Previous Page Next Page 
ఒక కోయిల గుండె చప్పుడు  పేజి 24

    "బండెక్కగానే వాడితో లేచిపోతున్నట్టా?స్నేహానికి ఆడా, మగా ఏంటండి? కాలంతో పాటు మీరు మారకపోయినా మమ్మల్ని వెనక్కు లాక్కండి" అంటూ అత్తగారిని ఎడా పెడా దులిపేసింది.
    అయినా అవిషయం ప్రభావతి హరికి చెప్పలేకపోయింది. అనన్యే తను చేసింది ఘనకార్యం అన్నట్టుగా చెప్పేయడంతో మొదటిసారిగా భార్య పై పిచ్చి కోపం వచ్చింది హరికి. సీరియస్ గా అడిగాడు "మా అమ్మని అంత మాట అనేముందు నీకు కొంచెం కూడా బుద్ది పనిచేయలేదా? అని.
    "నాకు బుద్ది పనిచేయలేదా అని అడుగుతున్నావా? నా మీద నీకు నమ్మకం లేదా? నువ్వెప్పుడూ నీతో పనిచేసే లేడీ డాక్టర్ కో, నర్సు లకో లిప్ట్ ఇవ్వలేదా? నేను ఎవరితో బండి మీద వెళితే వాళ్ళతో నాకు అఫైర్ ఉన్నట్టేనా?" రెచ్చిపోతూ అడిగింది.
    "నమ్మకం లేదా? అని బాధపడే ముందు మనం నమ్మకం కలిగేలా ప్రవర్తిస్తున్నామా అని ఆలోచించుకోవాలి. మన నమ్మకాలు కాదు ఇక్కడ ముఖ్యం. చుట్టుపక్కల వాళ్ళ గురించి ఆలోచించాలి. సమాజానికి దూరంగా బతకడం లేదు కదా! ఇంటి పెద్ద అత్తగారు అయిన ఆవిడను గౌరవించడం నేర్చుకో. స్వేచ్చని నియంత్రించడం నా ఉద్దేశం కాదు. అర్ధం చేసుకుంటావని చెప్తున్నా" అన్నాడు.
    "మీ అమ్మని ఒక్కమాట అన్నందుకు నాకు ఇన్ని సూక్తులు చెప్తున్నావంటే నీకు నా మీద కన్నా, మీ అమ్మ సిద్దాంతాల మీద గౌరవం అన్నమాట. నా మీద నమ్మకం లేని భర్తతో నేనెందుకు కలిసి బతకాలి?" తీవ్రంగా అంది. అనన్య అంతలేసి మాటలు అనడంతో హరి, ప్రభావతి నిర్ఘాంత పోయారు. ఆరాత్రి కూడా మౌనంగా హల్లో పడుకున్నాడే కానీ ఏమీ మాట్లాడలేదు హరి.
     ఆ రోజు నుంచి ఇదంతా దేనికి దారి తీస్తుందో , వీళ్ళ సంసారం ఏం అవుతుందో అని భయపడుతోంది ప్రభావతి. అనన్య ధోరణి లో ఇంకా మార్పు రాకపోగా, ఇవాళ తొమ్మిది అవుతున్నా ఇంటికి రాలేదు. శుక్రవారం వరలక్ష్మీ వ్రతం అని నలుగురు పేరంటానికి కోడలిని పంప,మని చెప్పి వెళ్ళినా, ఈ పిల్లకి ఏమీ పట్టదు అనుకుంది ప్రభావతి నిట్టురుస్తూ.
    ప్రభావతి పెళ్ళి కాకముందు కొంతకాలం  టీచర్ గా ఉద్యోగం చేసింది. కానీ, సంప్రదాయాలను , అత్తమామలను గౌరవించింది. భర్త కాళ్ళు కడిగి నెత్తిన చల్లు కోకపోయినా కష్టసుఖాలు పంచుకునే స్నేహితుడిగా ప్రేమించేది. చుట్టుపక్కల వారితో స్నేహ సంబంధాలు కలుపుకోవడానికి నోములు, వ్రతాలు చేసింది. ఇప్పటిలా అప్పుడు పుట్టిన రోజని,  పెళ్ళి రోజని, ఇంకో రోజని పార్టీలు చేసుకునేవాళ్ళు కాదు. పెళ్ళిళ్ళు, సీమంతాలు, పూజలు వంటివి మాత్రమే నలుగురి నీ ఒక దగ్గర చేర్చేవి.
    ఇవాళ హరి ఎందుకో కోపంగా వున్నాడు. సహజంగా అతడికి కోపం రాదు. వచ్చిందంటే దాని పరిణామం ఊహించడం కష్టమే. ఏదో జరుగుతుందని ఆందోళన చెందడం కన్నా, మౌనంగా వుండడమే ఉత్తమమని ఆలోచిస్తూ ప్రభావతి తన గదిలోకి వెళ్ళిపోయి మంచం పై వాలింది.

            ****
    బయట కారాగిన శబ్దం . "బై....గుడ్ నైట్..." అంటూ అనన్య స్వరం.
    "గుడ్ నైట్...." అంటూ ఓ వ్యక్తీ చెప్పాక -- కారు కదిలిన శబ్దం.
    "అనన్యా....!" అంటూ అరిచాడు హరి. అయినా ఆమె ఏ సమాధానం చెప్పలేదు.
    "ఎక్కడి కెళ్ళావు?" అని భర్త ప్రశ్నించినా ఆమె నుంచి జవాబు లేదు.
    "ఎక్కడి కెళ్ళావు ఇప్పటి దాకా? టై,మెంతో తెలుసా?" కొంచెం తీవ్రంగా అడిగాడు.
    "అబ్బా.... ఏంటి నీ దబాయింపు. నీ భార్యనా? ఇంటి నౌకరునా?" అంది.
    "నువ్వెందుకు నౌకరవు అవుతావు? నీకు అన్నీ అందించే మా అమ్మే నౌకరు అవుతుంది. ఎక్కడి కెళ్ళావో నా ప్రశ్నకు సమాధానం చెప్పు."
    "నీకు చెప్పాల్సిన అవసరంలేదు."
    "వినాల్సిన అవసరం నాకుంది."
    "నా స్వేచ్చని ప్రశ్నిస్తున్నావా?"
    "స్వేచ్చా స్వాతంత్రాల గురించి చర్చించాలను కోవడం లేదు. గతంలో మన మధ్య గొడవలు జరిగినపుడు చాలాసార్లు వెనక్కి తగ్గాను. ఇప్పుడు సహనం చచ్చిపోయింది . దేనికైనా కొన్ని లిమిటేషన్స్ వుంటాయి."
    "నేను హద్దులు మీరి ప్రవర్తిస్తున్నానా?"
    "హద్దు లే,మిటో . అవి ఎందుకో =చదువుకున్నదానివి, నీకు చెప్పవలసిన అవసరం లేదు. భర్తగా నాకు నీపట్ల హక్కుల సంగతెలా వున్నా బాధ్యతలున్నాయని అడుగుతున్నాను." జవాబు చెప్పడం బాధ్యత అని నువ్వు అనుకుంటే చెప్పు."
    "చెప్పను, ఏం చేస్తావు?"
    'చేయడానికి ఏం ఉంది? ఇన్నాళ్ళు ఏం చేశాను?"
    "నేను ఆధునిక యువతిని. సంపాదన పరురాలిని. మొగుడి అదుపాజ్ఞలలో వుండే అవసరం నాకు లేదు. నేనిలాగే వుంటాను. నీకు ఇష్టమైతే కలిసి వుంటాం. ;లేదంటే విడిపోదాం. ప్రతిరోజూ ఈ తగాదాలు, నిర్భందాలు భరించలేను."
    "నీ నిర్ణయం అదే అయితే - రేపటి దాకా ఎందుకు? ఈ క్షణమే విడిపోదాం. మనల్ని విడదీయడానికి లాయర్ అవసరం లేదు. ఒక్క ద్వారం చాలు. ద్వారం దాటితే నువ్వెవరో, నేనెవరో..."
    "నన్ను ఇంట్లోంచి వెళ్ళి పోమ్మంటున్నావా? నీ కెంత పొగరు? ఇది నీ ఇల్లనేగా? ఇప్పుడే వెళ్తున్నా.... వెళ్ళి పోవడమే కాదు పెళ్ళి చేసుకోబోయే ప్రతి ఆడపిల్లకూ చెప్తాను. పెళ్ళి అయిన వెంటనే అత్తారింటికి వెళ్ళద్దు నీకంటూ ఒక ఇల్లు ఏర్పాటు చేసుకున్నాకే పెళ్ళి చేసుకో అని....ఇక గుడ్ బై..."
    
                                                               ****

    "అనన్యా....వెళ్ళవద్దమ్మా...వెళ్ళకు...." గట్టిగా అరిచింది ప్రభావతి.
    "అమ్మా.... ఏమైంది నీకు?" హరి కుడుపుతుంటే బలవంతంగా కళ్ళు తెరిచింది ప్రభావతి.
    "ఏమైంది? ఏదన్నా పీడకలా?' ఆవిడ మీదకి వంగి ఆప్యాయంగా అడిగాడు హరి.
    ఆవిడ నాలుగు వైపులా చూస్తూ "ఆ...అనన్య..."అంది.
    "అనన్య ని పిలవనా?' అంటూ హరి తలెత్తే సరికి గుమ్మం లో నిలబడి 'ఏమైంది?' అని అడుగుతోంది అనన్య.
    ప్రభావతి అనన్య వైపు చూసి కన్నీళ్ళ తో అంది 'అనన్యా నువ్వు ఎక్కడికీ వెళ్ళ వద్దమ్మా... ఈ ఇల్లు విడిచి ఎక్కడికీ వెళ్ళవు కదూ..."
    అనన్య ఆవిడ మంచం వద్దకు చేరుకొని వింతగా అడిగింది. "నేను వెళ్ళడం ఏంటండి? ఎక్కడికి వెళ్తాను? ఇది నా ఇల్లు , నేనెక్కడికి వెళ్తాను?"
    అనన్య మాటలకి తెల్లబోతూ కొడుకు వైపు చూసింది.
    "అనన్యా! అమ్మకేదో పీడకల వచ్చినట్టుంది. నిద్రలోంచి లేచింది కదా. కొంచెం వేడి పాలు తెస్తావా ?' అని హరి అనడంతో వంటగది వైపు వెళ్ళింది అనన్య.
    చెక్కిళ్ళ మీద కన్నీళ్ళు కారిపోతుంటే ఆవేదనగా అడిగింది ప్రభావతి. "మీరిద్దరూ గొ...ద...వ...."
    ఆవిడ మాటల్ని మధ్యలో ఆపేస్తూ నవ్వుతూ అన్నాడు హరి. "మేం గొడవ పడతామేమోనని ఆలోచిస్తూ పడుకున్నావా?"
    "నువ్వూ , కోడలు....విడాకులు..."
    "మేం విడాకులు తీసుకుంటున్నట్టు వచ్చిందా? అయ్యో.... అమ్మా.... అయినా విడాకులివ్వాల్సినంత తప్పేం చేసింది అనన్య..."
    కొడుకు వైపు చూసింది అయోమయంగా ప్రభావతి. "నువ్వేం కంగారు పడకమ్మా ఏమీ జరగదు. ఇదంతా స్వతంత్రభావాల సంఘర్షణ. ఇదొక ఆధునిక జీవన పోరాటం. ఇందులో ఎవరూ గెలవరు. ఎవరూ ఓడరు. ఈ పోరాటం కొందరి జీవితాల్లో చివరి దాకా సాగుతూ వుంటుంది. కొందరి జీవితాల్లో మధ్యలో సమసిపోతుంది. మా జీవితంలో ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది. అందాకా మౌనంగా చూస్తూ వుండు . నేనూ చూస్తూ వుంటా."
    అనన్య తెచ్చిన పాల గ్లాసును తీసుకుని తల్లి నోటికి అందిస్తూ అన్నాడు. "పాలు తాగి ప్రశాంతంగా పడుకో.... సరేనా?" ఆవిడ నిస్తేజంగా చూస్తూ గ్లాసు అందుకుంది. "తాగమ్మా ' అన్నాడు హరి తననే చూస్తున్న తల్లితో. ఆమె ఒక్కో గుక్కా తాగుతూ ఆలోచించ సాగింది. హరి ఏమీ అనలేదా? అనన్య వెళ్ళి పోతుందని భయపడ్డాడా? లేక తను బాధపడతానని అబద్ధం చెబుతున్నాడా? ఆవిడ చూపులు గోడ గడియారం వైపు తిరిగాయి. అర్ధరాత్రి పన్నెండు దాటి పదిహేను నిముశాలైంది. అంటే తను నిద్రపోయింది. మంచం మీద వాలగానే నిద్రపోయిందన్న మాట. కల వచ్చిందన్న మాట. మరి అనన్య ఆలస్యంగా వచ్చిందిగా... హరికి కోపం వచ్చినా ఏమీ అనలేదా?
    ఆవిడ చేతిలో గ్లాసు అందుకుంటూ అన్నాడు మృదువుగా హరి. "అమ్మా లైతర్పెస్తున్నాను.... అనవసరమైన ఆలోచనలు, ఆందోళన  పెట్టుకోకుండా హాయిగా నిద్రపో. నువ్వు ఆందోళన పడినంత మాత్రాన జరిగేది జరక్క మానదు."
    ఆవిడ ప్రశ్నార్ధకంగా అతని మొహంలోకి చూసింది. భుజాలు పట్టి ఆవిడ్ని పడుకోబెట్టి తలగడ సరిగా జరిపి , బ్లాంకెట్ కప్పి "గుడ్ నైట్ అమ్మా" అంటూ లైటార్పి గదిలోంచి వెళ్ళిపోయాడు. అతన్ని అనుసరించింది అనన్య.
    సోఫాలో వున్న తలగడా, బెడ్ షీట్ తీసుకుని అనన్యతో పాటు గదిలోకి నడుస్తూ అన్నాడు హరి "అమ్మ ఇంకా పడుకుని వుండదు. కలకీ, వాస్తవానికీ తేడా వెతుకుతూ మెలకువగానే వుంటుంది. కలని మర్చిపోయి వాస్తవాన్ని తట్టుకునే శక్తి తెల్లారేసరికి ఆవిడ కిమ్మని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఈ రాత్రికి ఇక్కడే నేలమీద పడుకుంటాను" బెడ్ షీట్ పరిచి తలగడ వేసుకుని వాలాడు హరి. వాస్తవానీకి, కలకీ వున్న దూరం కొలవడానికి ప్రయత్నిస్తూ మంచం అంచున నిశ్చలంగా కూర్చుండి పోయింది అనన్య.

                                                                  ---------
    


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS