Previous Page Next Page 
ఒక కోయిల గుండె చప్పుడు  పేజి 25

            ఒక కోయిల గుండె చప్పుడు

    "వద్దురా కన్నయ్యా....ఈ పొద్దు ఇల్లు వదిలి పోవద్దురా అయ్యా.... అయ్యా.... వద్దురా కన్నయ్యా..."
    శ్రావ్యంగా , తీయగా పాడుతోంది ఆ యువతి. అవును ఎంత హాయిగా, మధురంగా వుంది గొంతు.
    "ఈ అమ్మాయికి వాళ్ళమ్మ తేనే తాగించి పెంచింది కాబోలు."
    టీవీలో వస్తున్నా పాటల కార్యక్రమం ముగ్ధులై చూస్తున్న వాళ్ళంతా ఏకబిగిన ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు.
    "తప్పకుండా ఈమెకే వస్తుంది బహుమతి. అసలది స్వరమా? దేవుడిచ్చిన వరమా? ఆ గమకాలంటి సెలయేటి గలగలల్లా.... ఆ లయ ఏంటి?"
    "ఏదీ మరోసారి పాడవూ.... సన్నగా వీచే చల్లగాలికి కనులు మూసినా కలలాయే.... రాధికా కృష్ణా... తవ విరహే కేశవా?...."
    "అబ్బ ఎంత అమృతంలా పలుకుతోంది నీ స్వరంలో భావం. ఆ రాధ పడే విరహ బాధ నువ్వే పడుతున్నట్టు ....ఆ విరహం కృష్ణుడి కోసమా? నా కోసమా?"
    అలలు అలలుగా అతని నవ్వు.
    "మరోసారి పాడవూ.... ప్లీజ్ పాడు రాగా! నీ పేరు సరాగ కాదు, అనురాగ నా అనురాగ.... పాడవూ.... ఏదీ ఆలాపన, ఏదీ రాగం, ఏదీ తాళం, ఏదీ లయ? ఏదీ ఆ శ్రావ్యత? ఏదీ...ఏదీ?"
    "నో...." తల విదిల్చింది సరాగ.
    ఆలోచనలతో , గత స్మృతులతో తల తిరిగిపోతోంది.
    గుండె మండిపోతోంది. గొంతెత్తి హాయిగా పాడాలని స్వరపేటిక తహతహ లాడుతోంది.
    ఎలా జరిగిందిది? ఏమైంది సరాగాలు పలికే ఈ సరాగ స్వరం.... ఏమైపోయింది. తేనెలూరే ఆ గాత్రం.... ఏమైపోయింది? సరిగ్గా నెలరోజుల్లో ఇంత మార్పా?నెలక్రితం వరకూ ప్రకృతి లో గంధర్వ కన్యలు పూల తీగాలనే వీణ తీగలుగా మీటినట్లు పాడిన ఈ సరాగ మళ్ళీ పాడగాలదా? కనీసం.... కనీసం.... మాట్లాడగలదా? ఇప్పుడు  బొంగురు పోయిన ఈగొంతు .... చిన్న ఆలాపన కూడా తీయలేకపోతున్న ఈ గొంతు కనీసం మాట్లాదగలుగుతుందా ? శాశ్వతంగా మూగబోతుందా?
    "రాగా!' నాగాలక్ష్మీ లోపలకు వచ్చింది.
    "మందేసుకోతల్లీ!'
    చిన్న ఔన్సు గ్లాసులో మందు పోసి మంచం మీద చివరకు కూర్చుని తలగడలాంటి మెత్తని చెయ్యి ఆసరాగా ఇస్తూ సరాగ మెడని పైకి లేపి నోటికి గ్లాసు అందించింది.
    మందుతో పాటు కన్నీళ్ళు కూడా మింగేసింది సరాగ.
    ఆవిడ గ్లాసు పక్కన పెట్టి మృదువుగా చెవుల పక్కకి జారిన కన్నీరు తుడిచింది. వెచ్చగా తగిలాయి చెంపలు.
    "ఎందుకమ్మా ఏడుపు? మనిషన్నాక ఏదో ఒక జబ్బు రాదా? అదే తగ్గిపోతుంది. దాని గురించి అలోచించి జ్వరం తెచ్చుకున్నావు."
    సరాగ తలగడ మీదకి జారి తల అడ్డంగా ఊపింది.
    నూతిలోంచి వచ్చినట్టు వినిపించింది అమెస్వరం.
    "రాదు ....నాగొంతు ...నాకు మళ్ళీ రాదు..."
    నాగాలక్ష్మీ దుఃఖాన్ని గుండెల్లో అదిమిపెడుతూ అంది "తప్పు ....అలా అనకూడదు. మనిషి ఆశాజీవి.. నీమీద నీకు నమ్మకం , భవిష్యత్తు మీద ఆశ కోల్పోతే అన్నీ కోల్పోయినట్టే."
    కన్నీళ్ళతో తల్లి వైపు చూసింది.
    "ఎలా వుంటుందమ్మా ఆశ... ఎలా వుంటుంది?"
    ఆవిడ కూతురిప్రశ్నకి సమాధానం చెప్పలేని దానిలా నిస్సహాయంగా చూసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది.
    సంగీతం అంటే పంచ ప్రాణాలైన నాగాలక్ష్మీ ఒక్కగానొక్క కూతురికి సరాగ అని పేరు పెట్టడమే కాక ఆ పిల్లకి ఐదేళ్ళ వయసు వచ్చిన దగ్గర నుంచి సంగీతం చెప్పించడం మొదలు పెట్టింది. పదేళ్ళు వచ్చేసరికి ఎంతో పరిణతితో కీర్తనలు కూడా పాడేస్తూ అడపా దడపా స్కూలు వార్షికోత్సవాలకి , వేదికల మీద చిన్న చిన్న బహుమతులు పొందిన సరాగ పదమూడు సంవత్సరాలు వచ్చేసరికి టీవీలో వస్తున్న పాడనా హాయిగా అనే కార్యక్రమం ఆడిషన్ లో సెలెక్ట్ అవడమే కాక ప్రధమ బహుమతి కూడా పొందింది. అప్పటి నుంచి అనేక అవకాశాలు ఆమెను వెదుక్కుంటూ వచ్చి పదహారేళ్ళ కి సినీ నేపధ్య గాయనిగా ఎన్నో సినిమాలకు పాటలు పాడుతూ తెలుగు రాష్ట్రంలో తెలుగు కోయిలగా పేరు ప్రఖ్యాతులు పొందింది.
    సుమారు ఏడేళ్ళ క్రితం నాగాలక్ష్మీ రామారావు దంపతుల ఇంట్లో మేడ మీద పోర్షన్ లో కొంతకాలం అద్దె కున్న కామేశ్వరి, ఆమె భర్త దూరపు బంధువుల ఇంట్లో పెళ్ళికి హైదరాబాద్ వచ్చి పెళ్ళి అయిన మర్నాడు రామారావు ఇంటికి వచ్చారు.
    వీళ్ళని చూడగానే నాగాలక్ష్మీ చాలా సంతోషించింది.
    "రండి.... రండి.... ఎలా ఉన్నారు?' అంటూ ఆప్యాయంగా ఆహ్వానించింది.
    పిచ్చాపాటీ అయ్యాక తను వచ్చిన పని చెప్పింది కామేశ్వరి.
    "మా అమ్మాయి సుహాసిని పెళ్ళికి మిమ్మల్ని పిలవాలనుకున్నాం. కానీ అమెరికా సంబంధం అనుకోకుండా వచ్చి హడావుడిగా పెళ్ళయి పోయింది.
    తను అమెరికా వెళ్ళి నాలుగేళ్లయింది.ఈ మధ్య అనుకోకుండా పాటల కార్యక్రమం చూసిందట. ముందు మీ అమ్మాయిని చూసి అసలు పోల్చుకోలేదుట. తరువాత గుర్తుకొచ్చి నాకు ఫోన్ చేసి అడిగింది. అప్పట్లో సన్నగా, పెద్ద జడతో వుండే సరాగేనా అమ్మాయి ఇంత అందంగా అయిందా అంటూ."
    ఆవిడ మాటలకు నాగాలక్ష్మీ కొంచెం గర్వంగా నవ్వింది.
    "రాహుల్ అని మా అల్లుడి స్నేహితుడు . మీ అమ్మాయిని చాలాసార్లు టీవీలో చూసి ఇష్ట పడ్డాడట. చాలా మంచి సంబంధం. ప్రస్తుతం అక్కడే వున్నాడు. పిల్లాడు చక్కగా వుంటాడు. రామారావుగారి మెయిల్ ఐడి చెబితే ఫోటో పంపిస్తాను."    
    ఆవిడ చెప్పింది విని రామారావు అన్నాడు. "ఏమనుకోకండమ్మా . ఎన్నారై సంబంధంచేయము. పిల్లకి ఇక్కడ వుంటే మంచి భవిష్యత్తు వుంటుంది. అక్కడికి వెళితే ఏం వుంది? ఇంట్లో కూర్చుని మంగళహారతులు పాడుకోవాల్సిందేగా."
    "అయ్యో లేదండి. ఆ అబ్బాయికి కూడా అక్కడ సెటిల్ అవడం ఇష్టం లేదు. వాళ్ళ కంపెనీ ఎల్ వన్ వీసా మీద పంపించింది. ఏదో ప్రాజెక్టు ఇచ్చి వచ్చేస్తాడు. వాళ్ళ ఆఫీసు ఇక్కడ హైటెక్ సిటీ లో వుందిట." అన్నాడు శ్రీధర్ మూర్తి కామేశ్వరి భర్త.
    "మీరు చెప్పారుగా. మా అమ్మాయి అభిప్రాయం కూడా అడిగి అలోచించి చెప్తాం లెండి" అని అప్పటికి దాటేసారు రామారావు దంపతులు.
    వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నారై సంబంధం చేయడం ఇష్టం లేదు. ముందు  ఎల్ వన్ వీసా మీద వెళ్తారు. అక్కడికి వెళ్ళాక రావడం ఇష్టం లేదని హెచ్ వన్ వీసా సంపాదిస్తారు. అందుకే మౌనంగావుండిపోయారు. సరాగ'కి అంతకన్నా ఇష్టం లేదు. 
     మరో రెండు నెలలు గడిచాయి. ఈలోగా కామేశ్వరి మరో రెండు సార్లు ఫోన్ చేసి రాహుల్ విషయంలో రామారావు దంపతుల మీద ఒత్తిడి చేసింది.
    "చూద్దాం" అంటూ దాటేశారు.

                                                                         ****
    ఆరోజు సాయంత్రం సరిగ్గా ఆరు గంటలకు గేటు తోసుకుని వస్తున్న కామేశ్వరి, ఆమె పక్కన హుందాగా , అందంగా రాజసం ఉట్టి పడుతూ నడిచి వస్తున్న యువకుడినిచూసి ఆశ్చర్యంతో ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు రామారావు దంపతులు.
    కామేశ్వరి చిరునవ్వుతో పరిచయం చేసింది.
    "ఇతనే రాహుల్.... వారమైంది ఇండియా కి వచ్చి, డ్యూటీ లో కూడా జాయిన్ అయ్యాడు."
    "నమస్తే అంకుల్ " వినయంగా నమస్కరించాడు రాహుల్.
    అతని రూపం , అతని వినయం, అతని ప్రొఫైల్ చూసి ఇతన్నా మేము తిరస్కరించింది అని పశ్చాత్తాప పడ్డాడు రామారావు.
    రికార్డింగ్ నుంచి అప్పుడే వచ్చిన సరాగని పరిచయం చేశాడు.
    అతన్ని చూడగానే సరాగ గుండె కొట్టుకోవడం మానేసింది. ఎంత అందంగా వున్నాడు అనుకుంది.
    ఆ రాత్రి తండ్రి "ఆ అబ్బాయి నీకు నచ్చాడామ్మా నిన్నతను టీవీ లో చూసి ఇష్ట పడ్డాడట." అని చెబుతుంటే రెండు చేతులతో మందారం లాంటి మొహం దాచేసుకుని గదిలోకి పారిపోయింది.

                                                               ****
    మరో నెలరోజుల్లో వాళ్ళ పెళ్ళి ఆడంబరంగా జరిగింది.  ఎంతోమంది పేరున్న సింగర్స్, టీవీ, సినీ కళాకారులు వచ్చి ఆశీర్వదించారు.
    శోభనం నాటి రాత్రి తెల్లచీరలో నిండు చందమామ లా మెరిసిపోతున్న సరాగని దగ్గరకు తీసుకుని "నీ పాటంటే నాకు ప్రాణం. నీ స్వరం వింటూ నన్ను నేను మర్చిపోతాను ప్రతిరోజు నీ పాటల సీడీ వింటే గానీ నిద్రరాదు. ఇప్పుడు నాకు సీడీ లతో పనిలేదు గదూ, హాయిగా నువ్వు తీయగా నా చెవుల్లో అమృతం పోస్తున్నట్టు పాడతావు కదూ" అన్నాడు గుసగుసగా రాహుల్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS