Previous Page Next Page 
ఒక కోయిల గుండె చప్పుడు  పేజి 26

    అతని మాటలకి  సరాగ మనసు కడలి తరంగాల్లా ఎగిసి పడింది. పరవశంతో అతని గుండెల్లో ఒదిగిపోతూ అస్పష్టంగా తలూపింది.
    "ఏదీ ఒక్క పాట పాడవా?" ప్రాధేయపూర్వకంగా అడిగాడు.
    "రాధికా కృష్ణా తవ విరహే కేశవా"... అష్టపది అందుకుంది.
    "ఈ విరహం నీ గొంతులో నా కోసమా, ఆ కృష్ణుడి కోసమా?' సిగ్గుతో అరచేతుల్లో మొహం దాచుకుంది.
    "ఒక సినిమా పాట పాడవూ."
    "సన్నగ వీచే చల్లగాలికి కనులు మూసినా కలలాయే...."
    "వాహ్ అద్భుతం . మరోసారి పాడవూ.... ప్లీజ్ పాడు రాగా.... నీ పేరు సరాగ కాదు, అనురాగ... నా అనురాగ...."
    "ఆ రాత్రి పాటలతోనే గడిపెద్దామా?" తీయ తీయగా అంది.
    "నిజమే సుమా నీ పాటల మత్తులో పడి అసలు మత్తు మరిచాను" కౌగిట్లో బంధించాడు.

                                         ****

    రోజులు క్షణాల్లా గడిచిపోయాయి.
    రాహుల్ ప్రేమలో పూర్తిగా తడిసి ముద్దయి పోయింది సరాగ.
    మరో పది హేనురోజుల కాలం ఓ గాలి కెరటం లా సాగిపోయింది.
    "ఇవాళ నా కాన్సర్ట్ వుంది రవీంద్రభారతి లో. సాయంత్రం త్వరగా వచ్చేస్తారుగా." అడిగింది సరాగ ఆఫీసుకి బయలుదేరుతున్న రాహుల్ తో.
    "ఈజిట్.... ఎప్పుడు ఫిక్స్  అయింది?" సంతోషంగా అడిగాడు.
    "పెళ్ళికి ముందే పది రోజుల ముందు ఫిక్స్ అయింది."
    'అలాగా.... ఎవరెవరు పాడుతున్నారు?"
    "నేనూ, శృతీ, గిరి, కృష్ణ మెయిన్ సింగర్స్ , మరో ఇద్దరు అప్ కమింగ్ సింగర్స్ కూడా వున్నారనుకుంటా" అంది.
    "ఓ.... అయితే ఇంకేం తప్పకుండా వస్తాను. నువ్వు ముందు వెళ్ళాలేమోగా వెళ్ళు నేను ఆఫీసు నుంచి నేరుగా వస్తాను సరేనా?" అన్నాడు సరాగ నుదుటి మీద పడిన వెంట్రుకలు పెదాలతో సరిచేస్తూ.
    మధురంగా నవ్వింది సరాగ.
    రవీంద్రభారతి లో ఆ సాయంత్రం సరాగ, ఆమె బృందం పాడిన పాటలతో పాటల పండుగ జరిగింది.
    సరాగ సోలో పాటలు కొన్ని పాతవి పాడింది. గుండమ్మ కధలో 'అలిగిన వేళనే చూడాలి' అర్ధాంగి లో 'వద్దురా కన్నయ్యా... ఎక్కడమ్మా చంద్రుడు' వగైరా పాటలు పాడుతుంటే పిన్ డ్రాప్ సైలెన్స్ తో ట్రాన్స్ లోకి వెళ్ళిపోయిన ప్రేక్షకులు ఆమె పాటలు పూర్తీ కాగానే చప్పట్ల హారతి పట్టాయి.
    ఆ తరువాత శశిరేఖ, వసంత అని ఇద్దరమ్మాయిలు కూడా కొన్ని కొత్త సినిమా పాటలు పాడారు. కానీ ఎవరికీ అవి అంతగా నచ్చలేదు. చాలామంది ప్రేక్షకులు లేచి వెళ్ళిపోయారు.
    "మనం కూడా వెళదాం" అంది సరాగ.
    "ఉండు. వీళ్ళు చక్కగా పాడుతున్నారు . పూర్తిగా విని వెళదాం" అన్నాడు.
    చిత్రంగా చూసింది సరాగ అతని వైపు. ఎవరికీ నచ్చనివి ఇతనికేలా నచ్చాయి అనుకుంది.
    కార్యక్రమం పూర్తీ కాగానే కారులో కూర్చుని భర్త వైపు చిరునవ్వుతో చూస్తూ తన చేతిలో కవర్ అందించ బోయింది సరాగ.
    "నాకెందుకు? మీ కష్టార్జితం , అది నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకో" అన్నాడు రాహుల్.
    అతని విశాల హృదయానికి , సంస్కారానికి మురిసిపోతూ అడిగింది "బాగా పాడానా?" 
    అతను ఏం మాట్లాడలేదు.
    కొన్ని క్షణాలు అతని ప్రశంస కోసం ఎదురు చూసి "చెప్పరేం బాగా పాడానా" అంది.
    రాహుల్ ఆమె వైపు చిరునవ్వుతో చూసి "అక్కడి ప్రేక్షకుల స్పందన చూశాక బాగాలేదు అని చెప్పే ధైర్యం నాకుందంటావా?' అన్నాడు.
    హాయిగా నవ్వేసింది సరాగ.

                                              ****
    మరో పదిరోజుల్లో అన్నమాచర్య జయంతి ఉత్సవాలు జరిగాయి. ఆ సందర్భంగా త్యాగరాయ గానసభ లో సరాగ అన్నమాచార్య సంకీర్తనా కార్యక్రమం జరిగింది.
    ఆరోజు ఆదివారం కావడంతో రాహుల్ సరాగని తనే స్వయంగా కారులో వెన్యూకి తీసుకెళ్ళాడు. కిటకిటలాడి పోయింది హాలు. గంటన్నర సేపు ఆమె ఎంతో భక్తీ పారవశ్యంతో ఆలపించిన కీర్తనలతో ప్రేక్షకులు తన్మయిలైనారు.
    మర్నాడు రాహుల్ ఆఫీసు నుంచి వస్తూ యాపిల్స్, ద్రాక్ష, డ్రైఫ్రూట్స్ , ప్రోటీన్ పౌడరు కొనుక్కొచ్చాడు.
    "ఎంటివన్నీ దేనికి?" ఆశ్చర్యంగా అడిగింది సరాగ.
    "ఎందుకేంటి? నీకోసమే. ఇవన్నీ తీసుకుంటూ నువ్వు బాగా ఆరోగ్యంగా వుండాలి. ఇంకా ఎన్నో అద్భుతమైన పాటలు పాడాలి. ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందాలి. అందుకే ఈ రోజు నుంచి రాత్రిళ్ళు పడుకునేటప్పుడు పాలల్లో ఈప్రోటీన్ పౌడరు కలుపుకుని తాగాలి. ఊహూ.... నేను కలిపిస్తాను...నువ్వు తాగాలి." అన్నాడు ఆమె చెక్కిళ్ళు నిమురుతూ.
    సరాగ చెక్కిళ్ళు తడిసిపోయాయి కన్నీటితో.

                                            ****

    ఏమైంది అంత ప్రేమ? ఏమైంది ఆ అనురాగం , ఆ మోహం....!
    సరిగ్గా నెల క్రితం వేదిక మీద ఆనందభైరవి సంస్థ వాళ్ళు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తను రక్తం కారినా ఫర్వాలేదు అన్నట్టు గొంతు చించుకుని పాడడానికి ప్రయత్నించి పాడలేక గుండె పగిలి ఏడుస్తుంటే అతను చిన్న ఓదార్పు మాట పలకలేదు.
    మౌనంగా ఉండిపోయాడు. ఊహించని విధంగా తనకెంతో ఇష్టమైన తన భార్య గొంతు అలా అయిపోవడంతో షాక్ కి గురైనాడేమో అనుకుంది.
    కానీ పది రోజులు ఎంతగా ప్రాక్టీస్ చేసినా పాడలేక పోగా దగ్గుతో బాధపడుతుంటే "హాల్స్ తీసుకుని కొన్నాళ్ళు ఆగి ట్రై చేయవచ్చు గదా , ఇప్పుడు నువ్వు పాడకపోతే కొంపలేం అంటుకున్నాయి?' అని మాట్లాడడంతో సరాగ నిర్ఘాంత పోయింది.
    ఇతను తనను ప్రేమించి, రాయభారాలు నడిపించి, వెంటబడి పెళ్ళి చేసుకున్న రాహులే నా అన్నట్టు వెర్రిగా చూసింది. అయినా అతనిలో చలనం లేదు. కనీసం డాక్టర్ దగ్గరకు వెడదాం, ఇఎన్టి స్పెషలిస్టు కి చూపిద్దాం అని కూడా అనలేదు.
    తనంతట తను నోరు విప్పి "గొంతు చాలా నొప్పిగా వుంది రాహుల్ , డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళవా?' అని అడిగింది.
    "నాకు టైమేక్కడుంది? నువ్వెళ్ళు" అన్నాడు నిర్లక్ష్యంగా.
    సరాగకి ఏడుపొచ్చింది.
    నాగలక్ష్మీ ఓ ఇరవై రోజులు హాల్స్ వేసుకొమ్మని, గోరువెచ్చని నీళ్ళల్లో ఉప్పు వేసి గాగుల్ చేయమని, పాలల్లో మిరియాల పొడి వేసుకుని తాగమని.... ఇలా అనేక రకాల చిట్కాలు సూచించి తగ్గకపోగా బొంగురు నుంచి అసలు గొంతే లేకపోవడం చూసి కంగారు పడి "నాలుగు రోజులు మా ఇంటికి తీసుకెళ్తాను బాబూ, గొంతులో ఏదన్నా ఇన్ఫెక్షన్ వుందేమో ఓసారి డాక్టర్ కి చూపిస్తే యాంటీబయాటిక్ ఇస్తారు. సెట్ అవుతుంది" అని అల్లుడితో అంది.
    "తీసుకెళ్ళండి , నాపర్మిషన్ దేనికి?" అన్నాడు దురుసుగా.
    సరాగని వెంటనే తీసుకు వచ్చేసింది నాగాలక్ష్మీ.
    అదేరోజు సాయంత్రం రామారావు కూతుర్ని తీసుకుని ఇఎన్ టి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాడు.
    అయన పరీక్షించి "గొంతులో ఇన్ఫెక్షన్ ఏమీ లేదు. మరి ఇలా ఎందుకైందో నాకేం అర్ధం కావడం లేదు. ఎందుకైనా మంచిది ఎక్సరే తీయించండి." అని అన్నాడు.
    మర్నాడు ఎక్సరే తీయించాడు రామారావు.
    ఆ రిపోర్టు లో కూడా లోపం ఏమీ కనిపించలేదు.
    "నాకేమీ డిఫెక్ట్ కనిపించడం లేదు. అనవసరంగా యాంటీబయాటిక్ ఇవ్వడం నాకిష్టం లేదు. చూడండి హాల్స్ వేసుకుని వార్మ్ వాటర్ లో సాల్ట్ వేసుకుని రెండు పూటలా గాగుల్ చేయండి. కాఫ్ సిరప్ తీసుకోండి. దానంతట అదే సెట్ అవ్వాలి" అన్నాడు డాక్టర్.
    భార్యభర్తలిద్దరికీ మతిపోయినట్లు అయింది. సరాగకి పిచ్చెక్కినట్లుగా వుంది. ఈ స్వరం ఇంతేనా? ఈస్వరవీణ ఇంక మోగదా? ఏం జరిగింది తనకి.
    పదిరోజులైంది పుట్టింటికి వచ్చి, ఒక్కనాదూ తనంత తానుగాఫోన్ చేసి "ఎలా వున్నావు?' అని గానీ, డాక్టర్ దగ్గరకు వెళ్ళావా? డాక్టర్ ఏమన్నాడు? అని గానీ అడగలేదు. సరిగదా నేను బిజీగా వున్నాను. మందులు వాడుతున్నవుగా తగ్గుతుందిలే' అంటూ పొడిపొడిగా మాట్లాడి ఫోన్ పెట్టేశాడు.
    తన గొంతు ఇలా అయిందని స్నేహితులు, పరిచయస్తులు ఎందరో వచ్చి చూసి వెళ్ళి నాలుగు ఓదార్పు మాటలు చెబుతున్నారు. కొందరు కొన్ని రెమిడీలు కూడా చెబుతున్నారు.
    కానీ అతను ఒక్కసారి కూడా చూడడానికి రాలేదు. పుట్టింటికి, తనింటికీ వున్నది ముపై కిలోమీటర్ల దూరం మాత్రమే. అయినా అతనికి రావడానికి సమయం లేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS