శేఖర్, మరో యువకుడు కలిసి ప్రేక్షకులందరికీ పుస్తకం పంచుతున్నారు. టెన్షన్ తో కూర్చున్న రాహుల్ చేతిలో శేఖర్ పుస్తకం పెట్టి వెళ్ళిపోయాడు. రాహుల్ కళ్ళు పుస్తకం మీదకు మళ్ళాయి.
ప్రహ్లాద గారి స్వరం గంబీరంగా మోగింది.
"వేదిక మీద వున్న మహానుభావులకు, మీ అందరికీ నా నమస్కారాలు. సరాగ.... పేరులోనే వుంది ఆమె నైపుణ్యం అంతా. ఏం అలోచించి పెట్టారో ఆమె తల్లితండ్రులు ఆమెకీ పేరు. ఏది ఏమైనా ఆమె చిన్న వయసులోనే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నేపధ్య గాయనిగా, అన్నమాచార్య కీర్తనలకి పెట్టింది పేరుగా కీర్తిని గడించింది. అయితే దురదృష్టం కొద్ది ఆమె స్వరం ఊహించని ప్రమాదానికి గురైంది. కొద్దిగా ఆలస్యం అయితే పూర్తిగా మూగాపోవాల్సిన ఆమె స్వర తీగలను సవరించి తీయని రాగం ఆలపించ మని దీవించారు స్వామీజీ. ఇప్పుడామె గాయనే కాదు,ఈ నేల రోజులుగా స్వామీజీ ఆశ్రమం లో ఉంటూ అయన పర్యవేక్షణ లో ఆమె పూర్తిగా స్వస్తురాలై పోవడమే కాక తన అనుభవాన్ని రంగరించి చక్కటి కధ రాసింది. ఈరోజు నా చేతుల మీదుగా అవిష్కరించాల్సిన ఈ పుస్తకం నాకు రెండు రోజుల ముందే స్వామీజీ పంపించారు. కాబట్టి నేను ఈ పుస్తకం ఆమూలాగ్రం చదివాను. ఆమె వేదన అర్ధం చేసుకున్నాను. ఈమె కేసుని సుమోటా గా స్వీకరిస్తూ త్వరలోనే ఆమెకి లీగల్ గా ఆమె భర్త అనబడే ఒక వయోముఖ విష కుంభం నుంచి విముక్తి ప్రసాదిస్తానని ఆమెకి మాట ఇస్తున్నాను."
ప్రేక్షకుల్లో అయోమయం, రాహుల్ కళ్ళల్లో ఆగ్రహం...నాగాలక్ష్మీ, రామారావు కళ్ళల్లో ఆక్రోశం, సరాగ కళ్ళల్లో జడ్జిగారి నిర్ణయం పట్ల ఆత్మీయత.
స్వామీజీ లేచారు.
"జడ్జిగారు నిర్ణయానికి మీరంతా ఆశ్చర్య పడుతున్నారని నాకు తెలుసు. జడ్జిగారు సరాగకి విడాకులు ఎందుకు మంజూరు చేస్తున్నారన్న ప్రశ్నకి సమాధానం మీ చేతుల్లో వున్న పుస్తకం లో లభిస్తుంది. ఒక ఆడపిల్లను వంచింది, ఆమె బంగారు భవిష్యత్తుని నాశనం చేయాలనుకున్న ఆమె భర్త అనబడే రాహుల్ మీ మధ్యనే వున్నాడు. తన ప్రేయసిని ఉన్నత శిఖరాలకి తీసుకెళ్ళడానికి, ఒక అపూర్వ గాయనిని వంచించి భార్యగా చేసుకుని, తన ప్రేయసి ఎదుగుదలకి అడ్డుపడుతోందన్న భ్రమతో, అసూయతో ఒక గొప్ప స్వరాన్ని శాశ్వతంగా మూసేయడానికి విషప్రయోగం చేశాడు అది ఎలా? ఎందుకు? అనే విషయాలు మీకా పుస్తకం లో లభిస్తాయి. అందుకే జడ్జిగారు ఈ నిర్ణయం తీసుకున్నారు."
ఒక్కసారిగా ప్రేక్షకుల్లో కలకలం. కొందరు తలలు అటూ ఇటూ తిప్పి రాహుల్ కోసం వెదకసాగారు. కొందరు గబగబా తమ చేతుల్లో వున్న పుస్తకం తెరిచారు. నాగాలక్ష్మీ నిర్ఘాంత పోతూ భర్త వైపు చూసింది. అయన భాదను అణుచుకుంటూ కళ్ళు మూసుకున్నాడు.
రాహుల్ కి అర్ధమైపోయింది. తన నిజస్వరూపం సరాగకే కాక మొత్తం అందరికీ తెలిసిపోయింది. అతను శశిరేఖ చేతిమీద తట్టి "పద వెళ్ళిపోదాం" అన్నాడు.
అతను మెల్లిగా పారిపోవడం గమనించిన స్వామీజీ గుంభనంగా నవ్వుకున్నారు. అయన స్వరం తిరిగి మోగింది.
"ఇప్పుడు కల్చరల్ మినిస్టర్ గారు మాట్లాడతారు."
మంత్రి గారు లేచారు. సరాగని అభినందించి, స్వామీజీ సాధించిన అపూర్వ విజయాన్ని శ్లాఘించారు. ప్రేక్షకుల వైపు తిరిగి అన్నారు....
"మన తెలుగు వారి సంస్కృతీ , సంప్రదాయాలు సంగీతం, నాట్యం, సాహిత్యం, చిత్రకళలు అనే నాలుగు స్తంభాల మీద పటిష్టంగా నిలబడి వున్నాయి. ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ కూడా మన సంప్రదాయ సంగీతాన్ని , సంప్రదాయ నాట్యాన్ని ఎంతో ఆదరిస్తున్నాయి. ఇంకా ఇంకా మన సంస్కృతీ సంప్రదాయాలు విశ్వవ్యాప్తం కావాలంటే భవిష్యత్తు లో మరెందరో కళాకారులు తయారు కావాలి. అలాంటి కళాకారులను తయారు చేయడానికి సరాగ లాంటి అంకిత భావం వున్న యువతల సహకారం , సహాయం కావాలి. ఈమె లాంటి వాళ్ళు కళలను పెంపొందించడానికి ముందుకు రావాలంటే ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం , ఆర్ధిక సహకారం కావాలి. అందుకే ఈమెకి ఈ ప్రాంతం లోనే ఒక సంగీత కళాశాలను కట్టించి దానికి ఈసరాగను చైర్మన్ ను చేయాలన్న నా నిర్ణయాన్ని త్వరలో ప్రభుత్వానికి తెలియజేసి, ప్రభుత్వం నుంచి ఆమోదం తీసుకుంటాను.ఈమె శిష్యరికంలో మరెంతో మంది గాయనీ గాయకులూ తయారై మన తెలుగు వారి సంస్కృతీ సంప్రాదాయాలైన సంగీతాన్ని ప్రపంచ దేశాలకి చాటాలని మనసారా కోరుకుంటున్నాను."
సరాగ ఆపుకోలేని ఉద్వేగంతో ఆక్కడి నుంచి తెర వెనక్కి వెళ్ళిపోయి రెండు చేతుల్లో మొహం దాచుకుని ఏడవసాగింది. ఆమె కళ్ళ ముందు రాహుల్ మొబైల్ లో కనిపించిన వాట్సప్ మెసేజ్ లు, ప్రోటీన్ పొడి అంటూ పాలలో విషాహారం కలిపి తనతో ప్రేమగా తాగించడం, తన కార్యక్రమం రోజునా ఎవరూ మెచ్చుకొని శశిరేఖ పాటను అతను మెచ్చుకోడం సంఘటనలన్నీ వలయాలుగా కదలసాగాయి.
అప్పటికే తన చేతిలోని అరవై పేజీల పుస్తకం లోని విషయాలు చదివి ఆవేశంతో రగిలిపోసాగాడు శేఖర్. ఎంత దారుణమైన మోసం! సరాగ కీర్తి ప్రతిష్ట లు తన ప్రేయసి ఎదుగుదలకి అవరోధం అని ఇలా వంచించాడా? కులాలు అడ్డు వచ్చాయని పెద్దవాళ్ళ నిర్ణయానికి తల వంచి పెళ్ళి చేసుకున్న ఆ శశిరేఖ లక్షణంగా కాపురం చేసుకోక వివాహితురాలు అయి వుండి, పాత ప్రేమికుడిని ఉసి గొల్పి సరాగ జీవితం నాశనం చేస్తుందా? ఎంత పైశాచికత్వం! వీళ్ళని..... వీళ్ళని.... పళ్ళు పటపట కొరుకుతూ చేతిలో పుస్తకం నలిపివేస్తున్న శేఖర్ భుజం మీద చల్లటి స్పర్శ.
ఉలిక్కిపడి చూసిన శేఖర్ చిరునవ్వుతో తనకి ఎదురుగా వున్న స్వామీజీని చూసి ఆవేదనగా పిలిచాడు "స్వామీ.... ఏమిటిది?"
"బాధపడకు బాబూ.... పాపం పండుతుంది. దుష్టులని సంహరించడానికి భగవంతుడు వెంటనే అవతారం దాల్చలేదు. చాలా ఓపిక పట్టి , సహనం నశించాకే దుష్టశిక్షణ, శిష్ట రక్షణకి అవతారం దాల్చాడు. వాళ్ళిద్దరి దుర్మార్గం బయటపడి శిక్ష పడే రోజు త్వరలో వస్తుంది. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం సరాగ కోల్పోయిన కీర్తి ప్రతిష్టలను ఆమెకి తిరిగి అందించడానికి సహకరించడమే."
స్వామీజీ మాటలతో కన్నీటితో నిండిన కళ్ళెత్తి ఆయన్ని చూసిన సరాగ గభాలున అయన పాదాల మీద వాలిపోయింది.
అయన ఆమెను లేవనెత్తి "ఏడవద్దమ్మా ....ధైర్యంగా పరిస్థితులతో పోరాడి విజయం సాధించు. శతమానంభవతి" అంటూ ఆమె తల మీద చేయి వేసి దీవించారు స్వామీజీ.
----------
