Previous Page Next Page 
ఒక కోయిల గుండె చప్పుడు  పేజి 28

    ఒక్కొక్కటిగా ....ఒక్కొక్కటిగా మెస్సేజ్ లు.... సరాగకి కళ్ళకు కమ్ముకున్న నమ్మకపు పోరలు విడదీస్తూ ఆమె పెంచుకున్న ప్రేమలతని వేళ్ళతో సహా పెకలిస్తూ.... 
    ఆమె పడుకున్న మంచం కింద నేల పగిలిపోతున్నట్లు, పైన సీలింగ్ తన నేత్తిన పడిపోతున్నట్టు మొత్తం గిరగిరా తిరుగుతున్నట్టు అనిపించింది. "నాది అనుమానం కావచ్చు, వాస్తవం కావచ్చు...' స్వామీజీ స్వరం చెవుల్లో అదే పనిగా వినిపిస్తుంటే కళ్ళు తెరచుకుని కన్నీరు కారుస్తూ వుండిపోయింది.

                                            ****

    తెల్లవారింది. సరిగ్గా పది లంఖణాలు పడినదానిలా వుంది. కళ్ళు లోతుకు పోయాయి. 
    మొహం పీక్కుపోయింది. తూలిపోతున్న కూతుర్ని భుజం పట్టుకుని నడిపిస్తూ వచ్చి దగ్గరుండి బ్రష్ చేయించింది నాగాలక్ష్మీ. బ్రష్ చేసుకుని వచ్చిన సరాగ కి పల్చటి మజ్జిగ ఇచ్చింది.
    మజ్జిగ తాగి కొద్దిగా సేద తీరిన సరాగ నెమ్మదిగా అంది "నాన్నా! శేఖర్ కి ఫోన్ చేసి త్వరగా రమ్మను."
    "మళ్ళీ అల్లుడికి కోపం వస్తుందేమో?"
    "రానీ నాన్నా.... అయన కోపం కన్నా నాకు నా స్వరం ముఖ్యం" దృడంగా అంది. 
    ఆయనకి కూతురు ధోరణి చిత్రంగా అనిపించింది. చేసేది లేక శేఖర్ కి ఫోన్ చేసి కారు తీసుకురమ్మని చెప్పాడు.
    శేఖర్ అరగంట లో వచ్చాడు.
    సరాగ తల్లికి రాహుల్ మొబైల్ ఇచ్చి "అయన వస్తే ఇచ్చేయమ్మా" అంటూ వెళ్ళి కారులో కూర్చుంది.
    కారు కదిలింది.
    మరో గంటలో కారు ఆశ్రమం చేరింది. ఆమెని చూసిన స్వామీజీ పెదాలమీద చిన్న చిరునవ్వు మెరిసింది.

                                          ****
    సరాగ తెల్లవారుజామున ఐదింటికి లేచి కాలకృత్యాలు తీర్చుకుని అరగంట యోగా, చేయడం, స్నానం, ధ్యానం, అయ్యాక పసరు వైద్యం చేసుకుని పుస్తకాలు చదువుకుంటూ మధ్య మధ్య ఏదో రాసుకుంటూ వుంటుంది. ఆమెతో పాటు ఆ ఆశ్రమం లో అయన శిష్యులు ఇద్దరు కుర్రాళ్ళున్నారు. వాళ్ళతో కాసేపు కబుర్లు, ఆహారం కోసం స్వామీజీ ప్రత్యేకంగా ఏం చేయాలో చెబితే అది తనే తయారు చేసుకుంటుంది. సరాగ కాయగూరలు, పండ్లు, రాత్రిళ్ళు పడుకునే ముందు గ్లాసు పాలు, అంతకు మించి కాఫీలు, టీలు చిరుతిళ్ళు ఏమీ లేవు.
    ఆ ప్రశాంతమైన వాతావరణం , క్రమశిక్షణతో కూడిన దినచర్య, నియమిత ఆహారం, నిత్యం వ్యాయామం . పదిహేను రోజుల్లోనే తనలో ఏదో అపూర్వమైన మార్పు వచ్చినట్లు గమనించింది సరాగ. క్రమంగా ఆమె చర్మంలో కాంతి, కళ్ళల్లో వింత వెలుగులు , స్వరంలో కూడా మునుపటి లాలిత్యం వస్తోంది.
    ఇరవై రోజులు గడిచాయి. ఇరవై రోజుల్లో సరాగ ఒక్కసారి కూడా రాహుల్ కి ఫోన్ చేయలేదు.
    చేయాల్సిన అవసరం లేదనుకుంది.
    అతను కూడా ఏమీ చేయలేదు. కనీసం ఒక్కసారన్నా చూడ్డానికి రాలేదు. వస్తాడని ఆమె ఆశించలేదు.

                                      ****

    ఆరోజు ఉదయం స్వామీజీ అన్నారు "ఈరోజు నీకు గుర్తున్న కీర్తన ఒకటి పాడు తల్లీ."
    "పాడగలనా స్వామీజీ" ఆశగా అడిగింది.
    "తప్పకుండా పాడగలవు. పాడగలను అనే విశ్వాసం నీలో నింపుకుని పాడు."
    కళ్ళు మూసుకుని గుండె నిండా గాలి పీల్చుకుంది. క్రమంగా గాలి వదుల్తూ శ్వాస తీసుకుని గొంతు సవరించుకుంది. పూల తీగల మీద తూగుతూ పచ్చని పచ్చిక మీద వాలే మలయమారుతంలా సాగింది ఆమె స్వరం.
    "ముద్దుగారే యశోద....' ఆమెకి తెలియకుండానే ఆమె స్వరం జలపాతం లా పరుగులు తీసింది.
    ఒకటి, ఒకటి, ఒకటిగా తనకు తెలియకుండానే నాలుగు కీర్తనలు అలవోకగా పాడేసి టపీమని ఆపేసింది.
    కన్నీళ్ళతో ఆమె చెక్కిళ్ళు తడిసిపోయాయి. గభాల్న అయన పాదాల మీద సాష్టాంగ పడింది.
    అయన రెండు చేతులతో లేవనెత్తి "ఇంక ధైర్యంగా నీ పాట కచేరీ ఏర్పాటు చేసుకో తల్లీ' అన్నాడు.
    "స్వామీ!అదేదో మీ ఆశీర్వాదం తో మీరే చేయండి ప్లీజ్. అలాగే నా పాట కచేరీ రోజున నేను రాసిన చిన్న పుస్తకం ఒకటి కూడా ఆవిష్కరించాలి మీ చేతుల్తో . మీరు ఒప్పుకుంటే నాన్నని పిలిచి నేను రాసుకున్న కాగితాలు ప్రింట్ కి ఇవ్వమని చెప్తాను."
    "తప్పకుండా నీ కధ నేను ఆవిష్కరిస్తానమ్మా" అన్నాడాయన నర్మగర్భంగా నవ్వుతూ.
    తండ్రికి ఫోన్ చేసింది సరాగ. మరో రెండు గంటల్లో అయన వచ్చాడు.
    తను రాసుకున్న రాత పత్రిని ఇస్తూ అంది "నాన్నా! నాకు ఇది మూడు రోజుల్లో పుస్తకరూపం లో కావాలి. చాలా తక్కువ పేజీలు . సుమారు అరవై పేజీలుంటాయి అంతే."
    'అలాగే తల్లీ! తప్పకుండా తెస్తాను" అన్నాడు రామారావు కూతురి స్వరంలో పలుకుతున్న తంబూరనాదం వింటూ.

                                                ****
    ఆరోజు ఆశ్రమం తరపున స్వామీజీ ప్రముఖుల సమక్షం లో ఏర్పాటు చేసిన భక్తీ గీతాల కార్యక్రమం, అతిధులతో , ఆహూతులతో , ప్రాంతీయ కళాభిమానులతో మీడియా వారితో కళకళలాడిపోతోంది ఆవరణ.
    ఆశ్రమం చుట్టూ ఉన్న ఖాళీ స్థలం లో పెద్ద వేదిక ఏర్పాటు చేశారు. కుర్చీలు, బల్లలు, రంగు కాగితాలతో అలంకరణ, విద్యుద్దీపాల కాంతితో పరిసరాలు శోభాయమానంగా ప్రకాశిస్తున్నాయి. అంతా స్వామీజీ పర్యవేక్షణ లో ఆకర్షణీయంగా వుంది.
    శేఖర్, రామారావు, నాగలక్ష్మీ వచ్చారు.
    సరాగ పంపించిన ఆహ్వానం చూసి షాకయ్యాడు రాహుల్.
    సరాగ పాడే భక్తీ గీతాల కార్యక్రమమా? ఎలా సాధ్యం అనుకున్నాడు.
    వెళ్ళాలా? వద్దా? అని అలోచించి చివరికి వెళ్ళడానికే నిశ్చయించుకున్నాడు.
    సాయంత్రం ఆరయింది. కల్చరల్ ఎఫైర్స్ మంత్రి గారు, డైరెక్టరు గారు, హైకోర్టు జడ్జి గారు, మరో ఇద్దరు ప్రముఖ న్యాయవాదులు , ఇద్దరు ప్రముఖ నేపధ్య గాయనీ గాయకులూ , స్థానిక ఎంఎల్ ఎ , మరో ఇద్దరు పీఠాదిపతులు వచ్చారు. వేదిక తేజోవంతంగా వుంది.
    స్వామీజీ వేదిక మీదకు వచ్చారు.
    రెండు అరచేతులు గట్టిగా నలుపుకుంటూ ఆందోళన అణచుకుంటూ నిలబడిన సరాగ భుజం మీద ధైర్యాన్నిస్తూ తట్టాడు శేఖర్ 'అల్ ది బెస్ట్ సరాగా. ఇది నీకు పునర్జన్మ గుర్తుంచుకో" అన్నాడు.
    అవునన్నట్లు తలూపింది సరాగ.
    స్వామీజీ స్వరం గంభీరంగా మోగింది. ఆనాటి కార్యక్రమ ప్రత్యేకత గురించి వివరించాడు.
    సరాగ తన దగ్గరకు ఏ పరిస్థితుల్లో వచ్చిందో వివరించి ఉజ్వలమైన భవిష్యత్తు వున్న ఓ అపూర్వగాయనిని తిరిగి లోకానికి అప్పగించాలన్న తన సంకల్పం వివరించాడు.
    ముందుగా ఆమె రెండు కీర్తనలు పాడుతుందని, తరువాత ఆమె రాసిన చిన్న పుస్తకం జడ్జి గారు ఆవిష్కరిస్తారని వివరించి తన ఆసనంలో ఆసీనులయ్యారు.
    సరాగ వేదిక మీదకు వచ్చింది. ప్రేక్షకుల్లో జంటగా కూర్చున్న శశిరేఖ , రాహుల్ ని చూసింది.
    నిబ్బరంగా కళ్ళు మూసుకుని ముందుగా ప్రార్ధన "శుక్లాం బరధరం ' తో ప్రారంభించి వాతాపి గణపతిం భజే....
    నాగాలక్ష్మీ , రామారావు కళ్ళ నుంచి గంగా, యమునా ప్రవహిస్తున్నాయి.రాహుల్ కళ్ళల్లో నిప్పు రవ్వలు రాలుతున్నాయి. ప్రేక్షకులంతా మంత్రముగ్దులైనారు.
    లేత నీలం రంగు పట్టుచీరలో , ఎప్పటి కన్నా నునుపు తేలి మెరిసిపోతున్న లావణ్యం తో చిరునవ్వుతో అందరినీ చూస్తూ అపూర్వంగా ఆలపిస్తున్న సరాగని చూస్తున్న కొద్దీ రాహుల్ లో ఆవేశం, ఆగ్రహం ఎక్కువ అయిపొయింది. అవమానంతో అతని మొహం జేవురించింది.
    రెండు కీర్తనలతో అపాలనుకున్న ఆమెని అపనివ్వలేదు ప్రేక్షకులు. గంట తరువాత ధారాపాతంగా కారుతున్న ఆనందభాష్పాలు తుడుచుకుంటూ వచ్చి తన కుర్చీలో కూర్చుంది" సరాగ.
    రంగు కాగితాల్లో చుట్టిన పుస్తకాల పాకెట్ తో శేఖర్ వేదిక మీదకి వచ్చి అతిధుల ముందు వున్న సెంటర్ టేబుల్ మీద ఆ పాకెట్ పెట్టి వెళ్ళిపోయాడు.
    స్వామీజీ జడ్జి గారిని పుస్తకం ఆవిష్కరించవలసిందిగా కోరారు.
    సరాగ జడ్జిగారి పక్కకి వచ్చి నిలబడింది.
    అవిష్కరనోత్సవం ప్రారంభమైంది. న్యాయమూర్తి, జస్టిస్ ప్రహ్లాద గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడిన పుస్తకం కవర్ పేజీ ప్రేక్షకులకి మీడియాకి కనిపించేలా పట్టుకున్నారు జడ్జిగారు.
    "ఒక కోయిల గుండె చప్పుడు" అట్ట మీద పెద్ద పెద్ద అక్షరాలతో....
    రాహుల్  భ్రుకుటి ముడి పడింది. ఆ పుస్తకం సరాగ రాసిందా? సరాగ గాయనే గాక రచయిత్రి కూడానా? తనతో ఎప్పుడూ చెప్పెలేదే? శశిరేఖ ఏదో అంటోంది.
    ఆమె మొహం కందగడ్డలా వుంది. రాహుల్ ఆమె మాటలకి తల పంకిస్తున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS