Previous Page Next Page 
ఒక కోయిల గుండె చప్పుడు  పేజి 23

            ప్రశ్న

    "అప్పుడే ఎనిమిదైంది. నా ఖర్మ కాకపొతే ఇవాళే సమయం ఇలా పరుగెత్తాలా? అనుకుంది ప్రభావతి. కోడలు అనన్య ఇంకా ఇంటికి రాలేదు. ఇన్నాళ్ళూ అంతగా పట్టించుకోని కొడుకు హరి ఇవాళెందుకో రెండు మూడు సార్లు 'ఇంకా రాలేదా? రోజూ ఇలాగే వస్తోందా?" అని అడిగాడు. ఇవాళ హరి త్వరగా వచ్చాడు.అందుకే ప్రభావతి కీ దడగా వుంది. ఈ పిల్ల త్వరగా వస్తే బాగుండు అనుకుంటూ వీధి చివరకు చూసింది. ఆవిడకి తెలుసు. తనకున్న భయంలో కాసింత కూడా అనన్యకి వుండదని. హరి హల్లో కూర్చుని టీవీలో వార్తలు చూస్తున్నా అతడి ధ్యాసంతా భార్య కోసమేనని ప్రభావతి గ్రహించింది. తలుపు రెక్క ఒకటి తెరిచి అక్కడే కుర్చీ వేసుకుని కూర్చుని రోడ్డు వైపు చూస్తోంది ఆవిడ.
    రెండ్రోజుల క్రితం టీవీలో చూసిన సంఘటన ఆవిడ మనసులో ఆందోళన కలిగిస్తోంది . స్నేహితులుగా వుంటూనే రాత్రి పూట పార్టీ నుంచి వస్తూ 'లిప్ట్' ఇస్తామంటూ ఓ మహిళ పట్ల కొందరు మగాళ్ళు పశువుల్లా ప్రవర్తించిన ఘటన అది.
    అప్పటిదాకా వర్షం కురిసి ఆగిందేమో చల్లగాలి వీస్తోంది. చీకటి పడినా శ్రావణ మాసం అవడం చేత, అందులోనూ శుక్రవారం అవడంతో ఆడవాళ్ళు, పిల్లలు పేరంటానికి వెళ్లి వస్తూ కాలనీలో సందడిగా తిరుగుతున్నారు. భర్త పోయాక ప్రభావతి ఎక్కడికీ వెళ్ళడం లేదు. కానీ ఇదివరకు శ్రావణ మాసంలో మంగళ, శుక్రవారాలు ఎవరో ఒకరింటికి పేరంటానికి వెళ్ళి వస్తూ కబుర్లు చెప్పుకుంటూ కాలనీ లో సందడి గానే తిరిగేది. కోడలోచ్చాక నోములు చేయించి నలుగురు పెరంటాళ్ళని పిలిచి వాయినాలు ఇప్పిస్తే సరదాగా వుంటుందని ఆశపడింది. ఆదిలోనే హంస పాదన్నట్టు కాపురానికి రాగానే కోడలి వేష ధారణతో ప్రభావతి మతిపోయింది. మెడలో మంగళ సూత్రాలు బీరువాలో దాచేసి, మ్యాచింగ్ అంటూ చీర రంగుకి సరిపడే పూసల దండ వేసుకుని ఆఫీసు కి బయలుదేరిన కొత్త కోడల్ని చూసి విస్తుబోతూ అడిగింది.... "మంగళసూత్రం ఏదమ్మా?' అని.
    "ఉంది లెండి.... దాచి పెట్టాను లోపల" అంది నిర్లక్ష్యంగా అనన్య.
    "లోపల దాచడం ఏంటమ్మా తప్పు కదా" అందావిడ ఆగలేక.
    "నేను మంగళసూత్రాలు , నల్లపూసలు తీయగానే మీ అబ్బాయికి ఏదన్నా అవుతుందని భయమా? మీరేం కంగారు పడకండి. ఆయనకే కాదుగా నూరేళ్ళ జీవితం నాకూ కావాలి. మరి నా ఆయుష్షు పెరగడానికి మీ అబ్బాయెం చేయాలి?" అంది నవ్వుతూ . ఆ మాటలు గుండెల్లో ముల్లులా గుచ్చుకున్నాయి ప్రభావతికి.
    ప్రభావతి కి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు గిరి, అతని భార్య ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళకిద్దరు పిల్లలు. రెండోవాడు హరి డాక్టర్. కోడలు అనన్య ప్రభుత్వ సంస్థ లో పర్సనల్ ఆఫీసర్ గా చేస్తోంది. కొడుకులిద్దరివీ ప్రేమ వివాహాలే. పెళ్ళిళ్ళు తన చేతుల మీద చేసి పెద్దరికం నిలుపుకుంది ప్రభావతి. ప్రభావతి భర్త హనుమంతరావు అకౌంటెంట్ గా చేసేవాడు. అతను చనిపోయి ఎనిమిదేళ్ళ యింది.ఇరవై ఏళ్ళ క్రితమే స్థలం కొని ముచ్చటైన ఇల్లు కట్టించాడు. ఉద్యోగరీత్యా దూరంగా వుంటున్నా గిరికి తల్లి, అన్నా, తమ్ముడన్నా అంతులేని ప్రేమ. హరికి కూడా తల్లన్నా, అన్న గారన్నాగౌరవం . గిరి భార్య విదిత కూడా మంచి పిల్ల. ఆమె చదువే కాదు, సంస్కారం కూడా ఉన్నతమైందే. అత్తవారింట్లో అందరినీ అభిమానిస్తుంది.
    అనన్య కోడలిగా వచ్చాక శాంతి మాయమవుతున్నట్లుగా అనిపిస్తోంది ప్రభావతికి. అనన్య స్వభావం ఆ ఇంట్లో వారికి పూర్తిగా భిన్నం. తాను చేయదలచుకున్నది ఎవరు వద్దన్నా చేస్తుంది. ఇష్టం లేకపోతె ఎవరు చెప్పినా చేయదు. ఇంటికి పెద్ద దిక్కయిన ప్రభావతి ఏదన్నా చెప్పబోతే "మీకెందుకండి అనవసర విషయాలు, నాకు తెలుసు ఏం చేయాలో , ఏం చేయకూడదో" అంటుంది. చాలా విషయాల్లో భార్య ఏం చేసినా హరి ఏమీ అనకపోగా, తల్లి ఏమన్నా అంటే - "పోనీలేమ్మా ....తను చిన్నదే కదా ఏవో సరదా లుంటాయి వదిలేయ్" అని భార్యనే వెనకేసుకొస్తూ వచ్చాడు. సాధారణంగా అనన్య రోజూ ఆఫీసు నుంచి ఆలస్యంగానే వస్తుంది. ఇంట్లో అటుగ్లాసు ఇటు పెట్టదు. ఇంటికి రావడం, ఆలస్యం కావడంతో ఓరోజు ప్రభావతి - "ఏంటమ్మా లేట్ అయింది ' అని అడిగింది.
    "అవుతుందండీ.... ఒకసారి బయటికెళ్ళాక టైం మన చేతుల్లో వుంటుందా? అయినా.... ఆఫీసు కాగానే ఇంటి కొచ్చి ఏం చేయమంటారు? కాసేపు స్నేహితులతో గడిపే హక్కు లేదా ?" అనేసరికి ఆవిడ తెల్లబోయింది.
    "అదేంటమ్మా..... ఆడపిల్లవు అలా వెళ్ళడం ఏంటి?" అని అడిగితె - గయ్యి మని లేచిన అనన్య...." ఆడపిల్లవు అది చేయకూడదు , ఇది చేయకూడదని ఇంకోసారి అనకండి... నాకు చిర్రోత్తుకొస్తుంది . ఆడపిల్ల మనిషి కాదా? మీఅబ్బాయి బార్ కి వెళ్ళచ్చు కానీ నేను రెస్టారెంట్ కి వెళ్ళకూడదా' అంది. దాంతో ఆవిడకి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. చాలా తక్కువగా హరి పార్టీలకి వెళ్తాడు. వెళ్ళినా సభ్యత కోసం ఒకే పెగ్గు తాగుతాడు. అలాంటి హరి గురించి ఇలా అంటుంటే బాధగా అనిపించింది ఆవిడకి.
    "నా స్వేచ్చని ప్రశ్నించేవాళ్ళంటే నాకు మంట. ఇంకోసారి నా స్వవిషయాల్లో కలగజేసుకోకండి" అంటూ అల్టి మేటమ్ ఇచ్చింది. కనీసం తన వయసుకైనా గౌరవం ఇవ్వని కోడలి స్వభావంతో ఆవిడకి దిగులు పట్టుకుంది.
    ఆదివారం వస్తే చాలు, "వీకెండ్ ఎంజాయ్ చేయాలి? బయట భోజనం చేసి, సినిమా కో లేదంటే ఏదన్నా అవుటింగ్ కి వెడదాం" అని అంటుంది.
    హాస్పిటల్ లో ఏదన్నా పనుండి అతను 'ఇవాళ వద్దు... ఇంకోసారి వెడదాం' అని అనకూడదు 'నువ్వు వెళ్ళు...నాకు పనుంది' అని అనాలి. అలా అనకపోతే అదో రభస. అలాంటప్పుడు ఒక్కతే వెళ్ళిపోతుంది . అది పగలైనా, రాత్రైనా సరే.
    'అసలే రోజులు బాగాలేవు. ఆడపిల్ల అర్ధరాత్రి , అపరాత్రి తిరగడం ఏంటిరా' వణికి పోతూ అంటుంది ప్రభావతి కొడుకుతో. 'తనకి లేని భయం నీకెందు కమ్మా? తను చాలా ధైర్యస్తురాలు. నీమానానా నువ్వు భోం చేసి పెందలాడే పడుకో, ఆరోగ్యం పాడుచేసుకోకు అంటాడు హరి. ఆడపిల్ల పొద్దు పోయేదాకా ఇంటికి రాకపోతే ప్రశాంతంగా పడుకోగలదా?
    అనన్య నెలకు నాలుగైదు సార్లు షాపింగ్ కి వెళుతూ ఒకటో, రెండో చీరలు కొంటుంది. అయినా ఎవరూ అడక్కూడదు. ఒకసారి సరదాకి అడిగాడు హరి "ఏంటి అనన్యా.... నీ జీతం మొత్తం చీరలు కోనేస్తావా?' అని.
    "నా జీతం నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకునే హక్కు లేదా? ప్రతిదీ నీకు చెప్పి చేయాలా? నిన్ను అడగుతున్నానా నీ సంపాదన ఏం చేశావు అని?" అంటూ ఓరోజు ఆమె కడిగి పారేసేసరికి హరికి కన్నీళ్లు ఒక్కటే తరువాయి. ఆ రాత్రి హరి హల్లో టీవీ చూస్తూ తెల్లవార్లూ గడిపినా అనన్య గదిలోంచి బయటికి రాలేదు. "సారీ' చెప్పి సంధి ప్రయత్నాలు చేయలేదు. అయినా మర్నాటి నుంచి హరి మాములుగానే వున్నాడు.
    ఇదంతా చూస్తుంటే ప్రభావతి కి భయమేస్తుంటుంది. 'నాకెందుకులే ' అని ఊరుకున్నా పెద్దరికం మాత్రం - "చెప్పకపోవడం నీ బాధ్యతారాహిత్యం ...' అని హెచ్చరిస్తున్నట్లు అనిపిస్తుంది. స్వేచ్చ ముదిరితే విచ్చలవిడితనం అవుతుందన్న వాస్తవం అనన్య విషయంలో జరుగుతోంది. హరిలో సహనం చచ్చిపోతోంది. వారానికి నాలుగుసార్లు పార్టీలు, గెట్ టు గెదర్ లు అంటూ అనన్య ఇంటికి ఆలస్యంగా వస్తోంది. ఆలస్యంగా వచ్చినప్పుడల్లా ఎవరో ఒకరు బైక్ మీదో, కారులోనో దింపడం, అది చుట్టూ పక్కల వాళ్ళు గమనించడం ప్రభావతికి ఇబ్బందిగా అనిపిస్తోంది. "పొద్దుపోయాక పరాయి మగాడితో బండి మీద రావడం మర్యాద కాదమ్మా మనం మధ్య తరగతి వాళ్ళం, ఎటొచ్చి ఎటుపోయినా మనకే నష్టం" అంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS