది.
    కాపురానికి వచ్చిన దగ్గర్నించి అత్తగారితో సరదా మాటలు, ఆత్మీయత.... ఏమీ లేదు. ప్రమీల కొత్తల్లో బాధపడినా తర్వాత అలవాటు పడిపోయింది. ఉద్యోగస్తులు ఇలాగే వుంటారులే అని సమాధానపడింది.
    ఇప్పుడు కొడుకు అలా పడుకుంటే ఆందోళనగా అనిపించింది. మనశ్శాంతి కోసం సుందరకాండ చదువుతూ కూర్చుంది.

                                         ****
    గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని మంచం మీద వాలిన శశాంక్ కి గుండెల మీద పెద్ద పెద్ద ఇనపగుండ్లు దోర్లిస్తున్నట్టు బరువుగా , నొప్పిగా అనిపిస్తోంది. గొంతులో ఏదో వుండగా మారి అడ్డం పడినట్లుంది. తల పగిలిపోతోంది. ఇదంతా నొప్పి వల్ల కాదు, ఆలోచనల వాళ్ళ, రాత్రి ప్రత్యూష కి , తనకీ మధ్య సంభాషణ , ఆమె పంతం గుర్తుకొస్తే వణుకు పుడుతోందతనికి.
    నిజంగా ప్రత్యూష వెళ్ళిపోతుందా?ఈ ఇంట్లో ఆమెకు ఏం తక్కువైంది? ఎంత సుఖంగా వుంటోంది తను, ప్రత్యూష ని అమ్మ ఎంతో బాగా చూసుకుంటోంది. కోడలికి ఇన్ని సేవలు ఎవరు చేస్తారు? ప్రత్యూష కి ఇవన్నీ అర్ధం కావడం లేదు. ఆకాశంలో వుండే చందమామ అరచేతిలో వుంటే దాన్నో రబ్బరు బంతి అనుకుని పక్కన పడేయడం మనిషి నైజం. దూరం నుంచి చూసేవే అందంగా కనిపిస్తాయి. ఎంతో అపూరూపమైనవి అందుబాటులో వుంటే వాటి విలువ తెలియదు.
    ప్రత్యూష పరిస్థితి ఇప్పుడు ఇలాగే వుంది. అమ్మ దూరమైతే కానీ, ఆవిడ విలువ తెలిసి రాదు. కనీసం తెలుసుకోవడానికి ప్రయత్నించకుండా అవేశాపడింది.
    ప్రత్యూష ఎందుకంత పట్టుబడుతోంది? తన సమస్య ఏంటి? ఎంత ఆలోచించినా శశాంక్ కి అర్ధం కావడం లేదు. ఎందుకు? అనే ప్రశ్న ఒక పెద్ద సమ్మెటలా మారి అతని తల మీద కొడుతోంది.
    ప్రత్యూష తన ప్రాణం , తన సర్వస్వం. ఆమె కోసం తపించి, వెంటబడి, ఆమె ఎన్ని కండిషన్లు పెట్టినా అన్నిటినీ అంగీకరించి పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళంటూ చేసుకుంటే ప్రత్యూష నే చేసుకుంటా, లేకపోతె అసలు పెళ్ళి చేసుకోనని పట్టుబడితే , అలాగే చేసుకోనాన్నా నీ ఇష్టానికి వ్యతిరేకంగా నేను ఏమీ చేయను, సరేనా? అంటూ పెళ్ళికి అంగీకరించడమే కాదు, ప్రత్యూష ని ఎంతో ఆదరించి కన్నకూతురులా చూసుకుంటోంది అమ్మ. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS