Previous Page Next Page 
ఒక కోయిల గుండె చప్పుడు  పేజి 15

            సతీ సమేతుడు
    మొబైల్ ఆగకుండా మోగుతుంటే అప్పుడే స్నానం చేసి బాత్ రూమ్ లోంచి వచ్చిన రాంబాబు గబుక్కున టీపాయి మీద వున్న ఫోన్ అందుకుని హలో అంటూ వంటగది వైపు తొంగి చూశాడు, ఈ మహాతల్లి ఎక్కడి కెళ్ళింది ఫోన్ చేయకుండా అన్నట్టు.
    అవతలి నుంచి వినిపించిన స్వరం రాంబాబు ని నిటారుగా మార్చింది.
    "రాంబాబూ....' శ్రీధర్ పిలిచాడు.
    రాంబాబు గుండె దడదడలాడింది. గొంతు మూగబోయింది.
    "నేను శ్రీధర్ ని... రాంబాబూ.." అతని స్వరంలో కంగారు, సన్నటి జీర.
    రాంబాబు, మరోసారి వంటగది వైపు తొంగి చూసి అక్కడి నుంచి నడిచి బాల్కనీ లోకి వచ్చాడు.
    "ఎరా బాగున్నావా?" నూతి లోంచి వచ్చినట్టుగా అనిపించింది శ్రీధర్ కి రాంబాబు గొంతు.
    అదేం పట్టించుకోకుండా చెప్పాడు...."కల్యాణికి సీరియస్ గా వుంది. హాస్పిటల్ లో జాయిన్ చేశాం...."
    నెత్తిన పెద్ద అటంబాంబు పడినట్టు అయింది. చేతిలో ఫోన్ వణికింది. నుదిటి మీద చిరుచెమటలు పట్టింది.
    "ఏ....ఏమైంది?" తడబడుతూ అడిగాడు.
    "తెలియదు... ఉదయం ఐదింటికి లేచింది. బ్రష్ చేసుకుని కాఫీ కాచుకోడానికి వెళ్ళబోతూ వంటింటి గుమ్మంలో బోర్లాపడింది. నుదుటికి గాయం అయింది. వెంటనే స్పృహ తప్పింది. నేను అనుకోకుండా రాత్రి అక్క దగ్గర వున్నాడు కాబట్టి అదృష్టం బాగుండి సమయానికి హాస్పిటల్ కి తీసుకెళ్ళాను."
    "ఏ హాస్పిటల్?" కొంచెం నీరసంగా అడిగాడు రాంబాబు.
    "కేర్ హాస్పిటల్ ...బంజారాహిల్స్ ...నీకు చెప్పడం నాభాధ్యతగా భావించి చెపుతున్నాను."
    "ఆ తరువాత మీఇష్టం" అన్నట్టుగా ఫోన్ పెట్టేశాడు శ్రీధర్.
    రాంబాబు అణువణువు చచ్చుబడినట్టు అయింది. కాళ్ళు వణికిపోతున్నాయి. చల్లగాలి వీస్తున్నా మొహం నిండా చెమటలు కమ్మేశాయి. అక్కడే వున్న కుర్చీ లో నిస్సత్తువగా కూలబడిపోయాడు.
    నీకు చెప్పడం నా బాధ్యతగా భావించి చెబుతున్నాను.... శ్రీధర్ స్వరం చెవుల్లో గింగురుమంటోంది.
    కల్యాణి కి అనారోగ్యమా? అది కూడా హాస్పిటల్లో చేర్చించెంత తీవ్రంగానా....
    రాంబాబు కి వున్న పళంగా పరిగెత్తుకుని వెళ్ళాలని పించింది... కాని, అడుగు కూడా కదపలేని నిస్సహాయత.... కాళ్ళూ, చేతులూ చచ్చుపడినట్టు ఉన్న చోటు నుంచి కదలనని మొరాయిస్తున్నాయి.
    అతని కాళ్ళు, చేతులు కల్యాణి కోసం పనిచేయడం మానేసి చాలా కాలమైంది. ఇంకా చెప్పాలంటే మనసు ఎంత తపించినా మెదడు కూడా ఆమె ఆలోచనలను దగ్గరకు రానివ్వడానికి భయపడుతుంది.
    కారణం శాంత....
    శాంత రాంబాబు అగ్నిసాక్షి గా పెళ్ళాడిన భార్య...
    కల్యాణి రాంబాబు అంతరాత్మ సాక్షిగా తాళికట్టిన భార్య.
    ఇద్దరూ భార్యలే అయినా అటు మంత్రాల సాక్షిగా, ఇటు బంధుమిత్రుల సాక్షిగా అతని చేత తాళి కట్టించుకుని, అగ్ని చుట్టూ ఏడడుగులు నడిచి అతని ఇంటికి వచ్చి ఇంటి ఇల్లాలైంది. అతని పిల్లలికి తల్లి అయింది. అతని జీవితాన్ని శాసించే మహారాణి అయింది శాంత.
    విజయవాడ కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి సాక్షిగా పసుపుతాడు కట్టిన కల్యాణి భార్య అయింది.... అతని కూతురికి తల్లి అయింది కానీ, ఇంటి ఇల్లాలు కాలేక పోయింది . అతనిజీవితంలో అధికారికంగా భాగమూ కాలేకపోయింది.
    శాంత హక్కులతో అతడిని కట్టేసింది. కల్యాణి ప్రేమతో , అనురాగంతో అతడిని కొంతకాలం ఇంటికిరప్పించుకుంది కానీ,చట్టబద్దమైన హక్కుల్ని మాత్రం పొందలేక పోయింది.
    ఎన్నోసార్లు తన హక్కుల కోసం పోరాడాలనుకుంది కల్యాణి . కానీ సాక్ష్యం లేని పెళ్ళిని రుజువు చేయడానికి కొండలకి మాటలొస్తే బాగుండని ఎడురుచూస్తూ పదిహేనేళ్ళు గడిపేసింది.
    కాలేజీ రోజుల్లో ప్రేమించుకుని, ప్రమాణాలు చేసుకుని, ప్రణాళికలు వేసుకుని ఉద్యోగాలతో చెరో దారిలోకి మారే సమయంలో రెండు పసుపు కొమ్ములతో, ఒక పసుపుదారంతో ఆమె భావాలమీడా, ఆమె స్వేచ్చ మీదా, ఆమె నిర్ణయాల మీదా అధికారం సొంతం చేసుకున్నాడు రాంబాబు.
    ప్రేమించడం తప్ప వంచించడం తెలియని సున్నిత మనస్కురాలు కల్యాణి. అతను పొందిన హక్కులను ప్రశ్నించలేదు. అది చాలా సహజం అనుకుంది.
    కల్యాణి చెన్నై లో , రాంబాబు హైదరాబాద్ లో ఉద్యోగాల్లో చేరారు. నెలకోసారి కల్యాణి దగ్గరకి భర్తగా  హక్కుగా వస్తూ, ఆమె జీవితం  మీద కూడా ఆధిపత్యం సంపాదించుకున్నాడు. అయితే హైదరాబాద్ ఏనాడూ వెళ్ళని కళ్యాణికి తెలియని రహస్యం ఓ దుర్ముహుర్తాన విజయవాడ లో అక్కగారి ద్వారా తెలిసింది. తల్లిదండ్రుల మాటను శిరసావహిస్తూ , కల్యాణితో తను రహస్యంగా చేసుకున్న నైతిక ఒడంబడికను విస్మరించి రాంబాబు మరో అమ్మాయి తో సామాజిక ఒడంబడిక చేసుకున్నాడని. మరో అమ్మాయికి చట్టబద్దంగా, వందల మంది సాక్షిగా మరోమారు భర్త అయ్యాడని తెలుసుకున్న కల్యాణి నెత్తిన ఆ ఇంద్రకీలాద్రి విరుచుకుపడుతున్న భావన.... బిటెక్ ఫస్ట్ క్లాస్ లో పాసై, క్యాంపస్ సెలక్షన్స్ లో మంచి కార్పోరేట్ కంపెనీ లో చదువు పూర్తీ కాకుండానే ఉన్నతమైన ఉద్యోగం సంపాదించుకున్న కల్యాణి తెలివితేటలూ బీటలు వారి , పగలదానికి సిద్దమవుతున్న తన సంసారాన్ని నిలబెట్టుకోవడం లో నిర్వీర్యమై భార్య స్థానం నుంచి స్థాన భ్రంశం చెందింది.
    నువ్వు నా ప్రాణం కళ్యాణీ.... నాశారీరం మాత్రమే ఆమె దగ్గర వుంది. మనసు నీతోటి, నీ దగ్గరే అంటూ పాతపటను కొత్త రాగంలో వినిపించిన రాంబాబు స్వరంలోని మత్తుకి కరిగింది. అతి ప్రయత్నం మీద చెన్నై నుంచి హైదరాబాదు బదిలీ చేయించుకుని అతనికి శాశ్వరంగా చట్టవిరుద్దమైన భార్యగా మిగిలింది.
    ముందు నీ స్థానం నీదే కల్యాణి అన్న అతని మాటల పారవశ్యం లో వాస్తవం గ్రహించలేక పోయిన కల్యాణి పక్కన పడుకున్న భర్త మాటి, మాటికీ చేతి వాచీ చూసుకుంటూ వెళ్ళాలి కళ్యాణీ తను భోజనం చేయకుండా ఎదురు చూస్తుంటుంది అంటే నిర్ఘాంత పోయింది. సాయంత్రం ఆఫీసు నుంచి నేరుగా తనింటికే వచ్చిన అతడిని ఆదమరిచి  అల్లుకుపోయిన తన అమాయకత్వానికి తనని తనే అసహ్యించుకుంది. అయినా ఆ అసహ్యం నుంచే జన్మించింది వాసవి. అటు ఇద్దరు పిల్లలు, ఇటు ఈ ఒక్క పిల్ల మొత్తం ముగ్గురు పిల్లల తండ్రి అయినా లోకం దృష్టి లో ఇద్దరు పిల్లల తండ్రిగానే చెలామణీ అవుతున్నాడు రాంబాబు.
    తన కూతురికి ఆ తండ్రిపేరు చెప్పుకోలేకపోతున్న దౌర్భాగ్యానికి ఏడవాలో, నవ్వాలో అర్ధం కాని కల్యాణి చట్టపరమైన హక్కుల కోసం ఆక్రోశించింది కానీ, అది అరణ్య రోదన అయింది.
    కాలం గడుస్తున్న కొద్దీ రాంబాబు చాపకింద నీరులా తనకు చేస్తున్న ద్రోహం సంప్రదాయం , సంఘం అనే మాటలతో చాటుకున్న పిరికితనం కళ్యాణికి బోధపడ్డాయి. మొదట్లో రోజుకి రెండుగంటలు, ఆతరువాత రెండు రోజులకో రెండు గంటలు, క్రమంగా వారానికో గంటా, అలా తగ్గుతూ వచ్చిన అతని రాకపోకలు అగ్నిసాక్షి చేత నియంత్రించబడ్డాయి. ఇద్దరికీ వారధిగా మారి వాళ్ళని కలపడానికి ప్రయత్నించిన మరో స్నేహితుడు శ్రీధర్ కూడా రాంబాబు లోని పిరికితనాన్ని ఎస్కేపిజాన్ని స్వార్ధపూరిత తత్వాన్ని అసహ్యించుకోవడం ప్రారంభించి కళ్యాణికి సలహా ఇచ్చాడు.
    "ఒక పనికిరాని వ్యక్తీ కోసం దిగులుతో ఏడుస్తూ అతని కోసం నిరీక్షిస్తూ ఎందుకమ్మా కళ్యాణీ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. పొరపాటున కాలుజారి కిందపడ్డామని లేవకుండా అలాగే ఏడుస్తూ కూర్చుంటా,మా? లేవాలి.... గాయానికి మందేసుకోవాలి... మానిన గాయం చూస్తూ మరోసారి కిందపడకుండా అప్రమత్తంగా ఉండాలి.... అంతేగాని ఇలా ఏడుస్తూ వుంటే నీ జీవితంతో పాటు ఆ చిన్నారీ తల్లి భవిష్యత్తు కూడా పాడు చేస్తావు" అని చెప్తున్న శ్రీధర్ కల్యాణి కళ్ళకి హితభోద చేస్తున్న కృష్ణ పరమాత్మ లా కనిపించాడు. ఆ క్షణం నుంచీ అతడిని తన సోదరుడిగా భావిస్తూ కష్టసుఖాలు పంచుకుంటూ రాంబాబు ని మర్చిపోవడానికి ప్రయత్నించింది.
    భార్య అదుపాజ్ఞలలో నిస్సిగ్గుగా బతికే రాంబాబు కి పిల్లని చూడాలని వున్నా కంట్రోల్ చేసుకునే సహనంవుంది. అందుకే కాలగర్భం లో మరో నాలుగేళ్ళు గడిచినా కల్యాణి ఆరోగ్యంలో అనూహ్యమైన మార్పులు వచ్చినా, భార్య మాట జవదాటని బుద్ది మంతుడనే బిరుదు నిలబెట్టుకోడానికి కృషి చేస్తూనే వున్నాడు.
    ఇప్పుడు కల్యాణి కి ఆరోగ్యం బాగాలేదు. హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు శ్రీధర్.
    ఆమెని చూడడానికే కాదు , ఆమెకి సేవ చేయడానికి కూడా రాంబాబు వెళ్ళాలి.... అది అతని బాధ్యత.... పంచభూతాల్లో అగ్ని తప్ప సూర్యుడు, చంద్రుడు, నీరు, వాయువు అన్నీ చూశాయి అతను ఒకనాడు కల్యాణి మెడలో తాళి కట్టడాన్ని.... కానీ, అగ్నిసాక్షి ప్రబలమైంది అనుకునే భార్య కల్యాణి గురించి తెలిసినా అమెనిఅతని భార్యగా  అంగీకరించలేదు.. ఆమోదించలేదు.... ఆమె అంగీకరించలేదు కాబట్టి రాంబాబు కూడా ఆమోదించలేదు.... అందుకే అతనికి తన బాధ్యతల గురించి ఆలోచించే జ్ఞానం లేదు.
    అయితే ఆమెతో పంచుకున్న ప్రేమానురాగాలు , పెంచుకున్న మమతానుబంధాలు మర్చిపోలేక పోతున్నాడు. కారణం ఇంకా మనసు చావలేదు. కల్యాణిని చూడడానికి వెళ్ళాలని వున్నా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగే భార్యకి సమాధానం చెప్పే సాహసం అతనికి లేదు. బుజ్జగించి, బతిమాలి వెళ్ళే చాకచక్యం అంతకన్నా లేదు.
    ఫలితంగా అతని కోసం ఎదురు చూసిన కల్యాణి గాజుకళ్ళు శాశ్వతంగా మూసుకు పోయాయి.
    అప్పుడు వచ్చింది అతని నోటి నుంచి ఒక్క మాట "తను....తను.... పోయిందిట శాంత.....ఒక్కసారి వెళ్ళి చూసివస్తాను."
    శాంత గంభీరంగా తానూ బయలుదేరింది. "పదండి వెళ్ళడం మన ధర్మం...." 
    అతను ఆమె వెనుక కదిలాడు.
    సతీ సమేతంగా మరో సతి అంత్యక్రియలకు హాజరైన రాంబాబు ని చూస్తె, అసహ్యం, జుగుప్స ఉప్పెనలా కలిగాయి శ్రీధర్ లో.
    భార్య వెనకాల కల్యాణి శవం దగ్గర పది నిముషాలు మౌనం పాటించిన రాంబాబు ఎవరికీ చెప్పకూడదన్న సంప్రదాయం పాటిస్తూ బయటికి కదిలాడు.
    ఇంటికి వెళ్ళగానే తాళం తీసి లోపలికి వెడుతూ అంది అతని భార్య.... "స్నానం చేసి బట్టలు తడిపేయండి.."
    అతను మౌనంగా బాత్ రూమ్ లోకి నడిచాడు....

                                                      ---------


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS