Previous Page Next Page 
ఒక కోయిల గుండె చప్పుడు  పేజి 22

    నారాయణ అంబులెన్స్ తీసుకొచ్చి ఆనంద్ ని తీసుకెళ్ళాడు. పరిస్థితి సీరియస్ గా వుందని ఐసీయూ లో పెట్టారు. నారాయణ ఆ రాత్రే మేనకోడళ్ళిద్దరికీ ఫోన్ చేసి విషయం చెప్పాడు.
    ఇద్దరూ ఫోను లోనే భోరుమన్నారు. "మావయ్యా నాన్నని మంచి హాస్పిటల్లో చూపించు" అన్నారు ఏడుస్తూ.
    తెల్లారేసరికి ఆనంద్ శాశ్వతంగా సెలవు తీసుకున్నాడు.
    కన్నీళ్ళ కి ఆకారం వస్తే జానకిలా వుంటుందేమో అనిపించింది.
    పిల్లలకి ఫోన్లు వెళ్ళాయి. మూడో రోజుకి అందరూ వచ్చారు.
    యధావిధిగా జరగాల్సిన కార్యక్రమాలు జరిగాయి.
    వాళ్ళు వెళ్ళేరోజు దగ్గరకు వచ్చింది. నారాయణ మేనకోడళ్ల ని, వాళ్ళ భర్తల్ని సమావేశ పరిచాడు.
    "మీ నాన్న మీ చదువుల కోసం , పెళ్ళిళ్ళ కోసం చేసిన అప్పులు ఇల్లమ్మి తీర్చాడు. తెలుసా!' అడిగాడు. ఆడపిల్లలు మాట్లాడలేదు. కళ్ళు తుడుచుకున్నారు. అల్లుళ్ళు తల పంకించారు.
    "రిటైర్ మెంట్ బెనిఫిట్స్ బ్యాంకులో వేసుకుని ఆ వడ్డీతో , తన పెన్షన్ తో చీకూ చింతా లేకుండా బతకాల్సిన వయసులో వున్న డబ్బుతో మరింత అప్పు చేసి ఇల్లు కొనుక్కుని ఆ అప్పు తీర్చడం కోసం మళ్ళీ ఉద్యోగం చేశాడు తెలుసా!" అడిగాడు నారాయణ సూటిగా చూస్తూ.
    "అవును! అదే చాలా తప్పు చేశాడు నాన్న తొందరపడ్డాడు" అంది పెద్దమ్మాయి.
    "అసలీ వయసులో మళ్ళీ ఉద్యోగం చేయడం ఏంటి నాన్న, అమ్మైనా వద్దని చెప్పాల్సింది " అంది చిన్నమ్మాయి.
    "మామయ్యగారు తప్పు చేశారు. హాయిగా వడ్డీ, పెన్షన్ కలిపి మంచి ఇల్లు అద్దెకు తీసుకుని ఎంజాయ్ చేయాల్సింది . అనవసరంగా ఈ వయసులో లోన్ తీసుకోవడం అది తీర్చడానికి అవస్థ పడడం రాంగ్ డెసిషన్" అన్నారు అల్లుళ్ళు.
    'అయిందేదో అయింది. మరి ఇప్పుడెం చేయాలను కుంటున్నారు. అయన పోయాడు. మీ అమ్మకి ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. ఆవిడ తిండి, బట్టా గడిచిపోతాయి. మరి ఇంటి మీద అప్పేలా తీరడం? మీలో ఎవరు తీరుస్తారు?' సూటిగా విషయంలోకి వచ్చాడు నారాయణ.
    "ఇప్పుడెందుకండి ఈ ఇల్లు అమ్మేసేయండి' అన్నాడు చిన్నల్లుడు.
    "అదేంటి బాబూ ఇల్లమ్మి ఆవిడ ఎక్కడుంటుంది? అయినా రేపు ఆవిడ తదనంతరం మీ భార్యలేకెగా వచ్చేది."
    "ఆ, ఇప్పుడా ఇల్లు మాకు రావడం కోసం ఎదురు చూస్తామా? మా డైనింగ్ ఏరియా అంత లేదు ఇల్లంతా కలిపినా . మేమేం చేసుకుంటాం? అయినా మీ మేనకోడలికి ఐదో నెల వచ్చింది. ఎలాగూ తన డెలివరీ కి అత్తయ్యగారిని పిలిపించాలనుకున్నాం. బ్యాడ్ లక్ ఈ ఇన్సిడెంట్ జరిగింది. సరే జరిగేదాన్ని అపలెం అనుకోండి. కాకపొతే ఆవిడ మరో రెండు నెలల్లో మా దగ్గరికి రావాల్సిందేగా."
    "అన్నయ్య చెప్పింది నిజమే. మేము కూడా ఫ్యామిలి ప్లాన్ చేస్తున్నాం. అత్తయ్యగారు ఏడాది కి కనీసం ఆర్నెల్లు మాలో ఎవరో ఒకళ్ళ దగ్గర ఉండాల్సిందేగా. అంచేత ఇల్లమ్మి లోన్ తీర్చేసి , ఆవిడకి ఏదన్నా సింగల్ బెడ్ రూమ్ ప్లాట్ చూడండి రెంట్ కి. జస్ట్ చిన్న షెల్టర్ కోసమేగా " అన్నాడు చిన్నల్లుడు.
    నారాయణ రక్తం మరిగింది. చెల్లెలి వైపు చూశాడు. చలనం లేనిదానిలా ఎటో చూస్తూ కూర్చుంది జానకి.
    "అవును మావయ్యా, అమ్మ ఇంక ఇక్కడుండి ఏం చేస్తుంది? మనవళ్ళు, మనవరాళ్ళను చూసుకుంటూ మా దగ్గరే వుంటుంది. గ్రీన్ కార్డు వచ్చిందనుకో అక్కడే వుండచ్చు. అప్పుడప్పుడు ఇక్కడకు వస్తుంటుంది. హాయిగా కాలక్షేపం అయిపోతుంది. మాక్కూడా అమ్మ వుండి వండిపెడుతూ , పిల్లల్నిచూసుకున్తుంటే నిశ్చింతగా వుంటుంది కూడా" అంది పెద్దమ్మాయి.
    కళ్ళు తుడుచుకుంటూ అంది చిన్నమ్మాయి. "నాన్న ఎక్కడికీ వెళ్ళలేదమ్మా నా కడుపునో, అక్క కడుపు నో మళ్ళీ పుడతాడు. ఆ రకంగా నువ్వు నాన్నని చూసుకోవచ్చు."
    "వెళ్ళగానే పేపర్స్ పంపిస్తాం అత్తయ్యా. వీసా వచ్చేస్తుంది మీరేం వర్రీ అవకండి" అన్నారు అల్లుళ్ళు.
    "నువ్వేం అంటావు జానకీ" అడిగాడు నారాయణ.
    "అమ్మ ఏమంటుంది మామయ్యా. మనం నిర్నయించాల్సిందే తనకేం తెలుసనీ" అంది పెద్దమ్మాయి.
    "ఇల్లు అమ్మేటప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరూ సంతకాలకి రావాలేమో. ఇప్పుడే ఆ సంతకాలేవో తీసుకోండి బాబాయి గారూ" అన్నాడు చిన్నల్లుడు.
    "నిజమే తండ్రిఅస్తి కదా అమ్మాలంటే ఆడపిల్లలు సంతకాలు చేయాలి అందులో వీళ్ళకి భాగం వుంటుందిగా " అన్నాడు పెద్దల్లుడు.
    'అలా అయితే డాక్యుమెంట్స్ తెప్పించు మావయ్యా ఓ పనై పోతుంది" అన్నారు కూతుళ్ళు ఇద్దరూ.
    నారాయణ జానకి వైపు చూశాడు. ఆమె నిశ్చలంగా అలాగే కదలకుండా కూర్చుంది.
    చేసేది లేక నారాయణ మర్నాడు లాయర్ ని కలిసి పరిస్థితి తెలియజేశాడు. "ఇల్లు అమ్మాలంటే ఆడపిల్లలు సంతకాలు చేయాలండి" అన్నాడాయన.
    డాక్యుమెంట్స్ రెడీ చేయించి ఆయన్ని కూడా వెంట బెట్టుకుని వచ్చాడు నారాయణ.
    మళ్ళీ అందరూ సమావేశమయ్యారు.
    "ఏమ్మా ఈ నిర్ణయం మీకంగీకారమేనా" అడిగాడు లాయర్ జానకిని ఉద్దేశించి.
    ఆవిడ ఏం మాట్లాడకుండా కూతుళ్ళ వైపు చూసింది.
    "ఇల్లు అమ్మడం ఇన్ ఎవిటబుల్, అదే సొల్యుషన్" అంది పెద్దకూతురు.
    "ఆవిడ కూడా ఓ మాట చెప్పాలమ్మా" అన్నాడు లాయర్.
    "చెప్పమ్మా" మృదువుగా అంది పెద్దకూతురు మళ్ళీ.
    అల్లుళ్ళు ఆవిడ వైపు అసహనంగా చూశారు ఈవిడ మాట్లాడదెం అన్నట్టు.
    జానకి నెమ్మదిగా అంది.... "ఇల్లు అమ్మద్దన్నయ్యా."
    ఒక్కసారిగా పెద్ద విస్పోటనం జరిగినట్టు చూశారు కూతుళ్ళు , అల్లుళ్ళు.
    "ఏమ్మా?" ఆశ్చర్యంగా అడిగాడు నారాయణ. "ఎందుకని?' ఒక విధంగా ఆయనకి ఆవిడ మాట చెప్పలేనంత ఆనందం కలిగించింది. ఈ పిచ్చిది కూతుళ్ళు ఏం చెబితే అదే చేసేస్తుందేమో అని టెన్షన్ పడ్డాడు.
    "అవునన్నయ్యా ఇల్లు అమ్మద్దు" మరోసారి నెమ్మదిగా అయినా దృడంగా అంది.
    'అప్పేలా తీరుస్తావమ్మా? అయినా ఏం చేసుకుంటావా ఇల్లు? నువ్వేం ఇక్కడ వుండి పోతావా? ఎలాగా రెండెన్నలల్లో నా దగ్గరకు రావాలిగా" అంది పెద్ద కూతురు అసహనంగా.
    తల అడ్డంగా ఊపుతూ అంది జానకి "లేదమ్మా....నేనెక్కడికీ రాను. ఇక్కడే వుంటాను. ఈ ఇంట్లోనే ఉంటాను. అప్పు ఎలా తీర్చాలి అనేది నా సమస్య కాబట్టి దాని గురించి తరువాత ఆలోచిస్తాను."
    "ఏంటి మా దగ్గరకు రావా మరి మా పిల్లల్ని ఎవరు చూస్తారు?" విసుబోతూ అడిగారు కూతుళ్ళు.
    ఆవిడ అదోలా నవ్వింది.
    "మీ దగ్గర బోలెడు డబ్బుంది. డబ్బు ఇస్తే ఎంతోమంది ఆయాలు, దొరుకుతారు. ఇండియా నుంచి కేర్ టేకర్స్ గా చాలా మంది మీ విదేశాలకు వస్తున్నారని విన్నాను. పిలిపించుకొండి నేను మాత్రం రాను. చాలు ఇప్పటిదాకా చేసింది చాలు. మీ కోసం బతికాం.... మీకోసం నవ్వాం... మీకోసం ఏడ్చాం.... అన్నీ మీకోసమే చేశాం.... అలా చేసి చేసి అయన వెళ్ళిపోయారు." ఆవిడ స్వరం వణికింది. "కానీ, నేను ఈరోజు నుంచీ, కాదు ఈ క్షణం నుంచి నాకోసం బతుకుతాను.... సమస్య నాది, పరిష్కారం కూడా నాది. మీరెవ్వరూ నాకోసం బాధపడకండి."
    "ఆడపిల్లలైనా ఉన్నత చదువులు చదువుకుని, ఆత్మవిశ్వాసంతో , ఆత్మాభిమానంతో, స్వతంత్రభావాలతో, ఉన్నతమైన వ్యక్తిత్వంతో బతకాలని నా భర్త మిమ్మల్ని శక్తి కి మించి చదివించారు. మీమీద నమ్మకంతో మీరు తీసుకున్న అప్పుకి తనే సెక్యూరిటీ సంతకం చేశారు. ఆ అప్పు తీర్చే బాధ్యత మాది అని మీరు బ్యాంకు అధికారులతో చెబితే అందుకు నేను హామీ అంటూ భరోసా సంతకం చేశారు అదే అయన పాలిట శాపం అయింది."
    కళ్ళు తుడుచుకుంటూ లాయర్ వైపు తిరిగింది జానకి. "లాయర్ గారూ ఆస్తి హక్కుల్లో ఆడపిల్లలకు కూడా సమభాగం వుండాలనే మీ చట్టం, బాధ్యతల్లో సమానత్వం వుండాలని చెప్పలేదా?"
    లాయర్ తెల్లబోయి చూశాడు.
    "ఒకవేళ అలాంటి చట్టం వుంటే అదేమిటో ఐపిసి సెక్షన్ తో సహా వీళ్ళకి చెప్పండి. నాకోసం కాదు. భవిష్యత్తు లో వీళ్ళకి అవసరం వస్తుందేమో అందుకే దయచేసి చెప్పండి." వెక్కిళ్ళు అడ్డుపడగా రెండు చేతుల్లో మొహం దాచుకుని లోపలికి వెళ్ళిపోయింది జానకి.
    తన మొహంలో, కళ్ళల్లో వెల్లివిరుస్తున్న వెలుగు ఎవరికీ కనిపించకుండా మొహం తిప్పుకున్నాడు నారాయణ.
    నిర్ఘాంతపోయి చూస్తున్న ఆడపిల్లల చేతుల్లోంచి డాక్యుమెంట్స్ తీసుకుని బయటికి నడిచాడు లాయర్.

                                                                   ---------
    


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS